MohanPublications Print Books Online store clik Here Devullu.com

రమణ మహర్షి_Ramana Maharshi





అనుభూతి
ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ప్రమాదం నడకలో మార్పు తీసుకువస్తుంది. ఒక అనుభవం జీవితం పట్ల దృక్పథాన్ని సవరిస్తుంది. ఆ అనుభవం మరణానుభవమైతే? ఈ ప్రశ్నకు రమణ మహర్షి జీవితమే సరైన సమాధానం!
రమణ మహర్షి అసలు పేరు తిరుచ్చుళి వేంకట రామన్‌. ఆయనది మధురై. 1896 జులైలో ఒక రాత్రిపూట అకస్మాత్తుగా ఆయనకు మరణభయం కలిగింది. అందరిలాగా బెంబేలు పడలేదు. తానే మరణ సమస్యను పరిశోధించాలనుకున్నారు. దాన్ని మానసికంగా అనుసరించారు. శ్వాసను బంధించి, కళ్లు మూసుకున్న ఆయన- మృతిని అనుకరించారు. తాను మరణించినట్లు వూహించారు. తన దేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లడం, దహనం చేయడం, అది క్రమంగా కాలి బూడిద కావడం- ఈ క్రమాన్నంతటినీ రమణ మహర్షి భావన చేశారు.
ఆ సమయంలో ఒక అద్భుతం సంభవించింది. ‘శరీరం లేకున్నా నేను ఉన్నాను’ అనే పరమ సత్యం ఆయనకు స్ఫురించింది. ఆ నేను- ఈ దేహం కాదని, దానికన్నా భిన్నమైందని, దానికి మరణం ఉండదని తెలిసిపోయింది. దాంతో మరణభయం రమణ మహర్షి మనసు నుంచి తొలగిపోయింది. ‘సాక్షీభూత స్థితి’గా శాస్త్రాలు వివరించిన ఒకానొక స్థితి ఆయనకు అనుభవ పూర్వకంగా అవగతమైంది. ఆత్మస్థితి బోధపడింది.
నేరుగా అరుణాచలం చేరుకున్న ఆయన ఈశ్వర రూపం ముందు నిలిచారు. ‘అప్పా! నీ ఆజ్ఞ ప్రకారం నీ చెంతకు చేరుకున్నాను... ఇక నీ ఇష్టం’ అని సంపూర్ణ శరణాగతి చెందారు.
అరుణాచలేశ్వరుడి దర్శనం పిదప, ఆయన 40 రోజులపాటు తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు. మౌనం పాటించారు. ‘మౌన స్వామి’గా ప్రజలు ఆయనను పిలవడం మొదలైంది. ఆ దశలోనే తల్లి అళగమ్మ, సోదరుడు నాగసుందరం ఆయనకు శిష్యులయ్యారు. అనంతర కాలంలో సన్యాసం స్వీకరించి ‘నిరంజనానంద స్వామి’గా మారింది రమణ మహర్షి సోదరుడు నాగసుందరమే!
తెలుగు గడ్డలోని బొబ్బిలి ప్రాంతం కలువరాయికి చెందిన ఉపాసకులు కావ్యకంఠ గణపతి మునిని చూశాక, వేంకట రామన్‌ మౌనం వీడారు. ఆ ముని ఆయనకు ‘భగవాన్‌ శ్రీరమణ మహర్షి’గా నామకరణం చేశారు. ‘మాటలు ఆగితే, అది నిశ్శబ్దం. ఆ స్థితి- మనసులోని ఆలోచనలకు, సంకల్పాలకు సైతం ఏర్పడితే అది మౌనం’ అని రమణ మహర్షి బోధించారు. ‘మృత్యుభీతి తొలగిపోవడమే మృత్యువును జయించడం’ అని చాటారు. మోక్షం, ఆత్మ సాక్షాత్కారం, నిర్వాణం వంటి పదాలకు అదే అర్థమన్నారు. తాను పొందిన అనుభవాన్నే సాధన చేయించి- శిష్యులకు ఆత్మసాక్షాత్కార అనుభూతిని అనుగ్రహించారు. దానికి తల్లి అనుభవమే ఒక ఉదాహరణ.
అళగమ్మ చివరి ఘడియల్లో మౌనస్వామి ఆమె తలపై చేతులుంచి గంటల తరబడి ధ్యానం చేశారు. రానున్న జన్మల్లో ఆమె పూర్తిచేసుకోవాల్సిన కర్మపరిపాకాన్ని ఆ సమయంలో మానసికంగా అనుభవానికి తెచ్చారు. సంపూర్ణ కర్మ విమోచన ముగిసిన భావన అళగమ్మలో ఏర్పడింది. అది ఆమెను మోక్షస్థితికి చేర్చింది.
ఇది కేవలం చదివితేనో వింటేనో అవగతమయ్యేది కాదు. ఎవరినైతే బాధపెట్టామో వారి హృదయాల్లోకి ప్రవేశించి- ఆ వేదనను, అవమానభారాన్ని పూర్తిగా అనుభవించగలిగిననాడే అది బోధపడుతుంది. కర్మ విమోచన ప్రక్రియ అలవాటవుతుంది. ‘కర్మల నుంచి విముక్తులు కావడమే ముక్తి’ అని పెద్దలు చెప్పిన సత్యం అంతటా రుజువవుతుంది. ఎవరి స్వీయ అనుభవంతో వారు తమ జీవితం పట్ల దృక్పథాన్ని సరిదిద్దుకోవాలి. కారణజన్ముడిగా భావించే భగవాన్‌ రమణ మహర్షికి మానవాళి సమర్పించగల నివాళి అదే!     - ఎర్రాప్రగడ రామకృష్ణ


దేవుని ప్రేమపాత్రులు!

భక్తుల్లో నాలుగు వర్గాల వాళ్లుంటారు. కొందరు ఆర్తితో భగవంతుణ్ని కొలుస్తారు. వాళ్లు ముందు బాగానే బతికినా, కాల కర్మ వైపరీత్యం వల్ల అన్నీ పోగొట్టుకుంటారు. మళ్లీ వెనకటిలాగ జీవితంలో సుఖపడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తారు. మరికొందరు తమ ఆత్మస్వరూపాన్ని గురించిన జిజ్ఞాసతో భగవంతుణ్ని సేవిస్తారు. ఇంకా కొందరు, గర్భదరిద్రులుగా ఉండి, ఐశ్వర్యం కోరుకుంటారు.
వాళ్లూ భగవంతుణ్నే ఆశ్రయిస్తారు. మరికొందరు భగవంతుని నిష్కామంగా ప్రేమించి సేవిస్తారు. వాళ్లనే ‘జ్ఞానులు’ అంటాడు శ్రీకృష్ణుడు ‘‘ఈ నాలుగు రకాల వాళ్లూ నాకు భక్తులే. కాని అందరికన్నా ఈ చివర చెప్పిన ‘జ్ఞాని’ అంటే నాకు ఎక్కువ మక్కువ. వాడు నాకు ఆత్మ’’ అని తెలియజేశాడు పరమాత్మ. అంటే నిష్కామంగా భగవంతుని సేవించడమే జ్ఞానం. అటువంటి వారినే భగవంతుడు ప్రేమిస్తాడు.



ద్రువుని దీక్ష
      అనగనగా ఉత్థానపాదుడు అనే రాజుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్య పేరు సునీతి. ఇంకో భార్య పేరు సురుచి. సునీతి కొడుకు ధ్రువుడు. సురిచి కొడుకు ఉత్తముడు. ఒకరోజు సుఖంగా కూర్చుని ఉన్న సమయంలో ఆయన తొడపై ఉత్తముడు కూర్చున్నాడు. అప్పుడు ధ్రువునికి కూడా తండ్రి ఒళ్లో కూర్చోవాలని అనిపించింది. వెంటనే నాన్న దగ్గరికెళ్లి ‘‘నాన్నా... నేను కూడా నీ ఒళ్లో కూర్చుంటాను’’ అని అడిగాడు. కానీ ఉత్తముడు కూర్చోనివ్వలేదు. అక్కడే ఉన్న ఉత్తముని తల్లి సురిచి ‘ఎంతో తపస్సు చేస్తే గానీ నీకు ఆ భాగ్యం దక్కదు, పో..’ అని కఠినంగా మాట్లాడింది. దాంతో ధ్రువుడు ఏడుస్తూ వాళ్లమ్మ దగ్గరికెళ్లి జరిగినదంతా చెప్పాడు. కొడుక్కి జరిగిన అవమానాన్ని విని ఓదార్చింది. భగవంతుని దయ లేకపోవడం వల్ల నీకు ఈ అవమానం జరిగింది. మీ చిన్నమ్మ చెప్పిన మాట నిజమే. తపస్సు చేస్తే ఏమైనా లభిస్తాయి. వెళ్లి విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయి అని చెప్పింది. తల్లిమాట ప్రకారం ధ్రువుడు ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్లిపోయాడు. ఒంటరిగా అడవుల్లో తిరుగుతున్న ధ్రువున్ని చూసి నారదమహర్షి జాలిపడి ‘ధ్రువుని దగ్గరకొచ్చి నీ పేరేంటి? ఎవరు నీవు? ఎక్కడికిలా బయలుదేరావు’ అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు తన సంగతంతా చెప్పాడు. నారదుడు ప్రేమగా ధ్రువుని తల నిమిరి నీకు తప్పకుండా విష్ణుమూర్తి దర్శనమవుతుంది అని ‘నమో భగవతే వాసుదేవాయ’ విష్ణు మంత్రాన్ని జపించమని ఉపదేశించాడు. ధ్రువుడు ఒక చెట్టు నీడన ఏకాగ్రతతో, పట్టుదలతో విష్ణు మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. నిష్ఠగా, తీవ్రంగా తపస్సు కొనసాగించాడు.

      ధ్రువుని పట్టుదలకు, తపస్సుకు మెచ్చి మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శంఖు, చక్రాలతో అందంగా ఉన్న విష్ణువుని చూసి ఽధ్రువుడు పరమానందపడ్డాడు. విష్ణువు ప్రేమతో తన శంఖాన్ని ధ్రువుని బుగ్గకు అలా తగిలించాడు. వెంటనే ధ్రువునికి వేదరహస్యాలన్నీ అర్థమయ్యాయి. అమోఘమైన జ్ఞానం అబ్బింది. దాంతో ధ్రువుడు విష్ణు మూర్తిని చక్కగా స్తోత్రం చేశాడు. విష్ణువు సంతోషించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. విష్ణువును చూశాక ఇంతకంటే గొప్ప ఏముంటుందని ‘ఇంకేం వరం అక్కర్లేదు’ అన్నాడు. కానీ ధ్రువుడు ఎందుకు తపస్సు చేశాడో విష్ణువుకు తెలుసు కదా! అందుకే ‘నిన్ను నక్షత్ర మండలానికి అధిపతిని చేస్తాను’ అని విష్ణుమూర్తి వరమిచ్చాడు. ఆయన పేరుతోనే ధ్రువనక్షత్ర మండలం ఏర్పడింది. ఆ పదవి పొందాక ధ్రువుడు తిరిగి తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ధ్రువున్ని చూసి ఆ తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. తమ తప్పు తెలుసుకుని సురిచి,ఉత్తముడు క్షమించమని కోరారు. ధ్రువుడు వాళ్లవైపు ప్రేమతో చూస్తూ ‘మీ వల్లనే నేను తపస్సు చేశాను. విష్ణుమూర్తి దయను పొందాను’ అని కృతజ్ఞత చూపించాడు. దీక్ష, పట్టుదల ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ధ్రువుడు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list