ఇఫ్తార్ విందు భలే పసందు
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను ఇఫ్తార్ విందుతో విరమించటం ఆనవాయితీ. ఉపవాసంతో శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి భర్తీ చేయాలంటే ఇవిగో ఈ ఇఫ్తార్ వంటకాలను తయారు చేసుకోవాలి..
షీర్ ఖుర్మా
(తయారీ సమయం - 20 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
చిక్కని పాలు - 5 కప్పులు
సేమియా - 75 గ్రాములు
పంచదార - రెండున్నర టేబుల్ స్పూన్లు
ఖర్జూరం ముక్కలు - అర కప్పు
నట్స్ - అర కప్పు (బాదం, పిస్తా, జీడిపప్పు)
ఎండు ద్రాక్ష - 2 టే.స్పూన్లు
నెయ్యి - తగినంత
యాలకుల పొడి - అర టీస్పూను
రోజ్ వాటర్ - 1 టీస్పూను
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం:
నెయ్యిలో నట్స్ దోరగా వేయించుకోవాలి.
అదే నెయ్యులో ఎండు ద్రాక్ష కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అర కప్పు పాలలో ఖర్జూరాలు వేసి నానబెట్టాలి.
మిగతా పాలను మందపాటి గిన్నెలో బాగా మరిగించి దాన్లో సేమియా వేసి ఉడికించాలి.
చక్కెర వేసి కలపాలి.
యాలకుల పొడి వేసి కలిపి, నానబెట్టిన ఖర్జూరాల ముక్కలు వేయాలి.
నెయ్యితోపాటు వేయించిన నట్స్ వేసి కలిపి వేడిగా సర్వ్ చేయాలి.
ఖర్జూరం లడ్డు
(తయారీ సమయం - 15 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
ఖర్జూరాలు - 20
నట్స్ - పావు కప్పు (బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్)
పచ్చి కొబ్బరి కోరు - 1 టే.స్పూను
తయారీ విధానం:
నట్స్ నూనె లేకుండా బాండీలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే బాండీలో విత్తనాలు తీసిన ఖర్జూరాలను వేసి మెత్తబడేవరకూ వేయించాలి.
తర్వాత కొబ్బరి కోరు వేసి కలిపి దించేయాలి.ఔ
వేయించి చల్లార్చిన ఖర్జూరాలను బ్లెండర్‌లో వేసి తిప్పి పక్కనుంచాలి.
వేయించిన నట్స్ కూడా బ్లెండర్‌లో వేసి పలుకులుగా చేసుకోవాలి.
తర్వాత ఖర్జూరాలు, నట్స్ రెండూ కలిపి బ్లెండర్‌లో తిప్పాలి.
తర్వాత ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టాలి.
ఈ లడ్డూలను కొబ్బరి కోరులో దొర్లించాలి.
డబుల్ కా మీఠా
(తయారీ సమయం - 30 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
తెల్ల బ్రెడ్ స్లయిసులు - 8
పాలు - 1 కప్పు
పంచదార - మూడున్నర టేబుల్ స్పూన్లు
మీగడ - 3 టేబుల్ స్పూన్లు
కరిగించిన తాజా నెయ్యి - 2 టే.స్పూన్లు
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12
తరిగిన పిస్తా - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం:
పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి.
మరో గిన్నెలో పంచదార, రెండు టే.స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి.
బ్రెడ్ స్లయిసె్‌సల అంచులు కట్ చేసి త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి.
వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి.
పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి.
వేయించిన బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి.
వాటి పైన చిక్కటి పాలను పోసి, పైన మిగిలిన చక్కెర పాకం పోయాలి.
తరిగిన బాదం పప్పులు, బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి.
10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది.
అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
కీమా ఆమ్లెట్
(తయారీ సమయం - 10 నిమిషాలు)
కావలసిన పదార్థాలు:
చికెన్ కీమా - 1 కప్పు
గుడ్లు - 3
ఉప్పు, నూనె - తగినంత
షెజువన్ సాస్ - 1 టీస్పూను
టమాటా గుజ్జు - 4 టీస్పూన్లు
స్వీట్ రెడ్ చిల్లీ సాస్ - ఒకటిన్నర టీస్పూను
తయారీ విధానం:
మూడు గుడ్లను పగలగొట్టి గిన్నెలో వేసి ఉప్పు చేర్చి గిలక్కొట్టాలి.
నాన్‌స్టిక్ పాన్‌లో 1 టీస్పూను నూనె పోసి చికెన్ కీమా వేసి కలపాలి.
పచ్చివాసన పోయాక షెజువన్ సాస్, టమాటా గుజ్జు వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత చిల్లీ సాస్ వేసి కలిపి చికెన్ మెత్తగా ఉడికేవరకూ చిన్న మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి.
చికెన్ మెత్తగా ఉడికాక పొయ్యి నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి.
మరో పాన్‌లో మరికొంత నూనె పోసి గిలక్కొట్టిన గుడ్ల సొన పోసి ఆమ్లెట్ వేయాలి.
ఆమ్లెట్ మీద సగ భాగం వరకూ చికెన్ కీమా మిశ్రమం ఉంచి ఆమ్లెట్‌ను సగానికి మడిచి తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి.
ఇలా సొనతో ఆమ్లెట్లన్నీ ఇలాగే తయారు చేసుకుని వేడిగా సర్వ్ చేయాలి.
చికెన్ హలీమ్
(తయారీ సమయం - 50 నిమిషాలు)
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్ (అర అంగుళం పొడవు) - 200 గ్రా
గోధుమ రవ్వ - 6 టే.స్పూన్లు
యాలకులు - 6
లవంగాలు - 10
బిరియాని ఆకులు - 4
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
జీలకర్ర - 2 టీస్పూన్లు
ఉల్లి ముక్కలు - 2 కప్పులు
అల్లం పేస్ట్ - 2 టే.స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - 2 టే.స్పూన్లు
నానబెట్టిన పొట్టు మినప్పప్పు - 4 టే.స్పూన్లు
నానబెట్టిన శనగపప్పు - 4 టే.స్పూన్లు
డాలియా - 6 టే.స్పూన్లు
పసుపు - 1 టీస్పూన్లు
కారం - 2 టీస్పూన్లు
ఉప్పు - తగినంత
గరం మసాలా - 1 టీస్పూను
కొత్తిమీర - 4 కట్టలు
పుదీనా ఆకులు - 20
నెయ్యి - పావు కిలో
తయారీ విధానం:
గిన్నెలో నెయ్యి వేసి కాగాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, బిరియాని ఆకులు, ఉల్లిపాయలు వేసి ఎర్రబడేవరకూ వేయించాలి.
తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లు వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించి శనగపప్పు, మినప్పప్పు, డాలియా వేసి వేయించాలి.
తర్వాత పసుపు, కారం వేసి కలపాలి.
3 నిమిషాల తర్వాత కప్పు నీళ్లు పోసి మరో 5 నిమిషాలపాటు ఉడికించాలి.
ఇప్పుడు చికెన్ ముక్కలు, ఉప్పు వేసి కలిపి తెర్లబెట్టాలి.
తర్వాత పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసి కలపాలి.
చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి.
మెత్తగా ఉడికి చికెన్ ముక్కలు బాగా కలిసేదాకా తిప్పాలి.
నెయ్యి పైకి తేలుతుండగా హలీమ్ పొయ్య నుంచి దింపి బిరియాని ఆకులు ఏరి తీసేయాలి.
హ్యాండ్ బ్లెండర్‌తో హలీమ్‌ను మెత్తగా మెదిపి నిమ్మ చెక్కలతో వేడిగా సర్వ్ చేయాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565