MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాస్త అధిక పింఛను వచ్చేలా... Siri posts 2nd June 2017



కాస్త అధిక పింఛను వచ్చేలా... 


బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ తగ్గుతోంది. ఇదే ఆసరాగా చేసుకొని, జీవనం సాగించే పెద్దలకు (సీనియర్‌ సిటిజన్లకు) ఇది కొంత నిరాశ కల్గించేదే. మరి, ఇలాంటప్పుడు బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా.. రాబడికి హామీ, అంతే సురక్షితంగా ఉండే పథకాలేమిటో తెలుసుకుందాం! 
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ.. పదవీ విరమణ తర్వాత వచ్చిన సొమ్మును పెట్టుబడి పెట్టేవారు కోరుకునేవి ఇవే. ఇలా భద్రత గల పింఛను పథకాలు రెండు రకాలు. డిపాజిట్‌ సొమ్ముపై వడ్డీని నెలవారీగా లేదా నిర్ణీత కాలావధిలో ఇచ్చి, గడువు తర్వాత అసలు కూడా ఇచ్చేవి మొదటి రకం. డిపాజిట్‌ సొమ్ములో అసలు, వడ్డీని కలిపి నిర్ణీత గడువు వరకూ ఇచ్చేవి రెండో రకం.
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం 
పూర్తి భద్రతతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యధిక వడ్డీ ఇస్తున్న పథకం ఇది. 60 ఏళ్ల వయసున్న భారతీయులెవరైనా చేరవచ్చు. రూ.1,000 నుంచి రూ.15లక్షల వరకూ జమ చేసుకోవచ్చు. 
* 55 ఏళ్లు నిండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వారూ చేరవచ్చు. అయితే, పదవీ విరమణ తర్వాత నెల రోజుల్లోగా ఇందులో చేరాలి. వచ్చిన డబ్బుకు మించి ఎక్కువ డిపాజిట్‌ చేయడానికి అంగీకరించరు. 
* మాజీ సైనికులు ఏ వయసు వారైనా ఈ పథకంలో డిపాజిట్‌ చేయవచ్చు. 
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంకు తదితర బ్యాంకులతో పాటు నిర్దేశిత పోస్టాఫీసుల్లో కూడా ఈ పథకంలో జమ చేయవచ్చు. బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు, పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు డిపాజిట్‌ను బదిలీ చేసుకోవచ్చు. 
* విదేశాలలో నివసించే భారతీయులు, అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్‌లు అంగీకరించరు. 
* దంపతులిద్దరూ ఉమ్మడిగా ఖాతా తెరవవచ్చు. మొదటి ఖాతాదారుకు మాత్రం 60ఏళ్లు ఉండాలి. రెండో ఖాతాదారు వయసు ఎంతయినా అంగీకరిస్తారు. ఇద్దరి వయసు 60 ఏళ్లు దాటితే చెరొక రూ.15లక్షల వరకూ డిపాజిట్‌ చేసుకోవచ్చు. 
* ఏప్రిల్‌ 1, 2017 నుంచి ఈ పథకంలో చేరిన వారికి 8.4శాతం వడ్డీ వస్తుంది. భద్రత గల పథకాల్లో అత్యధిక వడ్డీ వచ్చే పథకం ఇదే. (ఆడపిల్లల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజనలో కూడా 8.4శాతం వడ్డీ వస్తుంది) ఐదేళ్ల కాల పరిమితి గల ఈ పథకంలో చేరిన వారికి, చేరినప్పుడు ఉన్న వడ్డీని ఐదేళ్ల వరకూ మార్చరు. (పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో చేసిన డిపాజిట్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి వడ్డీ మారుతుంటుంది) మూడు నెలలకు ఒకసారి ఈ పథకంపై వడ్డీని ప్రభుత్వం సమీక్షిస్తుంది. కొత్తగా చేరే వారు మాత్రం చేరినప్పుడు ప్రభుత్వం ప్రకటించే వడ్డీ పొందుతారు. మూడు నెలలకు ఒకసారి.. మార్చి, జూన్‌, సెప్టెంబరు, డిసెంబరు నెలాఖరులలో మీ ఖాతాకు వడ్డీ జమ చేస్తారు. రూ.15,00,000 జమ చేసిన వారికి ప్రతి మూడు నెలలకోసారి రూ.31,500 వస్తాయి. 
* ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ చేసిన జమపై 80సీలో ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో రూ.10వేలకు మించిన వడ్డీపై పన్నును మూలం వద్ద (టీడీఎస్‌) తగ్గిస్తారు. వడ్డీపై ఆదాయపు పన్ను రాయితీ లేదు. 
* జమ చేసిన ఏడాది తర్వాత ఖాతాను రద్దు చేసుకోవచ్చు. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడిలో 1.5శాతం తగ్గించి చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత 1శాతం తగ్గించి ఇస్తారు. డిపాజిట్‌ కాలపరిమితి ఐదేళ్లు దాటిన తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. పొడిగించినప్పుడు అప్పటి వడ్డీ వర్తిస్తుంది. డిపాజిట్‌ కాల పరిమితి అయ్యాక పొడిగించడానికి అవసరమైన పత్రాలు ఇవ్వకుంటే పోస్టాఫీసు పొదుపు ఖాతా వడ్డీ 4శాతం ఇస్తారు. పొడిగించిన కాలంలో ఏడాది తర్వాత ఎటువంటి అపరాధ రుసుము లేకుండా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు. 
* నామినీ పేరును రాయడం మర్చిపోవద్దు.
ఎస్‌బీఐ.. యాన్యుటీ పథకం 
బ్యాంకులో అప్పు తీసుకొని నెలనెలా సమాన నెలసరి వాయిదాలు (ఈఎంఐ) కడితే రుణ కాలావధి పూర్తయ్యాక రుణ నిల్వ సున్నా అవుతుంది. దీనికి విరుద్ధంగా యాన్యుటీ పథకంలో ఏక మొత్తంగా డిపాజిట్‌ చేసినందుకు బ్యాంకు ప్రతి నెలా సమాన నెలసరి వాయిదాలలో డిపాజిటరుకు చెల్లిస్తుంది.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాన్యుటీ పథకంలో సీనియర్‌ సిటిజన్‌ రూ.15లక్షలు పదేళ్ల కాలానికి డిపాజిట్‌ చేస్తే ప్రస్తుత వడ్డీ 6.75తో నెలకు రూ.17,195 ఇస్తారు. గడువు తీరిన తర్వాత అదనంగా ఏమీ ఇవ్వరు. ఈ పథకంలో మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్ల కాలానికి కూడా డిపాజిట్‌ చేయవచ్చు. రూ.15లక్షలు మూడేళ్ల కాలానికి డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.46,118 ఇస్తారు. డిపాజిట్‌ మధ్య కాలంలో ప్రత్యేక అవసరాల కోసం అధిక మొత్తం అవసరం అయితే, డిపాజిట్‌ నిల్వలో 75శాతం అప్పుగా ఇస్తారు. అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పు తీరే వరకూ చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంకు అప్పు కింద జమ చేసుకుంటుంది. నిర్ణీత గడువు కంటే ముందు డిపాజిట్‌ మొత్తాన్ని ఇవ్వరు. డిపాజిట్‌ చేసిన వారు మరణించినప్పుడు మాత్రం మిగిలిన నిల్వను ఇస్తారు.
జీవన్‌ అక్షయ్‌ 6 యాన్యుటీ 
భారతీయ జీవిత బీమా సంస్థ అందించే జీవన్‌ అక్షయ్‌ పింఛను ప్లాన్‌ ఆప్షన్‌ 7లో 60ఏళ్ల వ్యక్తి రూ.1లక్ష డిపాజిట్‌ చేస్తే ఏడాదికి రూ.6,530 యాన్యుటీ చెల్లిస్తారు. 70ఏళ్ల వ్యక్తికి రూ.6,620, 80 ఏళ్ల వ్యక్తికి రూ.6,760 లభిస్తాయి. పాలసీదారుకు ఏమైనా అయితే జీవిత భాగస్వామికి యాన్యుటీ లభిస్తుంది. జీవిత భాగస్వామి కూడా మరణిస్తే.. నామినీకి డిపాజిట్‌ మొత్తాన్ని ఇస్తారు. తీవ్ర రోగాల కారణంగా గడువుకు ముందు డిపాజిట్‌ సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు. 
ఈ నాలుగు పథకాల్లోనూ వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించి, నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి వయ వందన యోజన
ఈ ఏడాది బడ్జెట్‌లో 8 శాతం వడ్డీ ఇచ్చే పింఛను పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా మే 4, 2017న ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం (పీఎంవీవీవై) ప్రారంభమైంది. మే 3, 2018లోపు ఈ పథకంలో చేరవచ్చు. 60ఏళ్లు నిండిన వారు ఇందులో డిపాజిట్‌ చేసి, నెలకు కనీసంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.5వేలు పింఛను పొందవచ్చు. ప్రతి నెలా రూ.వేయి పింఛను రావాలనుకునే వారు ఒకేసారి రూ.1,50,000 చెల్లించాలి. ప్రతి నెలా రూ.5వేలు పొందాలి అనుకునే వారు ఏక మొత్తంగా రూ.7,50,000 చెల్లించాలి. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి డబ్బు తీసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి పింఛను తీసుకునే వారు కనిష్ఠంగా రూ.1,44,578, గరిష్ఠంగా రూ.7,22,892 చెల్లించాలి.
ఈ పథకం కాల పరిమితి పదేళ్లు. ఈ కాల పరిమితి లోపు డిపాజిట్‌ చేసిన వారికి ఏమైనా అయితే.. మొదట కట్టిన మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. పాలసీ వ్యవధి పూర్తి అయ్యాక కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తారు. పదేళ్ల గడువులోగా తీవ్ర అనారోగ్య కారణంగా డిపాజిట్‌ సొమ్ము వెనక్కి తీసుకోవాలంటే కట్టిన డబ్బులో 2శాతం మినహాయించుకొని వెనక్కిస్తారు. పథకం ప్రారంభం అయిన మూడేళ్ల తర్వాత డిపాజిట్‌లో 75శాతం రుణం తీసుకోవచ్చు. ఈ పథకంలో నెలవారీగా చెల్లించే వడ్డీ 8%. బ్యాంకు డిపాజిట్‌లలో చెల్లించే మూడు నెలల చక్రవడ్డీ లెక్కల ప్రకారం అయితే, ఇందులో మనకు లభించే వడ్డీ 8.05%. ఆరు నెలల చక్రవడ్డీ ప్రకారం చూస్తే వడ్డీ 8.13%. ఈ డిపాజిట్‌పై రుణం తీసుకుంటే ప్రస్తుత నిబంధనలను బట్టి 10% ఆరు నెలల చక్రవడ్డీ మనం కట్టాల్సి ఉంటుంది. మనకు చెల్లించాల్సిన పింఛను నుంచి మనకు ఇచ్చిన రుణంపై వడ్డీని మినహాయించుకుంటారు.
భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) నిర్వహించే ఈ ప్రభుత్వ పథకంలో ఆన్‌లైన్‌లోనే కాకుండా ఏజెంట్‌ ద్వారా కూడా చేరవచ్చు. ఆన్‌లైన్‌ పాలసీ జారీ అయ్యాక పాలసీ నిబంధనలు నచ్చకపోతే 30 రోజుల్లో పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే రద్దు చేసుకోవడానికి గడువు పాలసీ అందిన తేదీ నుంచి 15 రోజులు. ఈ పథకంలో ఒక కుటుంబానికి (భార్య, భర్త, వారిపై ఆధారపడిన వారు) నెలకు రూ.5వేలు కంటే ఎక్కువ పింఛను అనుమతించరు.
ఏం చేయాలి?
* బ్యాంకు, బీమా కంపెనీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ప్రతి నెలా వచ్చే వడ్డీ, ఇంటి అవసరాలకు చాలనప్పుడు యాన్యుటీ పథకాన్ని ఎంచుకోచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై చాలీచాలని వడ్డీ మాత్రమే తీసుకొని, పిల్లలకు డిపాజిట్‌ అసలు మొత్తాన్ని ఇచ్చి తాము ఇబ్బంది పడే బదులు వడ్డీతోపాటు అసలును కూడా ప్రతి నెలా వాడుకోవడానికి యాన్యుటీ పథకం ఎంచుకోవడం మంచిది. 
* ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకంలో వడ్డీ (8%) కంటే సీనియర్‌ సిటిజన్‌ పథకంలో వడ్డీ (8.4%) ఎక్కువ. వయ వందన యోజన పథకంలో డిపాజిట్‌కు ఆదాయపు పన్ను రాయితీ రాదు. కాబట్టి, సీనియర్‌ సిటిజన్‌ యోజన పథకంలో డిపాజిట్‌ చేసుకోవచ్చు. అయితే, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో వడ్డీకి హామీ ఐదేళ్లే. వయ వందన యోజన పథకంలో వడ్డీకి హామీ పదేళ్లు. ఐదేళ్ల తర్వాత వడ్డీ రేట్లు భారీగా తగ్గితే పదేళ్ల వరకూ 8 శాతం వడ్డీకి హామీ ఇచ్చే వయ వందన యోజన పథకం మెరుగనిపిస్తుంది. 
* అనుకోని అనారోగ్యం వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఇబ్బంది ఎదురవ్వకుండా కొంత అత్యవసర నిధి ఎప్పుడూ ఉంచుకోవడం మంచిది. ఇందుకోసం కొంత మొత్తాన్ని బ్యాంకు డిపాజిట్‌, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. 
* అసలు, వడ్డీకి హామీ ఉండే పింఛను పథకాల్లో వచ్చే ఆదాయం పెరుగుతున్న అవసరాలకు సరిపోకపోవచ్చు. కాబట్టి, పెద్దలు వీలైతే తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని అధిక రాబడికి అవకాశం ఉండే మ్యూచువల్‌ ఫండ్లలో డెట్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు.



ఆలోచన మారితేనే ఆర్థిక విజయం!
మనలో చాలామంది మనసులో ఒకటి అనుకుంటారు.. దాన్ని కచ్చితంగా అమల్లో పెట్టాలనుకుంటారు. కానీ, ఆచరణలో మరోటి ఉంటుంది. పెట్టుబడి నిర్ణయాలూ ఇందుకు అతీతం ఏమీ కాదు. ఇవి బలహీనతలే అయినప్పటికీ బయట పడటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. పెట్టుబడి నిర్ణయాలను పక్కదోవ పట్టించే కొన్ని ఆలోచనలు.. వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా!తమకు నచ్చిందే.. 
కొంతమంది మదుపరులు తమకు తెలిసిన, మొదటిసారి విన్న సమాచారానికే కట్టుబడి ఉంటారు. తమ నిర్ణయాలను అంత తేలికగా మార్చుకునేందుకు ఇష్టపడరు. వారికున్న సమాచారం మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారంటే.. దాని నుంచి అంత తేలికగా బయటకు రారు. ఉదాహరణకు.. ఒక సమాచారాన్ని తెలుసుకొని, ఆ పథకంలో మదుపు చేశారనుకుందాం. ఆ ఫండ్‌/పెట్టుబడి పథకంలో నష్టం వచ్చినా.. దానిలో నుంచి బయటకు రాకుండా ఉంటారు. పైగా కొన్నిసార్లు మరింత పెట్టుబడి పెట్టేందుకు సిద్దపడతారు. ఇలాంటప్పుడు వారు మరింతగా నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది.
దీన్ని సులభంగానే అధిగమించేందుకు ప్రయత్నించవచ్చు. తమ పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడం, దాని పనితీరును పరిశోధించడం ద్వారా.. కొత్త సమాచారాన్ని తెలుసుకోవడంలాంటి వాటి వల్ల తమ నిర్ణయాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
అందరూ వెళ్తున్నారు కదా! 
ఆర్థిక విషయాల్లో ఒకరితో ఒకరిని పోల్చలేం. కానీ, కొంతమంది ఇతరులను ఉదాహరణలుగా తీసుకుంటుంటారు. వారు తీసుకునే నిర్ణయాలనే తామూ అమలు చేయాలని కోరుకుంటారు. బృందం తీసుకునే నిర్ణయాలే తమకూ వర్తిస్తాయని అనుకుంటారు. సాధారణంగా షేర్‌ మార్కెట్లో ఇలాంటి పోకడలను ఎక్కువగా చూస్తుంటాం. మనదేశ సైన్యం పాకిస్థాన్‌ మీద సర్జికల్‌ దాడులు చేయగానే యుద్ధ భయంతో మార్కెట్లో ఉన్న పెట్టుబడులు వెనక్కి తీసుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి వారిలో మీరూ ఉంటే.. మీరు ఇతరుల ఆలోచనలకు ప్రభావితం అవుతున్నట్లే.
మీ లక్ష్యాలేమిటి? వాటిని సాధించేందుకు ఎలా మదుపు చేయాలి? మీరు కట్టుబడి ఉండాల్సింది వీటికే. దీనికోసం మీరు సొంతంగా పరిశోధన చేసి పెట్టుబడులు పెట్టాలి. బృందాన్ని అనుసరించడం మానేసి, అవసరమైతే నిపుణుల సలహాలు స్వీకరించాలి.
చరిత్ర ఆధారంగా.. 
ఒక షేరు/ఫండు గతంలో మంచి రాబడి ఇచ్చింది.. ఇది భవిష్యత్తులోనూ పునరావృతం అవుతుంది.. సాధారణంగా చాలామంది నమ్మే సూత్రం ఇది. మరికొంత మంది తమకు ఎదురైన చేదు అనుభవాలు.. ఎప్పుడూ అలాగే ఉంటాయని నమ్ముతుంటారు. 2008 మార్కెట్‌ పతనం తర్వాత కొంతమంది ఈక్విటీలవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ రెండు పద్ధతులూ పెట్టుబడి నిర్ణయాలను ప్రభావితం చేసేవే.
పెట్టుబడులు పెట్టినప్పుడు ఎప్పుడూ స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసుకోకూడదు. వీటి ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలను తీసుకోవడమూ సరికాదు. సగటు సూత్రాన్ని నమ్మాలి. కొన్నిసార్లు స్వల్పకాలంలో అనుకోని లాభాలు రావచ్చు. కానీ, ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక సగటు ప్రయోజనాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేప్పుడు వివిధ మార్కెట్‌ దశల్లో ఫండ్‌ పనితీరు ఎలా ఉందో చూడాలి. అంతేకానీ, మార్కెట్‌ వృద్ధి చెందే దశలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.
అవకాశాలు ఎక్కువైతే.. 
సాధారణంగా ఏదైనా ఎంపిక చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటే మంచిది. కానీ, వాస్తవ పెట్టుబడుల ప్రపంచంలో పథకాలు ఎక్కువైన కొద్దీ వేటిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో అయోమయం ఏర్పడుతుంది. మన నిర్ణయాలను ఇది కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మ్యూచువల్‌ ఫండ్లనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో అనేక ఫండ్లు ఉన్నాయి. వీటిలో వేటిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో చాలాసార్లు ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా కొన్నిసార్లు మంచి పథకాల్లో మదుపు చేయకుండా ఉండిపోతారు.
మనకు ఉన్న అవకాశాలను పరిమితం చేసుకోవాలి. దీనికోసం కొంత పరిశోధన చేయాలి. లేదా వ్యక్తిగత ఆర్థిక నిపుణుడిని అడగాలి. మీ ఆర్థిక పరిస్థితికి నప్పే షేర్లు/ఫండ్లను ఎంపిక చేయాల్సిందిగా సూచించాలి. మీ ప్రాథమిక అంచనాలను అందుకున్న షేర్లు/ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించాలి.
నష్టం వస్తుందా? 
చాలామంది అధిక రాబడులు రావాలనుకుంటారు. కానీ, అదే సమయంలో దాని వెనుక ఉన్న నష్టభయం గురించి ఆలోచించరు. కొంతమంది నష్టం వస్తుందేమో అన్న భయంతో కచ్చితమైన రాబడినిచ్చే పథకాలను ఎంచుకుంటారు. ఇవి రెండూ ఇబ్బంది పెట్టే అంశాలే.
ఇలాంటప్పుడు ఆర్థిక సలహాదారుల సూచనలు పాటించడమే మేలు. దీనివల్ల సరైన పెట్టుబడి పథకాలను, లేదా ప్రత్యామ్నాయ పథకాలను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుంది. అప్పుడు మీరు ఆశించినట్లు అధిక రాబడిని ఆర్జించే అవకాశం ఉంటుంది.
- ఎస్‌.లక్ష్మీనరసింహన్‌, అనలిస్ట్‌, మ్యూచువల్‌ ఫండ్‌ రీసెర్చ్‌, FundsIndia.com

మార్కెట్‌కు మంచి భవిష్యత్తే!
‘ప్రస్తుతం మార్కెట్లు జీవన స్థాయి గరిష్ఠాలకు చేరుకున్నాయి. అప్పుడప్పుడూ స్వల్ప దిద్దుబాటు వచ్చినా.. ఈ వృద్ధి దశ కొనసాగుతూనే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో సానుకూలాంశాలు, కీలక సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు కలిసొచ్చే అంశాలు. ఈ నేపథ్యంలో చిన్న మదుపరులు మార్కెట్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల’ని అంటున్నారు రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ-సీఈఓ సందీప్‌ సిక్కా. మదుపరులు దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్న ఆయన ఇంకా ఏమంటున్నారంటే...* మార్కెట్లు గరిష్ఠ స్థాయుల్లో ఉన్నాయి కదా! ఇలాంటప్పుడు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేవారు ఏక మొత్తంగా మదుపు చేయడం మంచిదా? ‘సిప్‌’ మార్గాన్ని ఎంచుకోవడం మేలా? 
భారత స్థూల ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటంతో మార్కెట్లు వృద్ధి పథంలో సాగుతున్నాయి. రూపాయి బలోపేతం కావడం, చమురు ధరలు, రుతుపవనాలు సానుకూలంగా ఉండటంలాంటి కారణాలను ఇందుకు చెప్పుకోవచ్చు. మార్కెట్‌తోపాటు, ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతోంది. ఇలాంటప్పుడు కొత్తగా మదుపు చేసే వారు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)ను ఎంచుకోవడమే మేలు. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడమే ఎప్పుడూ మంచి ఆలోచన. మార్కెట్లో కొంత అనిశ్చితి ఉండవచ్చు. ఏ సమయంలోనైనా మార్కెట్లో 3-4శాతం దిద్దుబాటు రావచ్చు. మదుపరులు దీనికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే, మరీ పెద్ద దిద్దుబాటు వస్తుందనే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.
* దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి మ్యూచువల్‌ ఫండ్లు అవకాశం కల్పిస్తాయా? 
21 ఏళ్ల క్రితం రూ.10 ఉన్న యూనిట్‌ విలువ ఇప్పుడు దాదాపు రూ.1,000 ఉంది. అంటే, ఈ 21 ఏళ్లలో 100 రెట్లు పెరిగింది. అప్పుడు రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.కోటి వరకూ వస్తాయి. ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ 15-20ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే వచ్చే ఫలితాలకు ఇది ఉదాహరణ. దీన్ని బట్టి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లు మంచి నేస్తాలని.
* ప్రస్తుతం ఈటీఎఫ్‌లో పెట్టుబడుల గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. వీటిలో ఎవరు మదుపు చేయవచ్చు? 
ఇటీవల విడుదల చేసిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో దాదాపు 5లక్షల మంది కొత్త మదుపరులు పెట్టుబడులు పెట్టారు. మ్యూచువల్‌ ఫండ్లతో పోలిస్తే ఈటీఎఫ్‌లలో ఖర్చులు తక్కువ. దీనివల్ల ఇవి వ్యక్తిగత మదుపరులను ఆకర్షిస్తున్నాయి. కొత్త మదుపరులెవరైనా సరే.. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌)లో మదుపు చేసేందుకు అనుకూలమే. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడానికి కేటాయించే పెట్టుబడుల్లో కొంత శాతాన్ని వీటికి కేటాయించవచ్చు.
* చిన్న నగరాలు, పట్టణాల నుంచి కూడా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెరుగుతున్నాయా? 
ప్రస్తుతం చాలా మంది మదుపరులు సంప్రదాయ పథకాలకు భిన్నంగా తమ పెట్టుబడి ప్రణాళికలను వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న నగరాలు, పట్టణాల నుంచి కూడా మదుపరులు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మున్ముందు ఇది ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది.
* ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పనితీరును ఆశించవచ్చు?
ప్రస్తుతం మార్కెట్లు జీవన కాల గరిష్ఠ స్థాయుల్లో ఉన్నాయి. అయితే, మదుపరులు ఎప్పుడూ మార్కెట్‌ సూచీలను పరిగణనలోనికి తీసుకోకూడదు. దీన్ని బట్టి, పెట్టుబడులు ప్రారంభించడం, ఆపేయడంకానీ చేయకూడదు. పెట్టుబడులు ఎప్పుడూ క్రమశిక్షణతో సాగాలి. మార్కెట్‌ విలువను బట్టి కాకుండా.. వారి లక్ష్యాల ఆధారంగా పెట్టుబడులు ఉండాలి. చిన్న మదుపరులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకూ నేరుగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా.. నిపుణుల సలహాలతో మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇక రానున్న రెండేళ్ల కాలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే.. ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉండటంతోపాటు, 2019లో కూడా ఇదే విధంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫలితంగా కొన్ని కీలక సంస్కరణలను తీసుకురావడానికి ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. కరెన్సీ విలువ కూడా సానుకూలంగానే ఉంది. కాబట్టి, మరో రెండేళ్ల వరకూ మార్కెట్లో పూర్తి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి.
* మదుపరులు ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు? 
గత ఆరు నెలల కాలంలో కొన్ని కీలక సంస్కరణలను చూశాం. ముఖ్యంగా అందుబాటు గృహాలకు సంబంధించి. కాబట్టి, గృహ నిర్మాణ రంగం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతోపాటు, ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌, రోడ్లు, డిఫెన్స్‌, వినియోగ వస్తువుల రంగాలు కీలక భూమిక పోషిస్తాయి. ప్రభుత్వం దృష్టి సారించే ఏ రంగమైనా రానున్న 3-4ఏళ్లలో మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది.






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list