MohanPublications Print Books Online store clik Here Devullu.com

నిజంగా సూపరేనా?- Super


నిజంగా సూపరేనా?

ఆరోగ్యం మీద, తద్వారా ఆహారం మీద అతి శ్రద్ధ పుణ్యమా అని ఇవాళ ఎవరిని కదిలించినా... కినోవా, చియా సీడ్స్‌, బ్లాక్‌ రైస్‌...లాంటి సూపర్‌ ఫుడ్స్‌ మాటే! చౌకైన మన చిరు ధాన్యాలను కాదని... ఖరీదైన ఈ పాశ్చాత్య ధోరణి ఫుడ్స్‌ కొంటున్నారు, తింటున్నారు. పెరిగిపోతున్న ఈ ధోరణి ఏ మేరకు ఆరోగ్యకరం? ఎంత మేరకు
లాభదాయకం?
ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరికీ మునుపెన్నడూ లేనంతగా ఆరోగ్యం పట్ల చైతన్యం పెరిగింది. ఫలితంగా ఇప్పుడు మన సమాజంలో సూపర్‌ ఫుడ్స్‌ పట్ల క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. వాటి మీద మోజు ఎన్నడూ లేనంతగా పతాకస్థాయికి చేరింది. ఆరోగ్యంగా ఉండాలంటే, కేవలం జిమ్‌లో వ్యాయామం చేస్తే సరిపోదు... దాంతో పాటు సరైన పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలనే స్పృహ ఇప్పుడు పెరిగింది. అందువల్లే ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ ఉండేవాళ్ళంతా ఇప్పుడు సూపర్‌ మార్కెట్ల చుట్టూ తిరుగుతూ, బలవర్ధకమైన సూపర్‌ ఫుడ్స్‌ కోసం వెతుకుతున్నారు. కినోవా రైస్‌, చియా, అలొవేరా, ఫ్లాక్స్‌ విత్తనాలు, కాలే, గోజీ బెర్రీల లాంటివి ఖరీదైనా సరే... ఏరి కోరి మరీ కొనుక్కొని తింటున్నారు.
విశేషం ఏమిటంటే... ఇంటి పక్కన పచారీ కొట్టులో ఈ సూపర్‌ ఫుడ్స్‌ దొరక్కపోతే, వెతికి వెతికి మరీ కొంటున్నారు. అక్కడా దొరకలేదంటే... ఏకంగా ఆనలైనలోకి వెళ్ళి, బోలెడంత డబ్బులు పోసి మరీ కొనుగోలు చేస్తున్నారు. నిజానికి, ఈ సూపర్‌ ఫుడ్స్‌ అన్నీ బాగా ఖరీదే. అయితే, ఆదాయం బాగుంటున్న నేటి యువతరం, మరీ ముఖ్యంగా పాతికేళ్ళ నుంచి నలభై ఏళ్ళ లోపు వాళ్ళు ఈ సూపర్‌ ఫుడ్స్‌ మీద తగని మోజు చూపిస్తున్నారు. కినోవా రైస్‌తో ఉప్మా, చియా గింజలతో సలాడ్‌, వీట్‌ గ్రాస్‌తో షేక్స్‌, గ్రీన టీ, కాలే చిప్స్‌, అలాగే అవొకాడో, స్పిరులీనా లాంటివి దాదాపుగా చాలామంది రోజు వారీ తిండిలో భాగమైపోయాయి.
దర్శక - నిర్మాత మణిశంకర్‌ సంగతే తీసుకుంటే, ఆయన రోజు వారీ తిండిలో ఆకుకూరలు, బొప్పాయి పండ్లు, బ్లాక్‌ రైస్‌ భాగమయ్యాయి. మామూలుగా మనం వాడే తెల్ల బియ్యంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ జిగురుగా ఉంటుంది. అయితే, ఐరన, విటమిన ఇ, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పోషక విలువలు పుష్కలంగా ఉండే ఈ బ్లాక్‌ రైస్‌ వాడకం చైనా, జపాన, ఇండొనేసియాలలో చాలా ఎక్కువ. మణి శంకర్‌ ఇంటర్‌నెట్‌లో అమెజాన వెబ్‌సైట్‌కి వెళ్ళి, అక్కడ ఈ బ్లాక్‌రై్‌సకు ఆర్డర్‌ చేస్తుంటారు. నల్లగా ఉండే ఈ తరహా బియ్యం అద్భుత ఆరోగ్యదాయని అని మణిశంకర్‌ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నల్ల బియ్యానికి పైన ఉండే పొట్టు వల్ల రుచితో పాటు, చాలా శక్తి వస్తుందని పరిశీలకుల మాట.
ఓ పేరున్న ఫ్యాషన డిజైనింగ్‌ కంపెనీలో పనిచేసే ఇరవై ఎనిమిదేళ్ళ నేహా సర్కార్‌ కూడా ఇలాంటి సూపర్‌ ఫుడ్స్‌ ప్రియుల జాబితాలో ఒకరు. కినోవా రైస్‌, చియా సీడ్స్‌ అంటే చాలు... ఆమెకు తగని ఇష్టం. ఆమె ప్రతిరోజూ రాత్రి వేళ చియా విత్తనాలను నీళ్ళలో నానబెట్టుకుంటారు. ఆ తరువాత వాటిని సలాడ్‌లో కానీ, పొద్దున్నే బ్రేక్‌ ఫాస్ట్‌గా తినే ఓట్స్‌ మీద కానీ చల్లుకుంటారు. అందం, ఆరోగ్యం పట్ల అమితమైన శ్రద్ధే ఈ బెంగాలీ యువతితో ఈ పని చేయిస్తోంది. సర్వసాధారణంగా బెంగాలీలు తినే చేపలు, మామూలు బియ్యంతో పోలిస్తే, ఈ కినోవా ఖరీదెక్కువే. అయినా సరే నేహా సర్కార్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఆమె వంటింట్లో అన్ని రకాల మమూలు రైస్‌ నిషిద్ధమంటే నమ్మండి. ‘‘మా అమ్మానాన్నలిద్దరికీ చిన్న వయసులోనే డయాబెటిస్‌ వచ్చింది.
వాళ్ళలా కాకుండా నేను దీర్ఘకాలం, హాయిగా, ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నాను. అందుకే, ఆహారంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా’’ అంటారు నేహ. పైపెచ్చు, పుస్తకాలలో, పేపర్లలో చాలామంది సినీ తారలు తాము కినోవా తింటున్నట్లు చెప్పడం ఆమె చదివారు. ఆ మాటలు తనపై ప్రభావం చూపాయని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి కినోవా రుచిలో చిరు చేదుగా ఉంటుంది కానీ, దానిలో ప్రొటీన్లు, మెగ్నీషియం, పీచు పదార్థాలు పుష్కలం. దక్షిణ అమెరికా దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తుంటారు. ప్రస్తుతం ఈ కినోవాకు దేశమంతటా ఉన్న క్రేజును చూసి, కొంతమంది రిటైలర్లు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కినోవా ధాన్యాన్ని పండిస్తున్నారు.
ఈ ధాన్యంలో కొలెసా్ట్రల్‌ శాతం తక్కువ కాబట్టి, దీన్ని సూపర్‌ పంటగా ఐక్యరాజ్య సమితి వర్గీకరించింది. నిజానికి, మన దేశంలో చియా విత్తనాలకు కూడా ఇప్పుడు పెద్ద మార్కెట్‌ ఏర్పడింది. చియా అంటే బలిమి అని అర్థం. దీన్ని ఎక్కువగా మెక్సికోలో పండిస్తారు. శుద్ధి చేయని గింజ ధాన్యాల కోవకు వచ్చే వీటిని శరీరం తొందరగా జీర్ణం చేసుకుంటుంది. గింజల రుచిలో ఉండే ఈ చియా విత్తనాలను సలాడ్స్‌, రైతా, పెరుగు, కూరగాయలు, పాలు - ఐస్‌ క్రీమ్‌ - పండ్లతో చేసే స్మూతీలలో వాడతారు.
అయితే, వైద్యచికిత్సలో, పోషకాహారంలో నిపుణులైనవారు మాత్రం ఈ సూపర్‌ ఫుడ్స్‌ వ్యామోహంలో పడి, అనవసరంగా అతిగా ఖర్చు చేసుకుంటున్నారని భావిస్తున్నారు.
సికింద్రాబాద్‌లో ఓ ఆరోగ్య కేంద్రం నడిపే పోషకాహార నిపుణురాలైన డాక్టర్‌ జ్యోతీ ఛబ్రియా మాట్లాడుతూ, ‘‘ఇవాళ చాలామంది యువతీ యువకులు ఏం తినాలి, ఏమొద్దు అనే విషయం కోసం ఏకంగా గూగుల్‌కు వెళ్ళి సెర్చ్‌ చేస్తున్నారు’’ అన్నారు. సరైన రీతిలో అన్ని రకాల ఆహార పదార్థాలూ తినేవాళ్ళే ఆరోగ్యవంతుల కింద లెక్క. ఉదాహరణకు, ఇవాళ నెయ్యి వేసుకోవడం అనగానే చాలామంది భయపడుతుంటారు. కానీ, మన తిండిలో తగు మోతాదులో నెయ్యి చేర్చుకోవడం అవసరం. కానీ, ఇవాళ మార్కెట్‌లో లభిస్తున్న రకరకాల నేతుల్లో చాలా భాగం కల్తీవే. స్వచ్ఛమైన నెయ్యి అందుబాటులో లేదు.
‘‘మనం ఎంతసేపటికీ చియా, గ్రీన టీ లాంటి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి, ఇవన్నీ మార్కెటింగ్‌ వల్ల ఇంత ప్రాచుర్యంలోకి వచ్చాయి కానీ, నిజానికి మనం ఫలూదాల లాంటి వాటిలో వాడే సబ్జా గింజలకూ, చియా గింజలకూ పెద్ద తేడా లేదు. పైగా, ఒంటికి చలవ చేసే సబ్జా గింజలు చాలా చౌక కూడా’’ అని డాక్టర్‌ ఛబ్రియా వ్యాఖ్యానించారు. ‘‘అయితే, మనం మామూలుగా వాడే వైట్‌ రైస్‌తో పోలిస్తే, బ్రౌన రైస్‌, రెడ్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌లు కొద్దిగా బెటర్‌. ఎందుకంటే, వాటిలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. అలాగని, ఉత్తరాది వాళ్ళను చపాతీలు తినడం మానేయమనీ, దక్షిణాది వాళ్ళను అన్నం తినడం మానేయమనీ చెప్పడం దీర్ఘకాలంలో ఆట్టే ఉపయోగకరం కాదు’’ అని డాక్టర్‌ ఛబ్రియా అన్నారు.
ఇప్పుడీ సూపర్‌ ఫుడ్స్‌ మోజు ఎంత వరకూ వచ్చిందంటే, ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా టైన్రర్ల దగ్గర శిక్షణ తీసుకొనవాళ్ళు కూడా వీటి వెంట పడుతున్నారు. తమకు సరైన డైట్‌ ఛార్ట్‌ ఇవ్వమని కోరుతున్నారు. ఆనక ఆ డైట్‌ ఛార్ట్‌ను తమ డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళి, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేయించుకుంటున్నారు. ‘‘ఇవాళ ఈ చైతన్యం బాగా పెరిగిపోయింది. జనం తమ ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడదలుచుకోవట్లేదు. తాము నోట్లో పెట్టుకొని తింటున్నదేమిటో, దానిలో పోషకాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు’’ అని లతారెడ్డి అన్నారు. బరువు తగ్గడం కోసం ఒక పేరున్న వెయిట్‌ లాస్‌ క్లినిక్‌లో చేరిన లతారెడ్డి కేవలం సూపర్‌ ఫుడ్స్‌ మాత్రమే తింటూ, మిగిలినవన్నీ మానేయడం ద్వారా రెండునెలల్లో దాదాపు ఎనిమిది కిలోలు బరువు తగ్గారు.
నిజానికి, ఇవాళ ఈ సూపర్‌ ఫుడ్స్‌ వెంట పడుతున్నాం కానీ, మన సాంప్రదాయిక భారతీయ ఆహార పదార్థాల్లో వీటిని తలదన్నే జొన్నలు, రాగులు, సజ్జల లాంటి చిరుధాన్యాలు చాలానే ఉన్నాయి. రేటు కూడా తక్కువుండే ఈ చిరు ధాన్యాలు, ఇవాళ జనం వేలంవెర్రిగా కొంటున్న సూపర్‌ ఫుడ్స్‌ అంత సమర్థంగానూ పనిచేస్తాయి. కాకపోతే, ఇటీవలి కాలంలో తెలివైన మార్కెటింగ్‌ ద్వారా ఈ ఖరీదైన సూపర్‌ ఫుడ్స్‌ను జనంలోకి బాగా చొచ్చుకుపోయేలా చేశారు.
ఒక్కసారి మన తాత, ముత్తాతల కాలానికి వెళితే, ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఆహారాన్ని ఔషధం లాగా చూసేవారు. తీసుకొనేవారు. కానీ, ఇటీవలి కాలంలో మనం కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం వైపు మనం మళ్ళాం. అసలు నేరం అదేనని సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ జి.వి. రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. ‘‘ఎంతసేపటికీ మనం బంగాళదుంప వేపుడు, అన్నం, లేదంటే బంగాళదుంప కూర, చపాతీలు తింటున్నాం’’ అని ఆయన అన్నారు. కినోవా సంగతికే వస్తే, దానిలో ఖనిజ లవణాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండేమాట నిజమే. కానీ, మన కొర్రల లాంటి చిరు ధాన్యాలు కూడా అంతే బ్రహ్మాండంగా ఆరోగ్యకరం. జహీరాబాద్‌ లాంటి మన సమీపంలోనే అవి పండుతున్నాయి.
కానీ, పేదలు మాత్రమే తినే తిండిగా మనం వాటిని దూరం పెడుతున్నాం. ఛియా సీడ్స్‌ మన శరీరంలోకి నిదానంగా తేమను విడిచిపెడతాయి. వాటి కన్నా చాలా చౌకగా దొరికే సబ్జా గింజలు కూడా ఆ పనే చేస్తాయని సి.ఎ్‌స.ఏ. సంస్థాపకుడు రామాంజనేయులు అన్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా పండిస్తారు కాబట్టి, కినోవా వాళ్ళ ఆహారంలో సహజంగానే ఒక భాగం. కానీ, భారతీయులమైన మనం స్థానికంగా పుష్కలంగా, చౌకగా దొరికే చిరుధాన్యాలు తినడమంత ఉత్తమం మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గుడ్డిగా పాశ్చాత్య దేశాల్నీ, సంస్కృతినీ అనుకరించే బదులు, పెద్దల కాలం నుంచి వస్తున్న మన తిండి, మన ఆహారపుటలవాట్లను అనుసరించడం సుఖం. ఈ సూపర్‌ ఫుడ్స్‌ మీద అతిగా ఖర్చు పెట్టే బదులు ఈ చిరుధాన్యాలు, అలాగే తాజా కూరగాయలు కొనుక్కొని తినడం ఆరోగ్యంతో పాటు ఆదా మార్గం కదూ!
-మాధవీ తాతా









No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list