MohanPublications Print Books Online store clik Here Devullu.com

గురువు ప్రేమ-Guruvu Prema


ఆర్థిక విషయాల్లోనూ ఆసక్తి చూపాలి!
సింగిల్‌ మదర్స్‌కు పిల్లల్ని పెంచడం పెద్ద సవాలు. ముఖ్యంగా పిల్లల కోసం ఆర్థికంగా వాళ్లు ఎంతో కష్టపడాలి. అయితే సరైన ప్లానింగ్‌ ఉంటే ఈ కష్టాలను అధిగమించడం సులువే. అదెలాగంటే...
విడాకులు తీసుకోవడం వల్ల తలెత్తిన మానసిక బాధలు పిల్లల జీవితాలపై పడకుండా చూసుకోవాలి.
ఒకవైపు మానసిక ఒత్తిళ్లు పడుతూ మరోవైపు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం కష్టమే కానీ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తే వీటిని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. అలాగే ఆర్థిక పరమైన నిర్ణయాల పట్ల కూడా ఆసక్తి చూపాలి.
తమ ప్రాధాన్యాల విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత వచ్చిన సొమ్ముతో కుటుంబం సుస్థిరంగా నిలదొక్కుకునేలా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులుంటే వాటిని తీర్చి ఆస్తిని సమకూర్చుకోవాలి.
హెల్త్‌ ఇన్సూరెన్సులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది సింగిల్‌ మదర్స్‌ తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఇంటిని నడిపించే ఏకైక వ్యక్తి ఆమే. కనుక పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్సు చేస్తే మంచిది.
తండ్రి లేని పిల్లలు కదా అని పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వద్దు. దుబారా ఖర్చులకు తావివ్వద్దు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ తీసుకోవాలి.
పిల్లల అవసరాలు సరిగ్గా తీరుస్తున్నానా... లేదా అనే విషయంపైనే సింగిల్‌ మదర్‌ ఎక్కువ ఆలోచిస్తుంది. దాంతోపాటు తమ రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ గురించి కూడా సింగిల్‌ మదర్స్‌ ముందే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
కుటుంబానికి సంబంధించిన చాలా విషయాల్లో సింగిల్‌ మదర్స్‌ మల్టీ టాస్కింగ్‌ చేస్తుంటారు. ఇంటి పనులతో పాటు పిల్లల చదువు, ఆరోగ్యం, ఇంటి బడ్జెట్‌ ఇలా అన్ని బాధ్యతలూ వీరివే. అనుక్షణం బాధ్యతల మధ్య కొట్టుకుపోతూ తమకూ ఒక జీవితం ఉందని మర్చిపోతారు. అలా కాకుండా సింగిల్‌ మదర్స్‌ ఏటా తమకోసం కొంత సొమ్మును ట్రావెలింగ్‌కి కేటాయించుకోవాలి. తమకు నచ్చిన హాబీలను కొనసాగించాలి. తాము పెట్టుకున్న లక్ష్యాల కోసం విడివిడిగా సేవింగ్స్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల సింగిల్‌ మదర్‌పై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.



బీపీకి, కిడ్నీలకు ఏమిటి సంబంధం? 
గత నాలుగేళ్లుగా నాకు అధిక రక్తపోటు సమస్య ఉంది. అయితే ఎప్పుడో అరుదుగా తప్ప దాని తాలూకు ఇబ్బందులేమీ కనిపించవు. అందుకే ఎప్పుడైనా తలబరువుగా గానీ, నొప్పిగా గానీ అనిపించిన ఆ రోజున మాత్ర వేసుకుని మిగతా రోజుల్లో మానేస్తాను. ఒకసారి ఈ విషయం స్థానిక డాక్టర్‌ ముందు ప్రస్తావనకు వచ్చినప్పుడు అలా ఎప్పుడో ఒకసారి మాత్రలు వేసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఆయనకు నేను ఎప్పుడు తారసపడినా అదే విషయమై హెచ్చరిస్తూ ఉంటాడు. నా మట్టుకు నాకు కిడ్నీలకు, హై బి.పికి పెద్దగా సంబంధం ఉన్నట్లు అనిపించదు. మీరేమంటారు?
- డి. రామేశ్వరం, కళ్యాణదుర్గం

కిడ్నీ ఫెయిల్యూర్‌ కేసుల్లో నాలుగింట మూడు వంతులు అధిక రక్తపోటు వల్లనే ఏర్పడుతున్నాయని ఎన్నో అధ్యయనాల్లో బయటపడింది. జీవక్రియల్లో భాగంగా గుండె అనుక్షణం రక్తాన్ని శరీరంలోని అణువణువుకూ సరఫరా చేస్తుంటే, మరోవైపు మూత్రపిండాలు రక్తంలోని మలినాలను ఎప్పటికప్పుడు వడబోస్తూ ఉంటాయి. ఈ వడబోత కోసం రక్తం నిరంతరం మూత్రపిండాల్లోకి వెళ్లివస్తూ ఉంటుంది. రక్తపోటును క్రమబద్దంగా ఉంచడంలో మూత్రపిండాలు కీలకపాత్రను పోషిస్తూ ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచడం కోసమే ఇవి ‘రెనిన్‌’ లాంటి కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అంతే కాకుండా ఒంట్లో నిలువై ఉన్న అదనపు ద్రవాలను ఎప్పటికప్పుడు బయటికి పంపడం ద్వారా మూత్రపిండాలు, శరీరంలో రక్త పరిమాణం పెరగకుండా, తద్వారా రక్తపోటు పెరగకుండా చూస్తుంటాయి. వాస్తవానికి మన మూత్రపిండాల్లో నిజంగా ఒక అద్భుతమైన యంత్రాంగం ఉంది. ఒక్కో కిడ్నీలో దాదాపు 10 లక్షల చిన్నచిన్న నెఫ్రాన్‌ యూనిట్లు ఉండి అవి నిరంతరం రక్తాన్ని వడబోస్తుంటాయి. అందుకోసం రక్తం నిరంతరంగా ఈ యూనిట్లలోని సూక్ష్మాతిసూక్ష్మమైన రక్తనాళాల్లోకి వెళ్లివస్తుంటాయి. ఎవరిలోనైనా హై బి.పి ఎక్కువ కాలం కొనసాగితే, ఈ నెఫ్రాన్‌లలో ఉండే సున్నిత రక్తానాళాల మీద ఒత్తిడి పెరిగి అవి కుంచించుకుపోయి దెబ్బతింటాయి. ఈ స్థితి వల్ల కిడ్నీల్లో వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఒంట్లోని అదనపు ద్రవం బయటికి పోకుండా లోపలే ఉండిపోవడంలో రక్తపోటు మరింతగా పెరుగుతుంది. అంతిమంగా కిడ్నీలు పూర్తిగా, శాశ్వతంగా దెబ్బతినిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మీకున్న అధిక రక్తపోటు సమస్యను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసింది చాలు. ఒకసారి కిడ్నీ పరీక్షలన్నీ చేయించుకుని ఆ తర్వాతైనా క్రమం తప్పకుండా బి.పి మాత్రలు వేసుకోవడం కొనసాగించండి.
- డాక్టర్‌ ఎన్‌. శ్రావణ్‌ కుమార్‌, నెఫ్రాలజిస్ట్‌

గురువు ప్రేమ 
జెన్‌ గురువు సుజుకీ రోషికి గొప్ప పేరుంది. ఆయన తన శిష్యులను ప్రేమగా చూసుకునేవారు. శిష్యులకు కూడా గురువుపై అమితమైన అభిమానం ఉండేది. శిష్యుల్లో ఒక అమ్మాయికి గురువుగారిపై ప్రేమ కలిగింది. ఆయన లేనిదే బతుకు లేదనే భావనలో పడిపోయింది. ఒకరోజు ఆ శిష్యురాలు సుజుకీ దగ్గరికి వచ్చింది. ఆయనపై తనకున్న ప్రేమను ఎలాగైనా చెప్పాలనుకుంది. ప్రేమతో కూడిన హావభావాలు వ్యక్తం చేస్తూ.. ఏదో రకంగా గురువుగారి మనసులో చోటు సంపాదించాలని భావించింది. అయితే అది ప్రేమో... కాదో.. తెలియలేని అయోమయస్థితిలో ఉందామె. తీరా గురువుగారు ఏమంటారో అన్న ఆందోళన కూడా ఆమెను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. శిష్యురాలి ఇబ్బందిని గ్రహించిన సుజుకీ.. ఆమె తలను ఆప్యాయంగా నిమిరి.. ‘‘నీవు ఏమీ బాధపడకు. మీ గురువు మీద ఉన్న ప్రేమనంతా, ఆయనపై ఉన్న అభిమానాన్నంతా... ఈ గురువు కోసం మనసులో అలాగే ఉంచుకోండి. అది మంచిదే. అయితే మన ఇద్దరికీ సంబంధించి... అంటే గురు, శిష్యులకు సంబంధించినంత వరకు కావలసినంత క్రమశిక్షణ నేను కలిగి ఉన్నాను. నా శిష్యురాలిగా నీలోనూ ఆ గుణం ఉందని విశ్వసిస్తున్నాను’’ అంటూ ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరించాడు. ఆ మాటలు వినగానే.. శిష్యురాలికి గురువు గొప్పదనం తెలిసి వచ్చింది. ఆయన గురువుగా లభించడం తన అదృష్టంగా భావించింది.


ముఖవర్ఛస్సు పెరుగుతుంది
వంటింట్లో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో పెరుగు కూడా ఒకటి. మీ ముఖవర్చస్సు పెరగాలంటే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి
పెరుగులో రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా రాసుకోవాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే... చర్మం నిగనిగలాడుతుంది.
ఒక కప్పు పెరుగులో ఒక టేబుల్‌ స్పూన్‌ శెనగపిండి వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేయడం ద్వారా ముఖం కాంతిమంతం అవుతుంది.
చిన్న కప్పు పెరుగులో ఒక టేబుల్‌ స్పూన్‌ బియ్యం పిండి వేసి నల్లని మచ్చలపై తరచూ రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.


పొరలుగా ఊడిపోతుంటే... 
కొందరికి అరిచేతుల్లోనూ, అరికాళ్లలోనూ చర్మం పొరలు పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. ఇది కొందరిని తీవ్రమైన ఆత్మన్యూనతకు కూడా గురిచేస్తూ ఉంటుంది. సాధారణంగా ఒంటికి పడని కొన్ని వస్తువుల్ని తరుచూ తినడం వల్లగానీ లేదా ఆ భాగాలు బాగా ఒరిపిడికి గురికావడం వల్లగానీ వస్తూ ఉంటుంది. చర్మం ఊడిపోవడమే కాకుండా కొందరికి ఆయా భాగాల్లో చిన్న చిన్న నులిపొక్కులు కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగుతున్నప్పుడు ఆ పొరల్ని గోళ్లతో గానీ, నోటితో గానీ, తీసివేయడం అలవాటవుతుంది. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి రక్తం వచ్చి ఇన్‌ఫెక్లన్లు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు గృహ వైద్యంగా.....
వేపగింజల గుజ్జును చర్మం పొరలు లేస్తున్న భాగంలో లేపనంగా రాయాలి.
అల్లంరసాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా సేవించాలి.
పై విధానాలతో తగ్గకపోతే, తిప్పసత్తు, అభ్రకభస్మం, ద్రాక్షాది చూర్ణం వాడవచ్చు.

ఆ రహస్యం తెలిసింది 
నీటి మీద రాళ్లతో వంతెన కట్టి శ్రీరాముడు సముద్రాన్ని దాటాడని రామాయణంలో చదువుకున్నాం.. కాలక్రమంలో నీటి మీద తేలే రాళ్లు కూడా ఉన్నాయని పరిశోధకుల అధ్యయనాలలో తేలింది. పుమైస్‌ స్టోన్స్‌గా వ్యవహరించే ఈ రాళ్లు ఏళ్ల తరబడి నీటిపై తేలడం వెనకున్న రహస్యం ఏంటనేది చాలాకాలం వరకు అంతుపట్టలేదు. ఈ చిక్కుముడిని విప్పడానికి లారెన్స్‌ బెర్క్‌లీ నేషనల్‌ లేబరేటరీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. వారి పరిశోధనలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఎక్స్‌రేల సాయంతో రాళ్లను పరీక్షించగా.. మన చర్మంపై ఉన్న రోమాల తరహాలో ఈ రాళ్లపై సూక్ష్మ స్థాయిలో రంధ్రాలు ఉన్నాయని తేలింది. దీంతో పాటు రాళ్ల లోపల రకరకాల వాయువులు ఉన్నట్లు గుర్తించారు. అంతర్భాగంలో చిక్కుకుపోయిన ఈ వాయువుల కారణంగానే ఈ రాళ్లు నీటిపై తేలుతున్నాయని నిర్ధారణకు వచ్చారు.

హాయ్‌ చెప్పేయండిలా!

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు కొందరు సహోద్యోగులుల్ని నవ్వుతూ పలకరిస్తే.. మరికొందరు మౌనంగా ఎవరితోనూ మాట్లాకుండా ఓ చోట కూర్చుంటారు. మొదటిరోజే కదా.. ఎలా ఉన్నా ఫర్వాలేదు అని తేలిగ్గా తీసుకోవద్దు. మీ ప్రవర్తన సహోద్యోగుల్లో మీపై కొన్ని అభిప్రాయాల్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి...
* కనీసం పావుగంట ముందుగా పనిచేసే చోటుకు హాజరుకావాలి. మీరు ఎక్కడ నుంచి వచ్చారనేది తెలియజేయండి. మీ విభాగంలో ఉన్నవారికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నప్పుడు ముఖంలో చిరునవ్వుని చెదరనీయొద్దు. భయం, బిడియం వంటి భావోద్వేగాలని మీ ముఖంలో కనిపించనీయొద్దు. 
* మొదటి రోజు నుంచి ఏదో గుర్తింపు తెచ్చుకోవాలని ఏదో ఒక పనిచేసి హడావుడి పడిపోవద్దు. అలాగే మీరు చేసే పనిలో కంగారు, గాబరా కనిపించకుండా జాగ్రత్త పడండి. ముందు పని వాతావరణాన్ని అర్థంచేసుకోండి. అలాని మరీ సహోద్యోగులతో అతిచొరవ తీసుకుని జోక్స్‌ వేయడం కూడా సరికాదు. హుందాగా ఉండండి. 
* మొదటిరోజు కదా..మాతో కలిసి తింటావా అని సహోద్యోగులు కానీ బాస్‌కానీ అడిగితే కాదనకండి. కలిసి తినడం వల్ల మీరు బృందంలో కూడా త్వరగా కలుస్తారనే భావన వారిలో కలుగుతుంది. 
* మొదటిరోజు నుంచే సహోద్యోగులు చెప్పిన ప్రతిదాన్నీ కాదు, కుదరదు అంటూ ఖండించవద్దు. కొన్నిరోజుల వరకూ ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. వినడం..చిరునవ్వుతో పలకరించడం అనేవి మిమ్మల్ని ఉద్యోగంలో వేగంగా కుదురుకునేలా చేస్తాయి.

ఖర్జూరం.. పోషకాల ఖజానా!

ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్‌ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఖర్జూరాలు ఇంకెలా మేలుచేస్తాయంటే..
* విటమిన్లూ, ఖనిజాలూ, మాంసకృత్తులూ ఖర్జూరాల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌ల వల్ల తీసుకున్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది. అలసట మటుమాయమవుతుంది. ఖర్జూరాలను పాలతోనూ కలిపి తీసుకోవచ్చు. 
* ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలకు మేలుచేస్తాయి. కడుపు మంటను కూడా తగ్గిస్తాయి. వీటిలోని అరుగుదలకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఖర్జూరాలు ముందుంటాయి. 
* ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీటితో సహా తీసుకుటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునేవారికి ఇది చక్కటి ఆహారం. ఖర్జూరాల్లో ఇనుము శాతం కూడా ఎక్కువే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఎదురు కాదు.

ఆధ్యాత్మిక పరిణతి!
ఆత్మీయం
ఆధ్యాత్మికత అంటే అందరికీ అనేక సందేహాలు, భావనలు ఉంటాయి. అయితే ఈ పని చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అందుకని ఈ పని చేయను. శక్తి లేక కాదు. ఈ గొలుసు ఎవరిదీ అని అడిగి ఇచ్చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. జేబులో వేసుకుంటే సంతోషించడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడన్నది మన నమ్మకం. అంతే. ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాం. ఏది చేస్తే ఇంటిలోని వాళ్లు బాధపడతారో అది చేయం. ఏది చేస్తే పెద్దలు సంతోషిస్తారో అది చేస్తాను. అదే ఆధ్యాత్మికత. అది క్రమక్రమంగా పరిణతి చెందాలి. పరిణతి చెందడమంటే... దేవుడున్నాడని నమ్మింది నిజమైతే, ఆయన మనకు ఇన్ని శక్తులిచ్చాడన్నది నిజమైతే దేవుడున్నాడని అందరూ అనుకునే ఆలయానికి వెళ్లకుండా ఉండగలమా?
ఆయనకు ఓ పండు నైవేద్యం పెట్టకుండా ఉండగలమా? ఆయనని అందరిలో చూడకుండా ఉండగలమా? భగవంతుడి ప్రీతికోసం ఆర్తుల సేవ చేయకుండా ఉండగలమా? డబ్బుంటే ఏదైనా ఓ గుడిలో అన్నదానం చేయకుండా ఉండగలమా? మనకు ఎప్పుడు అవకాశం వచ్చినా, భగవంతుడి కోసం, పదిమందిని సంతోష పెట్టడం కోసం బతకడం రావాలి. ఆధ్యాత్మిక పరిణతి అంటే అదే!


ఆకలికి భేష్‌...గుడ్‌ఫుడ్‌
జీలకర్ర ప్రధానాహారంగా కాకపోయినా... ఆహారానికి మంచి రుచి, సువాసన (ఫ్లేవర్‌) రావడానికి ఉపయోగపడే దినుసు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని... తాలింపులో జీలకర్ర పడగానే ఒక మంచి సువాసనతో మనకు ఆహ్లాదం చేకూరుతుంది. జీలకర్రలో ఉండే క్యుమినాల్డిహైడ్‌ అనే రసాయనమే దీనికి కారణం. ఇది మన లాలాజల గ్రంథులను ఉత్తేజపరచి ఆకలిని పెంచుతుంది.
పైన పేర్కొన్న ప్రక్రియ జరగగానే జీలకర్ర ఉండే థైమాల్‌ అనే మరో రసాయనం జీర్ణప్రక్రియకు అవసరమైన బైల్, ఇతర జఠరరసాలు ఊరేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చూస్తుంది. అందుకే ఆకలి లేనివారు, అరుగుదల సమస్యలు ఉన్నవారు జీలకర్ర వాడితే ప్రయోజనం ఉంటుంది. జీలకర్ర గ్యాస్‌ట్రబుల్‌ను తగ్గిస్తుంది. త్రేన్పులు ఎక్కువగా వస్తున్నప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో జీలకర్రను వాడితే గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.
జీలకర్రలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రుతు సమయంలో అధిక రుతుస్రావం అయ్యే మహిళలు జీలకర్ర వాడితే వారు కోల్పోయే ఐరన్‌ తిరిగి భర్తీ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకూ ఐరన్‌ ఎక్కువగా అవసరం కాబట్టి వారు వాడటం కూడా అవసరం. రక్తంలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్స్‌ను జీలకర్ర తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.
బ్యూటిప్స్‌
ఎండకు కమిలిన చర్మానికి బొప్పాయి రసం రాస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. ఫ్రూట్‌ ఫేషియల్‌కు బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును అన్ని రకాల చర్మాల వాళ్లూ వాడవచ్చు. ఒక టేబుల్‌ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో టీ స్పూన్‌ శనగపిండి, టీ స్పూన్‌ పెరుగు కలిపి ప్యాక్‌ వేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి.
మెడ, మోచేతులు, పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాల సేపు రుద్దాలి. ఇలా రెండువారాలు చేస్తే నలుపుపోతుంది. బొప్పాయిలో సహజసిద్ధంగా మైల్డ్‌ బ్లీచ్‌తోపాటు మాయిశ్చరైజర్‌ కూడా ఉంటుంది. కాబట్టి కృత్రిమ మైన బ్లీచ్, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ రాస్తే కలిగే ఫలితాన్ని బొప్పాయి ప్యాక్‌తో సాధించవచ్చు.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list