‘ఆ సర్జరీ’ అవసరమేనా?
బేరియాట్రిక్ సర్జరీ!.. లావు, బరువు తగ్గటానికి చేయించుకొనే శస్త్రచికిత్స. ఈ పేరు వినగానే ఇటీవలే మరణించిన దర్శకరత్న దాసరి, ఒకప్పటి అందాల నటి ఆర్తీ అగర్వాల్ మొదలైన ప్రముఖులు గుర్తొస్తారు. ఈ సర్జరీ వల్ల తలెత్తిన కాంప్లికేషన్స్ కొందరికి ప్రాణాంతకంగా పరిణమించటంతో ఇప్పుడు ఈ సర్జరీ అవసరం, ఫలితం, దుష్ప్రభావాల గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వరుణ్ రాజు సహాయంతో బేరియాట్రిక్ సర్జరీ గురించి విశ్లేషించే ప్రయత్నం చేసింది నవ్య.
లావవటం ఎంత తేలికో తగ్గటం అంత కష్టం. అయినా నియంత్రణ కోల్పోయిన శరీర బరువును అదుపు చేయటానికి వ్యాయామం, ఆహార నియమాల లాంటి ఎన్నో మార్గాలున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో, కొందరు వ్యక్తులకు ఇవేవీ ఫలితాన్నివ్వవు. జన్యుపరంగా లేదంటే అస్థవ్యస్థ జీవనశైలి వల్ల, ఆహారపుటలవాట్ల వల్ల ఒబేసిటీ (స్థూలకాయం) సంక్రమిస్తుంది.
ఈ ఒబేసిటీ ఫలితంగా మధుమేహం, రక్తపోటు, హైపర్‌టెన్షన్, హైపర్ కొలెస్ట్రాల్, హైపర్ ట్రైగ్లిసరైడ్స్, థైరాయిడ్ మొదలైన సమస్యలన్నీ చుట్టుముడతాయి. ఈ సమస్యలనే ‘మెటబాలిక్ డిజార్డర్స్’ అంటారు. ఈ డిజార్డర్లను మందులతో అదుపు చేయలేని సందర్భాల్లో, తప్పని పరిస్థితుల్లో మాత్రమే ‘బేరియాట్రిక్ సర్జరీ’ని ఆశ్రయించాలి. ఇంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీని సౌందర్యానికి సంబంధించిన విషయంగా భావించేవారు.
కానీ ఇప్పుడు దీన్ని ‘మెటబాలిక్ సిండ్రోమ్’ అనే వైద్యపరమైన సమస్యగా భావించటం మొదలుపెట్టారు. అన్ని రకాల శరీర సంబంధ వ్యాధులన్నీ ఒబేసిటీతో ముడిపడి ఉండటం వల్ల ఈ సమస్యను ఓ వ్యాధిగా పరిగణించే పరిస్థితి మొదలైంది. రకరకాల వ్యాధులకు మూలం ఒక వ్యాధే అయినప్పుడు ఆ ఒక్క వ్యాధికి చికిత్స అందించగలిగితే సరిపోతుందనే ఆలోచనా మొదలైంది. అలా వాడుకలోకొచ్చిన వైద్య విధానమే ‘బేరియాట్రిక్ సర్జరీ’!
ఏడు రకాల బేరియాట్రిక్ సర్జరీల్లో ప్రధానమైనవి ఐదు . అవేంటంటే....
1. స్లీవ్ గ్యాస్ట్రక్టమీ : రిస్ట్రిక్టివ్ కోవలోకొచ్చే ఈ బేరియాట్రిక్ సర్జరీలో జీర్ణకోశం పరిమాణాన్ని కుదిస్తారు. ఆకలి మీద, తీసుకునే ఆహారం మీద నియంత్రణ లేని వ్యక్తులకు జీర్ణకోశాన్ని కుదించే ‘స్లీవ్ సర్జరీ’ ఉత్తమమైనది. ఈ సర్జరీలో జీర్ణకోశాన్ని సగానికి కట్ చేసి అంచులను క్లిప్పులతో మూసేస్తారు. ఈ సర్జరీతో జీర్ణాశయం కుంచించుకుపోయి కొద్ది ఆహారానికే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో రోగి పరిమిత ఆహారం తీసుకుంటాడు. ఫలితంగా శరీరంలో నిల్వ ఉండిపోయిన కొవ్వు కరగటం మొదలై క్రమేపీ శరీర బరువు అదుపులోకొస్తుంది.
2. గ్యాస్ట్రిక్ బైపాస్: పేగులోని ఒక భాగాన్ని మరో పేగుకు అనుసంధానం చేసే సర్జరీ ఇది. మాల్‌బ్జార్పిటివ్ విభాగానికి చెందిన ఈ సర్జరీలో అన్నవాహిక నుంచి జీర్ణాశయంలోకి ఆహారం చేరుకునే మార్గం ప్రారంభంలో చిన్న పేగును అనుసంధానం చేస్తారు. దీంతో ఆహారం జీర్ణాశయంలోకి చేరే వీలు లేక నేరుగా పెద్ద పేగుల్లోకి చేరి విసర్జించబడుతుంది. అంటే ఆకలి వేసి ఆహారం తిన్నా అది అరగకుండా విసర్జించబడేలా జీర్ణవ్యవస్థకు మార్పులు చేస్తారు. ఈ సర్జరీ వల్ల ఆకలి తీరుతుంది. కానీ తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవు. ఫలితంగా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగి ఒబేసిటీ వదులుతుంది. వ్యక్తి శరీర తీరు, ఆరోగ్య పరిస్థితి, తగ్గాల్సిన బరువు ఆధారంగా ఈ సర్జరీలో పేగుల అనుసంధాన దూరాన్ని నిర్ణయిస్తారు.
3. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్: ఈ సర్జరీలో ఆహార నాళం చివర్లో అన్నవాహిక దగ్గర, జీర్ణాశయం ఓ చిన్న సంచిలా తయారయ్యేలా చేతివాచీ లాంటి ఒక బ్యాండ్‌ను ఫిక్స్ చేస్తారు. దీని నుంచి జీర్ణాశయంలోకి ఇరుకైన దారి ఉంటుంది. ఈ బ్యాండ్‌కు ఓ చిన్న అడ్జ్‌స్టమెంట్‌ను పొట్ట దగ్గరి చర్మం కింద అమరుస్తారు. రోగి ఆహారం తీసుకునేముందు దీన్ని నొక్కి జీర్ణాశయాన్ని చిన్నదిగా చేసుకోవాలి. తీసుకున్న ఆహారం మొదట ఈ చిన్న తిత్తిలోకి వెళ్తుంది కాబట్టి కొద్ది ఆహారానికే కడుపు నిండిన ఫీలింగ్ కలిగి తినటం మానేస్తాం. తిన్న తర్వాత ఆ ఆహారం నెమ్మదిగా జీర్ణాశయంలోకి జారి జీర్ణం అవుతుంది. ఈ విధానం వల్ల తక్కువ ఆహారంతో ఆకలి తీరిపోతుంది. అయితే బ్యాండ్ అడ్జ్‌స్టమెంట్ రోగి చేతిలో ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనే మనోసంకల్పం బలంగా ఉన్నవాళ్లకే వైద్యులు ఈ సర్జరీని సూచిస్తారు. మిగతా బేరియాట్రిక్ సర్జరీలతో పోలిస్తే బ్యాండింగ్ ఎంతో సులువైన ప్రక్రియ. దీన్ని అమర్చటం, తీయటం రెండూ తేలికే!
4. డియోడినల్ స్విచ్ అండ్ బైపాస్: ఇది మిక్స్‌డ్ బేరియాట్రిక్ సర్జరీ కోవలోకొస్తుంది. ఈ సర్జరీలో పేగులను కలిపే దూరాన్ని పెంచటంతోపాటు డియోడినల్ స్విచ్ కూడా ఏర్పాటు చేయటం వల్ల వెయిట్‌లాస్ ఎక్కువగా, త్వరగా జరుతుంది.
5. గ్యాస్ట్రిక్ బెలూన్: దర్శకులు దాసరి నారాయణరావుకు చేసిన సర్జరీ ఇదే! ఈ సర్జరీలో ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్‌ను ఎండోస్కోపీ సహాయంతో నోటి ద్వారా జీర్ణాశయంలోకి పంపిస్తారు. తర్వాత ఈ సిలికాన్ బెలూన్‌ను చిన్న గొట్టం ద్వారా సెలైన్ నీటితో నింపుతారు. దీన్ని ఆరు నెలలపాటు జీర్ణకోశంలో ఉంచొచ్చు. ఇది జీర్ణాశయంలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించటంతో కొద్ది ఆహారానికే పొట్ట నిండి ఆకలి తీరిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఆరు నెలల వ్యవధిలోనే రోగి శరీర బరువులో దాదాపు 30 శాతం కోల్పోతాడు. ఆరు నెలల తర్వాత అవసరమనుకుంటే ఆ బెలూన్‌ను పగలగొట్టి తీసేయటం లేదా దాని ప్రదేశంలో కొత్త బెలూన్ అమర్చటం చేస్తారు. జీవితకాలం సరైన శరీర బరువును మెయింటెయిన్ చేయాలనుకునేవారికి ఈ సర్జరీ సరైనది. గంటలో పూర్తయ్యే ఈ సర్జరీ నుంచి కోలుకోవటానికి మూడు రోజులు పడుతుంది. సర్జరీ సమయంలో ఒంటి మీద ఎలాంటి గాయాలూ అవవు కాబట్టి రోగికి శారీరక అసౌకర్యం కూడా కలగదు. ఆరు నెలల్లో బరువు తగ్గి రిస్ట్రిక్టెడ్ డైట్ అనుసరించగలిగిన వాళ్లు తిరిగి బెలూన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాకాకుండా మరింత బరువు తగ్గవలసి ఉండి, ఆహారం నియంత్రించాల్సి ఉంటే రెండు, మూడోసారి బెలూన్ రీప్లేస్ సర్జరీ అవసరమవుతుంది.
బేరియాట్రిక్ సర్జరీ అంటే?
బేరియాట్రిక్ సర్జరీ పనితీరు... తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించటం, తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే సమయాన్ని కుదించటం, జీర్ణమయ్యే అవకాశం ఇవ్వకపోవటం అనే సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రాల ఆధారంగా ‘రిస్ట్రిక్టివ్, మాల్‌అజ్జార్పిటివ్, మిక్స్‌డ్ సర్జరీ’ అనే మూడు విభాగాలకు చెందిన బేరియాట్రిక్ సర్జరీలను వైద్యులు ఎంచుకుంటారు. ఆహారాన్ని నియంత్రించటం కోసం ‘రిస్ట్రిక్టివ్’, ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా చేయటం కోసం ‘మాల్‌బ్జార్పిటివ్’ విధానాలను అనుసరిస్తారు. వ్యక్తుల మెటబాలిక్ డిజార్డర్ల తీవ్రత, మనోధైర్యం, కోరుకుంటున్న ఫలితం ఆధారంగా ఏ రకమైన బేరియాట్రిక్ సర్జరీ అవసరమనేది వైద్యులు నిర్ణయిస్తారు. ఆకలితో ఆహారం తీసుకోవాలనే కోరిక కలిగినా తక్కువ పరిమాణంలో తినగలిగేలా, తీసుకున్న ఆహారం ద్వారా పోషకాలు శరీరానికి అందకుండా ఉండేలా జీర్ణ వ్యవస్థకు మార్పులు చేసే సర్జరీలన్నీ బేరియాట్రిక్ కోవలోకొస్తాయి.
ఎవరికి అవసరం?
బిఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు బేరియాట్రిక్ సర్జరీని వైద్యులు సూచిస్తారు. బిఎమ్‌ఐ 40 కంటే ఎక్కువ ఉన్న సూపర్ ఒబేస్, అంతకంటే ఎక్కువ ఉన్న సూపర్ సూపర్ ఒబేస్, మార్బిడ్ ఒబేస్ రోగులూ ఉంటారు. కానీ 40 బిఎమ్‌ఐ అనేది అమెరికన్ ప్రజల శరీర తీరును బట్టి నిర్ణయించారు. కాబట్టి ఈ లెక్కను ప్రపంచవ్యాప్తంగా అనుసరించటం సరికాదు. మరీ ముఖ్యంగా ఆసియా దేశాల ప్రజల్లో బిఎమ్‌ఐ 27 - 28 ఉన్నా ఒబేసిటీగానే పరిగణించాల్సి ఉంటుంది.
వీళ్లందరికీ వారి వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా ఏడు రకాల బేరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటారు. ఇంతకంటే తక్కువ బిఎమ్‌ఐ ఉండి, మందులతో మెటబాలిక్ డిజార్డర్లు అదుపులోకి రాకుండా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నప్పుడు కూడా బేరియాట్రిక్ సర్జరీ తప్పనిసరి అవుతుంది. ఈ సర్జరీ వల్ల ఎండోక్రైన్ సిస్టమ్ పనితీరు మెరుగవుతుంది. దాంతో షుగర్, రక్తపోటు, థైరాయిడ్ లాంటి సమస్యలు సర్దుకుని ఆరోగ్యం సమకూరుతుంది.
ప్రత్యామ్నాయాలు ఫెయిలయునప్పుడే సర్జరీ!
ఒబేసిటీతో వచ్చిన ప్రతి వ్యక్తీ నేరుగా బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లటానికి వీలు లేదు. ముందుగా రోగికి ఒబేసిటీ అనే పదానికి వైద్యపరమైన అర్థాన్ని విడమర్చి చెప్పి, ఒబేసిటీ చికిత్సా విధానాలను వైద్యులు వివరిస్తారు. ఇందుకోసం మొదట డైట్ ప్లాన్(ఆహార ప్రణాళిక) సూచిస్తారు. అలాగే శరీరంలో ఎంత కొవ్వు ఉందో తెలుసుకోవటం కోసం ‘ఫ్యాట్ స్కాన్’ చేస్తారు. దాన్ని అనుసరించి, రోగి బాడీ మాస్ ఇండెక్స్(బి.ఎమ్.ఐ)కు తగిన క్యాలరీలను లెక్కించి అందుకు తగిన ఆహార నియమాలను సూచిస్తారు.
సర్జరీతో ఎలాంటి ఉపయోగాలు?
లావు, సన్నం... ఎలాంటి వ్యక్తులకైనా మజిల్ మాస్ ఒకేలా ఉంటుంది. లావుగా ఉండే వ్యక్తుల్లో ఈ మజిల్ మాస్‌కు అదనంగా కొవ్వు ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ ప్రధానోద్దేశం ఈ కొవ్వును కరిగించటమే! సర్జరీతో తీసుకునే ఆహారాన్ని, తద్వారా క్యాలరీలను నియంత్రించగలిగితే శరీరం శక్తి కోసం తనలోని కొవ్వును కరిగించుకోవటం మొదలుపెడుతుంది. ఈ పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరిగి శరీర బరువు అదుపులోకొస్తుంది. ఫలితంగా మెటబాలిక్ డిజార్డర్లు అయిన మధుమేహం, థైరాయిడ్, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. జీవన శైలి మెరుగవుతుంది. స్థూలకాయంతో కూడిన ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి.
సర్జరీ తర్వాత జాగ్రత్తలు
బేరియాట్రిక్ సర్జరీకి ముందు బాడీ మాస్ ఇండెక్స్, శరీరంలో కొవ్వు పరిమాణం లెక్కించి బరువు తగ్గటం కోసం అన్ని రకాల ప్రయత్నాలూ విఫలమైనప్పుడు, స్థూలకాయం మూలంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలు మందులతో అదుపులోకి రానప్పుడు మాత్రమే బేరియాట్రిక్ సర్జరీని ఎంచుకోవాలి. ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ...ఈ విఽధానాల్లో సర్జరీ చేసినా సర్జరీ తర్వాత వైద్యుల సూచనలు పాటిస్తూ, సూచించిన మందులను వాడాలి. అలాగే సర్జరీ ఫలితాన్ని అంచనా వేయటం కోసం క్రమం తప్పకుండా బాడీ మాస్ ఇండెక్స్, కొవ్వు పరిమాణాలను పరీక్షించుకుంటూ ఉండాలి. పొట్టలో ఎంత చిన్న అసౌకర్యం కలిగినా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
-డాక్టర్. వరుణ్ రాజు
లాప్రోస్కోపీ హెచ్‌ఓడి, జనరల్ అండ్ జిఐ సర్జరీ,
ఓమ్ని హాస్పిటల్స్, కూకట్‌పల్లి, హైదరాబాద్.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565