రక్తశుద్ధి పట్ల శ్రద్ధ అవసరం
కేవలం రక్త పరీక్ష ద్వారానే వందలాది వ్యాధులు బయటపడతాయి. దీన్నిబట్టి రక్తాన్ని శుద్ధంగా ఉంచుకోవడం ద్వారా ఎన్ని వ్యాఽధుల్లోంచి బయటపడవచ్చో ఇట్టే అంచనా వేయవచ్చు. అలాంటి రక్తం గురించి తెలియాలంటే, శరీర ధాతుక్రమం గురించి తెలియాలి. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అనే శరీరంలోని ఈ సప్తధాతువుల్లో రసఽధాతువు మొదటిది.. కీలకమైనది. ఎందుకంటే, మనం ఏ ఆహారం తీసుకున్నా, అది జీర్ణమై రసంగా మారకపోతే అది రక్తంగా మారే అవకాశం లేదు. ఏమైనా మాంసం నుంచి, రక్తం. రక్తం నుంచి మాంసం ఇలా ఒక ధాతువు నుంచి మరో ధాతువు తయారువుతుంది. అలా మొత్తం ఏడు ధాతువులకు, మూలంగా ఈ రస, రక్త ధాతువులు ఉంటాయి. రక్తం మాంసాన్ని ఇవ్వడమే కాదు, చర్మానికి వర్ణాన్నిస్తుంది. అంతకన్నా ముఖ్యంగా ఆరోగ్య యుక్తమైన జీవాన్నిస్తుంది.
ప్రతి ధాతువుకూ ఒక మూలాధారం ఉంటుంది. రక్తానికి కాలేయం, ప్లీహం, ధమనులు మూలాధారం. శరీరంలో రక్తం బావుండాలంటే, ఈ మూడూ బావుండాలి. రక్తం ఉత్పత్తి బాగానే జరిగినా ధమనులు సరిగా లేకపోతే, రక్తంగానీ, రక్తంతో వెళ్లే ఆక్సిజన్‌గానీ, ఇతర పోషకాలు గానీ, కణజాలానికి అందవు. శరీర రోగగ్రస్తం కావడానికి ఈ దురవస్థ చాలు. అందుకే రక్తంలో ఏ రకమైన దోషం తలెత్తినా కాలేయాన్నీ, ప్లీహాన్నీ, ధమనుల్నీ విధిగా శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు మలబద్దకం లేకుండా చూసుకోవాలి.
రక్తదోషాల వల్ల వచ్చే వ్యాధుల్లో ప్రధానంగా గౌట్, జాండిస్, అజీర్ణవ్యాఽధి, లో- బిపి, బొల్లి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కాళ్లూ చేతుల్లో మంటలు, నోటి పూత, చర్మం మీద దద్దుర్లు, అలర్జీ, ఎనీమియా.. వంటి జబ్బులు కూడా రక్తదోషాల వల్ల వస్తాయి. ముఖం మీద మచ్చలు, చుండ్రు, వ్యాధినిరోధక శక్తిలోపాలు, కళ్లల్లో మంట, అరిచేతులు ఎరుపెక్కడం వంటి సమస్యలు కూడా ఈ రక్తదోషాలతో వస్తాయి.
కారణాల్లోకి వెళితే...
రక్తం దోషాలకు, వాతావరణ కాలుష్యాలు ఒక కారణమైతే, అజీర్తి మరో కారణం. వీటన్నింటినీ మించి మద్యపానం, పొగతాగడం మరో కీలక కారణాలు... వీటికి తోడు శరీరానికి వేడిచేసే బొప్పాయి, నువ్వులు, గోంగూర వంటివి తరుచూ తీసుకోవడం. కారం, పులువు ఎక్కువగా వాడటం, ఉప్పు ఎక్కువగా తినడం, ఎండలో ఎక్కువగా తిరగడం, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే కర్మాగారాల్లో పనిచేయడం వంటివి కారణమవుతాయి. ఇవి శరీరంలో ఉష్ణాన్ని పెంచి రక్తంలో దోషాలకు మూలమవుతాయి.
శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మామూలుగా, అన్నం, గంజి మేలు. పెసలు, వెజిటెబుల్ సలాడ్, పొట్లకాయ తీసుకోవచ్చు. వీటితో పాటు ఖర్జూరం తీసుకుంటూ రక్తవృద్ధి కూడా జరుగుతుంది.
శరీర ఉష్ణోగ్రత తగ్గితే, శొంఠి, మిరియాలు, బొప్పాయి, తులసి, పసుపు వాడాలి అప్పుడు శరీర ఉష్ణోగ్రత్త సమస్థితికి చేరుకుంటుంది.
వైద్య చికిత్సల్లో.....
మామూలుగా అయితే, చందనం, వట్టివేరు, తిప్పతీగె, వేప, తులసి, బ్రాహ్మి, బావంచాలు రక్తాన్ని శుద్ధి చే యడంలో బాగా తోడ్పడతాయి. ఔషధాల్లో అయితే, మంజిష్టాది కషాయం, ఖదిరారిష్టం, సారీవాది ఆసనం, ఆరోగ్యవర్థిని, కైశోర గుగ్గులు, చోప్చీలి చూర్ణం వంటివి రక శుద్దికి అమోఘంగా పనిచేస్తాయి. కాకపోతే ఈ ఔషధాల్ని ఆయుర్వేద వైద్యుని పర్య వేక్షణలోనే తీసుకోవాలి.
- డాక్టర్ డి. వి. ప్రశాంత్ కుమార్
ఆయుర్వేద వైద్యులు, పంచకర్మ స్పెషలిస్ట్, సికింద్రాబాద్.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565