శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి - శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననము
II శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి -
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జననము II
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఓం శ్రీ వల్లీసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం శ్రీసీతారామచంద్రపరబ్రహ్మణే నమః
ఓం శ్రీ హనుమతే నమః
“మాసానాం మార్గశీర్షోహమ్” అన్నాడు గీతాచార్యుడు. ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏకాదశీ దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశినాడు. ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి వస్తుంది. ఈరోజు మార్గశీర్ష శుక్ల షష్ఠి. లోకసంరక్షణార్ధం, ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్యస్వామి వారు, ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈ రోజు. ఇటువంటి పరమపవిత్రమైన రోజున స్వామి వారి ఆవిర్భావము ఎలా జరిగింది, సుబ్రహ్మణ్యుని నామముల గురించి స్మరించి స్వామి వారి కృపకి పాత్రులము అవుదాము.
సుబ్రహ్మణ్య జననము – షష్ఠి ప్రాశస్త్యముః
సుబ్రహ్మణ్య జననము, స్వామి తారకాసుర వధగావించడమూ మొదలైన ఘట్టాలు మనకు అనేక పురాణ, ఇతిహాస, ఉపనిషత్తులలో కనబడుతుంది. ప్రఖ్యాతముగా శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి స్కందోత్పత్తి ఆఖ్యానము చెప్తారు. అలాగే మహాభారతములో శల్యపర్వములో కూడా సుబ్రహ్మణ్యుని ఆవిర్భావ ఘట్టం చెప్పబడినది. ఇవేకాక, మహాకవి కాళిదాసు గారు వ్రాసిన కుమార సంభవము అనే కావ్యము లోకప్రసిద్ధము. పూజ్య గురువు గారి ప్రవచనముల నుండి విన్నవి, పురాణ/ఇతిహాసముల నుండి అమ్మ చదివించిన మేరకు, గుర్తున్నంత మేరకు స్వామి వారి జనన విశేషాలు ఇక్కడ స్మరిస్తున్నాను.
పరమశివునికి ఆవాసమై, రమణీయ, కమనీయ మహనీయ సుందర కుసుమ సౌరభాన్ని నాలుగు దిక్కులకు వెదజల్లు కైలాస గిరీంద్రము, ఆ కైలాసము వర్ణింపశక్యము కానిది. అందులో ఉన్న వనములు ఆరు ఋతువులలో పూసి, ఫలించి శివమహాత్మ్యాన్ని ప్రపంచానికి అందిస్తున్నాయి.
గండుతుమ్మెదలు అచటగల పూలచుట్టూ ఝుంకారము కావిస్తూ అందులో కల మకరందాన్ని గ్రోలడం, చూపరులకాహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఆ కైలాస గుహలలో మహర్షులు వేలాది సంవత్సరాలు శంకరుని గూర్చి తపోనిష్టాగరిష్ఠులై ఎచట చూసినా గానవస్తారు.
అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీఅమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసము నందు వేయి సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయముగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది.
సురస్థిరసాధ్య విద్యాధరాదులు, తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మగారిచే ఒక వరం పొందాడు, అది ఏమిటంటే, పరమశివుని వీర్యమునకు జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామమును గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలోతానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని, తారకాసురుడు, దేవతలందరినీ బాధపెడుతున్నాడు.
శివవీర్యమునకు జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అందుకోసం, దేవతలందరూ కలిసి, సత్యలోకమునకు వెళ్ళి, అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మ గారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు అన్నారు…”బ్రహ్మాదిదేవతలారా! మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంత కాలము క్షమాగుణముతో ఓపిక పట్టండి..” అని ఓదార్చారు.
అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది, పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే, ఆ వచ్చే శక్తిని మనము తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి, దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అచ్చటికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖ ద్వారము వద్ద నిలచి దేవాదిదేవా! ప్రభూ మహాఆర్తులము, నీ కరుణా కటాక్షముతో మమ్ము రక్షింపుమని, తారకాసురుని బాధలనుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని, అమ్మవారి యందు నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్ధిస్తారు. భక్తవశంకరుడు అయిన పరమశివుడు, పార్వతీ అమ్మవారితో సంతోషముగా గడుపుతున్నవాడు, దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు. దేవతల ప్రార్ధన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండీ విడివడినది కావున, నాతేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్తారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది, తను మాత్రుమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గానూ, అంతట అమ్మవారు ఆగ్రహము చెందినదై, దేవతలందరినీ శపిస్తుంది, నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక, ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం ముఫ్ఫైమూడుకోట్ల మంది అంతే.
అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాత యందు ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకము నందు విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకము నుండి, ఆరుముఖములతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రములు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కావున, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖములతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామము వచ్చినది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.
శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరవణభవ అని నామము వచ్చినది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామము వచ్చినది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామములు వచ్చాయి. దేవతలను రక్షించుటకొరకై శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కావున స్వామికి స్కంద అనే నామము వచ్చినది. అలాగే క్రౌంచపర్వతమును భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామి వారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామములతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవముగా చేసుకున్నారు.
సరే ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు… అని అడిగితే, త్రిపురారహస్యంలో మాహాత్మ్య ఖండము నందు, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడినది. ఒకనాడు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందము అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా.. శపిస్తాను అంటారు శంకరుడు. అంతట సనత్కుమారుడు, వరమూ, శాపమూ అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు, నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు. అంతట ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరము అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో “నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను…” అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి…”ఇదేమిటి!! శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే..” అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు..”శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ, కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి, యోనిసంభవుడిగా రానమ్మా…. నన్ను క్షమించు” అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి, ఒకనాడు నీవు మోహినీ అవతారములో ఉన్నప్పుడు, కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండీ నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు.సుబ్రహ్మణ్యుడు అనే నామము ఎలా వచ్చిందీ అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కావున స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామముకూడా స్వామికలదు.
సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందముగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకములో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి.
అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామము కలదు. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. (ఇక్కడ పరమశివుని తక్కువచేయటం అని కాదు, ఏ తండ్రికైనా తన కొడుకు చేతిలో పరాభవం గొప్ప భూషణంగా, ఆనందముగా భావిస్తాడు..) ఈ గురుగుహా అనే నామమును, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్య అనుగ్రహ ప్రాప్తుడు శ్రీముత్తుస్వామిదీక్షితార్ గారు, ఆయన వ్రాసిన అన్ని కీర్తనలలోనూ గురుగుహా అనే నామంతో కలిపి చేశారు. అలాగే అరుణగిరినాథర్ తిరుప్పుగళ్ అనే గొప్ప తమిళకీర్తనలను కుమారస్వామి వారిపై రచించాడు.
వల్లీ అమ్మవారు, దేవసేనా అమ్మ ఇద్దరూ మహావిష్ణువు కుమార్తెలు. దేవసేనా అమ్మని ఇంద్రుని దగ్గర పెంచమని ఇస్తే, ఇంద్రుడు, ఆయన దగ్గర ఉన్న ఐరావతానికి ఆ బాధ్యత అప్పజెప్తారు, తమిళంలో ఏనుగు అంటే యానై, దేవతల ఏనుగు పెంచడంవల్ల దేవయాని అనే పేరు వచ్చింది. అలాగే వల్లీ అమ్మవారు, ఒక భిల్లరాజు వద్ద పెరుగుతుంది. భిల్లరాజు అంటే అరణ్యములలో ఉండే గిరిజన నాయకుడు. వల్లీ అమ్మవారు మన శరీరములో ఉండే కుండలినీ శక్తికి ప్రతీక. అలాగే స్వామి వారి ఇద్దరు శక్తులైన వల్లీ దేవసేనా అమ్మవార్లు ఇఛ్చాశక్తి, జ్ఞానశక్తిలకు ప్రతీక.స్వామి వారు ఇఛ్చాశక్తి, జ్ఞానశక్తిలతో కూడిన క్రియాశక్తి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపము.
కేశి అనే పేరుగల రాక్షసుడు దేవసేన అమ్మని బంధించి తీసుకుని పోవుతుండగా దేవేంద్రుడు అడ్డుపడి వజ్రాయుధముతో ఆ రాక్షసుని సంహరించి, ఆమెను శరవణాతటాకము నందు జన్మించిన సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేయతలంచెను.
సంస్కృత భారతములో వేదవ్యాసుల వారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ “తస్మాత్ షష్ఠీ మహాతిథిః” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథ కూడా కలదు.
పూర్వం స్వాయంభువమనువునకు ఉత్తానపాదుడు, ప్రయవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు. ఉత్తానపాదుడు ధృవుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియవ్రతుడు విరక్తి భావము కలవాడై ప్రవృత్తి భావము నందు అభిలాషలేక మోక్షగామియై తపస్సు చేయ పూనుకునెను.
ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు ప్రత్యక్షమవగా, ప్రియవ్రతుడు..”ఈ జీవితము అశాశ్వతము, భోగభాగ్యాలు ఇంకా అశాశ్వతము, జీవితము క్షణభంగురము, నేను రాజ్యము చేయకోరిక లేనివాడనై ఈ తపస్సు చేస్తున్నాను” అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు, “ఓ రాజా! నిండు సంసారమును విడిచి క్లేశమును పొందుతూ తపస్సు చేయుట వలన ఎట్టి లాభమూ లేదు. కనుక నీవు వివాహము చేసుకుని రాజ్యపాలన చేయుము” అని చెప్తారు.
బ్రహ్మౌపదేశము మీద, ప్రియవ్రతుడు తపస్సుని విరమించి, మాలతి అనే స్త్రీని వివాహమాడి ధర్మనిష్ఠతో రాజ్యపాలన చేస్తూ ఉండెను. పుత్రసంతతి కోసం అతడు పుత్రకామేష్ఠి చేయగా పుత్రుడు కలిగెను. కానీ ఆ పిల్లవాడు మరణించి ఉండెను. ప్రియవ్రతుడు ఆ శవమును భుజముపై వేసుకొని, శ్మశానమునకు వెళ్ళి ఖననం చేయ ప్రయత్నంలో ఉండగా, ప్రియవ్రతుడు, ఆయన వెంట వచ్చినవారు అందరూ ఎంతగానో దుఃఖించిరి. ఆ అర్ధరాత్రి సమయమున ఆకాశములో ఒక మెరుపు కనిపించెను. నిలకడగా చూస్తే అది మెరుపు కాదు, ప్రకాశించుచున్న దివ్యవిమానము. ఆ విమానము ప్రియవ్రతుని సమీపమునకు చేరెను. ఆ విమానము నుండి ఒక తేజోమూర్తి యైన స్త్రీమూర్తి దర్శమిచ్చి ప్రియవ్రతునితో …”నేను ఆదిపరాశక్తి ఆరవ అంశతో అవతరించినదానను కావున నన్ను షష్ఠీ దేవి అని పిలుస్తారు. దేవసేన అని మరిఒక పేరు కూడా కలదు. నేను సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ధర్మపత్నిని. నా దర్శనము వృధా కాదు. ఎవరికేమి కావలసినా ఈయగలను. నీ కుమారుడిని బ్రతికించెదనని”, ఆ ప్రియవ్రతుని కుమారునికి ప్రాణము పోసెను. అంతట ఆ పిల్లవాడికి సువ్రతుడు అని నామకరణం చేసెను. ప్రియవ్రతుడు ఎంతగానో సంతోషించెను. ఇంకా దేవసేనా అమ్మవారు ప్రియవ్రతునితో ఇట్లు పలికెను..” ఓ ప్రియవ్రతా! మీరందరు షష్ఠి వ్రతము చేయుడు. మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు షష్ఠీ వ్రతమునారంభించి ప్రతీ నెలలోనూ వచ్చిన శుద్ధ షష్ఠి నాడు ఈ వ్రతము సంవత్సర కాలము చేసినచో సత్పురుష సంతానము కలుగును” అని సకల జనులకు వరమునిచ్చి అమ్మవారు అంతర్ధానము అయ్యెను.
వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యారాధన చేసిన వారికి తప్పక సత్సంతానము కలుగును. స్వామి అనుగ్రహం వల్ల, సమస్త శుభములు సర్వులకూ లభించును.
సుబ్రహ్మణ్యస్వామి వారి క్షేత్రాలు తమిళనాడులో ఆరుపడైవీడు అనే పేరున, స్వామి వారి ఆరు ముఖములకు ప్రతీకగా ఆరు క్షేత్రాలలో స్వామి వెలిశారు. అవే పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, తిరుప్పరంకుండ్రం, పళముదిచ్చొళై. తమిళనాట అనేక మంది భక్తులు విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు.
అలాగే కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య), మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక సుబ్రహ్మణ్య) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని, ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు. ఇది సత్యం సత్యం పునః సత్యం.
అలాగే మన తెలుగునాట కూడా, అనేక పుణ్యక్షేత్రాలలో స్వామి వెలసి ఉన్నారు. తిరుమలలో ఆనంద నిలయములో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ సుబ్రహ్మణ్యుడిగా కొలిచే పెద్దలు ఎందరో ఉన్నారు. అందుకే అక్కడ స్వామి పుష్కరిణి అనే నామము, తిరుమలేశునికి స్వామి అనే నామము వచ్చాయి అని పెద్దలు విశ్వసిస్తారు. అలాగే కృష్ణా జిల్లాలోని మోపిదేవి, తూర్పుగోదావరిజిల్లాలో మల్లవరం క్షేత్రము మొదలైనవి. ఈ మల్లవరం క్షేత్రంలో వెలిసిన సుబ్రహ్మణ్యుని గురించి పూజ్య గురువు గారు అనేకసార్లు ప్రవచనములలో చెప్పి ఉన్నారు. అలాగే బెజవాడ దుర్గమ్మ ఆలయములో గుట్టపై వెలిసిన స్వామి.
కొలిచిన వారికి కొంగుబంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు, అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే నా బుజ్జి తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్షములు మనందరిమీదా వర్షించాలని, బయటా, మనలోపలా ఉన్న ఆసురీ ప్రవృత్తిని సంహరించి, మనల్ని ధర్మమార్గములో నడపాలనీ, మన సనాతన ధర్మమును పరిరక్షించాలనీ, గురుగుహా స్వరూపములో మన అజ్ఞానతిమిరాలను పారద్రోలాలనీ శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. - మోహన్ కిషోర్ నెమ్మలూరి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565