వైకుంఠనాధుడు శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం కలియుగంలో ప్రత్యక్షంగా చిత్తూరు జిల్లా తిరుమలగిరుల్లో స్వయంభువుగా అవతరించారు. ఆది వరాహ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుని వివాహం పద్మావతి దేవితో అంగరంగవైభవంగా జరిగింది. తిరుమల కొండలకు వెళ్లే ముందు స్వామివారు జిల్లాలోని పలుప్రాంతాల్లో నివాసం ఉన్నారు. భక్తుల ప్రార్థనలు ఆలకించి కొన్ని రోజులు భక్తులను అనుగ్రహించేందుకు అక్కడే ఉండేవారు. నారాయణవరంలో వివాహం తరవాత అప్పలాయిగుంటలో నివాసమున్నారు. సాక్షాత్తు స్వామివారు నివసించిన పవిత్రప్రదేశమిది. ప్రసన్నంగా భక్తులను ఆశీర్వదించడంతో ప్రసన్న వేంకటేశ్వరస్వామిగా ఖ్యాతిచెందారు.
అప్పులయ్య కథ
పూర్వం ఈ ప్రాంతాన్ని అన్ఱుణ (రుణం లేని) సరోవరం అని పిలిచేవారు. అప్పలాయిగుంట అని పేరు రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు.పేరుకు తగ్గట్టుగానే అతను వూరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి సొమ్మును తీసుకోవాలన్న దురుద్దేశంతో అతని మీద నింద మోపి ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంటాడు. అప్పులయ్య ఎలాగు అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి అందరు అతను నిజంగానే ఆ వ్యక్తి దగ్గర అప్పు చేశాడనుకుని అతనిని అప్పు చెల్లించమని చెప్తారు. అప్పులయ్య ఎంత చెప్పినా ఎవరు వినరు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పులయ్య ఒక రాయి మీద ‘ నేను ఋణం తీసుకోలేదు’ అని రాసి దగ్గరలో ఉన్న ఒక కోనేరులో వేస్తాడు. ఆ రాయి ఆ కోనేటి లో మునిగిపోకుండా తెలుతుంది. దీంతో గ్రామస్థులందరు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కోనేరును అన్ఱుణ సరోవరం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పులయ్యగుంట అనే పిలిచేవారు. కాలక్రమేణా అది అప్పలాయిగుంటగా ప్రసిద్ధి చెందింది.
స్థల పురాణం
తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకుని, పసుపు దుస్తులతోనే తిరుమలకు మరవలికి (వరుడు, వధువు ఇంట జరిగే లాంఛనాలు) బయల్దేరి వస్తూ ఈ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్యదంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడి దేవుడిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి అంటారు.
ఆలయ చరిత్ర
ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. దీని ముఖద్వార గోడ మీద క్రీ.శ. 1585 కాలం నాటి వేంకటపతిరాయల దానశాసనం ఉంది. కాబట్టి ఆలయం అంతకు ముందే నిర్మించి ఉంటారని అభిప్రాయం. ఇక్కడ పూర్వం స్థానికంగా కార్వేటి నగర రాజులు పరిపాలించారు కాబట్టి వారే ఆలయ ఆలనపాలనా చూసుకొంటూ వచ్చారు. తరువాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని స్వాధీన పరచుకొని జీర్ణోద్ధరణ చేసి, ఏప్రిల్ 30, 2006న మహాసంప్రోక్షణ చేసి అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం నిర్వహిస్తారు. స్వామి ప్రసన్నవదనంతో అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. రోగాల బారిన పడిన భక్తులు ఇక్కడ ఉన్న భారీ వాయునందనునికి మొక్కితే రోగ విముక్తలవుతారని ప్రశస్తి.
* తోరణ ద్వారం ఉండటం వలన ఈ క్షేత్రాన్ని సులభంగానే గుర్తించవచ్చు.
* ఇది ప్రసన్న వేంకటేశ్వరస్వామి పద్మావతీ సమేతంగా వెలసిన చోటు.
* ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే గోదాదేవి కూడా ఆలయంలో అమ్మవారికి సమాంతరంగా ఆమెలాగే వెలుపల ఉంటుంది.
ఎలా చేరుకోవాలి
* ఈ క్షేత్రం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో తిరుచానూరు నుంచి చెన్నైకు వెళ్లే దారిలో ఉంది.
* రైలు ద్వారా రేణిగుంట, తిరుపతి, పుత్తూరు రైల్వేస్టేషన్లకు చేరుకొని అక్కడ నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు.
* తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకునే సదుపాయముంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565