పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టమైనదిగా వెలుగొందుతోంది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం. ఆ ఉమామహేశ్వరుడిని దర్శించినంత మాత్రనే మనకు ఎలాంటి అకాల మృత్యుబాధలు వుండవని పురాణాలు పేర్కొంటున్నాయి. మంత్రశక్తితో స్వయంభువుగా వెలిసిన మహాకాళేశ్వరుని దర్శనం మనకు ఎప్పుడూ సకల శుభాలను కలుగచేస్తుంది. శిప్రా నదీతీరంలో, రుద్రసాగర్ సరస్సు సమీపంలోని శ్రీమహాకాళేశ్వరుడు వేల సంవత్సరాలుగా భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు.
స్థలపురాణం
కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఉజ్జయినిలో ఒక మహాశివభక్తుడు వుండేవాడు. నిత్య శివారాధనతో మహాశివున్ని ఆరాధించేవాడు. ఆయనకు నలుగురు కుమారులు. తండ్రి అడుగుజాడల్లోనే వారు కూడా శంభునాధుడిని పూజించేవారు. ఆ ప్రాంతానికి సమీపంలోని ఒక రాక్షసరాజు బ్రహ్మ వరంతో గర్వంతో ఉజ్జయినిపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించేవాడు. ఈ క్రమంలో శివభక్తుని కుమారులైన నలుగురిపై దాడి చేశాడు. వారు ఎలాంటి భీతి చెందకుండా అక్కడ వున్న శివలింగాన్ని పూజించారు. భక్త వత్సలుడైన పరమేశ్వరుడు శ్రీమహాకాళుడిగా అవతరించి రాక్షసుడిని భస్మం చేశాడు. అనంతరం భక్తుల కోరిక మేరకు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు స్థలపురాణం తెలుపుతోంది. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథ కూడా వుంది.ఉజ్జయిని నగరాన్ని పాలించే చంద్రసేనుడు శివభక్తుడు. ఆయన రాజ్యంలోనే రైతు కుమారుడు శ్రీకరుడు శివున్ని ఆరాధించేవాడు. చంద్రసేన రాజ్యంపై శత్రువులు దండెత్తుతారు. ఈ సమయంలో విధి అనే పూజారి, శ్రీకరుడు శివున్ని ప్రార్థిస్తారు. పరమేశ్వరుడు శత్రువులను రాజ్యం నుంచి పారదోలుతాడు. అనంతరం వారి కోరిక మేరకు అక్కడే వుండిపోయినట్టు తెలుస్తోంది.
మూడు అంతస్థుల్లో శివలింగాలు
ఈ క్షేత్రంలో శివలింగాలు మూడు అంతస్థుల్లో వుండటం విశేషం. మొదట మహాకాళ లింగం, తరువాత ఓంకారలింగం, చివరగా వుండేది నాగచంద్రేశ్వర లింగం. చివరలో వుండే నాగచంద్రేశ్వర లింగ విగ్రహాన్ని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేసుకోగలం. మిగతా రోజుల్లో దర్శనానికి అనుమతివుండదు. మహాకాళేశ్వరుడు వున్న ప్రాంతం కింద శంఖుయంత్రం వుంది. స్వామి ఆరాధనలో భాగంగా శంఖువును వూదుతారు.
భస్మ హారతి
మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుఝామున స్వామివారికి సమర్పించే భస్మహారతి విశిష్టంగా వుంటుంది. ఇతర క్షేత్రాల్లో ఇలాంటి హారతిని మనం వీక్షించలేం. ప్రతిరోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదట మహాకాళేశ్వర లింగానికి జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం విభూతిని కొడుతూ భస్మహారతి ఇస్తారు. ఈ క్రమంలో గర్భగుడి విభూతితో నిండిపోయి సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడకు విచ్చేసిన దివ్యానుభూతి కలుగుతుంది. అదే సమయంలో మోగించే వాయిద్యాల హోరుతో శంభోశంకర హర హరహర మహదేవ అన్న నినాదాలతో ఆలయం నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటుంది. మనిషి జీవితచక్రంలో అనేకమైన దశలుంటాయి. జన్మించింది మొదలు చనిపోయేవరకు అనేక ఘట్టాలను జీవుడు చవిచూస్తాడు. చివరకు అంతిమక్రియల అనంతరం భస్మంగా మారుతాడు. ఈ నిత్యసత్యాన్ని గుర్తుచేసేవిధంగా ఆ పరమేశ్వరునికి భస్మహారతి నిర్వహిస్తారు. భస్మహారతిని వీక్షిస్తే అకాల మృత్యు బాధలుండవు. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ పూజ చేశాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఈ క్షేత్రాన్ని మహాస్మశానమని కూడా పిలుస్తారు.
మహంకాళి అమ్మవారు
అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ క్షేత్రం ఒకటిగా వుంది. అమ్మవారు మహంకాళిగా సమస్త మానవాళిని రక్షిస్తుంటారు. మహాకవి కాళిదాసుకు అమ్మవారు దర్శనమిచ్చారు.
ఇలా చేరుకోవచ్చు..
* హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి రైలు సౌకర్యముంది.
* సమీప విమానాశ్రయం ఇండోర్‌లో వుంది. ఇక్కడ దిగి కారు లేదా ఇతర వాహనాల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు.
* మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కూడా చేరుకునే సౌకర్యముంది.
It's really good
ReplyDelete