MohanPublications Print Books Online store clik Here Devullu.com

వేలాయుధపాణి_Tiruparankundra-MohanPublications

వేలాయుధపాణి



శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అసురుడు సూరపద్ముడి సంహారానికి ఆరు రణశిబిరాలను ఏర్పాటుచేశారు. వీటిని తమిళంలో ఆరుపడైవీడు అంటారు. ఈ శిబిరాల్లో ప్రముఖమైనది తమిళనాడు మధురై జిల్లాలోని తిరుప్పరన్‌కుండ్రం. ఇతర క్షేత్రాలు తిరుచెందూర్‌, పళణి, తిరుత్తణి, స్వామిమలై, పళమ్‌ముదిర్‌ చోళై, కొండదిగువన శిలలను తొలిచి నిర్మించిన తిరుప్పరన్‌కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పాండ్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం వున్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది.
ఆరుపడైవీడులో మొదటిది
ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. అన్ని ఆలయాల్లో మురుగన్‌ నిలుచుకొని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండటం విశేషం. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహనం జరిపిన ప్రదేశంగా తిరుప్పరన్‌కుండ్రం ఖ్యాతిచెందింది. దేవయాని సమేతుడైనస్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు వున్న చిత్రం కనిపిస్తుంది.
అభిషేకం వేలాయుధానికే...
సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూలవిరాట్టుకు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామి వారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకి వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళమాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండపై వున్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రధాన మందిరం
ప్రధాన మందిరంలో శ్రీసుబ్రమణ్యస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. సమీపంలోనే ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుల మందిరం, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండప, మహామండపాలను చూడవచ్చు. వీటిపైవున్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.
నక్కిరార్‌ ఆలయం
ప్రముఖ తమిళకవి నక్కిరార్‌కు ఒక ఆలయముంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్‌కు ఒక రోజు ఆలయ పుష్కరిణలో సగం చేప, సగం పక్షి రూపంలో వున్న ఒక జీవం కనిపించింది. దీన్ని ఆయన తదేకంగా చూడటంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపం రాక్షసరూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది. దీంతో ఆయన తనను రక్షించమంటూ మురుగన్‌ను తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కిరార్‌ను అతనితో పాటు వున్న అనేకమందిని రక్షించాడు. స్వామి తన వేలాయధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగ జలం బయటకు వచ్చింది. ఈ జలంలో మునిగితే పాపాలు పోతాయి.ఎంత వేసవిలోనూ ఈ తీర్థం ఎండిపోకపోవడం విశేషం.
ఇలా చేరుకోవచ్చు
* తమిళనాడులోని మధురై చేరుకొని అక్కడ నుంచి తిరుప్పరన్‌కుండ్రానికి చేరుకోవచ్చు.
* మధురై నుంచి తిరుప్పరన్‌కుండ్రం 8 కి.మీ.దూరంలో వుంది.
* మధురైకు దేశంలోని పలుప్రాంతాల నుంచి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list