MohanPublications Print Books Online store clik Here Devullu.com

MOHAN PUBLICATIONS Price List

గౌతమిపుత్ర శాతకర్ణి _GautamiputraSatakarni_

సాహో... శాతకర్ణి
నాయకుడు...
గౌతమిపుత్ర శాతకర్ణి క్రీ.పూ. ఒకటి, రెండు శతాబ్దాలు. శాతవాహన సామ్రాజ్యం.
రాజధాని నగరమైన అమరావతి.
ఇరవైమూడో పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి - ఏకవ్యక్తి అక్షౌహిణి, కదిలే శతఘ్ని. అంతటి వీరుడు, అపార సాహసి! గౌతమిపుత్రుడు పట్టంకట్టుకున్న సమయానికి దేశం నిండా...జానాబెత్తెడు రాజ్యాలే, వామనవృక్షాల్లాంటి పాలకులే. ఆ అనైక్యతతో జాతి సార్వభౌమత్వానికి చేటుతప్పదని గ్రహించాడు. దేశాన్నంతా ఓ ఛత్రం కిందికి తీసుకురావాలని సంకల్పించాడు. అది రణన్నినాదమే అయినా, శాంతిమంత్రం అంతర్లీనం. పైపైకి రాజ్యకాంక్షలా అనిపించినా...సంక్షేమ ఆకాంక్ష నిబిడీకృతం. అస్థిరత్వాన్నీ అరాచకత్వాన్నీ రూపుమాపి...ఓ జాతినీ నీతినీ రీతినీ నిర్మించడానికి రాజసూయమే రాచమార్గమని తలచాడు.
భరతవర్షంలో ఇప్పటిదాకా మూడు రాజసూయ యాగాలు జరిగాయంటారు. ఒకటోది - మహాభారతంలో, ధర్మరాజు నేతృత్వంలో. రెండోది - ఉత్తరాదిలో, విక్రమాదిత్యుడి హయాంలో. మూడోది - అమరావతిలో, గౌతమిపుత్ర శాతకర్ణి కర్తృత్వంలో. అప్పుడే, రాజసూయంలో అగ్రపూజ ఎవరికన్న ప్రశ్న ఎదురైంది. హరిహరబ్రహ్మాదులకైనా అమ్మే ఆధారం కాబట్టి, బ్రహ్మాండనాయకుడైనా అమ్మ కడుపున పిండమే కాబట్టి...మాతృశ్రీ గౌతమీదేవికే ఆ గౌరవం దక్కుతుందని ప్రకటించాడా రాచబిడ్డడు. గౌతమి...మహిళ, వితంతువు! అపచారమనీ అనాచారమనీ హెచ్చరించారు. అయినా శాతకర్ణి నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ మహాయాగంతో శాలివాహనశకం ప్రారంభమైంది. అదే యుగాది...ఉగాది.
తెలంగాణ గడ్డమీదున్న కోటిలింగాల శాతకర్ణి జన్మభూమి! ఇక్కడే, మాతామహుల ఇంట్లో పుట్టి పెరిగాడు. ఆంధ్రుల ప్రజారాజధానిగా పునర్వైభవానికి నోచుకున్న అమరావతి శాతకర్ణి కర్మభూమి! పట్టాభిషేకం చేసుకున్నదీ, పట్టుదలతో యావత్‌ దేశం మీదా పట్టుసాధించినదీ అమరేంద్రుడికి సైతం అసూయపుట్టేలా పాలన సాగించినదీ అమరావతి నుంచే!
గౌతమిపుత్ర శాతకర్ణి నడిచే పటాలం. జీవితమంతా రణమండలంలోనే గడిచిపోయింది. దేశీ శత్రువులూ, విదేశీ శత్రువులూ, మిత్రుల చాటు శత్రువులూ...ఏ ఒక్కర్నీ వదల్లేదు. ఆంధ్రప్రశస్తిలో విశ్వనాథవారు ‘ఇతడు విద్యానిధి. ప్రజ్ఞావంతుడు. ధనుర్విద్యావిశారదుడు. ఇతని పరాక్రమము నాభాగ నహూషజనమేజయ సగర యయాతి రామాంబరీశులను మించి ఉండెను..’ అని కొనియాడారు. శాతకర్ణి తర్వాత, పరపాలకులు ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా పదిహేనువందల సంవత్సరాలు పట్టింది. అవీ పునాదులంటే, అదీ నాయకత్వమంటే! ఆ సంగ్రామయోధుడి సమగ్ర వ్యక్తిత్వాన్ని తెరకెక్కించడం అంటే - రాజసూయాన్ని తలపించే సృజనాత్మక యాగమే.
బృందనాయకుడు
జాగర్లమూడి క్రిష్‌
గౌతమిపుత్ర శాతకర్ణి...ఆ పేరు వింటేనే క్రిష్‌ ఒళ్లు పులకిస్తుంది, కళ్లు మెరుస్తాయి. బాల్యం నుంచీ ఆ యోధుడే దర్శకుడి కలల కథా నాయకుడు. కార్తిక స్నానానికో, వనభోజనానికో వెళ్లినప్పుడు...తాతయ్య జాగర్లమూడి రమణయ్యగారి చిటికెనవేలు పట్టుకుని అమరావతి వీధుల్లో నడుస్తున్నప్పుడు - తొలిసారిగా ఆ సమ్రాట్టు పేరు విన్నాడట. అప్పుడే మొదలైంది క్రిష్‌ చారిత్రక కృషి...
‘ఏ పుస్తకం కనిపించినా శాతకర్ణి కదనకుతూహలాన్ని చాటే వీరోచిత గాథల కోసం కళ్లు ఆత్రుతగా వెదికేవి. అమరావతిలో ఏ బండరాయి కనిపించినా శాతవాహనుల శాసనమేమో అని ఆశగా తడిమిచూసిన రోజులున్నాయి. కోటిలింగాలలో అలనాటి నాణాలు దొరికినట్టు ఎవరో చెప్పారు. రెక్కలు కట్టుకుని ఆ గడ్డ మీద వాలిపోయాను. అయినా, తనివితీరక పరబ్రహ్మశాస్త్రి లాంటి పురావస్తు నిపుణుల్ని సంప్రదించాను. గౌతమీమాత నాసిక్‌లో వేయించిన శాసనాల్నీ చూసొచ్చాను. దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించి నీలకంఠశాస్త్రిలాంటి వారు లోతైన పరిశోధనలు చేశారు. ఆ పుస్తకాలన్నీ కంఠతా వచ్చేశాయి. లండన్‌ మ్యూజియంలోని అమరావతి గ్యాలరీ నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నాను. మహారాష్ట్ర రాజు నహపాణుడూ, యవనపాలకుడు డెమిత్రియస్‌...తదితరుల చరిత్ర నుంచీ కొంత ఆధారం లభించింది. చరిత్రను చరిత్రగా చదివితే యుద్ధాలూ సైనిక దాడులూ మినహా మరో ప్రస్తావన ఉండదు. వర్తమానంలోంచి గతాన్నిచూస్తే... నిస్సారంగానే ఉంటుంది. అది కాదు పద్ధతి. మనమూ, కాలయంత్రమెక్కి గతంలోకి వెళ్లాలి. ఆ భేరీనాదాలు వినాలి. కత్తులూ బల్లాలూ పట్టుకుని ఆ
సైనికులతో పాటూ పరిగెత్తాలి. పాలకుడి ప్రతి బిరుదం వెనకున్న అంతరార్థాన్ని విశ్లేషించుకోవాలి. శాతకర్ణిని ‘త్రిసముద్రతోయ పీతవాహన’ అని అభివర్ణించిందో శాసనం. అంటే, ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయట! ఆ సామ్రాజ్యం అంత విస్తారమైంది అన్నమాట! అలా...ఒక్కో ఘట్టాన్నీ పేర్చుకుంటూ వెళ్లినప్పుడే...గౌతమిపుత్ర శాతకర్ణి విరాట్‌రూపం మనకు దర్శనమిస్తుంది. గౌతమిపుత్రుడి కథను జిజియాబాయి శివాజీకి చెప్పేదట. మామూలు తల్లుల్లా... నిద్రపుచ్చడానికి కాదు. ఆత్మాభిమానాన్ని మేల్కొలపడానికి, కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి. అంతటి మహావీరుడి రూపురేఖలు ఇంకెంత పదునుగా ఉండాలి! ఆ రాజసం, తేజసం నందమూరి బాలకృష్ణగారిలో కనిపించాయి. ఆయన కూడా అంతే ఉత్సాహంగా ఈ పాత్రకు అంగీకరించారు.