MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుంభకోణం _Kumbhakonam-MohanPublications

నమో.. సూర్యదేవా..
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌.
బ్రహ్మశాపంతో..
ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు బాధ నుంచి విముక్తి కలిగించమని కలిగించమని అతను నవగ్రహాలను ప్రార్థించాడు. దీంతో అనుగ్రహించిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు. దీనిపై సృష్టికర్త బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని శాపం పెడుతాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారకుడైన పరమేశ్వరుని కోసం తపస్సు ఆచరిస్తాయి. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి కలిగిస్తాడు. వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటూ ప్రార్థిస్తే వారికి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఆ మహేశ్వరుడు.
ఉషా, ప్రత్యూషలతో కలిసి...
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తుంటారు. సూర్యదేవుడంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. అయితే అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో వుంటాడు. స్వామి వివాహవేడుకల్లో వుండటం విశేషం. మిగతా గ్రహాలకు కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలు వున్నాయి. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ఆలయ నిర్మాణం

క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివకామి, వినాయక, మురుగన్‌ విగ్రహాలున్నాయి. వీటితో పాటు ప్రధాన మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం వుంది. ప్రాంగణంలోనే ఇతర ఏడు గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి.
ఉత్సవాలు
తమిళమాసమైన తాయ్‌ నెలలో జరిగే రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. తాయ్‌ మాసం (జనవరి-ఫిబ్రవరి)లో ఈ వేడుక జరుగుతుంది. సూర్యదేవుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో రథ సప్తమి వేడుకలను వైభవంగా పదిరోజుల పాటు జరుపుతారు. అలాగే ప్రతి తమిళమాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. మహాభిషేకానికి విశేషసంఖ్యలో భక్తులు హాజరవుతారు.
గ్రహశాంతికి ప్రత్యేక పూజలు
గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా వున్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి పూజలు సాంత్వన కలిగించమని వేడుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన... తదితర పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం... తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.
ఎలా చేరుకోవాలి
* రైలులో వచ్చే ప్రయాణికులు కుంభకోణం రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి ఆలయం 15 కి.మీ.దూరంలో వుంది. ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లవచ్చు.
* సమీప విమానాశ్రయం తిరుచినాపల్లిలో వుంది. విమానం దిగిన ప్రయాణికులు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్లవచ్చు. ( దూరం 110 కి.మీ.)
* వసతి సౌకర్యాలు: కుంభకోణంలోనే ఎక్కువ వసతి గృహాలున్నాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list