MohanPublications Print Books Online store clik Here Devullu.com

బతుకమ్మ పండుగ_BhathukammaPanduga-MohanPublications

బతుకమ్మ పండుగ


సమైక్య జీవన విధానం, సామాజిక ఏకత్వానికి ప్రతీకలు మన పండుగలు. జాతి చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయ వైభవానికి ఈ ఉత్సవాలు ఉపకరిస్తున్నాయి. సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్యాత్మిక సరళికి ఇవి దోహదం చేస్తున్నాయి. ఈ పరంపర లోనివే- ఆశ్వయుజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రులు! ఆటపాటల నేపథ్యంగా, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాల్ని కొనసాగిస్తారు. ‘ప్రకృతి స్వరూపిణి’గా అమ్మతల్లిని భావించి, వివిధ పుష్పాలతో పేర్చి ‘బతుకమ్మ’గా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది.
ప్రాణశక్తి, ప్రాణధాత్రి, ప్రాణేశ్వరి అనే ఆదిశక్తి నామాలకు ప్రతిబింబం- బతుకమ్మ. బతుకునివ్వడంతో పాటు, సకల ప్రాణులకూ జీవశక్తిని అందజేసే ప్రకృతి, ఆకృతి- బతుకమ్మ. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకొనే బంగరు కల్పవల్లిగా బతుకమ్మను జానపదులు భావిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి- అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పుష్పాల్ని క్రమానుగతంగా ఉంచుతారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ, చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణగాథలు, ఇతిహాస ఘట్టాల్ని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. ‘పసుపుబొట్టు’ పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకొంటారు. బతుకమ్మను పసుపు, కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం, ప్రతి నిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం!
తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సందడి విలసిల్లుతుంది. పూర్ణత్వానికి సంకేతం- తొమ్మిది. నవ విధ భక్తి మార్గాలకు, నవ నిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పుష్పాలతో తొమ్మిది వరసల్లో అమరుస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో- మొదటి, రెండో రోజుల్లో బొడ్డెమ్మగా, మూడో రోజు లక్ష్మీదేవిగా, నాలుగో రోజు గౌరమ్మగా ఆరాధిస్తారు. అయిదో రోజు అట్ల బతుకమ్మగా, ఆరో రోజు అలిగిన బతుకమ్మగా, ఏడో రోజు చకినాల బతుకమ్మగా, ఎనిమిదో రోజు దుర్గమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా ఆరాధించడం సంప్రదాయం. తొమ్మిది రోజులూ గౌరీదేవి ‘పూలమ్మ’గా పుట్టింటికి తరలి వచ్చినట్లు భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ, గీతాల ద్వారా ఆరాధనను వెల్లడిస్తారు.
తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మకు సాగనంపు వేడుక నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తవారింటికి- అంటే, శివుడి వద్దకు పంపుతూ, సకల సౌభాగ్యాలూ అనుగ్రహించడానికి మళ్లీ తరలిరమ్మని వేడుకుంటారు. ప్రకృతి నుంచి ఆవిష్కృతమైన పూల పుంత బతుకమ్మ. జలాల్లో సమ్మిళితమై, చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. పూలరాణిగా బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేడుక చేయడం, నిమజ్జనంతో అనంత ప్రకృతిలో సంలీనం కావడం అనేవి- జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మక తత్వాలకు సంకేతాలు!
నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ ఆరాధన! ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపం ఆమె. ‘ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి. ఆ ప్రకృతే మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే సామాజిక ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. అహింస, నిగ్రహం, భూతదయ, క్షమ, శాంతి, ధ్యానం, సత్యం, ప్రేమ- ఈ అష్ట పుష్పాలతో పాటు, మనో పుష్పాన్ని కలిపితే మొత్తం తొమ్మిది పుష్పాలవుతాయి. వాటన్నింటి సమ్మిళిత ఆరాధనమే బతుకమ్మ వేడుక!
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list