MohanPublications Print Books Online store clik Here Devullu.com

భూకైలాసం.._Milapur-MohanPublications

భూకైలాసం..


పరమేశ్వరుడు స్వయంభువుగా భువిపై వెలసిన క్షేత్రమే చెన్నై నగరంలోని మైలాపూర్‌లోని అరుల్‌మిగు కపాలీశ్వరస్వామి ఆలయం. లయకారకుడైన శివుడు స్వయంగా భువిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. సాక్షాత్తు ఆ జగన్మాత పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన పవిత్రపుణ్యక్షేత్రమది. అరుల్‌మిగు కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది. అందుకనే మైలైయే కైలై- కైలేయే మైలై అంటారు. దీనర్థం మైలాపూరే కైలాసం, కైలాసమే మైలాపూర్‌ అని అర్థం. అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది. అందుకనే మయిల్‌ అంటే నెమలి పేరుతో మైలాపూర్‌గా ఏర్పడింది.
బ్రహ్మ శాప విముక్తి.. కైలాసంలో శివున్ని దర్శించిన అనంతరం సృష్టికర్తయైన బ్రహ్మ గర్వం ప్రదర్శించాడు. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు అతని తలల్లో ఒకదానిని ఖండించి ఆ తలను ఒక చేతిలో పట్టుకున్నారు. కపాలాన్ని ధరించిన వాడు కనుక కపాలీశ్వరుడు అని అంటారు. బ్రహ్మ తన పాప నివారణ కోసం మైలాపూర్‌ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేయడంతో ఆయన పాపం పరిహారమయింది.

అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం.. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథనం ప్రాచుర్యంలో వుంది. నమశ్శివాయ అన్న పదానికి అర్థాన్ని శంభునాథుడు పార్వతీ దేవికి వివరిస్తుండగా ఆమె ఒక నెమలి వైపు దృష్టి సారించింది. దీంతో ఆగ్రహం చెందిన ఆయన నెమలిగా మారిపొమ్మని శాపం ఇస్తాడు. దీంతో ఆమె శాప విముక్తి కోసం ప్రార్థించగా భూలోకంలో తన కోసం తపస్సు చేస్తే విముక్తి కలుగుతుందని చెబుతాడు. భూలోకంపై అడుగుపెట్టిన పార్వతీ దేవి ఒక చెట్టుకింద నెమలిరూపంలో స్వామివారి కోసం తపస్సు చసింది. ఆమె తపస్సుకు ప్రత్యక్షమైన లయకారకుడు శాపవిముక్తి చేయడంతో పాటు కర్పగవల్లిగా దీవించాడు. దీంతో ఆ ఆదిదంపతులు ఇక్కడే నివాసముంటూ భక్తులకు అభయమిస్తున్నారు.
మురుగన్‌కు వేలాయుధం.. రాక్షసుడు సురపన్మను సంహరించేందుకు సుబ్రమణ్యస్వామి ఈ ఆలయంలోనే తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన ఆదిదంపతులు తమ కుమారునికి వేలాయుధం ఆయుధాన్ని ఇక్కడే ఇచ్చినట్టు పురాణాలు తెలుపుతున్నాయి. రాక్షస సంహారం అనంతరం శరవణుడు సింగారవేల్‌గా తిరిగొచ్చాడు. దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రమణ్యస్వామికి ఇచ్చి వివాహం చేస్తాడు. దేవలోకంలో వుండే ఐరావతం దేవసేనతో బాటే వచ్చేస్తుంది. అందుకనే వల్లీ, దేవసేన సమేతంగా మురుగన్‌ ఐరావతంపై దర్శనమిస్తుంటారు. ఇది అరుదైన దర్శనం కావడం విశేషం.
తిరుజ్ఞాన సంబంధర్‌.. నయనార్ల పరంపరలో తిరుజ్ఞాన సంబంధర్‌ మహాభక్తుడు. ఆయన తొలి కావ్యాన్ని స్వామి సన్నిధిలోనే రాయడం విశేషం. పరమేశ్వరుడు భక్తులకు పెన్నిధి అనే అంశాన్ని ఈ కథ నిరూపిస్తుంది. శివనేశ్వర్‌ అనే భక్తుని కుమార్తె పూంపవై. ఆ బాలిక రోజు శివపూజలో తరించేది. ఒకరోజు పూలు కోస్తుండగా పాము కాటుతో మరణిస్తుంది. భగవంతుడినే నమ్ముకున్న శివనేశ్వర్‌ ఆమె అస్థికలను ఒక కుండలో వుంచుతాడు. ఒకనాడు సంబంధర్‌ అక్కడకు రాగా శివనేశ్వర్‌ తన దీనగాధను విన్నవించి ఆ కుండను ఆయన ముందువుంచుతారు. పరమభక్తుడైన సంబంధర్‌ కపాలీశ్వరుని ఆర్థ్రతతో ప్రార్థిస్తాడు. మట్టిట పున్నై అనే గానంలో పరమేశ్వరుని పండగలను వివరిస్తూ బాలిక శివుని పర్వదినాలను ఎలా వీక్షించకుండా వుండగలదు అని వేడుకుంటాడు. దీనదయాళుడైన ఆ శంభునాథుడు ఆ బాలికకు తిరిగి ప్రాణం పోస్తాడు. ఒక్కసారిగా కుండలు పగిలి అస్థికల నుంచి బాలిక బతికొస్తుంది. కృతజ్ఞతాభావంతో శివనేశ్వర్‌ సంబంధర్‌కు ఆమెను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అయితే తాను జీవితాన్ని తిరిగి ఇచ్చాను కాబట్టి తండ్రిలాంటి వాడినని సున్నితంగా తిరస్కరిస్తాడు. పూంపవై తన శేషజీవితాన్ని భగవంతుని సన్నిధానంలో గడిపి శివసాయుజ్యం పొందింది.
ఎలా చేరుకోవాలి..
* చెన్నై దేశంలోని ప్రధాన నగరం
* అన్నిప్రాంతాలతో చెన్నైకు రవాణాసౌకర్యాలున్నాయి.
* రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చెన్నై చేరుకోవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list