MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం_Sripuram-MohanPublications

శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం


బంగారం... స్తంభాలు బంగారం... వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం... అన్నీ బంగారంతో చేసినవే. అంటే స్వర్ణదేవాలయం! అమృత్‌సర్‌ స్వర్ణదేవాయంలో కూడా మంటపాలూ, గోపురాలూ ఇవన్నీ ఉండవే అనుకుంటున్నారా... మీ సందేహం నిజమే, ఇది అమృత్‌సర్‌ గురుద్వారా కాదు, తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం!
వంద ఎకరాల విస్తీర్ణం... 1500 కిలోల బంగారం... 400 మంది శిల్పులు... ఆరేళ్ల నిరంతర శ్రమ... అద్భుతమైన శిల్ప చాతుర్యం... సుమారు 600 కోట్ల రూపాయలు... వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం.

ఇప్పటివరకూ స్వర్ణదేవాలయం పేరు వినగానే వెంటనే స్ఫురించేది అమృత్‌సర్‌. కానీ, ఇప్పుడా ఖ్యాతిని శ్రీపురమూ దక్కించుకుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలూ శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు. ఆ తరవాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి, శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్‌తోనే రూపొందించి, బంగారు తొడుగుతో అలంకరించారు.
చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలైకోడిగా ప్రసిద్ధి. మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరం ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాలి. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్‌, బైబిలులోని ప్రవచనాలను రాశారు. వీటన్నింటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి, జ్ఞానసుగంధంతో బయటకు వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తిఅమ్మ ఉద్దేశం.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటెన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన ఏడు జన్మల్నీ దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు.
మూలస్థానంలో...
వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది.
అంతా ఒక్కటే!
మిగిలిన ఆలయాల్లోలాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. తారతమ్యాలు లేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు. భద్రత దృష్ట్యా ఆలయంలోకి సెల్‌ఫోన్లు, కెమేరాలు, తినుబండారాలను అనుమతించరు.
ఆలయ సందర్శనం ముగించుకుని బయటకు వచ్చే సరికి... అమ్మవారి దివ్యమంగళ స్వరూపం, గోడలపై కనిపించే మతగ్రంథాల బోధనలు భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. వారిని సదా ఆధ్మాత్మిక మార్గంలో నడిపిస్తాయి... అని శక్తిఅమ్మ చెబుతుంటారు.
దర్శనం కోసం..
వేలూరు నుంచి దక్షిణాన వూసూర్‌ ఆనైకట్లు వెళ్లే మార్గంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీపురం నెలకొంది. ప్రతిరోజూ ఉదయం 5.00 గంటల నుంచి 7.30 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, అలంకారం, హారతి ఉంటాయి. ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతారు.
ఎవరీ శక్తిఅమ్మ
నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్‌. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్‌ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్‌. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం... ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తిఅమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.
ప్రతిదీ ప్రత్యేకమే!
శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయపరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కన్నా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు తక్కువ.
* నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకతను పాటించారు. రిజర్వ్‌బ్యాంకు అనుమతి పొంది మినరల్స్‌ అండ్‌ మెటల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ బంగారాన్ని కొనుగోలు చేశారు.
* కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది.
* 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
* ఆలయానికి రాజగోపురం ఉంది. తిరుమల ఆలయానికి మల్లే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్‌ పూర్తిగా బంగారంతో చేసిందే.
* ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు.
* ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
* ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు.
* ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది.
* ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి, వెలుపలికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి.
ఇలా చేరుకోవాలి
* చిత్తూరు నుంచి 49 కి.మీ.దూరంలో వుంది.
* తిరుపతి నుంచి 134 కి.మీ.దూరంలో వుంది.
* రైలులో కాట్పాడి రైల్వేస్టేషన్‌లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు.
* చెన్నై విమానాశ్రయం నుంచి 145 కి.మీ. దూరంలో ఈ క్షేత్రముంది.
* తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని సందర్శించుకోవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list