MohanPublications Print Books Online store clik Here Devullu.com

చందన రూ పుడు.. సింహాచలేశుడు_Simhachalam-MohanPublications

చందన రూ
పుడు.. సింహాచలేశుడు

దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.
ఆలయ చరిత్ర-స్థల పురాణం
స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో.. భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా.. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (రూ.52 కోట్లు)కలిగిన దేవాలయమిదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం.



సింహాచలంలో 

జరిగే చందనోత్సవం

 విశిష్టత ఏమిటి?



కృతయుగంలో హిరణ్యకశిపుని సంహరించ డానికి స్తంభము నుండి ఆవర్భవించిన నారసింహుడు నృసింహ పురాణానుసారం నూరు దివ్య సంవత్సరములు ఘోరమైన యుద్ధము చేయగా హిరణ్యకశిపుడు తన మాయా ప్రభావంతో వ్యాఘ్రముగా, శరభంగా, నీటిసింహంగా, గండబేరుండంగా ఇలా అనేక రూపాలలో నృసింహ స్వామితో తలపడెను. స్వామి కూడా ధీటుగా ధరించిన పలు రూపాలలో వరాహ నరసింహ రూపం ఒకటి. ఋషులు, మునులు, దేవతలు, ఇతర భక్తజనం అమితంగా ఇష్టపడిన ఈ వరాహ స్వామి అంతకు ముందు హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరించి జలముపై నిలిపి పంచమహా యజ్ఞములను ప్రభోదించి అంతర్థానం చెందెను. ఆ సమయములో భక్తులకు స్వామిని తనివితీరా దర్శించి స్తుతించి ఆనందించే అవకాశం లభించకపోవడంతో మరల స్వామి వరాహ రూపం చూసి మురిసిన భక్తులు ఈ రూపంలోనే ఎల్లకాలము దర ్శనమీయమని ప్రార్థించెను. అగస్త్య మహర్షి భక్తుడైన ద్యూమసేనుడికి వరాహ స్వామి అంటే అమితమైన ప్రీతి. వరాహ స్వామి వరాహ నారసింహ రూపంలో హిరణ్యకశిపునితో వివిధ రకాల యుద్ధ రీతులలో యుద్ధము చేస్తున్నప్పుడు చంపక గిరి(సౖింహాచలకొండ)పై స్వామి ఒక్క క్షణం మెరిసాడు. ఆ సమయంలో స్వామి ఉగ్రరూపాన్ని చూసిన అగస్త్య మహర్షి, ద్యూమసేనుడు, భూదేవి, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు స్వామికి చందనాభిషేకం గావించారు. చల్లబడిన స్వామి వారిని వరం కోరుకోమనగా ఈ కొండమీదే ఈ రూపంతోనే స్థిరంగా అశేష భక్తజనులకు కన్నుల పండగ చేస్తూ శాశ్వతంగా నిలవాలని కోరుకున్నారు. ఆనాడు వైశాఖ శుద్ధ తదియ కావున బ్రహ్మ, అగస్త్యుడు ఇతర రాజులు చేసిన చందనాభిషేకాన్ని ప్రతీ సంవత్సరం ఇదేవిధంగా ఇదేరోజున చేసిన నిరంతరం తన నిజరూపాన్ని చందనంలోనే దాచుకుంటానని స్వామి అనుగ్రహించెను. శివ ప్రీతి కోసం చందనం కప్పుకున్న స్వామి శివభక్తులకు లింగాకారంగా కనబడతారు. ఒక్క వైశాఖ శుద్ధతదియ నాడు అనగా అక్షయ తృతీయ నాడు స్వామి నిజరూపాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది. ఆనాడు చందనం తీసి మరలా చందనం పూయుటకు మధ్యన స్వామిని దర్శించిన వారు అలాగే తీసినపపుడు, వేసినప్పుడు దర్శించిన వారు సకల మనోరధ సిద్ధిని పొందుతారు. స్వామి కోసం చందనం తీసిన వారికి మరుజన్మ ఉండదు. స్వామి చందన మూర్తి, సువర్ణ మూర్తి కావున ఆనాడు బంగారం దానం చేసిన వరాహ స్వామి అనుగ్రహం పొంది అనంతమైన పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొని దాచుకోవడం దురభ్యాసం.

ప్రధాన పూజలు
1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.


ఇతర సేవల ధరలు
* సహస్రనామార్చన: రూ.200
* అష్టోత్తర శతనామార్చన: రూ.100
* లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
* గరుడ సేవ: రూ.300
* కప్పస్తంభ ఆలింగనం: రూ.25
* లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
* గోపూజ: రూ.50
* గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
* పశువుకట్టు: రూ.15
* అన్నప్రాశన, అక్షరాభ్యాసం: రూ.50
* ద్విచక్రవాహన పూజ: రూ.100
* కారు పూజ: రూ.200
* కేశఖండన: రూ.10
టిక్కెట్లు దొరికే స్థలాలు: అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
ప్రసాదాల ధరలు
* లడ్డూ(80గ్రాములు): రూ.5
* పులిహోర : రూ.5
* చక్కెర పొంగలి: రూ.3
* రవ్వ లడ్డూ : రూ.2
దర్శన వేళలు
* ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
* మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
* మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
* సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
* రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
* రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
* రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
* మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల ధరలు
* రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
* రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
* రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.
రవాణా సౌకర్యం
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
వసతి వివరాలు
కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్టు రెస్ట్‌ హౌస్‌, తితిదే సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో వున్నాయి.
ఇతర దర్శనీయ స్థలాలు
ఆండాళ్‌ సన్నిధి(గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు
ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్‌, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడమూ సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list