MohanPublications Print Books Online store clik Here Devullu.com

కోర్కెలు తీర్చే ఇలవేల్పు_Chilukuri Balaji Temple-MohanPublications

కోర్కెలు తీర్చే ఇలవేల్పు


కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగాఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది. వారానికి 75 వేల నుంచి లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించు’.. అని చెప్పి మాయమయ్యాడట! నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాలుగేళ్ల కిందట దేవాలయం వద్ద నూతనంగా ఆలయ గోపురాన్ని నిర్మించారు. రెండేళ్ల కిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి, నారేపచెట్టుతో రూపొందించిన కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. ఆ పై గరుత్మంతులవారి గుడిని నిర్మించారు. పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.స్వయంప్రతిపత్తి హోదా ఈ దేవాలయానికి నాలుగేళ్ల కిందట స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు. నిత్య పూజా ఫండ్‌ కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒక కమిటీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది.చిలుకూరులో ప్రధాన పూజలు ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.* ప్రత్యేక పూజలు కూడా ఏమీ ఉండవు. * దర్శన సమయంలో విరామం ఉండదు. * ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడం వంటివేవీ లేవు. * ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్‌ ఆలయాలు ఉన్నాయి. * ఆర్జిత సేవలు, ప్రధాన పూజలు * బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి పూజలు జరపాలో అవే ఉంటాయి. అవి కూడా ఉచిత దర్శనమే.బాలాజీ దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7.45 వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.ప్రయాణ సౌకర్యాలు దేశంలో ఎక్కడి నుంచైనా హైదరాబాద్‌కు వచ్చేందుకు చక్కటి రోడ్డు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చిలుకూరుకు చేరడం ఎంతో సులభం. ఆర్టీసీ-హైదరాబాద్‌ అధికారులు నగరం నుంచి ప్రతి 5నిమిషాలకు ఒక బస్సు చొప్పున చిలుకూరు బాలాజీ సన్నిధికి సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు.నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి దూరం... శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 29.3 కి.మీ.లు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 30.1 కి.మీ.లు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి 28.8 కి.మీ.లు నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 26.2 కి.మీ.లు ఎంజీబీఎస్‌ నుంచి 26.5 కి.మీ.లు జేబీఎస్‌ నుంచి 31.1 కి.మీ.లు మెహిదీపట్నం నుంచి 21.4 కి.మీ.లు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list