MohanPublications Print Books Online store clik Here Devullu.com

నాలుగు యుగాల దేవుడు... చెన్నకేశవుడు!_Chennakesavudu

నాలుగు యుగాల దేవుడు... చెన్నకేశవుడు!
సత్యయుగం నుంచీ కలియుగం దాకా అన్ని యుగాల్లోనూ భక్తుల పూజలందుకున్న దేవదేవుడు... మార్కాపురంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు. ఆనాడు మహర్షుల కోరికపై దండకారణ్యంలో వెలసిన స్వామి, ఈనాడు నగరం నడి మధ్యలో శరణు కోరిన వారికి అభయ హస్తం అందిస్తున్నాడు.
కతే గజారణ్యం తవేశః
త్రేతాయుగే మాధవపుర్య భూత్తత్‌
సాద్వాపరే సర్వపురం హిక్షేత్రం
మార్కాపురీత్యద్య కలౌ ప్రసిద్ధా...
శివారాధన చేసి మృత్యువును జయించిన చిరంజీవి మార్కండేయుడు. ఆ మహా పురుషుడు రచించిన ‘గజారణ్య సంహిత’ అనే గ్రంథం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవుడు నాలుగు యుగాలుగా భక్తులను కటాక్షిస్తున్నాడు. నల్లమలకు ఆనుకొని ఉన్న మార్కాపురమే ఒకప్పుడు గజారణ్యంగా ప్రతీతి. అప్పట్లో అదంతా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మహర్షులు తపస్సు చేసుకునేందుకు అనువుగా ఉండేది. ఆ దీక్షను భగ్నం చేసేందుకు అసురులు సకల ప్రయత్నాలూ చేసేవారు. వాళ్ల ఆగడాల నుంచి రక్షించమని వేడుకున్న రుషి పుంగవుల కోరిక మేరకు మహావిష్ణువు ఆ దండకారణ్యంలో చెన్నకేశవుని రూపంలో స్వయంభువుగా వెలిశాడు. కృతయుగంలో ఏనుగులు గుండికానది నుంచి నీటిని తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించేవట. ఏనుగులు ఎక్కువగా సంచరించేవి కాబట్టి దీనికి గజారణ్యం అని పేరు. త్రేతాయుగంలో గౌతమ మహర్షి ఇక్కడే తపస్సు చేశారు. ఆ కాలంలో ఆ ప్రాంతం మాధవీపురంగా ప్రసిద్ధి చెందింది. ద్వాపర యుగంలో అక్కడ రాక్షసుల చేతిలో హింసకు గురైన భక్తులకు విష్ణుమూర్తి స్వర్గలోక ప్రాప్తి కలిగించడంతో అది స్వర్గసోపానంగా విలసిల్లింది. కలియుగారంభంలో మారిక, మారకులనే భక్తులు నిత్యం స్వామిని ఆరాధించేవారు. ఆ పరమ భక్తుల పేర్ల మీదే క్షేత్రాన్ని మారికపురం, మారకాపురమని పిలిచేవారు. కాలక్రమంలో అది మార్కాపురం చెన్నకేశవ క్షేత్రంగా మారిందని చెబుతారు.
రాయల ఆధ్వర్యంలో...
పల్నాటి రాజుల నుంచీ కృష్ణదేవరాయల వరకూ చాలామంది ప్రభువులు చెన్నకేశవుని కొలిచిన వారే. ఆలయ శాసనాల ప్రకారం... పన్నెండవ శతాబ్దంలో మలిదేవుడనే పల్నాటి రాజు ఓసారి గురజాలలో జరిగిన కోడిపందేలలో ఓడిపోయాడు. ఆ తరవాత చెన్నకేశవుని కొలిచి, చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాడు. స్వామి కటాక్షంతోనే తన దశ మారిందని నమ్మి ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మాచర్లలో మరో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఆ విషయాన్ని ‘పల్నాటి వీరచరిత్ర’లో శ్రీనాథుడూ ప్రస్తావించాడు.
ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగరానికి తిరిగి వెళ్తూ మార్గ మధ్యంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు. ఆయన ఆదేశానుసారం గర్భాలయం, అంతరాలయం, మహాద్వారం, విమాన గోపురం, రాజ్యలక్షీ అమ్మవార్ల అలయాలను సామంతరాజు సిద్ధిరాజు తిమ్మయ్య నిర్మించాడు. తరవాతి కాలంలో లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాలస్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, రామానుజల ఆలయాలను ఆ ప్రాంగణంలో అచ్యుత దేవరాయలు నిర్మించారు. రాయల కాలంలో రెండంతస్తులకే పరిమితమైన గాలిగోపురాన్ని 1929లో తొమ్మిదంతస్తులకు పెంచారు. శిథిలావస్థకు చేరిన ఆ గోపురాన్ని నాలుగేళ్ల క్రితం పునర్నిర్మించారు.

ఎన్నెన్నో విశేషాలు
సాధారణంగా శ్రీహరికి కుడిచేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. మార్కాపురం చెన్నకేశవుడికి ఎడమచేతిలోనూ ఓ శేషచక్రం దర్శనమిస్తుంది. కేశీ అనే రాక్షసుడి సంహారానికి గుర్తుగా స్వామి శేషచక్రం ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్టు పక్కనే మార్కండేయ మహామునితోపాటు మారిక, మారకయ్యల విగ్రహాలూ కనిపిస్తాయి. మరే దేవాలయంలో లేని విధంగా స్వామివారి మూలవిరాట్టు పానవట్టంపై కొలువై ఉంటుంది. ఆస్థాన మండపంలో ఉన్న స్థంభాలన్నీ ఏకశిలపై చెక్కినవే. ఇద్దరు అన్నదమ్ములు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే అనేక స్తంభాలను ఆలయ ప్రాంగణంలో అందంగా మలిచారు. మధ్యరంగంలోని శిల్పకళా సంపద భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది. ధనుర్మాసంలో గాలిగోపురం, విజయస్తంభం, మధ్యమండపంలోని అవాంతరాలను దాటుకొని భానుడి కిరణాలు నేరుగా మూలవిరాట్టుని తాకేలా అద్భుత రీతిలో ఆలయాన్ని నిర్మించారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు..
చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు వేద కాలం నుంచే జరుగుతున్నట్లు గజారణ్య సంహిత చెబుతోంది. ఏటా ఛైత్రశుద్ధ చతుర్దశి రోజున బ్రహ్మోత్సవాలను అంకురార్పణతో ప్రారంభించి పౌర్ణమి రోజున వైభవంగా కల్యాణం జరిపిస్తారు. సూర్య, చంద్ర, సింహ, శేష, వ్యాళి, పొన్న, హనుమ, గరుడ, గజ, అశ్వ, హంస వాహనోత్సవాలను కన్నులపండువగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టం రథోత్సవం. మార్కాపురంతోపాటు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి లక్షమందికిపైగా ఆ రోజు రథోత్సవాన్ని తిలకిస్తారు. ఆలయంలో రథసప్తమి వేడుకలూ ఈ ఏడాది నుంచే ప్రారంభమయ్యాయి. వాటి కోసం భక్తులు స్వామివారికి రజత రథాన్ని సమకూర్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకే రోజున స్వామి ఏడు వాహనాలపైన పురవీధుల్లో దర్శనమిస్తాడు.
ఒంగోలు నుంచి మార్కాపురానికి 95 కిలోమీటర్ల దూరం. ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంటుంది. విజయవాడ- నంద్యాల రైల్వే మార్గంలో ఉన్న వూరు కాబట్టి, రెండు ప్రాంతాల నుంచీ రైలు ద్వారానూ చేరుకోవచ్చు.
- దొండపాటి మోహన్‌రెడ్డిన్యూస్‌టుడే, మార్కాపురం

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list