MohanPublications Print Books Online store clik Here Devullu.com

సింహాచలం... _Simhachalam

సింహాచలం... మహాపుణ్యక్షేత్రం

ఏడాదికి పన్నెండు గంటలు మాత్రమే ఆ దేవుడి నిజరూప దర్శనం భక్తులకు దొరుకుతుంది. మిగిలిన సమయంలో ఆ విగ్రహం చందనంతోనే నిండి ఉంటుంది. ఏడాదికోసారి మాత్రమే అరుదుగా దొరికే ఆ స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తారు. అతడే.. సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మీనరసింహస్వామి.
సింహాచలం దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. సముద్ర మట్టానికి రెండువందల నలభైనాలుగు మీటర్ల ఎత్తులో ఉండే సింహగిరి పర్వతంపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి మహత్యాన్ని తెలిపే కథలెన్నో ఉన్నాయి.
స్థల పురాణం
సింహాచలంలో శ్రీమహావిష్ణువు దశావతారాల్లో నాలుగోదైన లక్ష్మీనారసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం... రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. అతడి కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి బయటకు వచ్చిన విష్ణువు, హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇది జరిగిన తర్వాత నుంచీ ప్రహ్లాదుడు వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని సింహగిరి కొండ మీద ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానంలో ఈ కొండ మీదుగా వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రకాశవంతమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది. అక్కడ అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. ఆ విగ్రహాన్ని ఏడాదిపాటు చందనంతో కప్పి ఉంచి, వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేట్టు చేయమని ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. ఏటా వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాడు చందనం తీసివేసి భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలిగిస్తారు.
సింహాచల దేవాలయం పడమర ముఖంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న శాసనాలు సింహాచలం ప్రాముఖ్యాన్ని తెలుపుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండుసార్లు దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటుచేశాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలనూ సమర్పించాడు.
కప్ప స్తంభం
దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. దీన్ని సంతాన గోపాల యంత్రం మీద ప్రతిష్ఠించారు. ఇది అత్యంత శక్తిమంతమైందని భక్తుల నమ్మకం. సంతానంలేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు (పన్నులు) చెల్లించేవారు కాబట్టి దీన్ని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో ఈ ఆలయం ఉంది. ఈ కొండల మీద గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనే సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. భక్తులు ఈ ధారలలో స్నానాలుచేసి స్వామిని దర్శించుకుని తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సెలయేరు ఉంది. కల్యాణం తర్వాత స్వామి ఈ ఘట్టంలో స్నానమాచరిస్తాడు.
ఉత్సవాలూ, పండగలూ...
సింహాచలేశునికి ఏడాది పొడవునా ఉత్సవాలూ పండగలూ జరుగుతూనే ఉంటాయి. పెళ్లికొడుకును చేయడం, కల్యాణ మహోత్సవాలు, రథోత్సవం, చందనోత్తరణం, చందనోత్సవం, శయనోత్సవం, గిరిప్రదక్షిణ, కరాళచందనం, పవిత్రోత్సవం, శరన్నవ రాత్రులు, తెప్పోత్సవం, డోలోత్సవం, నరసింహ జయంతి లాంటి ఉత్సవాలను నిర్వహిస్తారు. సింహాచలం కొండ ఏడాది పొడవునా నిత్య కల్యాణాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. కొండపైన ఉండే నృసింహ మండపం, దిగువన ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలోనూ వివాహాలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రానికి విశాఖపట్నం వరకూ రైలు, బస్సు, విమాన మార్గాల్లో వెళ్లవచ్చు.
- ఎం.సత్యనారాయణ న్యూస్‌టుడే, సింహాచలం

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list