అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ జోగులాంబ ఆలయం తెలంగాణలోని గద్వాల్ జిల్లా, అలంపూర్‌లో ఉంది. కృష్ణానదిలో తుంగభద్ర సంగమించేది ఇక్కడికి సమీపంలోనే! జోగులాంబ ఆలయంతోపాటు అలంపురంలో అడుగడుగునా కనిపించే దేవాలయాలు మనలో ప్రతిక్షణం భక్తి భావనలను రేకెత్తిస్తాయి.
అలంపురం మహాక్షేత్రం తుంగా చోత్తర వాహినీ
బాల బ్రహ్మేశ్వరో దేవః జోగులాంబ సమన్వితః
తీర్థం పరశురామస్య నవబ్రహ్మ సమన్వితం
అలంపురే జోగులాంబా విశాలాక్ష్యా సమాస్మృతా
భువికా శ్యా సమక్షేత్రం సర్వదేవ సమర్చితం
సదానః పాతుసా దేవీ లోకానుగ్రహతత్పరా
జోగులాంబ ఆలయ విశిష్టతను తెలిపే ఈ మాటలకు అర్థం... అలంపురం సర్వోత్తమమైన క్షేత్రం. ఇక్కడ తుంగభద్ర ఉత్తరావాహిని. స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడు, అమ్మవారేమో జోగులాంబ. ఇది పరశురాముని తీర్థం. నవబ్రహ్మలకు నిలయం. ఈ క్షేత్రంలోని జోగులాంబ కాశీ విశాలాక్షితో సమానం, సకల దేవతలచేతా ఈ స్థలం పునీతమైనది. వీరిచేత జోగులాంబ పూజలందుకుంది. ఈ దేవి మనల్ని అనుగ్రహించుగాక... అని.
స్థల పురాణం...
ఒకప్పుడు హమతాపూర్, అమలాపూర్ పేర్లతో పిలిచిన క్షేత్రమే ప్రస్తుత అలంపూర్. జిల్లా కేంద్రం గద్వాల్‌కు 60కి.మీ. దూరంలో ఉంది. అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయమైన అలంపూర్‌లో అయిదో శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం ప్రధానమైనది. ఈ అమ్మవారిని లలితా సహస్రనామాల్లో పలుమార్లు పేర్కొన్నారు. దక్షయజ్ఞం సమయంలో దక్షప్రజాపతి శివనిందచేస్తూ పరిహాసంగా మాట్లాడటంతో ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి(దక్ష ప్రజాపతి కుమార్తె, శివుడి అర్ధాంగి) యాగాగ్నికి ఆహుతి అవుతుంది. పరివారగణంద్వారా విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై అక్కడికి చేరి యాగాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. అనంతరం అమ్మవారి దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయతాండవం చేస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుని శాంతింపచేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. ఆ సుదర్శనం అమ్మవారి శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తుంది. ఒక్కొక్క భాగం భారతదేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో పడుతుంది. అవే 18 శక్తి పీఠాలుగా ఉద్భవించాయి. ఇందులో అమ్మవారి పైదవడ భాగం అలంపూర్‌లో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. కింద దవడకంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ తల్లి రౌద్ర స్వరూపిణిగా వెలసింది. అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటంతో ఆమెను శాంతింపజేసేందుకు ఆలయ కింది భాగంలో జల గుండం ఏర్పాటు చేసి నీటితో ఉంచబడి ఉంది. మిగతాచోట్ల స్త్రీ దేవతలకు తల వెంట్రుకలు వెనక్కి ఉంటే ఇక్కడ మాతకు మాత్రం పైకి ఉంటాయి. ఇలా ఉండటాన్ని ‘జట’ అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే ఇలా జట ఉంటుంది. దేవతల్లో జోగులాంబకి మాత్రమే ఇలా ఉంటుంది. జటాజూటధారి అయిన తల్లి తల వెంట్రుకల్లో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఉంటాయి. వీటితోపాటు అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ఈ అయిదూ ఇక్కడి ప్రత్యేకతలు. పరమేశ్వరుడు ఎక్కువకాలం శ్మశానవాసి కాబట్టి దేవి కూడా ఆయనలో భాగమని చెప్పడానికే ఈ ప్రత్యేకతలు ఉంటాయి.
పునర్నిర్మాణం...
జోగులాంబ ఆలయాన్ని మొదట క్రీ.శ.ఆరో శతాబ్దంలో బాదామి చాళుక్యుడైన రెండో పులకేశి నిర్మించాడు. 17వ శతాబ్దంలో మహ్మదీయుల దండయాత్ర సమయంలో ఆలయం ధ్వంసమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అయితే అమ్మవారి విగ్రహాన్ని మాత్రం సమీపంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోని నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నట్టు నిర్మించింది. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచీ ఈ ఆలయానికి సందర్శకులు పెరిగారు. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీహోమాలు, ప్రతి శుక్రవారం వారోత్సవ పూజ, ప్రతి రోజూ అమ్మవారి సన్నిధిలో త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. ఏటా మాఘ శుద్ధ పంచమినాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు. ఆరోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది. అదేరోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు.
ఆలయాల అలంపురం
బాదామి చాళుక్యుల కాలంలోనే నిర్మించిన నవబ్రహ్మల దివ్యధామమూ అలంపూర్‌లో ఉంది. ఈ నిర్మాణశైలి దేశంలోనే ప్రథమంగా భావించే ఆలయ నిర్మాణశైలుల్లో ఒకటి. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక స్థానం పొంది శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారంగా విరాజిల్లుతున్నాయి. శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణాతీరంలోని ముంపు ప్రాంతం నుంచి రాళ్లను తరలించి యథాతథంగా పునర్నిర్మించిన సంగమేశ్వర ఆలయమూ అలంపూర్‌లో ఉంది. ఇక్కడికి దగ్గర్లోనే పాపనాశేశ్వర ఆలయాల సముదాయం ఉంది. ఇలా ఎన్నో ఆలయాలకు ఆలవాలం అలంపురం.
హైదరాబాద్-కర్నూల్ రహదారి మార్గంలో కర్నూల్‌కు 10కి.మీ. దూరంలోని అలంపూర్ చౌరస్తానుంచి అలంపూర్ చేరుకోవచ్చు. హైదరాబాద్-కర్నూల్ రైలు మార్గంలో కర్నూల్ స్టేషన్‌కు ముందు జోగులాంబ హాల్ట్ వస్తుంది.
- కె.మద్దిలేటి, న్యూస్‌టుడే, అలంపూర్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565