సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి మత్స్యరూపంలో కొలువైన కొండగా, మహిమాన్విత క్షేత్రంగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండప్రాంతమంతా భక్తుల దైవ నామస్మరణతో మార్మోగుతుంది. చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం భాసిల్లుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి కొండపై వెలసిన లక్ష్మీనారసింహుడిని కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు.
పూర్వం వ్యోములు అనే రుషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం అన్వేషిస్తూ మత్స్యగిరి కొండపైకి చేరి తపస్సు ప్రారంభించారు. దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్యకశిపుణ్ని సంహరించిన ఉగ్రనారసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు. దీంతో రుషులంతా తమను దుష్టశక్తుల బారినుంచి రక్షించమని నర్సింహస్వామిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకున్నాడు. పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట మూడు ముఖాలుగా, మూడు గుండాలుగా మారిందనీ దుష్టశక్తులన్నీ పరారయ్యాయనీ పురాణ కథనం. సాలగ్రామ రూపంగా స్వయంభువుడై వెలసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది. దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అభిషేక పూజ తీర్థానికి మునులు కొలనులోకి వెళ్లగా నామరూపుడైన స్వామి మత్సా్యవతారంలో దర్శనమిచ్చాడు. వేలతీరుల్లో స్వామిని కొలచిన మునులు గల కొండ... అందుకే దీనిని వేముల కొండ అనీ పిలుస్తుంటారు.
చేపలకు విష్ణునామాలు
సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కళకళలాడుతుంటుంది. ఇందులోకి నీరు ఎక్కడినుంచి వస్తుందో ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు. ఒకే పరిమాణంలో సుమారు అర మీటరు పొడవుతో చిన్న డాల్ఫిన్లలా కోనేరులో ఈదుతూ కనువిందుచేస్తాయి. వాటి తలలపై విష్ణునామాన్ని పోలిన మూడేసి మీసాల్లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు స్థానికులు. నామాల గుండం, విష్ణుగుండం, మాలగుండం సముదాయంలో ఈ చేపలుంటాయి. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలు కలసిపోయి అర్ధ చంద్రాకారంలా వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి. ఈ గుండాన్ని ఆనుకుని స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధ చంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున ఆరడుగుల చేప విగ్రహం వుంది. చేపలు పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్టు కనిపిస్తుంది. చేప ముఖం మాత్రం తూర్పువైపు తిరిగి ఉంటుంది. గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు ఈ చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది.
పుష్కరిణి ఆవిర్భావం
శ్రీమత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అది మూడు భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనీ, లక్ష్మి, పార్వతి, సరస్వతి అనీ, త్రినేత్రాలనీ... ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటుంటారు. దైవమహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడూ ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలోనే స్వామివారు చేప రూపంలో శ్రీవైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తున్నారు.
అభయవృక్షం
దేవాలయం ఆవరణలో ఉన్న రావిచెట్టుకు అభయవృక్షమని పేరు. సంతానం లేనివారు ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి, స్వామిని ప్రార్థించి, పొట్టుతో ఉన్న కొబ్బరికాయను చెట్టుకు ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో పంచమి, సప్తమి, దశమి తిథుల్లో కొండప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఏటా జ్యేష్ఠశుద్ధ త్రయోదశి నుంచి బహుళ విదియ వరకు అయిదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసంలో తిరుప్పావై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలూ జరుపుతారు. ఈ కొండపై ఉంటే ప్రశాంతత లభిస్తుందనీ రోగాలు తగ్గుతాయనీ భూతప్రేత భయాలు తొలగుతాయనీ భక్తుల నమ్మకం. పుష్కరిణిలోని నీరు మహిమాన్వితమనీ ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయనీ పంట పొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉంది.
క్షేత్రాన్ని చేరడానికి...
ఈ క్షేత్రానికి చేరడానికి బస్సు, రైలు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి 85 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వలిగొండ మీదుగా ప్రయాణం తేలిక. భువనగిరి నుంచి 36 కి.మీ.; మోత్కూరు నుంచి 24 కి.మీ.; నల్గొండ నుంచి 55కి.మీ. దూరం ఉంటుంది. ఘాట్‌రోడ్డు మీదుగా కార్లు, ఆటోల ద్వారా కొండమీదికి చేరుకోవచ్చు. భక్తుల బస నిమిత్తం చిన్నచిన్న వసతిగృహాలున్నాయి.
- ఆదిల్ పాషా, న్యూస్‌టుడే, వలిగొండ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565