లోకకళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో ఉగ్రనారసింహావతారం అత్యంత ప్రధానమైనది. ప్రహ్లాదుని మొర ఆలకించి హిరణ్యకశ్యపుని సంహారార్థం రౌద్రరూపంలో స్తంభంలోంచి ఆవిర్భవించిన ఆ నారసింహునికి దేశవ్యాప్తంగా తొమ్మిది సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఆ నవ నారసింహాలయాల్లో ఒకటి ఖాద్రి నృసింహక్షేత్రం.
‘‘ఇందుగలడందులేడని సందేహంవలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందేగలడు....’’ అన్న భక్తప్రహ్లాదుని పలుకులను నిజంచేస్తూ హిరణ్యకశ్యప సంహారార్థమై మహోగ్రరూపంతో వెలసిన ఉగ్రనరసింహుడు, ప్రశాంత వదనంతో ప్రహ్లాదసమేతంగా కొలువుదీరిన క్షేత్రమే కదిరి లేదా ఖాద్రి. అనంతపురంజిల్లా కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోర్కెలు తీర్చే భక్తనారసింహునిగా పూజలందుకుంటున్నాడు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల నుంచి విజయనగర చక్రవర్తులవరకూ వివిధ దశల్లో అభివృద్ధిచేశారు. దేశంలోకెల్లాఅత్యంత పెద్ద రథాలున్న ఆలయాల్లో ఇది మూడోది.
స్థల పురాణం!
పూర్వం కదిరి పట్టణానికి సమీపంలో పాత రేపల్లె పట్టణం(పట్నం) అనే సామంతరాజ్యం ఉండేది. దీని పాలేగారైన రంగనాయకునికి నృసింహస్వామి స్వప్నంలో కనిపించి వల్మీకం(పుట్ట)లో ఉన్న తన అర్చాబింబాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించాలని కోరాడట. ఆయన ఆదేశం మేరకు రంగనాయకుడు ప్రతిష్ఠించటంతోబాటు గర్భాలయాన్ని నిర్మించాడట. అభిషేకంచేశాక మూలవిరాట్టు విగ్రహం నుంచి స్వేదబిందువులు ఉద్భవిస్తాయనీ, స్వామివారు స్వయంగా కొలువై ఉన్నాడనేందుకు ఇదే నిదర్శనమనీ చెబుతారు భక్తులు.
కాటమరాయుడు!
శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని వసంత వల్లభుడు, కాటమరాయుడు, కంబాలరాయుడు...ఇలా పలుపేర్లతో కొలుస్తారు. కదిరి ప్రాంతంలోని గొడ్డువెలగల గ్రామ సమీపంలో ఉన్న కొండపై సభామండపం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఇది హిరణ్యకశ్యప కాలంనాటిదేననీ అందులోని స్తంభంనుంచే స్వామి ఉద్భవించాడని విశ్వసిస్తారు. స్తంభం నుంచి ఆవిర్భవించడంవల్లే స్వామివారిని జానపదులు కంబాలరాయుడు, కాటమరాయుడు అంటారు.
రాక్షససంహారానంతరం ప్రహ్లాదుని స్తోత్రానికి ప్రసన్నుడై కదిరికి తూర్పున ఉన్న పర్వతంపై దర్శనమివ్వటంతో ఈ ప్రాంతానికి ఖాద్రి అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఖాద్రి పేరులో ‘ఖా’ అంటే విష్ణుపాదం, ‘అద్రి’ అంటే పర్వతం. విష్ణుపాదం మోపిన ప్రాంతం కావటంతో ఈ ప్రాంతానికి ఖాద్రి, కదిరి అని పేరు వచ్చింది. అదే కదిరిగా మారింది. మద్దిలేరుగా పిలవబడుతోన్న నదిని పూర్వం అర్జుననదిగా పిలిచేవారని బ్రహ్మాండపురాణం చెబుతోంది. శ్రీదేవి, భూదేవిసమేతంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఆలయానికి పడమటివైపున ఉన్న పవిత్ర భృగుతీర్థంలో వసంతరుతువులో లభ్యమవడంవల్లే వసంతవల్లభులు అనీ అంటారు.
చారిత్రక నేపథ్యం..!
క్రీ.శ 985-1076 సంవత్సరాల మధ్య కదిరి ప్రాంతంలోని దట్టమైన వేదారణ్యం పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉండేది. ఆ సమయంలో దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా అర్జున నదీతీరాన చాళుక్యులు తమ కులదేవత దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం చెపుతోంది. దీనికి దక్షిణభాగాన వెలసిన శ్రీనారసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దుర్గాదేవి అమ్మవారినీ కొలిచేవారు. అనంతరం దుర్గాదేవి విగ్రహం స్థానంలో అమృతవల్లి అమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యాన్ని క్రీ.శ. 1274లో వీరబుక్కరాయల హయాంలో నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది.
సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నలువైపులా నాలుగు గోపురాలతో అలరారే ఈ ఆలయంలో స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు పీఠం, 256 శిల్పకళాకృతులతో అందంగా తీర్చిదిద్దిన ఈ రథాన్ని బ్రహ్మోత్సవ సమయంలో భక్తులే లాగటం విశేషం. తమిళనాడులోని ఆండాళ్ అమ్మవారి శ్రీవల్లిపుత్తూరు రథం, తంజావూరుజిల్లాలోని తిరువార్ రథాల తరవాతి స్థానం ఖాద్రి నృసింహునిదే. అనంతపురంకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిరికి బస్సు, రైలుమార్గాలు ఉన్నాయి.
- జి.సుధాకర్‌నాయుడు, న్యూస్‌టుడే, కదిరి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565