MohanPublications Print Books Online store clik Here Devullu.com

SriRamanavami_MOHANPUBLICATIONS
సీతారామ కల్యాణం
‘శ్రీరామనవమి’ అనగానే, మనందరికీ సీతారామ కల్యాణం గుర్తుకొస్తుంది. నిజానికి చైత్ర శుక్ల (శుద్ధ) నవమి రాముడి పుట్టినరోజే తప్ప- సీతారాముల పెళ్లిరోజు కాదు. వారి కల్యాణం వైశాఖ శుక్ల దశమినాడు జరిగిందని ‘వాల్మీకి రామాయణం’ చెబుతోంది. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి రెండూ- వారి వారి జన్మతిథులు. పుట్టిన రోజునాడు శాంతి కల్యాణాలు జరిపించడం సంప్రదాయం. శ్రీరాముడి పుట్టినరోజు వేడుకలు- సీతమ్మతో కలిపి జరిపించే క్రమంలో, శాంతి కల్యాణం చైత్ర శుద్ధ నవమి నాడు నిర్వహిస్తారు.
రామాయణం రీత్యా, సీతమ్మది గౌతమ గోత్రం. రాముడిది వసిష్ఠ గోత్రం. భద్రాద్రిలో వెలసింది వైకుంఠుడన్న భావనతో శ్రీమహాలక్ష్మికి చెందిన సౌభాగ్య గోత్రాన్ని సీతమ్మకు, శ్రీమహావిష్ణువుదైన అచ్యుత గోత్రాన్ని శ్రీరాముడికి ఆపాదిస్తూ- కల్యాణ క్రతువులో ప్రవర చెబుతారు. భద్రాచలంలో మూలవిరాట్టుకు, ఆరుబయట ఉత్సవ మూర్తులకు ఒకేసారి కల్యాణం నిర్వహించడం ఒక విశేషం.
అనేక ఏళ్ల క్రితం రామాలయంపై దుండగులు దాడి చేసినప్పుడు, అర్చక స్వాములు ఆ ఉత్సవ మూర్తులను గోదావరి సమీపంలో దాచి పెట్టారు. ఆ తరవాత వాటిని వెలికి తీసేటప్పుడు, సీతమ్మ ప్రతిమ కనిపించలేదు. ఈలోగా శ్రీరామనవమి రావడంతో, మూల విరాట్టులకు కల్యాణం జరిపించారు. అమ్మవారి విగ్రహం కొన్నేళ్ల అనంతరం లభించడంతో, మళ్లీ ఉత్సవ మూర్తులకు కల్యాణాలు మొదలయ్యాయి. భద్రాచల సీతారాముల కల్యాణంలో ‘మూడు సూత్రాలు’ మరో విశేషం. జనకుడు, దశరథుడు, కంచర్ల గోపన్నల పక్షాన మొత్తం మూడు సూత్రాలను సీతమ్మ కంఠంలో అలంకరిస్తారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని అధికారిక కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. ప్రసిద్ధ రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిల్లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఒంటిమిట్టలో రాత్రిపూట పండువెన్నెల్లో నిర్వహిస్తారు. సూర్యోదయం అనంతరం పగలు పద్నాలుగు ఘడియలు- అంటే, అయిదు గంటలా ముప్ఫై ఆరు నిమి షాల తరవాత, సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో అభిజిల్లగ్నం 48 నిమిషాలపాటు ఉంటుంది. (వామనావతారం ఆ లగ్నంలోనిదే). ఆ లగ్నంలో భద్రాద్రిలో సీతారాముల కల్యా ణం జరుగుతుంది.
అలా కాకుండా, కల్యాణాన్ని ఒంటిమిట్టలో శుక్లపక్ష చతుర్దశి రాత్రి ఆరుబయట వెన్నెల్లో నిర్వహించడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. సూర్యవంశపు రాముడు- రామ‘సూర్యుడు’ కాకుండా రామ‘చంద్రుడు’ కావడంలోని రహస్యమే... ఆ కథలోనూ అంతర్భాగం అయింది.
బాల్యంనుంచి రాముడికి చంద్రుడంటే ఇష్టం. చందమామ కావాలని తల్లివద్ద మారాం చేయడం, అద్దంలో చంద్రుణ్ని చూపిస్తే ఆనంద పడటం తెలిసిన కథే!
వాల్మీకి మహర్షి రామాయణ రచన ఆరంభంలో 16 సత్పురుష లక్షణాల గురించి నారద మహర్షిని అడిగాడు. వాటిని ‘పరమేశ్వర కళలు’గా వర్ణిస్తారు. అవన్నీ కలిగి ఉండటం పూర్ణ పురుష లక్షణం. ఆ లక్షణాలన్నీ కలిగిన రాముడు ‘షోడశ కళాప్రపూర్ణుడు’ అని రామాయణం చెబుతోంది. మరోవైపు- పుష్టి, ధృతి, తుష్టి వంటి 16 కళలతో పున్నమి చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తుంటాడు కాబట్టి, పురాణాలు చంద్రుణ్ని ‘షోడశ కళాప్రపూర్ణుడు’ అన్నాయి. వారిద్దరికీ అదే సాపత్యం! పగలు జరిగే రాముడి పెళ్లి తాను చూడలేనందుకు చంద్రుడు బాధపడతాడు. అందువల్ల రాముడు రాత్రిపూట కల్యాణానికి అంగీకరించాడని- ఒంటిమిట్ట కోదండ రాముడికి చెందిన కథ ప్రచారంలో ఉంది.
‘లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక’ అన్నట్లు, వీటి నిజానిజాల సంగతి ఎలా ఉన్నా- భద్రాద్రి రాముడి పెళ్లి పగలు, ఒంటిమిట్ట రాముడి పెళ్లి రాత్రిపూట జరగడం గమనించాల్సిన అంశాలు. సీతారాముల కల్యాణం జరిగింది ఎప్పుడైనా, అది లోక కల్యాణం అన్నదే భక్తుల నిశ్చిత అభిప్రాయం!      
- ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం