MohanPublications Print Books Online store clik Here Devullu.com

వీరేశ్వరస్వామి!_Vereswara Swamy

పెళ్లిళ్ల దేవుడు వీరేశ్వరస్వామి!


పెళ్ళిళ్ళ దేవుడుగా ప్రాచుర్యం చెందిన ఆ స్వామికి కళ్యాణం జరిపిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరతాయన్న నమ్మకంతో భక్తులు అక్కడకు విశేషంగా తరలివస్తుంటారు... అదే వృద్ధ గౌతమీ తీరంలో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం... మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం.
కొబ్బరిచెట్ల సవ్వడులూ పచ్చని పంటపొలాలూ గోదావరీజలాల గలగలల మధ్య భద్రకాళీ సమేతంగా వెలసిన వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో అలరారుతుంటుంది. తూర్పుగోదావరి జిల్లా, మురమళ్లలో వెలసిన ఆ వీరేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలి వస్తుంటారు. ఆలయంలో కొలువైన స్వామికి కళ్యాణం జరిపిస్తే అవివాహితులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతీతి. దక్షిణ భారతదేశంలోనే మరెక్కడాలేని విధంగా ఈ ఆలయంలో స్వామికి నిత్యం వివాహ వేడుకని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించడం విశేషం. భక్తులంతా సంకల్పం చెప్పుకుని, తమ గోత్రనామాలతో ఆ వీరభద్రుడికి కళ్యాణం జరిపిస్తుంటారు. అందుకే ఆయన్ని పెళ్లిళ్ల దేవుడని పిలుస్తారు.
స్థల పురాణం!
దక్షయాగాన్ని భంగం చేసి, సతీదేవి పార్థివ దేహంతో తాండవం చేస్తూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తోన్న వీరభద్రుడి మహోగ్రాన్ని చల్లార్చేందుకు దేవతల కోరిక మేరకు ఆ జగజ్జనని భద్రకాళి పేరుతో అతిలోకసుందరిగా రూపుదాల్చుతుంది. ఆమెను చూడగానే స్వామి శాంతించి, వివాహం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరికీ గాంధర్వ పద్ధతిలో మునులంతా కలిసి వివాహం జరిపించారట. మునులు సంచరించే ప్రాంతాన్నే మునిమండలి అంటారు. ఆ మునిమండలి ప్రాంతమే కాలక్రమంలో మురమళ్లగా మారింది అనేది పురాణ కథనం. ఆరోజునుంచీ అక్కడ వెలసిన స్వామికి మునులంతా కలిసి గాంధర్వ పద్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు.
పూర్వం గౌతమీ నదికి వరదలు వచ్చినప్పుడు స్వామి ఆలయం మునిగిపోయిందట. అప్పుడు శివభక్తుడైన వేలవలి శరభరాజుకి స్వామి కలలో కనిపించి మునిమండలి ప్రాంతంలోని గోదావరిలో మునిగి ఉన్న తనను వెలికితీయాలని కోరడంతో, శివలింగాన్ని గడ్డపారతో తీసేందుకు ప్రయత్నించాడట. అయితే గడ్డపార దెబ్బకు శివలింగం నుంచి రక్తం రావడంతో, భయభ్రాంతులైన భక్తులు స్వామిని ధ్యానించగా శివలింగం నుంచి మాటలు వినిపించాయట. శివలింగాన్ని ఐ.పోలవరం సమీపంలోని బాణేశ్వరాలయానికి తీసుకువెళ్లాలనీ మధ్యలో అనుకూలంగా ఉన్నచోట ఆగిపోతానన్నది ఆ మాటల సారాంశం. అంతట భక్తులు జయజయ ధ్వానాలమధ్య శివలింగాన్ని తీసుకెళుతుండగా మురమళ్ల గ్రామంలోని ఓ ప్రదేశంలో శివలింగం భారీగా పెరగడంతో అదే స్వామి ఆజ్ఞగా భావించి అక్కడే దించి, ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడుగా లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు.
వివాహమహోత్సవం!
అనాదిగా వస్తోన్న ఈ వివాహ క్రతువు జరిగే తీరు భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంటుంది. బాజా భజంత్రీలూ మేళతాళాలతో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరపడం ద్వారా కళ్యాణ వేడుకను ప్రారంభిస్తారు. ఓ పక్క కొందరు అర్చకులు యక్షగానం ఆలపిస్తుంటారు. మరోపక్క స్మార్తాగమం ప్రకారం ఆలయ పురోహితులు స్వామివారి వివాహ వేడుకను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులన్నీ స్వామి కళ్యాణంలో కనిపిస్తాయి. అనంతరం స్వామివారినీ అమ్మవారినీ అద్దాల మండపానికి తోడ్కొని, పవళింపుసేవ చేయడంతో కళ్యాణమహోత్సవం ముగుస్తుంది. మూడుగంటల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవం భక్తులకు కన్నులపండగే. కళ్యాణం జరిపించే భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ఉదయంపూట అభిషేకం జరుపుతారు. రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు నెల రోజులు ముందుగానే నమోదు చేసుకుంటుంటారు.దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆలయంలో నిత్యాన్నదానం, వసతి గదులూ అందుబాటులో ఉన్నాయి. కాకినాడకు 36, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం.
- వై.నాయుడు, న్యూస్‌టుడే, ఐ.పోలవరం

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list