MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ కేతకిసంగమేశ్వరాలయం. _Ketaki Sangameswaralayam_

బ్రహ్మ అభిషేకం... కేతకి పూజ


కృతయుగంలో నిర్మించిన పురాతన ఆలయంగా పేరొందింది శ్రీ కేతకి సంగమేశ్వరాలయం. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగంలో వెలసిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జిల్లాలోని అతి పెద్ద ఆలయాల్లో ఒకటి. కృతయుగంలో సూర్యవంశపు రాజు కుపేంద్రభూపాలుడు నిర్మించిన ఆలయం, అమృత గుండం ఇక్కడ ఉన్నాయి. మొగలివనంలో వెలసిన పార్వతీ సమేత కేతకి సంగమేశ్వరుడిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.
దక్షిణ కాశీగా భక్తులు పిలుచుకునే శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయ చరిత్ర స్కంద పురాణంలో ఉందని పండితులు చెబుతారు. సకల ప్రపంచ సృష్టిని పూర్తిచేసిన బ్రహ్మ కేతకి (మొగలి) వనంలో సేదతీరుతూ పరమేశ్వరుడిని ధ్యానించగా.. బాణలింగాకారంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కమండలంలోని జలంతో లింగాన్ని అభిషేకించారు. అనంతరం ఆయన కోరిక మేరకు శివుడు లింగాకారంలో అక్కడే వెలిశాడు. కేతకి అనే అప్సర శాపవిమోచనానికి అక్కడ వెలసిన బాణలింగాకారుడైన పరమశివుడిని కేతకి పుష్పాలతో పూజించింది. అందుకే ఇక్కడ స్వామివారికి శ్రీ కేతకి సంగమేశ్వరుడిగా స్థిరనామం ఏర్పడింది. సాధారణంగా కేతకి పుష్పాలను పూజకు వినియోగించరు.
అమృత గుండం-అష్టతీర్థాలు
పూర్వం ఈ స్థలంలో మహాపురుషులు యజ్ఞం చేసినట్లు కూడా పండితులు చెబుతారు. కృతయుగానికి చెందిన సూర్యవంశపు రాజు శ్రీ కుపేంద్రభూపాలుడిని భయంకరమైన చర్మవాధి పీడించేది. దానినుంచి విముక్తుడవడానికి దేశంలోని అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించాడు రాజు. అయినా ఫలితం లేకపోయింది. ఆ రాజు ఒకరోజు కేతకి వనానికి వేటకోసం వచ్చి ఒక లేడిని చూసి తరుముతూ ఈ ప్రదేశానికి వచ్చినట్లు పురాణకథ. దాహం వేసి నీటికై వెదుకుతున్న రాజుకు ఝరాగుండం కనిపించింది. రాజు అందులోని నీరు తాగి స్నానంచేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికెళ్లగానే భార్య చంద్రకళ రోగవిముక్తుడైన భర్తను చూసి ఆశ్చర్యంతో ఏం జరిగిందని ప్రశ్నించింది. రాజు తన వేట వృత్తాంతం భార్యకి వివరించాడు. ఝరాగుండంలో నీరు తాగి, స్నానం చేసినందువల్లే తనకు స్వస్థత చేకూరినట్లు తెలుసుకున్న రాజు ఆ గుండం వద్ద బాణలింగ రూపుడైన శివునికి ఆలయం నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ గుండానికి అమృత గుండమని పేరు. అష్ట తీర్థాలుగా పేర్కొనే నారాయణ, ధర్మ, బుషి, వరుణ, సోమ, చంద్ర, దత్త, యమజలాలు ఇందులో కొలువైనట్లు భక్తులు నమ్ముతారు. గుండం ఖాళీ చేయించి అందలి బుషి తీర్ధం నందు పంచభక్ష్య పరమాన్నాలతో నైవేద్యం పెట్టినా అది వెనక్కి రాకుండా లోనికి వెళ్లిపోయి కొన్ని గంటలకే మళ్లీ గుండం పూర్తిగా నీటితో నిండిపోతుంది.
ప్రత్యేక రోజుల్లో...
ప్రతి ఆది, సోమవారాలతోపాటు ఉగాది, దసరా, మహాశివరాత్రి పండగలప్పుడూ కార్తీక, శ్రావణమాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాలు, అర్చనలు, కుంకుమపూజలు చేస్తారు. గత ముప్పై ఏళ్లుగా ఆలయ మంటపంలో వినాయక చవితి, విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలలో చాలా మంది భక్తులు సంగమేశ్వరుడిని ఇంటి దైవంగా కొలుస్తారు. వారు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. శివరాత్రి సమయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, అగ్ని గుండం, పల్లకి సేవ, ఉత్సవ విగ్రహాలతో రథం వూరేగింపు కనువిందుగా జరుగుతాయి. వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఆయా రోజుల్లో కొంతమంది భక్తులు పూనుకుని అన్నదానం చేస్తారు. భక్తుల విరాళాలతో వంద గదుల సత్రాల నిర్మాణం, ప్రధాన గుడికి తలుపులు, శివలింగానికి వెండి తొడుగులు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లే 65వ నెంబరు జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి 17కి.మీ. దూరాన ఉన్న ఝరాసంగంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.


- సుధాకర్‌, న్యూస్‌టుడే, ఝరాసంగం


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం