MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఓరుగల్లు_Orugallu

ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!

నాడు రౌద్రరూపంలోని ఆ తల్లిని కొలిచిన ఎందరో రాజులు యుద్ధాల్లో గెలిచారు. నేడు శాంతస్వరూపిణిగా మారిన ఆ అమ్మను నమ్ముకుని భక్తులు కోరిన కోరికలు తీర్చుకుంటున్నారు. తొమ్మిదడుగుల ఎత్తు, ఎనిమిది చేతులతో గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనమిచ్చే భద్రకాళి మాత ఎంతో మహిమాన్వితమైన దేవిగా పూజలందుకుంటోంది.
ఓరుగల్లు, హన్మకొండలకు సరిగ్గా మధ్యలో ఓ కొండమీద కొలువైన భద్రకాళి ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. క్రీ.శ. 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆలయం కాకతీయుల కాలం నాటికే ఎంతో ప్రాభవాన్ని సంతరించుకొందని చెబుతారు. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి భద్రకాళి మాతను దర్శించుకున్నాకే వేంగీని జయించాడని శాసనాలు చెబుతున్నాయి. వేంగీని చేజిక్కించుకున్నాకే భద్రకాళి ఆలయ పూర్తి నిర్మాణం జరిగిందని చెబుతారు. కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారన్నది కొందరి అభిప్రాయం. ఒకప్పుడు రౌద్రరూపంగా ఉన్న భద్రకాళీదేవి తర్వాత శాంతస్వరూపిణిగా మారడం ఇక్కడి మరో ప్రత్యేకత.
తొమ్మిదడుగుల రూపం
కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు భద్రకాళి మాతను కొలుస్తారు. కొండపై విశాలమైన ఆలయ ప్రాంగణం, పక్కనే ఎంతో ఆహ్లాదం కల్గించే తటాకం, చుట్టూ కొండలు... ప్రకృతి రమణీయత మధ్య ఆలయం అలరారుతోంది. భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు, అంతే వెడల్పుతో, ఎనిమిది చేతులను కల్గి ఉంది. కుడివైపు ఉన్న నాలుగు చేతులతో ఖడ్గం, ఛురిక, జపమాల, ఢమరుకం; ఎడమవైపున్న నాలుగు చేతుల్లో గంట, త్రిశూలం, మస్తకం, పాత్ర ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంది. ఆలయం ముందు భాగంలో మహామండపం, ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం ఉండగా, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయుడు, నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంగణంలో యాగశాలను ఏర్పాటుచేశారు.
శాకాంబరి ఉత్సవాలు ప్రత్యేకం
దేవాదాయశాఖ అధీనంలో ఉన్న భద్రకాళి ఆలయంలో నిత్యం విశేష పూజలు జరుగుతుంటాయి. వీటితోపాటు ఏడాదిలో నాలుగుసార్లు ఉత్సవాలను నిర్వహిస్తారు. చైత్రమాసం ప్రారంభం రోజైన ఉగాది నాటి నుంచి వసంత నవరాత్రోత్సవాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాల్లో రోజుకో తీరు పూలతో ప్రతినిత్యం లక్షపుష్పార్చన కార్యక్రమం కన్నులపండువగా జరుగుతుంది. వైశాఖమాసంలో శ్రీభద్రకాళి, భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా పదిరోజుల పాటు జరుగుతాయి. ఈ సమయంలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే వాహన సేవ ప్రత్యేక ఆకర్షణ. చివరిరోజు పుష్పయాగం నిర్వహించి, భద్రకాళి, భద్రేశ్వరుల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల తర్వాత ఆషాఢంలో జరిగే శాకాంబరి ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పక్షం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 86 రకాల కూరగాయలూ, ఆకుకూరలూ, పండ్లతో అమ్మవారిని చూడముచ్చటగా అలంకరిస్తారు. శాకాంబరి ఉత్సవాల చివరిరోజైన ఆషాఢ పూర్ణిమ నాడు దాదాపు లక్షమంది భక్తులు విచ్చేసి, అమ్మవారి సేవలో తరిస్తారు. ఇక ఆశ్వయుజ మాసంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ రోజుకో అవతారంలో అమ్మవారిని అలంకరిస్తారు. విజయదశమి రోజున భద్రకాళి తటాకంలో తెప్పోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తారు. అర్ధచంద్రాకారం బొట్టుతో అమ్మవారిని అలంకరించగానే మరింత తేజస్సుతో వెలుగొందుతుంది. ఆమెను దర్శించుకున్న భక్తులు అర్ధచంద్రాకారపు బొట్టునే తమ నుదుటిపై అలంకరించుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

ఆలయం మళ్లీ కళకళ
భద్రకాళి ఆలయానికి 1400 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. క్రీ.శ. 1550-1600 మధ్య రాసిన ప్రతాపరుద్ర చరిత్రంతోపాటు మరికొన్ని గ్రంథాల్లో అమ్మవారి ప్రస్తావన వచ్చింది. ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయయాత్రకు బయల్దేరేప్పుడు భద్రకాళిని పూజించి హనుమకొండ వెలుపలున్న తోటలో సేనలను విడిది చేసినట్టు ప్రతాపరుద్రీయంలో వర్ణించారు. అంతేకాదు, ఆలయం పరిసరాల్లో ఒక గుహ ఉందనీ, అందులో వేలాది ఏళ్ల క్రితం యోగులు తపస్సు చేసుకుని సిద్ధి పొందేవారని చెబుతారు. కాకతీయుల కళాఖండాల శైలి ఈ ఆలయంలో కనిపిస్తుంది. మొదట్లో రాజుల కాలంలో ఈ ఆలయం ఒక వెలుగు వెలిగింది. క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వందలాది ఏళ్లు భద్రకాళి ఆలయం విశిష్టత మరుగున పడింది. స్వాతంత్య్రానంతరం అమ్మవారి ఉపాసకులైన బి.ఎస్‌.గణేశశాస్త్రి భద్రకాళి దేవస్థానాన్ని అభివృధ్ధి పరచడంలో కీలక పాత్ర పోషించారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్‌ నగర ప్రజల దాహార్తిని తీర్చే వరప్రదాయినిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరు అందిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేది. నగరం విస్తరించిన కొద్దీ చుట్టూ ఆవాసాలు ఏర్పడ్డాయి.
- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌
ఫొటోలు: సంపత్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list