MohanPublications Print Books Online store clik Here Devullu.com

బ్రహ్మాండనాయకుని కొలువు!_Tirumala Tirupathi Devastanam

బ్రహ్మాండనాయకుని కొలువు!


ఏడుకొండలవాణ్ణి ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఆ నామం ఎన్నిసార్లు పలికినా ఇంకా ఇంకా పలకాలనే అనిపిస్తుంది. శ్రీనివాసుడి మహత్యమే అది. మొక్కించుకోవడంలో కాదు మొక్కులు తీర్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తిరుమల కొండకు చీమల దండులా సాగే భక్తులే అందుకు నడిచే సాక్ష్యాలు!
బ్రహ్మకడిగిన బంగారు పాదం... ఆయనది. అందరికీ అభయమ్మునిచ్చే చల్లని చేయీ... ఆయనదే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే కనిపిస్తాడా బ్రహ్మాండనాయకుడు. సాక్షాత్‌ మహావిష్ణు స్వరూపంగా, కలియుగంలో భక్తుల కడగండ్లు తీర్చేస్వామిగా, వేంకటాద్రి మీద కొలువైన దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. అన్నమాచార్యుల వారు కీర్తించి తరించిన ఆ ప్రాంతమంతా పరమపవిత్రం. నిత్యం గోవింద నామాలు ప్రతిధ్వనించే ఆ చోటు ఇల వైకుంఠం.
స్థల పురాణం...
తిరుమల క్షేత్ర ప్రశస్తి వరాహ, బ్రహ్మాండ, భవిష్యోత్తర... ఇలా వివిధ పురాణాల్లో కనిపిస్తుంది. శ్రీ వేంకటాచల మహత్యం ప్రకారం... గోపీనాథ దీక్షితులు అనే వైఖానస అర్చకుడూ, రంగనాథుడు అనే బాలుడూ కలిసి స్వామి పుష్కరిణి సమీపంలో, చీమల పుట్టలో శ్రీవారి విగ్రహాన్ని గుర్తించారట. అక్కడే స్వామిని ప్రతిష్ఠించి, చిన్న ఆలయాన్ని నిర్మించి అర్చన చేశారట. ఇప్పటికీ గోపీనాథుడి వంశస్తులే స్వామి సన్నిధిలో అర్చకత్వం చేస్తున్నారు. రంగనాథుడు తర్వాతి జన్మలో తొండమాన్‌ చక్రవర్తిగా పుట్టాడంటారు. ఇక, స్వామిని దర్శించుకునే వాళ్లు ముందుగా వరాహమూర్తిని దర్శించుకోవాలన్నది పురాణవాక్కు. తిరుమల ఆలయం ప్రాంగణంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. మహాద్వారం లోపలికి ప్రవేశించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయం మూలన శ్రీవరదరాజస్వామి ఆలయం ఉంది. ఇక్కడి యోగనారసింహాలయం కూడా అతి పురాతనమైనది. వకుళాదేవితో పాటూ స్వామిని పూజించిన భాష్యకార్లూ ఆలయ ప్రాంగణంలో కొలువయ్యారు. బంగారు వాకిలి ఎదురుగా గరుడాళ్వార్‌ సన్నిధి ఉంటుంది. ఆనంద నిలయం గోపురంపైన ఉండే విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం విశేషం. ఏవైనా కారణాల వల్ల గర్భగుడిలోని స్వామిని దర్శించుకోలేని వాళ్లు ఈయన్ను దర్శించుకున్నా చాలట.


గర్భగుడిలో ఐదు మూర్తులు...
కొండంత దేవుడన్న పేరు కొండల్లో నెలకొన్న కోనేటి రాయడికి చక్కగా సరిపోతుంది. ఆనంద నిలయంలో వెలసిన మూలవిరాట్టు ఎత్తు ఎనిమిదడుగులకు పైనే మరి! ఓ పక్క వరదహస్తం మరో పక్క కటిహస్తంతో నిశ్చలంగా కనిపిస్తుందా దివ్య మంగళమూర్తి. ఈయన్ను పల్లవ, చోళ, విజయనగర తదితర ఎన్నో రాజ వంశాలకు చెందిన సామ్రాజ్యాధీశులు పూజించారు. ఈ ఆలయ నిర్మాణమూ క్రీ.పూ.12వ శతాబ్దానిదట. తిరుమల కొండల్లో వెలసిన శ్రీనివాసుడిని స్వయంభూగా చెబుతారు. గర్భగుడిగా పిలిచే ఆ గదిలోపల స్వామితో పాటు మరో నాలుగు మూర్తులు ఉంటాయి. కౌతుకబేరం, బలిబేరం, స్నపనబేరం, ఉత్సవబేరంగా పిలుస్తారా విగ్రహాలను. పల్లవ యువరాణి సామవై చేయించిన వెండి శ్రీనివాసుడిని కౌతుకబేరంగా పిలుస్తారు. ఈయన్నే భోగశ్రీనివాసుడిగా పిలుస్తారు. రోజువారీ దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంతసేవ వగైరాలన్నీ ఈ భోగశ్రీనివాసుడికే. ఇక, బలిబేరంగా పిలిచే స్వామిని కొలువు శ్రీనివాసుడు అంటారు. ఈయనను రోజూ ఆస్థాన మండపంలోకి తీసుకువచ్చి పంచాంగ శ్రవణం జరిపిస్తారు. ముందురోజు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కలు చెప్పి అప్పగిస్తారు. 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా వ్యవహరించిన ఉగ్ర శ్రీనివాసుడిని ‘స్నపనబేరం’ అంటారు. ఒకసారి వూరేగింపు సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఈయనకా పేరు వచ్చింది. ఏడాదికొకసారి సూర్యోదయానికి ముందు ఈ విగ్రహాన్ని సర్వాలంకారాలతో వూరేగింపునకు తీసుకువెళ్లి మళ్లీ అంతరాలయంలోకి తీసుకువస్తారు. ఉగ్రశ్రీనివాసుడిని బయట వూరేగింపులకు తీసుకువెళ్లడం మానేసినప్పటి నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఉత్సవ సేవలు చేస్తున్నారు. మూడడుగుల ఎత్తుండే ఈ విగ్రహాన్నే మనం బ్రహ్మోత్సవాల సమయంలో దర్శిస్తాం. ఇక, ఏటా స్వామిని దర్శించుకునేవారి సంఖ్య రెండున్నర కోట్లకు పైనే. ఇలా భక్తజనం పోటెత్తడంతో స్వామికి కునుకే బంగారమవుతోంది. ఏకాంతసేవ తర్వాత ఆలయాన్ని మూసి ఉంచేది నిండా రెండు గంటలే మరి!


నిత్యకళ్యాణం...
నిత్యకళ్యాణం పచ్చతోరణం అనే పదం అచ్చంగా సరిపోతుంది తిరుమల విషయంలో. వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుపుతారు. ఉదయం సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంతసేవ వరకూ ఎన్నో విశేష సేవలు నిర్వహిస్తారు. అందులో సుప్రభాత సేవ, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవల్లాంటి వాటిలో నియమిత రుసుము చెల్లించి భక్తులు పాలుపంచుకోవచ్చు. భవిష్యోత్తర పురాణం ప్రకారం స్వామి బ్రహ్మోత్సవాలను మొట్టమొదట సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలు పెట్టాడు. ఇక్కడ ఏటా సాధారణ బ్రహ్మోత్సవాలతో పాటు మూడేళ్లకోసారి అధికమాసంలోనూ బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఇక, తిరుమలలో స్వామి ప్రసాదంగా ఇచ్చే లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాని రుచికి ప్రపంచ వ్యాప్తంగా పేరు. ఈ లడ్డూకు తితిదే పేటెంట్‌ హక్కులను కూడా సాధించుకుంది.
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి.... అన్నది పురాణవాక్కు. ఒక్కసారి ఏడుకొండలెక్కి శ్రీనివాసుడ్ని దర్శించుకున్న వాళ్లెవరైనా ఈ మాట నిజమనక పోరూ... స్వామిని పునర్దర్శన ప్రాప్తినివ్వమని వేడుకోకా పోరు!
- గడ్డం వసంతనాయుడు న్యూస్‌టుడే, తిరుమల

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం