రఘురాముడు నడయాడిన పుణ్యభూమి ఏకశిలానగరి. దాశరథి పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రదేశం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడి కోదండపాణి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమికి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ సీతారాముల కల్యాణం నిర్వహిస్తోంది.
స్థల పురాణం...
జాంబవంతుడు త్రేతాయుగంలో ఒంటిమిట్టలోని శృంగిశైలంపైన ఆశ్రమం ఏర్పాటుచేసుకొని ఓ శిలలో సీతారాములను దర్శించుకుంటూ, వందేళ్లకుపైగా తపస్సు చేశాడని పురాణాలద్వారా తెలుస్తోంది. వనవాస సమయంలో రాముడు ఈ ప్రాంతంలో సంచరించి ఒంటిమిట్టకు సమీపంలో తపస్సు చేసుకుంటున్న మృకుండమహర్షికి రాక్షసుల బాధను తొలగించాడని చెబుతారు. వనవాస సమయంలో సీతమ్మకు దప్పిక అయినప్పుడు రాముడు భూమిలోకి బాణం చొప్పించాడనీ, దాంతో పాతాళం నుంచి జలం ఉబికిందనీ, ఆ నీటి బుగ్గే ప్రస్తుతం ఆలయ సమీపానున్న రామతీర్థం అని చెబుతారు. ఒంటిమిట్ట కోవెలలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు ఏకశిలపై కన్పిస్తాయి. అందుకే దీనికి ఏకశిలానగరం అని కూడా పేరు.
ఆలయ అభివృద్ధి
క్రీ.శ. 1336లో విజయనగర సామాజ్య్రాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. క్రీ.శ 1345 ప్రాంతంలో వీరి సోదరుడు కంపరాయలు ఉదయగిరి ప్రాంతానికి పాలకుడుగా వచ్చాడు. ఒకసారి ఒంటిమిట్టలో పర్యటించినపుడు స్థానిక బోయ నాయకులు ఒంటడు, మిట్టడు రాజుకు సదుపాయాలు కల్పించారు. వారి విన్నపం మేరకు క్రీ.శ 1355 నాటికి గుడినీ, చెరువునీ అభివృద్ధిచేశాడు. అదే సమయానికి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. కాశీ నుంచి తమ గురువు విద్యారణ్య మహర్షిని వెంట తీసుకుని రామేశ్వరం బయలుదేరాడు. గోదావరి తీరంలోని ఇసుకపల్లి నుంచి నాలుగు విగ్రహాలు తీసుకున్నాడు. మూడు విగ్రహాలను గండికోట, పామిడి, గుత్తిలకు చేర్చి సీతాలక్ష్మణులతో శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఏకశిలామూర్తిని ఒంటిమిట్టలో నిలిపాడు. అక్కడ విద్యారణ్య మహర్షి ఆధ్వర్యంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలనూ, బ్రహ్మోత్సవాలనూ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఒంటిమిట్ట గుడిలో చైత్ర మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల వివాహం జరుగుతూ వస్తోంది. తొలిసారి ఆ ముహూర్తం రాత్రి పూట వచ్చింది. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ రాములవారి కల్యాణం రాత్రిపూట జరుగుతోంది. క్రీ.శ.1600 నుంచి ఆలయం అభివృద్ధి చెందింది. మట్లి ఎల్లమరాజు కుమారుడు అనంతరాజు, ఆయన వారసులూ ఆలయాన్ని ఘనంగా అభివృద్ధి చేశారు.
- ఎ.సుబ్బారెడ్డి, న్యూస్‌టుడే, ఒంటిమిట్ట
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565