MohanPublications Print Books Online store clik Here Devullu.com

కర్మన్‌ఘాట్‌ ధ్యానాంజనేయుడు!_Karmanghat Dhyanaojaneyadu

కర్మన్‌ఘాట్‌ ధ్యానాంజనేయుడు!

భాగ్యనగరంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో శ్రీ ధ్యానాంజనేయస్వామి దేవాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఆంజనేయస్వామి ధ్యానాంజనేయునిగా నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయానికి ఔరంగజేబు వల్ల కర్మన్‌ఘాట్‌ ఆంజనేయుడన్న పేరొచ్చిందంటారు.
క్రీ.శ్ర.1143 ప్రాంతంలో రాజు ప్రతాపరుద్రుడు సైన్యంతో వేట కోసం లక్షీగూడెం గ్రామం(ఇప్పటి కర్మన్‌ఘాట్‌) మీదుగా అడవిలోకి వెళ్లాడు. రోజంతా వేటాడి అలసిసొలసి ఓ చెట్టు కింద విశ్రమించిన ఆయనకు పులి అరుపు వినిపించింది. వెంటనే దాన్ని వేటాడడానికి రాజు అరుపు విన్పించినవైపు వెళ్లాడు. ఎంత దూరం వెళ్లినా అరుపు విన్పిస్తోందే తప్ప పులి కనిపించలేదు. దాంతో అలసిన రాజు ఓచోట నిలిచి నిశితంగా పరిసరాలను గమనించాడు. ఓ చెట్ల గుబురులో నుంచి ఆయనకు రామనామం వినిపించింది. దట్టమైన అడవిలో దైవధ్యానం చేస్తున్నదెవరా అని ఆశ్చర్యపోయిన రాజు నెమ్మదిగా గుబురు తొలగించి చూశాడు. అక్కడ పద్మాసనంలో ధ్యానముద్రలో దివ్యతేజో ప్రభలతో వెలుగొందుతున్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి ప్రతిమ కనిపించింది. అది చూసి విచలితుడైన రాజు శ్రీ ధ్యానాంజనేయ ప్రతిమ కనిపించిన స్థలంలోనే స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. ప్రతాపరుద్రుని తరువాత ఇతర రాజులు స్వామివారికి ఇష్టదైవాలైన గణపతి, శ్రీరామ, శివ, వేణుగోపాల, జగన్నాథ, అమ్మవారి ఆలయాలను నిర్మించారు. శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంతోపాటు మిగిలిన ఆలయాల్లో పూజలు, నిర్వహణకు దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న 16 ఎకరాల భూమిని కేటాయించారు.
కర్మన్‌ఘాట్‌ పేరిలా...
కర్మన్‌ఘాట్‌ గ్రామం అసలు పేరు లక్ష్మీగూడెం. మొఘలుల పాలనలో ఔరంగజేబు సామ్రాజ్య విస్తరణకు నలుదిశలా సైన్యాన్ని పంపాడు. అలా హైదరాబాద్‌ చేరుకున్న ఓ సైన్య బృందం దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించగా ప్రహరీ గోడను కూడా తాకలేకపోయిందట. వారు తిరిగి వెళ్లి విషయం చెప్పగా ఆశ్చర్యపోయిన ఔరంగజేబు తానే స్వయంగా ఆలయం ధ్వంసం చేయడానికి పలుగు పట్టుకుని సింహద్వారం వద్దకు చేరుకున్నాడు. ఇంతలోనే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వినిపించింది. ఆకాశవాణి ఇలా హెచ్చరించింది ‘హే రాజన్‌ ... మందిర్‌ తోడ్‌నా హై తో పహలె తుమ్‌ కరో మన్‌ ఘట్‌’ (ఓ రాజా! నా ఆలయం ధ్వంసం చేయాలనుకుంటే ముందు నువ్వు గుండె ధైర్యం తెచ్చుకో). ఆ మాటలు విన్న ఔరంగజేబు ‘హే భగవాన్‌ నీలో సత్యముంటే అది నాకు చూపించు’ అని స్వామిని కోరాడనీ తాటిచెట్టు ప్రమాణంలో మెరుపులాగా స్వామి కనిపించాడనీ చరిత్ర చెబుతోంది. కర్‌ మన్‌ ఘట్‌ అన్న మాటే కాలక్రమంలో ‘కర్మన్‌ఘాట్‌’గా మారిందని స్థానికుల అభిప్రాయం.
ఏడంతస్తుల గోపురం
ఇటీవలే కోటి రూపాయలు వెచ్చించి ఆలయంలో ఏడంతస్తుల గోపురాన్ని నిర్మించారు. ప్రధాన ద్వారం దాటాక ఆలయం ముందు భాగంలో ఈ గోపురం నిర్మించారు. గోపుర నిర్మాణంతో ఆలయానికి మరింత అందం వచ్చింది. దేవాలయం వెలిసిన నాటి నుంచి ఆలయంలో పూజలతో పాటు భక్తులకు అన్నప్రసాదం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత పదేళ్లుగా శని, మంగళవారాల్లో భక్తులకు అన్నదానం చేస్తున్నారు. భక్తుల నుంచి విరాళాలుగా సేకరించిన కోటి రూపాయల నిధిని ఇందుకు వినియోగిస్తున్నారు.
సినిమా షూటింగులూ...
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాగర్‌రింగ్‌ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతుంటుంది. నగరంలో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఛాత్‌ తదితర పండగలు జరుపుకోవడానికి కూడా ఈ ఆలయాన్ని వేదికగా చేసుకుంటున్నారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన గుండం భక్తుల స్నానాలకు అనువుగా ఉంటుంది. వందల ఏళ్ల చరిత్రగలిగిన కర్మన్‌ఘాట్‌ శ్రీధ్యానాంజనేయ ఆలయాన్ని ప్రతినిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటారు. శని, మంగళ వారాల్లో ఆ సంఖ్య రెట్టింపవుతుంది. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిగంటల వరకూ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.
- ఎం.శ్రీనివాస్‌, న్యూస్‌టుడే, కర్మన్‌ఘాట్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list