MohanPublications Print Books Online store clik Here Devullu.com

మనసును మంచి భావాలతోనే నింపుకోవాలి-Mind, Spiritually, Ignorance, మనసు, ఆత్మీయం, అజ్ఞానం


మనసును మంచి భావాలతోనే నింపుకోవాలి
ఆత్మీయం
మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ఒక్క హిందూమతంలోనే ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి.
ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్‌ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు.
అద్భుతమైన పండు ఆలు–బుఖారా!
గుడ్‌ ఫుడ్‌
హిందీలో ఆల్‌–బుఖారా అని... కొన్ని తెలుగు ప్రాంతాల్లో ఆలు–బుఖారా లేదా ఆల్‌–పగోడా అని పిలిచే ఈ పండు వల్ల ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆల్‌–బుఖారాలను డ్రైఫ్రూట్స్‌గానూ వాడుతారు. అలా ఎండిన ఫలాన్ని ఇంగ్లిష్‌లో ప్రూన్‌ అంటారు. ఒకింత పులుపుతో కూడిన తీపితో తినడానికీ, చూడటానికీ చాలా ఆకర్షణీయంగా అనిపించే దీనితో ఆరోగ్యానికి అన్నీ లాభాలే. వాటిలో కొన్ని ఇవి...
ఆల్‌–బుఖారాలో ఫ్రీ–రాడికల్స్‌ను అరికట్టే గుణం ఉంది. ఈ పండు నుంచి లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్‌తో అది ఎన్నో రకాల క్యాన్సర్లను అరికడుతుంది. ఈ పండును ఆకర్షణీయంగా కనిపించేలా చేసే ఎరుపు రంగు పిగ్మెంటే ఫ్రీ–రాడికిల్స్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా క్యాన్సర్లను అరికడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, జీర్ణవ్యవస్థలో వచ్చే క్యాన్సర్లు, శ్వాస వ్యవస్థకు వచ్చే క్యాన్సర్లు (రెస్పిరేటరీ క్యాన్సర్లు), నోటి క్యాన్సర్లను నివారిస్తుంది. దీనిలో లభ్యమయ్యే సార్బిటాల్, ఐసాటిన్‌ వంటి జీవరసాయనాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆల్‌–బుఖారాలో విటమిన్‌–సి పాళ్లు చాలా ఎక్కువ. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల స్వాభావికమైన రోగ నిరోధక శక్తి సమకూరుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. హృద్రోగాలు ఉన్నవారికి, డయాబెటిస్‌ రోగులకు మేలు చేస్తుంది. ఆల్‌–బుఖారా ఒక స్వాభావిక విరేచనకారి. మలబద్దకం సమస్యను నివారిస్తుంది. మలవిసర్జన అలవాట్లను క్రమబద్దీకరిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపును దెబ్బతీసే ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌ను నివారిస్తుంది. ఇందులో విటమిన్‌–ఏ పాళ్లు కూడా ఎక్కువే. దాంతో కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ఆల్‌–బుఖారాలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అలాగే ఇందులో విటమిన్‌–సి కూడా ఉండటం వల్ల ఆ ఐరస్‌ వెంటనే ఒంటికి పడుతుంది. ఫలితంగా రక్తహీనత (అనీమియా) వంటి జబ్బులు వెంటనే తగ్గుతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా ఈ పండు దోహదపడుతుంది. ఆస్తమాను నివారిస్తుంది.

ఆరోగ్యవంతమయిన చర్మం కోసం...
బ్యూటిప్స్‌
అర కప్పు పెసరపిండిలో టేబుల్‌ స్పూన్‌ పెరుగు, పేస్ట్‌ చేయడానికి సరిపడా నీటిని కలపాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని అయిదు పది నిమిషాల పాటు మర్దనా చేసి, ఆ తరవాత చన్నీటితో కడిగేయాలి.రెండు టీ స్పూన్ల శనగపిండిలో సరిపడా తేనె కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్‌ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్‌ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే కాంతివంతమయిన చర్మం మీ సొంతం అవుతుంది.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list