MohanPublications Print Books Online store clik Here Devullu.com

అపోహలు వీడితేనే.. విశ్రాంతంలో భరోసా!-Apohalu veeditaenae.. visraamtamio bharosaa!

అపోహలు వీడితేనే.. విశ్రాంతంలో భరోసా!
మలి జీవితం ప్రశాంతంగా సాగాలి.. చాలామంది ఆలోచన ఇదే. మరి, దాన్ని సాధించే దిశలో మన ప్రయత్న లోపం ఉండకూడదు. సంపాదన ప్రారంభమైన రోజు నుంచే... ఉద్యోగ విరమణ తర్వాత పరిస్థితుల గురించీ అంచనాలుండాలి. కానీ, కొంతమంది కొన్ని అపోహలతో పదవీ విరమణ ప్రణాళికలకు దూరంగా ఉంటుంటారు. సాధారణంగా ఉండే అనుమానాలేమిటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాలను వివరిస్తున్నారు... పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్‌ హేమంత్‌ జి. కాంట్రాక్టర్‌. మరి, ఆయన ఏం చెబుతున్నారో చూద్దామా!
* నా వయసు కేవలం 20ఏళ్లే. ఇప్పటి నుంచే నేను పదవీ విరమణ గురించి ఆలోచించి, అందుకోసం పెట్టుబడులు పెట్టాలా? 
చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరిన చాలామందికి ఓ అపోహ ఉంటుంది. ఇప్పటి నుంచే నేను పొదుపు, మదుపు చేయాలా? కొన్నాళ్ల తర్వాత చూద్దాం కదా! అనుకుంటుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడులను ఒక్క ఏడాది వాయిదా వేసినా.. పదవీ విరమణ కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్న నిధిపై ఆ ప్రభావం ఉంటుంది. ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎంత చిన్న వయసు నుంచి పెట్టుబడులు ప్రారంభిస్తే.. మీ దగ్గర సంపద అంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అప్పుడే పెద్ద మొత్తంలో నిధి మీ దగ్గర సమకూరుతుంది. కాబట్టి, వీలైనంత తొందరగా పెట్టుబడులు ప్రారంభించడమే ఎప్పుడూ సరైనది.
* కొంత మిగులు కనిపించేదాకా నేను పెట్టుబడులను వాయిదా వేయాలనుకుంటున్నాను! దానివల్ల ఏమిటి ఇబ్బంది? 
‘ఇప్పుడు డబ్బుకు కొంచెం కష్టంగా ఉంది. మరో ఇంక్రిమెంట్‌ లేదా బోనస్‌ వచ్చిన తర్వాత పెట్టుబడులు ప్రారంభిస్తాను. అప్పుడైతే నాకు డబ్బు సర్దుబాటు తేలికగా ఉంటుంది!’ చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ, వాస్తవంలో ఇది ఎప్పటికీ జరగదు. మరింత ఆదాయం, మరో ఇంక్రిమెంట్‌, బోనస్‌ ఇలా ఏవి వస్తున్నా.. అవన్నీ మీ మిగులులోకి ఎప్పటికీ రావు. వాటితో మీరు ప్రారంభించాలనుకుంటున్న పొదుపు సాధ్యం కాదనే చెప్పాలి. 
మరి ఏం చేయాలి? సంపాదన నుంచి చిన్న చిన్న మొత్తాలనైనా పొదుపు, పెట్టుబడుల వైపు మళ్లించాలి. నెలవారీ ఆదాయంలో కనీసం 5శాతం నుంచి పొదుపు ప్రారంభించాలి. ఇది ఒక అలవాటుగా మారిన తర్వాత అంచెలంచెలుగా దీన్ని 10%, 15%, 20%, 25% ఇలా సాధ్యమైనంత మేరకు పెంచుకుంటూ వెళ్లాలి.
* ఉద్యోగ విరమణ తర్వాత నాకు పింఛను వస్తుంది. ఇది అప్పటి అవసరాలకు సరిపోతుంది కదా! 
నిజమే. కొన్ని కంపెనీలు, ఉద్యోగ సంస్థలు పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు కొంత పింఛను సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. సరే.. అయితే, ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న? మీ పదవీ విరమణ తర్వాత వచ్చే ఆ పింఛను మొత్తం మీ అవసరాలకు సరిపోతుందా? చాలా నివేదికలు ఏం చెబుతున్నాయో తెలుసా? చాలామంది పదవీ విరమణ తర్వాత కూడా పనిచేస్తూ ఆర్జిస్తున్నారని. ఇది ఏదో కాలక్షేపం కోసం కాదు. ఆర్థిక పరిస్థితులు వారిని అలా పనిచేయకుండా ఉండలేని స్థితిని కల్పిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుంటే చాలు.. మనం ఎందుకు పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం మదుపు చేయాలో సులభంగా తెలుస్తుంది.
* పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం పెట్టుబడి పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుందా? 
ఇది మరో అపోహ. చిన్న చిన్న చినుకులే ప్రవాహాన్ని సృష్టిస్తాయి అనే నానుడి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. పదవీ విరమణ కోసం అవసరమయ్యే నిధిని సమకూర్చుకునేందుకు చిన్న చిన్న మొత్తాలతోనూ పెట్టుబడులు ప్రారంభించవచ్చు. చేయాల్సిందల్లా క్రమం తప్పకుండా.. క్రమశిక్షణతో దీర్ఘకాలం అంటే... 20-25ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాలి. కాలం గడుస్తున్న కొద్దీ మీ స్వల్ప మొత్తాలు సాధించే ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
* పదవీ విరమణ తర్వాత 10-15ఏళ్ల వరకూ ప్రణాళికలు వేసుకుంటే సరిపోతుంది కదా! 
చాలామంది పదవీ విరమణ ప్రణాళికలు వేసుకునే ముందు వేసుకునే పొరపాటు అంచనా ఇది. వాస్తవం ఏమిటంటే.. గతంలో కంటే ఇప్పుడు ఆయుర్దాయం పెరిగింది. మున్ముందు ఇది మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి మీ చుట్టుపక్కల గమనించండి. మీ బంధువుల్లో, మీకు తెలిసిన వారిలో చాలామంది 70ఏళ్లకు పైబడిన వారు ఉండి ఉంటారు. అందులో కొందరు ఇంకా పూర్తి ఆరోగ్యంగా కన్పిస్తారు. పెరుగుతున్న వైద్య పరిజ్ఞానం వల్ల సగటు ఆయుర్దాయం కూడా ఎక్కువగానే ఉంటోంది. పదవీ విరమణ ప్రణాళికలు వేసుకునేప్పుడు ఈ విషయాలన్నీ మర్చిపోకూడదు. కాబట్టి, వాస్తవంలో పదవీ విరమణ తర్వాత కూడా ‘ఆర్థిక ఆరోగ్యం’ బాగుండేలా చూసుకోవాలి. దానికి ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక వేసుకోవాలి.
* నేను నా పదవీ విరమణానంతర అవసరాల కోసం పొదుపు చేస్తున్నాను. ఇది సరిపోతుందా? దాన్ని పెట్టుబడుల వైపు మళ్లించాలా? 
పొదుపు, పెట్టుబడి.. ఈ రెండింటి విషయంలో చాలామందికి స్పష్టమైన వ్యత్యాసం తెలియదు. ఈ రెండూ ఒకటి కాదు. కానీ, ఈ రెండింటికీ ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంది. పెట్టుబడి పెట్టాలంటే ముందుగా పొదుపు చేయాలి. అలా పొదుపు చేసిన మొత్తాన్ని తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టకుండా పొదుపు చేయడం అంటే.. మీ దగ్గరున్న డబ్బును జేబులో నుంచి తీసి, బీరువాలో దాచి పెట్టడంలాంటిదే. ఇలా దాచిన డబ్బు విలువ కొంత కాలం గడిచిన తర్వాత తగ్గుతుంది. పెట్టుబడులు పెట్టినప్పుడు.. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని సాధించేందుకు సాధ్యం అవుతుంది. కాబట్టి, పదవీ విరమణ ప్రణాళికలో పెట్టుబడులు తప్పనిసరి. వాటిలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మంచి రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది.
* మా పిల్లలు మా విశ్రాంత జీవితంలో చేదోడుగా ఉంటారు. అవసరం ఏదైనా వారే చూసుకుంటారు. ఇక ఇబ్బందేముంది? 
ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన శైలి కోసం వలసలు వెళ్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కుటుంబ వ్యవస్థలో మార్పులు అనివార్యం అవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు దాదాపుగా కనుమరుగవుతూ.. చిన్న కుటుంబాల ఏర్పాటు అనివార్యం అవుతోంది. అంటే, పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే, ఇక్కడ పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారా? అని సందేహించకండి! దీన్ని మరో విధంగా ఆలోచించాలి. తల్లిదండ్రులు తాము తమ పిల్లలకు ఆర్థిక భారం కాకుండా చూసుకోవాలి. అందులోనూ పిల్లలు తమ కోసం తాము పెట్టుబడులు పెట్టుకోవాల్సిన సమయంలో. కాబట్టి, ఎవరికి వారు పదవీ విరమణ తర్వాత కోసం అవసరమైన ప్రణాళిక వేసుకోవాల్సిందే. మీ పిల్లలు మిమ్మల్ని కనిపెట్టుకొని చూడటం అదో అదనపు వెసులుబాటు మాత్రమే అని గుర్తించాలి.
* వైద్య ఖర్చులను పట్టించుకోవాలా? 
ఉద్యోగం చేస్తున్నప్పుడు అనారోగ్యం బారిన పడితే.. ఉద్యోగ సంస్థ అందించే వైద్య బీమా లేదా యాజమాన్యం బిల్లును తిరిగి చెల్లించడంలాంటి వెసులుబాట్లు ఉంటాయి. పదవీ విరమణ చేసిన తర్వాత ఇలాంటివి దూరం అవుతాయి. ఒక్కసారి అనారోగ్యం బారిన పడితే.. అప్పటి వరకూ దాచుకున్న మొత్తం సొమ్ములో సింహభాగం ఖర్చయిపోతుంది. సర్వేల్లో తేలిందేమిటంటే.. గత దశాబ్దకాలంగా చూస్తే.. వైద్య ఖర్చులు దాదాపు 150శాతం వరకూ పెరిగాయి. కాబట్టి, పదవీ విరమణ ప్రణాళికలు వేసుకునేప్పుడు తప్పనిసరిగా వైద్య చికిత్స ఖర్చులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిందే.
* నా పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బును సురక్షిత పథకాల్లోనే పెట్టుబడి పెడతాను. వృద్ధికన్నా పెట్టుబడి సురక్షితంగా ఉండటమే నాకు కావాలి. 
గతంలో పదవీ విరమణ తర్వాత 10-15ఏళ్ల కోసం ప్రణాళిక వేసుకుంటే సరిపోయేది. కాబట్టి, నష్టభయం ఉండే పథకాలకన్నా.. పెట్టుబడి సురక్షితంగా ఉండే వాటిలోనే పెట్టుబడులు పెట్టేవారు. కానీ, ఇప్పుడు కనీసం 20-30ఏళ్లపాటు ఆ మొత్తంతో జీవించాలి. ఈ దశలో ద్రవ్యోల్బణాన్నీ పరిగణనలోనికి తీసుకోవాలి. సురక్షితంగా ఉండే పథకాల్లోనే డబ్బును ఉంచడమూ ఇప్పుడు నష్టమే. కాబట్టి, పూర్తి అవగాహనతో కొంచెం నష్టభయం ఉన్నప్పటికీ.. కాస్త అధిక రాబడినిచ్చే పథకాలను ఎంచుకోవడం ఇప్పుడు ఎంతైనా అవసరం.
* పదవీ విరమణ తర్వాత నా ఖర్చులను వీలైనంత తగ్గించుకుంటాను? ఇబ్బందేముంటుంది? 
చాలామంది చేసే పొరపాటే ఇది. పదవీ విరమణ ప్రణాళిక వేసుకునేప్పుడు వాస్తవాలను విస్మరించకూడదు. ఎంత ఖర్చుల్ని తగ్గించుకుందామనుకున్నా.. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. అంటే, ఇప్పుడున్న స్థాయి నుంచి కొంచెం తగ్గాలి. ఇది అందరికీ సాధ్యం అవుతుందా? ఒకవేళ అవుతుందనుకున్నా.. కొన్ని అనుకోని ఖర్చులు (వైద్యంలాంటివి) రావచ్చు. కాబట్టి, ప్రణాళిక వేసుకునేప్పుడు ఇలాంటివన్నీ లెక్క చూసుకోవాల్సిందే.


రాయితీతో.. గృహరుణం...
పట్టణాల్లో నివసిస్తూ సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీకి ఇంటి రుణం లభిస్తే ఆ అనందమే వేరు కదూ! అది కూడా వడ్డీ రాయితీ ఉంటే.. నెలకు రూ.25,000లోపు ఆదాయం వస్తున్న కుటుంబాల నుంచి రూ.1,50,000 నెలసరి ఆదాయం ఉన్న వారి వరకూ అన్ని సదుపాయాలతో సొంతింటి కలల్ని నిజం చేయడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం’. మరి దీని గురించి తెలుసుకుందామా!


ఆదాయం రూ. 6 లక్షలుంటే..
వార్షిక కుటుంబ ఆదాయం రూ.6లక్షలోపు ఉన్నవారు ఆర్థిక ‘బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలకు వడ్డీ రాయితీ రుణ పథకం’లో భాగంగా రుణం పొందేందుకు అర్హులు. 
* రూ.3లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న కుటుంబాలను ఆర్థిక బలహీన వర్గాల వారిగానూ, రూ.3లక్షల పైన రూ.6లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న కుటుంబాలను అల్పాదాయ వర్గాలుగానూ పరిగణిస్తారు. 
* భార్య, భర్త, పెళ్లికాని పిల్లలను కలిపి లబ్దిదారు కుటుంబంగా పరిగణిస్తారు. 
* పారిశుధ్య కార్మికులు, వితంతు మహిళలు, మహిళలు, షెడ్యూలు కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దివ్యాంగులు, లింగ మార్పిడి చేయించుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యం ఉంటుంది. 
* ఆర్థిక బలహీన వర్గాల వారు నిర్మించాలనుకున్న, విస్తరించాలనుకున్న ఇళ్లు 30 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 323 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు. అదే విధంగా అల్పాదాయ వర్గాల వారైతే 60 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 646 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు.
ఎంత తగ్గుతుంది?
* లబ్దిదారు అదాయాన్ని అనుసరించి గరిష్ఠ రుణ పరిమితిని, రుణ చెల్లింపు కాలాన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. 
* రుణ పరిమితికి లోబడి, రూ.6లక్షలు, 20 ఏళ్ల రుణ చెల్లింపు పరిమితి వరకూ 6.5% వడ్డీ రాయితీకి అర్హులు. రూ.6లక్షలకు పైగా, 20 ఏళ్లకు మించిన చెల్లింపు వ్యవధితో మంజూరైన రుణాలకు వడ్డీ రాయితీ లెక్కింపు రూ.6లక్షలు, 20ఏళ్ల చెల్లింపు వ్యవధికి పరిమితమవుతుంది. 
* ఈ 6.5%వడ్డీ రాయితీని, నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన లెక్కించి ఆ మొత్తాన్ని, కేంద్ర ప్రభుత్వం ఆయా ఆర్థిక సంస్థలకు, రుణ మంజూరు సమయంలో విడుదల చేస్తుంది. ఆ మొత్తం లబ్దిదారుడికి మంజూరైన పరిమితిలో మినహాయించి, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, లబ్దిదారుడు చెల్లించాల్సిన నెలసరి వాయిదాను నిర్ణయిస్తాయి. ముందస్తుగానే వడ్డీ రాయితీ మంజూరు కావడం వల్ల, చెల్లించాల్సిన నెలసరి వాయిదాలో భారీగా తగ్గింపు లభిస్తుంది. 
* ఉదాహరణకు మీకు రూ.10లక్షల రుణం మంజూరయ్యిందనుకోండి. మీరు రూ.6లక్షల వరకూ వడ్డీ రాయితీ పొందేందుకు అర్హులు. కాబట్టి, ఆ మొత్తంపై నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన, 20 ఏళ్ల చెల్లింపు పరిమితికి వడ్డీ రాయితీ లెక్కిస్తే రూ.2,67,280 వడ్డీ రాయితీకి మీరు అర్హులవుతారు. ఈ మొత్తాన్ని రూ.10లక్షల్లో నుంచి తగ్గించి, రూ.7,32,720లకు మాత్రమే నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు. అంటే, సుమారు నెలకు రూ.2,500 వరకూ మీకు లబ్ది చేకూరినట్లే.
మధ్యతరగతి వారికీ..
వార్షికాదాయం రూ.6లక్షలు-రూ.12లక్షల మధ్య ఉన్నవారు మధ్యాదాయ పథకం-1లోను, రూ.12లక్షలు- రూ.18లక్షల లోపు కుటుంబ ఆదాయం వస్తున్న వారు మధ్యాదాయ పథకం-2 లోనూ రుణం పొందేందుకు అర్హులు. 
* ఇళ్ల నిర్మాణం, కొనుగోలు కోసం గరిష్ఠంగా రుణాన్ని పొందవచ్చు. 
* భార్య, భర్త, పెళ్లికాని పిల్లలను కలిపి లబ్దిదారు కుటుంబంగా పరిగణిస్తారు. వైవాహిక స్థితితో నిమిత్తం లేకుండా ఆదాయం కలిగిన వయోజనులను వేరే కుటుంబంగా పరిగణిస్తారు. 
* మధ్యాదాయ పథకం-1 లబ్దిదారులైతే, నిర్మించదలచుకున్న లేదా కొనదలచుకున్న ఇళ్లు 90 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 969 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు. అదే విధంగా మధ్యాదాయ పథకం-2 లబ్దిదారులైతే 110 చదరపు మీటర్ల కార్పెట్‌ ఏరియా (సుమారు 1184 చదరపు అడుగులు) వరకూ ఉండవచ్చు.
ఎంత తగ్గుతుంది?
* గరిష్ఠ రుణ పరిమితి, గరిష్ఠ చెల్లింపు గడువు ఆయా రుణ మంజూరు సంస్థల నిబంధనలని అనుసరించి ఉంటాయి.
* మధ్యాదాయ పథకం - 1 లబ్దిదారులు, పొందిన రుణ పరిమితికి లోబడి, రూ.9లక్షలు, 20ఏళ్ల రుణ చెల్లింపు పరిమితి 4 శాతం వడ్డీ రాయితీకి అర్హులు. 
* మధ్యాదాయ పథకం-2 లబ్దిదారులు, పొందిన రుణ పరిమితికి లోబడి, రూ.12లక్షలు, 20 ఏళ్ల రుణ చెల్లింపు పరిమితి వరకూ 3శాతం వడ్డీ రాయితీకి అర్హులు. ఉదాహరణకు ఈ వర్గంలో, మీకు రూ.15లక్షల రుణం మంజూరయిందనుకోండి. మీరు రూ.12లక్షల రూపాయల వరకూ వడ్డీ రాయితీ పొందేందుకు అర్హులు. కాబట్టి, ఆ మొత్తంపై నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన, 20ఏళ్ల చెల్లింపు పరిమితికి వడ్డీ రాయితీ లెక్కిస్తే రూ.2,30,156 వడ్డీ రాయితీకి మీరు అర్హులవుతారు. ఈ మొత్తాన్ని రూ.15లక్షల్లో నుంచి తగ్గించి, రూ.12,69,844మీద మాత్రమే నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు. అంటే, సుమారు నెలకు రూ.2వేల వరకూ మీకు లబ్ది చేకూరుతుందన్నమాట. 
* మధ్యాదాయ పథకం-1 లబ్దిదారులు రూ.9లక్షల పైన పొందిన రుణ మొత్తానికి, మధ్యాదాయ పథకం-2 లబ్దిదారులు రూ.12లక్షలపైన పొందిన రుణ మొత్తానికి, 20ఏళ్ల చెల్లింపుపైన కాల పరిమితికి వడ్డీ రాయితీ వర్తించదు. అంటే, వడ్డీ రాయితీ పరిమితికి మించిన కాలానికి, రుణ మొత్తానికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇతర ఇంటి రుణ ఖాతాదారులకు వర్తించే వడ్డీని లెక్కిస్తాయన్నమాట.
ఏయే బ్యాంకుల్లో...
ఆంధ్రాబ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌లతో 30 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌తో సహా 22 గ్రామీణ బ్యాంకులు, 70కు పైగా హౌసింగ్‌ ఫైనాన్సు సంస్థలు, సహకార బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఇంటి రుణాలు పొందవచ్చు. 
* రుణ పరిమితి, రుణ చెల్లింపు వ్యవధిల ఆధారంగా, మీరు పొందబోయే వడ్డీ రాయితీని ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. 
https://nhb.org.in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-scheme/ 
* రుణం పొందాలనుకుంటున్న లబ్దిదారులు పథకం అమలు చేస్తున్న బ్యాంకులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం నిర్దేశించిన ప్రతినిధి సంస్థల ద్వారాగానీ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. 
* భారత దేశంలో ఎక్కడా, సొంత పక్కా ఇల్లు లేని వారు మాత్రమే ఈ పథకంలో రుణం పొందేందుకు అర్హులు. అయితే, ప్రస్తుతం ఉన్న పక్కా ఇంటి విస్తరణ, అభివృద్ధి కోసం రుణ మంజూరు విషయంలో ఈ నిబంధన వర్తించదు.
* అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు, గృహ సముదాయాల్లో నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసినప్పుడూ నిబంధనల ప్రకారం వడ్డీ రాయితీ లభిస్తుంది.
-పున్నమరాజు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list