హెల్త్‌టిప్స్
నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఫ్రూట్‌జ్యూస్‌లో కాని, ఆహారంలో కాని నిమ్మరసాన్ని తీసుకుంటుంటే ఆరోగ్యం మెరుగవుతుంది.
తేనెటీగలు కాని మరేవైనా కీటకాలు కాని కుట్టినప్పుడు వెంటనే గాయాన్ని నీటితో తడిపి ఉప్పుతో కవర్ చేయాలి. ఇలా చేస్తే నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇది డాక్టరును సంప్రదించే లోపు నొప్పి లేకుండా ఉండడానికి చేసే ప్రథమ చికిత్స మాత్రమే.
మంచి తండ్రిగా మీకు మార్కులెన్ని?
సెల్ఫ్ చెక్
ఇంట్లో వస్తువులు ఉన్నాయా? లేదా? పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? కుటుంబానికి రక్షణగా ఉంటున్నామా? లేదా?... ఇలా అన్ని విషయాలనూ గమనిస్తూ ఫ్యామిలీకి చేదోడువాదోడుగా కుటుంబ యజమాని ఉంటాడు. ఇలా చేసినప్పుడే కుటుంబంలో అతనికి విలువ ఉంటుంది. పిల్లలు ‘‘మా నాన్న మంచివాడు’’ అనాలన్నా... ‘‘అవర్ డాడీ ఈజ్‌ది బెస్ట్’’ అనిపించుకోవాలన్నా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవటం తప్పనిసరి. పరిశీలనా దృష్టి ఎక్కువగా ఉండే పిల్లలు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకొని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి, వారనుకున్న విధంగా మీరు ఉండటం అవసరం. యజమానిగా మీరు పర్‌ఫెక్ట్ డాడీనో కాదో ఒకసారి చెక్ చేసుకోండి.
1. మీ పిల్లలు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు.
ఎ. అవును బి. కాదు
2. మీరెంత బిజీగా ఉన్నా మీ పిల్లలతో సమయాన్ని గడుపుతారు.
ఎ. అవును బి. కాదు
3. పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎ. అవును బి. కాదు
4. సెలవు దొరికితే మీ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతారు.
ఎ. అవును బి. కాదు
5. పిల్లలకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చే స్తారు.
ఎ. అవును బి. కాదు
6. పిల్లలను అనవసరంగా కోప్పడరు. వారిని శారీరకంగా దండించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు.
ఎ. అవును బి. కాదు
7. పాఠశాలలో జరిగే పేరెంట్– టీచర్ సమావేశాలకు తప్పక హాజరవుతారు.
ఎ. అవును బి. కాదు
8. పిల్లలపై ప్రేమ చూపించటానికి మొహమాటపడరు.
ఎ. అవును బి. కాదు
9. మీ పిల్లలు ‘ఫలానా కావాలి నాన్నా’ అని అడిగిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు అడగక ముందే సిద్ధం చేసి ఉంటారు.
ఎ. అవును బి. కాదు
10. పిల్లల అవసరాలు తీర్చడంతోపాటు వారిని క్రమశిక్షణగా ఎలా పెంచాలో మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఐదు వస్తే కన్నతండ్రిగా మీరు యావరేజ్. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు పర్‌ఫెక్ట్ తండ్రి, పిల్లలను శ్రద్ధగా పెంచటంలో మీకు వందమార్కులు వచ్చినట్లు. మీ పిల్లలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంతే ప్రేమిస్తారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లలని ప్రేమించి, వారిని సంరక్షించడం, బాధ్యత తీసుకోవడం విషయంలో మీరు తెలుసుకోవలసింది చాలా ఉంటుంది.
మొక్కను ఆదర్శంగా తీసుకుందాం
ఆత్మీయం
అవాంతరాలు, అడ్డంకులు ఎదురు కాని మనిషి ఉండడు. ఆ మాటకొస్తే ఇబ్బందులు ఎదుర్కొనని జీవే ఉండదు. విత్తనం ఒక జీవమున్న పదార్థం అనుకుందాం. మర్రి విత్తనం ఎంతో చిన్నది. అది మొలకెత్తి ఎన్నో ఊడలున్న పెద్ద చెట్టుగా మారుతుందని మనకు తెలుసు. అయితే అది అంత తేలికగా ఏమీ జరగడం లేదు. విత్తనం చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు... మొదట విత్తనం మట్టిలో పడగానే చీమలు, చిన్న పురుగుల వంటివి దానిని తినేయాలని చూస్తాయి. అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటుంది. ఈలోగా పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేసేందుకు ప్రయత్నిస్తాయి.
వాటి బారిన పడకుండా అది ఆకులూ మారాకులూ వేస్తూ పెరుగుతూ ఉంటే, పశువులు దానిని ఫలహారం చేయబోతాయి. అయినా సరే, అది ఎదిగి కొమ్మలూ రెమ్మలూ వేస్తుంది... క్రమంగా ఊడలు పాతుకునిæ... భూమిలో బలంగా వేళ్లూనుకుంటుంది. చాలా చిత్రంగా అది చిన్న విత్తుగా భూమిలో ఉన్నప్పుడు దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. దాని మీద గూళ్లు కట్టుకుంటాయి. మనిషి ఎదుగుదల కూడా అటువంటిదే. అంత చిన్న విత్తనమే అన్ని అవరోధాలనుంచి తప్పించుకుని మొక్కగా పెరిగి మానుగా ఎదుగుతోందంటే... మనిషెలా ఉండాలి? అందుకే చిన్న చిన్న అడ్డంకులతో మన ఎదుగుదల ఆగిపోయిందని బాధపడకుండా మరింతగా పెరిగేందుకు ప్రయత్నించాలి.
కుండీల్లోనే తోట పెంచేస్తాం!
ఒకరు కంప్యూటర్ ఇంజినీరయితే.. మరొకరు సివిల్ ఇంజినీర్.. ఉద్యోగాలతో డబ్బు సంపాదించడం కంటే తమ అభిరుచినే ఆదాయమార్గంగా మార్చుకున్నారు. వాళ్లే రమ్యా కోడూరి, స్వర్ణ వేములపల్లి. పీస్‌లిల్లీ ఇండియా పేరుతో గార్డెన్ స్టోర్ నిర్వహిస్తున్నారు. అసలు వాళ్లేం చేస్తారో వివరిస్తున్నారు రమ్య.
లక్ష్యం మదిలో స్థిరంగా ఉన్నప్పుడు అవకాశాలు అందివస్తాయి. అద్భుతాలూ సృష్టించడం సాధ్యం. దానికి నేనే ఉదాహరణ. మాది తణుకు. గీతమ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తిచేశా. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లోని సీఎస్‌ఈ సంస్థలో రెండేళ్లు పనిచేశా. కానీ నాకు మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. దానికి కారణం ఉంది. అమ్మానాన్నల కోసం ఇంజినీరింగ్ చేసినా నా దృష్టి ఆర్ట్‌మీదే ఉండేది. ప్రతిదీ అందంగా మలచడం, కొత్తదనం కోరుకోవడం నాకు ఇష్టం. ఆ సృజననే వ్యాపారమార్గంగా మార్చుకునే అవకాశం నాకు పెళ్లయ్యాక వచ్చింది. మేముండేది అపార్ట్‌మెంట్‌లో. ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి స్థలం ఉండేది కాదు. అమ్మ ఇంటికొచ్చినప్పుడల్లా ‘పచ్చదనం లేని ఇల్లు బోసిగా ఉంటుందే’ అని చెప్పేది. నాకూ అలానే అనిపించేది. అప్పుడే మొక్కలకు సంబంధించి ఏదయినా చేయాలనుకున్నా. సరిగ్గా అలాంటి సమయంలోనే స్వర్ణ పరిచయమైంది. ఆమె మా వారి స్నేహితురాలు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. తను కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునేది. మేమిద్దరం కలిసినప్పుడల్లా ఇదే ఆలోచించేవాళ్లం. క్రమంగా మా ఇద్దరి దృష్టీ మొక్కల పెంపకంపై పడింది. దాన్నుంచే పీస్‌లిల్లీ ఇండియా పేరుతో గార్డెన్ స్టోర్‌ని రెండేళ్లక్రితం ఏర్పాటు చేయగలిగాం.
బహుమతులుగా ఇచ్చాం... మా వారిది ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ. అక్కడ తయారైన కొన్ని కుండీలను తీసుకుని వాటితో అందమైన మినియేచర్ గార్డెన్‌ని రూపొందించాం. వాటిని తెలిసినవారందరికీ బహుమతులుగా అందించాం. చాలా బాగున్నాయన్నారు. మరికొన్నీ తయారుచేశాం. అలాగే తోటకు సంబంధించిన ఇతర అలంకరణ వస్తువులూ, మొక్కలకోసం వాడే యాక్సెసరీలూ, ఇతర కొత్త మొక్కలకోసం మేం తిరగని చోటు లేదు. ఇంటర్నెట్‌లో అధ్యయనం చేశాం. వాటిని పుణె, దిల్లీ, థాయిలాండ్ చైనా వంటి చోట్లనుంచి తెప్పించుకుంటున్నాం. అలా మేం తయారుచేసిన మినియేచర్ గార్డెన్లను బంజారాహిల్స్‌లోని కెఫికోహైకూ అనే రెస్టారెంట్‌లో పెట్టాం. బాగున్నాయి అనడమే కాదు అంతా వాటిని కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆదరణ బాగున్నా వాటికే పరిమితం కాలేదు. రెండోదశలో సెల్ఫ్‌వాటరింగ్ కుండీలతో పాటు ఇండోర్ ల్యాండ్‌స్కేపింగ్‌నీ వినూత్నంగా చేయడం మొదలుపెట్టాం. దీనికోసం మేం ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా ఇంటర్నెట్ ద్వారా కాస్త అవగాహన పెంచుకున్నాం. మా ఆలోచనలు నచ్చి అవకాశాలూ వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి. మా ఉత్పత్తులూ, పనుల వివరాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్ చేయడమే అందుకు కారణం. మరి పెట్టుబడో అంటారా... ఇద్దరం కలిసి ఓ పాతిక లక్షల రూపాయలను దీనికోసం ఖర్చు చేశాం. ఇబ్బందులు దాటి ఇప్పుడిప్పుడే ఆదాయాన్ని అందుకుంటున్నాం కూడా.
అన్నీ వేడుకలకు... టెరేరియన్స్‌తో పాటు మేసన్, జియోమెట్రిక్ ఆకృతుల్లో ఉన్న జార్‌లలో తోటల్నీ పెంచేస్తాం. ఇక, పెళ్లిళ్లూ, సీమంతాలూ, పుట్టినరోజులూ, పండగలూ, ఇతర వేడుకల కోసం ప్రత్యేకంగా థీముల్లో మొక్కల్ని నాటి బహుమతులుగా అందిస్తున్నాం. హైదరాబాద్‌లోని ఇన్నోకార్ప్, కాంగ్రోకిడ్స్ పాఠశాల, షైన్‌స్క్రీన్ ఫిల్మ్ ఆఫీస్, సిగ్నేచర్ వన్ వంటి వాటికీ మేం పనిచేశాం. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఫ్యాబ్‌ఇండియా స్టోర్‌తో పాటు మరికొన్ని చోట్లా పనులు కొనసాగుతున్నాయి.
పనిఒత్తిడికి.. ఉందో పరిష్కారం!
కొంతమందికి రోజులూ, సంవత్సరాలూ కెరీర్‌లో పడి కొట్టుకుపోతుంటాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఒత్తిడితో నెట్టేసిన రోజులు తప్పించి పనినీ, వ్యక్తిగత జీవితాన్నీ ఆస్వాదించిన సందర్భాలే ఉండవు. అలా కాకుండా ఉండాలంటే...
* మీరూ రోజూ ఎన్నింటికి నిద్రలేస్తారు.. ఉదాహరణకు ఏడింటికి అనుకుందాం. ఈ సారి నుంచి ఓ అరగంట ముందే నిద్రలేచేలా చూసుకోండి. ఆ అరగంట పూర్తిగా మీదే. పత్రిక చదువుతారా.. ధ్యానం చేస్తారా.. కాఫీ తాగుతూ టీవీ చూస్తారా.. మీ ఇష్టం. కానీ ఏ మాత్రం హడావుడి లేకుండా ఆనందించండి. మీరు చేసే మిగిలిన పనులు కూడా ఎంతో ఉల్లాసంగా పూర్తిచేసేస్తారు.
* పనిచేసే చోట మనం ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. పని విషయంలో మీరు అవతలివారికి సాయం చేస్తే.. సహోద్యోగులూ మీకు అండగా ఉంటారు. పని పంచుకుంటారు.
* మీ మీద పని ఒత్తిడి పెరుగుతోందనుకుందాం. అందులోనే కొట్టుకుపోవద్దు. వీలైంతవరకూ బాస్‌తో ఈ విషయం మాట్లాడండి. పనిభారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కచ్చితంగా కొంత ఉపశమనం ఉంటుంది.
* ఉదయం టిఫిన్ చేయడం మానేసి...మధ్యాహ్నం కార్యాలయంలో మీరు కూర్చునే చోటే భోజనం చేయడం మీ దినచర్యలో భాగంగా మారితే కచ్చితంగా మానేయండి. భోజనాన్ని పనివాతావరణంతో సంబంధం లేని చోట తినండి. అప్పుడు రోజంతా పనిలోనే ఉన్నారనే భావన తగ్గుతుంది.
సర్దుకుపోదాం రండి!
ఆలుమగలుగా కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్లు...ప్రతి చిన్నవిషయానికీ పోట్లాడుకుంటే.. జీవితం నిస్సారంగా మారుతుంది. అలకలు కాస్తా అనుబంధాన్ని బీటలు వారుస్తాయి. అలాకాకుండా ఆదర్శ దంపతుల్లా అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి.. కొన్ని అలవాట్లూ చేసుకోవాలి.
* ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్ని అంతవరకే చూడండి. అలాకాకుండా దాన్నో పెద్ద సమస్యగా భావించి భాగస్వామిలో ప్రతికూలాంశాలను వెతుక్కోవద్దు. సానుకూల అంశాలనే లెక్కించండి. దాంతో మీరే సర్దుబాటు ధోరణికి వచ్చేస్తారు. అలానే భాగస్వామిలో వీలైనంతవరకూ సానుకూల అంశాలనే చూడండి. ఓ వారం మొత్తం భాగస్వామి ఏది చేసినా, చెప్పినా కరెక్టే అని చూడండి. అలా చూసిన ప్రత్యేకతల్ని వీలుంటే ఓ పుస్తకంలో కూడా రాసుకోండి. ఓ వారం కొనసాగిస్తే.. ప్రతికూలతలు చాలామటుకూ తగ్గుతాయి.
* ఇద్దరికీ నచ్చి, సరదాగా అనిపించే పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. దానివల్ల కూడా అనుబంధం పెరుగుతుందట. మీరు ఇప్పటివరకూ చేయని పనిని.. భాగస్వామితో కలిసి చేసేలా చూసుకోండి. అంటే ఓ డాన్స్‌క్లాస్‌లో చేరడం, స్కైడైవింగ్, ట్రెక్కింగ్ ఇలా ఏదయినా సరే.. ఇది అనుబంధాన్ని పెంచడమే కాదు.. సరదాగానూ అనిపిస్తుంది. దానికోసం ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు ఇకపై.
* భాగస్వామిని వీలైనంత ఎక్కువగా ప్రశంసిస్తే.. అవతలివాళ్లూ అదే చేస్తారు. మీకు చేసిన ప్రతి చిన్న సాయాన్ని అప్పుడప్పుడూ గుర్తుచేసి ధన్యవాదాలు తెలియజేయండి. ఇది కూడా అనుబంధాన్ని పెంచుతుంది. అప్పుడప్పుడూ థాంక్యూ నోట్ పెట్టడం కూడా తప్పనిసరే.
* ఇతరుల ముందు.. భాగస్వామిని చిన్నబుచ్చుకునేలా మాట్లాడటం.. మూడో వ్యక్తి దగ్గర భాగస్వామి లోపాల్ని ఎత్తి చూపడం..వంటివి సరికాదు. మీరిద్దరూ ఎంత వాదించుకున్నా.. ఎలాంటి మనస్పర్థలు వచ్చినా ఇద్దరిమధ్యే ఉండాలనే నియమాన్ని పెట్టుకోండి.
రోజూ ఉండాలి.. వెల్లుల్లి!
పప్పూ, పచ్చడీ, కూర.. .ఇలా ప్రతిదానిలో వెల్లుల్లి ఉండాల్సిందే కొందరికి. రుచి, వాసన కోసం వంటకాల్లో విరివిగా వాడటం అటుంచితే.. వెల్లుల్లికి ఔషధగుణాలు కూడా ఎక్కువే. అందుకే దీన్ని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అసలు వెల్లుల్లి ఎలా మేలుచేస్తుందంటే..
* వెల్లుల్లి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంపై వచ్చే మచ్చలనూ నివారిస్తుంది. దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేడినీటిలో వేసుకుని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది.
* ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తరచూ జలుబూ, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలూ, తేనె, అల్లం కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* వెల్లులిని తరచూ తీసుకోవడం వల్ల రొమ్మూ, ఉదర, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిల్లో ఉండే ప్రత్యేక పోషకాలే అందుకు కారణం.
* ఈ రెబ్బల్లోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరగకుండా చేస్తాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565