ఫ్యాషన్ మేళా!
ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కన్పించేలా డ్రెస్ చేసుకోవడం ఓ కళ. అందుకే అహర్నిశలూ శ్రమిస్తూ అద్భుతమైన డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు. అంతేకాదు, అది ఓ ట్రెండ్‌గా మారేందుకూ కృషిచేస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ ఆ కోవకు చెందినవే.
బ్లౌజుకి చిల్లుల సోయగం..!
పెళ్లి దగ్గర పడుతోంది. లేదూ సన్నిహితుల పెళ్లికి హాజరు కావాలి... అనుకోగానే అమ్మాయిలంతా ఏం చేస్తారు? చీరమీదకి వెరైటీ డిజైన్‌లో బ్లౌజ్ కుట్టించుకునేందుకు ఫ్యాషన్ మ్యాగజైన్లన్నీ తిరగేస్తుంటారు. హైనెక్‌లూ, షోల్డర్ హ్యాండ్సూ, కాలర్ నెక్‌లూ వాటిమీద ఖరీదైన ఎంబ్రాయిడరీలూ... అన్నీ పాతబడిపోయాయి. కొత్తగా ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవాలా అనుకుంటున్న వాళ్లకోసం వచ్చిన నయా ఫ్యాషనే ఈ కోల్డ్ షోల్డర్ వెడ్డింగ్ బ్లౌజ్. నిన్నమొన్నటివరకూ మోడ్రన్, క్రాప్ టాప్‌లమీద మాత్రమే హల్‌చల్ చేస్తోన్న ఈ కోల్డ్ షోల్డర్ ఫ్యాషన్, ఇప్పుడు పెళ్లి బ్లౌజుల్లోకీ ప్రవేశించింది. ఇంకెందుకు ఆలస్యం... ఇలాంటి బ్లౌజొకటి కుట్టించేయండి మరి..!
తేనెలూరే పెదాలు
లిప్‌స్టిక్ వేసుకుంటే కాసేపటికే పొడిబారిపోయి, ఎండిపోయినట్లుగా అయిపోతుంటుంది. అందుకే చాలామంది సెమీ లిక్విడ్ రూపంలో కాస్త మెరుస్తున్నట్లుగా ఉండే లిప్‌గ్లాస్ వేసుకోవడానికే ఇష్టపడుతుంటారు. అయితే అవి మాత్రం ఎంతసేపని ఆరిపోకుండా ఉంటాయి. కాసేపటికి ఆ మెరుపు కాస్తా విరుపై పోవాల్సిందే. కానీ పెదాలమీద వేసిన ఆ రంగు, తేనెలూరేలా మెరుస్తూ తుడిచే వరకూ నిలిచి ఉండాలంటే మాత్రం ఈ మాయిశ్చరైజింగ్ షీర్ లిప్ గ్లాస్ కావాల్సిందే మరి. వీటిని వేసుకోవడమూ సులభమే. పైగా ఇవి పెదాలను నున్నగా మెరుస్తున్నట్లుగా కనిపించేలా చేస్తాయి. ఈ సరికొత్త లిప్‌గ్లాసెస్‌తో అమ్మాయిలు పెదాలు పూలరేకుల్లా విచ్చుకుంటున్నాయి.
త్రీడీ కుట్టు... అదరగొట్టు!
త్రీడీ... సినిమా చూడాలంటే త్రీడీ. వాల్ పెయింటింగ్ కొనాలంటే త్రీడీ. టైల్స్ వేయాలంటే త్రీడీ... ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇదే మాట. ఇప్పుడు ఎంబ్రాయిడరీలోనూ అదే మాట. అవునుమరి, సాధారణంగా సిల్కు దారం, జర్దోజి, అద్దం... ఇలా ఏ రకం ఎంబ్రాయిడరీ చేసినా అది టూ డైమన్షన్‌లో మాత్రమే కనిపిస్తుంది. కానీ అది త్రీడీ తరహాలో కనిపించాలంటే మాత్రం ఆప్లిక్ వర్కు పూలతో కుట్టిన లేసు క్లాత్‌ని మించింది లేదు. అందమైన పువ్వులూ పూసలూ రంగురాళ్లతో డిజైన్ చేసిన ఈ త్రీడీ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్కు వాడకం ఒకప్పుడు విదేశాల్లోనే ఎక్కువ. ఇప్పుడు ఇది మన ఫ్యాషన్లలోకీ చొరబడింది. చీర, గాగ్రా, లంగా, గౌను... ఇలా అన్నింటిలోనూ ఈ త్రీడీ
ఎంబ్రాయిడరీ అటు సెలెబ్రిటీలతోబాటు ఇటు కాలేజీ అమ్మాయిల మనసూ దోచుకుంటోంది. మరి మీకూ నచ్చిందా..?
బ్యాగు ముడి.. బాగుందా..?
హ్యాండ్‌బ్యాగ్ అనగానే ఈతరం అమ్మాయిలకి అది కచ్చితంగా ఏదో ఒక బ్రాండ్‌దే అయి ఉండాలి. కానీ ఇప్పుడు నలుచదరంగా ఉండే వెడల్పాటి క్లాత్ ఉన్నా చాలు, డిజైనర్ బ్యాగుగా మారిపోతుంది. అవునుమరి, ఆ సరికొత్త బ్యాగు పేరే ఫురోషికి. నిజానికి ఇది జపనీయుల సంప్రదాయ వస్త్రం. దీన్ని వాళ్లు కానుకలు చుట్టి ఇచ్చేందుకూ ఎక్కడికైనా వెళ్లినప్పుడు బట్టలు పెట్టుకునేందుకూ మెడలో స్కార్ఫ్‌లా కట్టుకునేందుకూ వాడేవారు. ఇప్పుడు అదే బట్టను రకరకాలుగా ముడులేసి హ్యాండ్ బ్యాగులా తయారుచేస్తున్నారు. అది కాస్తా యూత్‌కి తెగ నచ్చేయడంతో ఫురొషికి బ్యాగుల్ని కంపెనీలే స్వయంగా తయారుచేసేస్తున్నాయి. దాంతో వాటిని ధరించడం కొత్త ట్రెండయిపోయింది.
మణికట్టుకి కాపర్ కనికట్టు!
ఒకప్పుడు వాచీలంటే లెదర్ బెల్టుతో మాత్రమే వచ్చేవి. ఆ తరవాత ఆడామగా తేడా లేకుండా సిల్వర్, గోల్డ్ కలర్ మెటల్ వాచీలు రంగప్రవేశం చేశాయి. అయితే ఆమధ్య అటు డ్రెస్సులూ యాక్సెసరీల్లో కాపర్ కలర్ ఫ్యాషన్ కావడంతో సాదా కంపెనీలతోబాటు బ్రాండెడ్ వాచీ కంపెనీలు సైతం రాగి రంగుకు దగ్గరగా ఉండే రోజ్‌గోల్డ్ రాగాలను అందుకుని కాపర్ వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి.. దాంతో నేటితరం అమ్మాయిలంతా అటు గోల్డ్, ఇటు సిల్వర్, కలర్ లెదర్స్... అన్నింటినీ పక్కకు నెట్టేసి, కాపర్ కలర్ వాచీలమీద మనసు పారేసుకుంటున్నారు. బాగున్నాయి కదూ.
పాదాలకు పూలందం..!
రంగురంగుల పూలంటే ఇష్టం ఉండనిది ఎవరికి. అందులోనూ అమ్మాయిలకి పూలబాసలంటే మరీ మరీ ఇష్టం. అందుకే జడ నిండా విరబూసిన పూలతో మురిసిపోతుంటారు. అక్కడితో ఆగుతారా... దుస్తుల్లోనూ నగల్లోనూ కూడా పూల డిజైన్లకే మొదటి ప్రాధాన్యం. ఇప్పుడు ఏకంగా పాదాలను అంటిపెట్టుకునే చెప్పుల్లోనూ పూలను పూయిస్తున్నారు. దాంతో చెప్పుల కంపెనీలన్నీ ఎరుపూ, గులాబీ, తెలుపూ... ఇలా విభిన్న రంగుల పూలతో శాండల్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. పైగా పాదాలతోబాటు కాళ్ల అందం ప్రతిబింబించేలా వీటిని గ్లాడియేటర్ తరహాలో తాళ్లతో కట్టుకునేలా రూపొందిస్తున్నారు. దాంతో ఆ పూల చెప్పులు వేసుకుని తెగ ముచ్చటపడిపోతున్నారు నేటి తరం అమ్మాయిలు.
అమ్మాయిలకీ కార్గో..!
ప్యాంటేసినా లెగ్గింగులానే ఉండాలి... ఇదీ సహజంగా అమ్మాయిలంతా అనుకునేమాట. కానీ ఈమధ్య టామ్‌బాయ్‌లా ఉండాలనుకునే అమ్మాయిల సంఖ్యా పెరుగుతోంది. అలాంటివాళ్లకోసం వస్తున్నవే ఈ సరికొత్త కార్గో ట్రౌజర్స్. నిన్న మొన్నటివరకూ అబ్బాయిల వార్డురోబుల్లోనే కనిపించిన కార్గో ప్యాంట్లు, ఇప్పుడు అమ్మాయిల అల్మరాల్లోనూ వేలాడుతున్నాయి. పైగా ఇవి జీన్స్, కాటన్, లినెన్... ఇలా రకరకాల ఫ్యాబ్రిక్కుల్లోవస్తున్నాయి. కాలుబారునా ఉండే జేబులతో స్టైలిష్‌గా ఉండటంతోబాటు, కాస్త వదులుగానూ ఉండటంతో మరీ లెగ్గింగుల మాదిరిగా పట్టేసినట్లుగా కాకుండా హాయిగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు అమ్మాయిలు టైట్స్‌నీ జీన్స్‌నీ కొంచెం పక్కకు నెట్టేసి, కార్గోలతో చిందులేస్తున్నారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565