వివాహ వేడుక
‘మనిషి జీవితం భగవంతుడిచ్చిన వరం’ అనేందుకు దాంపత్య వ్యవస్థ ఓ ఉదాహరణ. పెళ్లిచూపులతో పరిచయం, నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభలేఖలు పంచడం...వీటన్నింటితో వేడుకకు సమాయత్తం కావడం మరువలేని ఘట్టం.
దాంపత్య జీవనం సృష్టి ధర్మం. విచక్షణ గల ప్రాణిగా మనిషి సంస్కారవంతమైన జీవితం గడపాలి. అదే కర్తవ్యంగా భావించి అందులోనే సుఖం, శాంతి పొందాలి. అందుకే వివాహాన్ని ‘సంస్కారం’ అంటారు.
జీవరాశులే ప్రకృతి గతికి ప్రధానం. ఈ ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగడానికి ప్రకృతే దోహదపడుతుంది. మనోధర్మాలతో స్త్రీ, పురుషుల మధ్య కలిగే పరస్పర ఆకర్షణకు మూలం ప్రకృతి. ఇదే మార్గాన్ని పరమార్థ సాధనకు ఉపయోగించుకుంటుంది కల్యాణం. సంతతి పొందడానికి సంస్కారబద్ధమైన ఏర్పాటు గృహస్థాశ్రమమే! నాలుగు ఆశ్రమ ధర్మాల్లోనూ ఇదే అత్యంత ఉత్తమమని పెద్దల మాట. దీని పవిత్రతను కాపాడటానికే దంపతులకు నియమాలు ఏర్పాటయ్యాయి. కన్యను స్వీకరించిన వరుడు- ధర్మార్థ కామ మోక్షాల్లో ఆమెనే అనుసరిస్తానంటాడు. నియమాల్ని అతిక్రమించనని, సత్కర్మాచరణ సాగిస్తానని ప్రమాణం చేస్తాడు.
వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర, బెల్లం పెట్టుకుంటారు. ‘నా జీవనానికి హేతువైన ఈ మాంగల్యాన్ని ధరింపజేస్తున్నాను. నిండు నూరేళ్లూ సుమంగళిగా జీవించు’ అంటూ మెడలో తాళి కడతాడు. ఒకరి తలపై మరొకరు ఒద్దికగా తలంబ్రాలు పోసుకుని, కంకణాలు కట్టించుకుని, బ్రహ్మముడి వేయించుకుంటారు. పాణిగ్రహణం తరవాత ఉభయులూ సహవాసులై అగ్ని చుట్టూ ఏడడుగులు నడుస్తారు. అరుంధతీ నక్షత్ర దర్శనంతో పెళ్ళి క్రతువు పూర్తవుతుంది. ఆ జంట అర్ధనారీశ్వరుల్లా ఏకరూపం పొందుతారు.
ఇద్దరూ వ్రతాలు నిర్వహిస్తారు. అనంతర కాలంలో- శిశువును ఉయ్యాలలో వేయడం, నామకరణం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలన్నింటినీ బంధుమిత్రుల సమక్షంలో కనువిందుగా నిర్వర్తిస్తారు. పిల్లలు పెరిగి ప్రయోజకులయ్యాక, సహస్ర చంద్రోదయం వంటి ఉత్సవాల్ని మనవలు, మనవరాళ్ల నడుమ ముచ్చటగా చేసుకుంటారు.
ఏ వయసుకు తగ్గట్లు ఆ వేడుక ఉంటుంది. అది జీవన మధురిమను పెంచుతుంది. దంపతులకు అపరిమిత ఆనందం కలిగిస్తుంది. అదే ఆహ్లాదాన్ని కుటుంబసభ్యులందరికీ పంచుతుంది. షష్టిపూర్తి వంటివి ఎన్నో అనిర్వచనీయ అనుభూతుల్ని ప్రసాదిస్తాయి. సంతృప్తి, సంతోషం- రెండింటినీ అవి ద్విగుణీకృతం చేస్తాయి. దాంపత్య జీవితాన్ని ఎంతో అర్థవంతంగా మలుస్తాయి.
పెళ్లంటే ఒకప్పుడు అయిదు రోజుల వేడుక. అన్ని రోజులూ పెళ్లివారిల్లు మామిడి తోరణాలు, పందిళ్లు, బంధువుల విందులు వినోదాలతో కళకళలాడుతుండేది. రోజులు, పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. జీవన విధానంలో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవితంలో అతి వేగం వివాహ వేడుకను సైతం యాంత్రికంగా మారుస్తోంది. ఇంటికి ఒక్కరు అన్నట్లు ఆ ముహూర్త సమయానికి వెళ్లడం, అంతే వేగంగా తిరిగి ఇంటిముఖం పట్టడం పరిపాటి అవుతోంది. పెళ్లిపందిరి వద్ద పట్టుమని పది నిమిషాలైనా గడిపే పరిస్థితి చాలాచోట్ల లేదు.
ఊరంతా ఒక కుటుంబమై సీతారాములు లేదా శివపార్వతుల కల్యాణ వేడుకల్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తుంటారు. ఒళ్లంతా కళ్లు చేసుకొని తనివితీరా చూస్తుంటారు. అదీ పెళ్లి కళ అంటే!
బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లికి వెళ్లినవారు అక్కడ అందరినీ పలకరించడం, పదిమందితోనూ కలివిడిగా ఉండటమే మనసుకు పత్రహరితం అద్దుతుంది.
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565