మన పండుగ ఉగాది
పండగొచ్చింది!
ఉగాది పండుగ వచ్చేస్తోంది. కొత్త ఏడాదితో పాటు కొత్త ఉత్సాహం తెచ్చేస్తోంది. అసలేమిటీ ఉగాది? ఎందుకీ పండుగ?
బ్రహ్మ సృష్టిలో ప్రళయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని ‘బ్రహ్మకల్పం’ అని అంటూ ఈ ప్రారంభకాలాన్ని ‘కల్పాది’ అని వ్యవహరిస్తారు. ప్రతీ కల్పంలోను మొదట వచ్చే ‘ఆది’ సమయమే ‘ఉగాది’ పండుగ. దీన్ని గురించి ‘సూర్య సిద్ధాంతం’ అనే జ్యోతిష గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సర ఆరంభ దినం నాడు మనం ఉగాది పర్వదినం జరుపుకొనే ఆచారం ఏర్పడింది. ‘యుగాది’ అన్న సంస్కృత పదం ఉచ్చారణాభేదం వల్ల ‘ఉగాది’ అనే తెలుగు మాటగా ఏర్పడింది.
సృష్టి ప్రభవం అయిన ఈ మొదటి సంపత్సరం నుండి చరితార్థంగా ‘ప్రభవ’ అని నామకరణం చేశారు. అక్కడి నుంచి ‘క్షయ’ నామ సంవత్సరం క్రమంలో 60 నామాలతో సంవత్సర గమనం సాగుతుంది. కనుకనే మనం జన్మించిన మొదలు ఈ నామ చక్రం మనకు 60 సంవత్సరాల వయస్సుకు చేరినపుడు తిరిగి అదే సంవత్సరంతో పూర్తి అవుతుంది. అప్పుడు షష్టిపూర్తి జరుపుకొంటాం.
వేదాలను హరించిన సోమకుడు అనే రాక్షసుని వధించి శ్రీ మహావిష్ణువు తిరిగి పునరుద్ధరించిన రోజుగా కూడా ఉగాది ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు బుతువులుగా విభజితం అయింది. సంవత్సరం పొడవునా అనేక ఒడుదొడుకులు అనుభవించిన ప్రకృతిలోని చెట్లు శిశిర ఋతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి. చైత్రమాసంలో క్రొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి. ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్రమాసం. అందుకే ఈ మాసారంభానికి ఉగాది అని పేరు వచ్చినదని కూడా చెప్పుకోవచ్చు.
ఉగాది పర్వదినాన ‘అభ్యంగనం, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమ వర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరాలతో కూడిన పంచాగ శ్రవణం’ అనే ముఖ్యమైను విధులను అనుసరించాలని పెద్దల మాట!
అభ్యంగనం
సూర్యోదయానికి పూర్వమే నువ్వులనూనె తలకి పట్టించి ఉసరిక, పెసరపిండి, మ్రానిపసుపు, భావంచాలు, కచ్ఛూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం కుంకుళ్ళతో చేయాలి. ఈ దినం వేడినీటి స్నానం శ్రేష్ఠం. అనంతరం తిలకం దిద్దుకుని, నూతన వస్త్రాలు ధరించి సంకల్పం చెప్పుకోవాలని ‘ధర్మసింధువు’ తెలియచేస్తోంది.
పుణ్యకాల సంకల్పం
సూర్యోదయానికి ఒక ముహూర్తకాలం (20 నిమిషాలు) మాత్రమే పాడ్యమి ఉన్నా సరే ఆ రోజునే పండుగ సందర్భ నూతన సంకల్పం చెప్పుకొని ప్రారంభించాలి. సూర్యునికి అర్ఘ్యం, దీపం, ధూపం, పుష్పాంజలి సమర్పించాలని శాస్త్ర వచనం.
ధర్మకుంభం
ఉగాది రోజు రానున్న రోజులలో పూర్ణ మనోరథసిద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయనే సంకల్ప బలంతో పంచలోహాల పాత్రగాని, మట్టి కుండగాని కలశంగా తీసుకుని సుగంధ జలం, చందనం, పుష్పాక్షతలు వేసి ఆవాహన చేసి, పుణ్యాహ మంత్రాలతో బియ్యం పోసిన ఒక పళ్ళెంలో కలశం ఉంచి నూతన వస్త్రం చుట్టి ఉపరిభాగాన నారికేళం పెట్టాలి. కుంకుమ, పసుపు చందనాలు సమర్పించి పురోహితునకు గానీ, గురువునకు గానీ, లేక గుడిలోని ఇష్ట దైవానికి గానీ దానమిచ్చి వారి ఆశీర్వాదం పొందాలి. దీనినే ‘ధర్మఘట దానం’ లేక ‘ప్రపాదానం’ అంటారు. ఈ విధి నేటికీ పల్లెలలో ఆచరిస్తున్నారు.
పంచాంగ శ్రవణం
మహాపర్వదినములైన కల్పాది తిధులు, మన్వంతర తిధులు, దశావతార పుణ్యతిథులు మొదలైన వాటిని పంచాంగంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదు అంగాల కలయికగా చూపిస్తారు. ఈ విధమైన పంచ అంగాల శ్రవణం వల్ల భవిష్యత్తులో మనకు రానున్న విశేషాలు, పండుగలు, గ్రహణాలు, వర్ష వివరాలు, కాల నిర్ణయాలు మొదలైనవి తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఉగాది రోజున విశేష విధిగా భావించాలి. కనుక హైందవ సాంప్రదాయములో పంచాంగ శ్రవణం ఉగాది తిథి రోజున ప్రాముఖ్యత సంతరించుకుంది.
తిథేశ్చ, శ్రియమాప్నోతి వారాధాయుష్య వర్ధనమ్
నక్షత్రాత్ధరతే పాపం, యోగాద్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు, పంచాంగ ఫలముత్తమమ్
కాల విత్కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం భవేత్ !!
తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్యు, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణము వల్ల కార్యానుకూలత సిద్ధిస్తాయి. కాలం తెలిసి కర్మం చేసే ఆస్తికులు భగవత్ అనుగ్రహం పొంది సుఖం అనుభవిస్తారు. రామాయణాది పవిత్ర గ్రంథ పఠనం వల్ల వచ్చే విశేష ఫలం ఈ పంచాంగ శ్రవణం వల్ల కూడా పొందవచ్చు.
భూమి, స్వర్ణం, ఏనుగులు, గోవులు, సర్వ లక్షణయుక్తమైన కన్యను ఉత్తముడైన పాత్రునకు దానం చేస్తే కలిగినంత ఫలితంతో సమానం. శాస్త్రవిధిగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల సూర్యుని ద్వారా శౌర్య తేజస్సులు, చంద్రుని ద్వారా భాగ్య వైభవాలు, కుజుని ద్వారా సర్వ మంగళాలు, బుధుని ద్వారా బుద్ది వికాసము, గురుని ద్వారా గురుత్వం, ఙ్ఞానం, శుక్రుని ద్వారా సుఖం, శని దేవుని ద్వారా దుఃఖ రాహిత్యం, రాహువు ద్వారా ప్రాబల్యము, కేతువు ద్వారా తన వర్గంలో ప్రాముఖ్యత కలుగుతాయని శాస్త్ర వచనం.
ఉగాది నాడు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఉగాది పచ్చడి స్వీకరణ. దీనిని పరగడుపునే స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు రుచులు కలసిన ఉగాది పచ్చడి మన సొంతం. ప్రతీ మనిషి తన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనుభవాలకు ప్రతీకగా దీన్ని భావిస్తారు. ఈ పచ్చడి తయారు చేయడానికి చెరకు, మామిడికాయలు, వేప పువ్వు, అరటి పళ్ళు, లవణం, చింతపండు, బెల్లం, పచ్చి మిరప మొదలైనవి వాడతారు. మామిడి పూత, అశోక చిగురులు కలిపి సేవించే సంప్రదాయం మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది.
డాక్టర్ దేవులపల్లి పద్మజ
సద్భావన
ఉగాదిలో ‘ఆది’ లక్షణం కనిపిస్తుంది. పల్లవించే వసంతంతో ప్రారంభమై, ఆకు రాలే శిశిరంతో పూర్తికావడం- మన సంవత్సర కాలగణనలోని ఔచిత్యం. నక్షత్ర (ఉదు) సంబంధంగా చంద్ర (గమన)మానాన్ని అనుసరించి ఏడాదిని లెక్కిస్తారు కనుక- ఏడాదికి ‘ఆది’ని ఉగాది అన్నారు. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజూ ఇదేనని- యుగాది, ఉగాది, మన్వాది అనే నామాలతో ధార్మిక శాస్త్రాల ఆధారంగా వ్యవహరిస్తారు. ఈ మన్వంతరానికి ఆది అవతారమైన మత్స్యావతారం ఇదే రోజున కాబట్టి, పురాణోక్తి ప్రకారం దీన్ని ‘మత్స్య జయంతి’గా చెబుతారు.
వసంత నవరాత్రులకు తొలిదినమైన నేటి నుంచి, ప్రతి తిథీ అత్యంత మహిమాన్వితమని సంప్రదాయజ్ఞుల మాట. ఈ పాడ్యమి నుంచి వరసగా వచ్చే తిథులు- వాటికి సంబంధించిన దేవతల ఆరాధనలకు ప్రాధాన్యమిస్తున్నాయి. చైత్ర శుద్ధ విదియనాడు ప్రదోషకాలంలో గౌరీశంకరుల్ని పూజించి, చంద్రుణ్ని ఆరాధించడం ఆచారం. తదియనాడు శివపార్వతులకు పల్లకి, ఊయల సేవలు; శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి ‘డోలోత్సవాలు’ ప్రశస్తమైనవి. చైత్ర శుద్ధ చవితి గణపతి పూజకు ప్రాముఖ్యం. లడ్డు, ఉండ్రాళ్లు వంటి నైవేద్యాలతో వినాయకుణ్ని పూజించి, దమనంతో ఆరాధించాలని శాస్త్రోక్తి.
పంచమినాడు అనంతుడు, వాసుకి వంటి నాగదేవతల్ని పూజించాలని పురాణ వచనం. లక్ష్మీపూజ ఆచరిస్తారు. అష్టమి, నవమి అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైనవి. ఈ నవమినాడు పార్వతీదేవి ఆవిర్భవించిందని దేవీగాథలు చెబుతున్నాయి.త్రేతాయుగంలో ఒక చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు అవతరించాడంటుంది రామాయణం. అందుకే ఉగాది నుంచి నవమి వరకు దేవీ, శ్రీరామ నవరాత్రుల్నీ నిర్వహిస్తారు.
‘సత్పురుషులే వసంతం వంటివారు’ అని ఆదిశంకరుల మాట. వసంతాగమనంతో ప్రకృతిలో నూతనత్వం, యౌవన సమానమైన శోభ, లోకహితాన్ని కలిగించే పచ్చదనం- గోచరిస్తాయి. ప్రకృతి స్వరూపమైన జగన్మాతను ఈ సమయంలో ఆరాధించడమన్నది రుషులు సంభావించిన ఔచిత్యం. అదేవిధంగా లోకానికి వసంతంలా పుష్టిని, తుష్టిని, హితాన్ని కలిగించిన రామావతారమూ ఈ నవరాత్రుల ఆరాధనకు ప్రధానం. రామ, లలిత నామాలకు ‘సౌందర్యం’ అనే అర్థముంది. ఆనందం కలిగించే సౌందర్యం- ఆ రెండు దేవతామూర్తుల అసలు తత్వం. అందుకే వారిద్దరూ సోదరీ సోదరులని పురాణాలు వర్ణించాయి.
వసంతమూ ఆనందకర సుందరత్వమే కాబట్టి, ‘జగదానంద కారకం’ అయిన భగవత్ తత్వాన్ని ఈ వసంతంలో పూజించి భావించి తరించే ఉపాసనారీతులు ఎన్నింటినో వివరించారు. ఆనంద సుందర వసంతాది రోజున సుఖసంతోషాలు కోరుతూ- రానున్న వత్సర కాలం రాముడిలా, లలితాంబలా లోకానికి క్షేమం కలిగించాలంటారు. అందుకే పవిత్రమైన ఉగాది విధులు కొన్నింటిని ప్రాచీనులు రూపొందించారు.‘అబ్దాది కృత్యం’ (ఏడాది తొలినాడు చేయాల్సిన విధి) అని ధర్మగ్రంథాలు ఆయా పద్ధతుల్ని తెలియజేశాయి. ఈ రోజున విఘ్నేశ్వరుణ్ని, సరస్వతిని, ఇతర ఇష్టదేవతల్ని, గురువుల్ని ఆరాధించాలి. ఈ సంవత్సరం ‘విలంబి’ నామం. సూర్యవారమైన ఆదివారం ఉగాది కాబట్టి, ‘ఈ సంవత్సరానికి సూర్యుడు రాజు’ అంటుంది శాస్త్రం.
మనదైన శ్రద్ధ, శ్రమ, చిత్తశుద్ధి అన్ని రోజుల్నీ మంచి రోజులుగా మలుస్తాయి. అలాంటి మనోస్థితికోసమే నేడు భగవదారాధన, చక్కని భావనతో అందరి శ్రేయస్సునీ ఆకాంక్షించే చక్కటి విధుల్ని శాస్త్రాలు వివరించాయి.ఏ విలంబమూ (ఆలస్యం)లేని సత్ఫలితాల్ని ప్రసాదించే వత్సరం ఇది. తొందరపాటు లేకుండా ఆలోచిస్తే, ఆలస్యమూ క్షేమకరమేనని సూచిస్తోంది. మన చుట్టూ ఉన్నవారి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ, మనవల్ల ఏ ఒక్కరికీ హాని కలగకుండా జాగ్రత్తపడుతూ పయనించాలి. ఈ జీవితంలో సంవత్సరం మలుపు- ఒక మంచి భావంతో పురోగమించడానికి మరో శుభారంభం. అన్ని ఫలాలూ సత్ఫలాలేనన్న సద్భావనతో స్వాగతిద్దాం!
- సామవేదం షణ్ముఖశర్మ
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565