లేపాక్షి ఉత్సవాలు
గుండె మెచ్చే గండ శిలలు
రంభ నృత్యం వేలాడే స్తంభం
లే.. పక్షిలో..
ఒక పక్షి ఉంది.
దాని త్యాగం ఉంది.
లేపాక్షిలో రెండు కన్నులున్నాయ్!
అవి కన్న కలలున్నాయ్!
ఈ రెండింటి కలబోత.. మరెన్నో కళల పూత.. లేపాక్షి.
తెలుగు రాష్ట్రాల్లో అపురూప శిల్ప సంపదతో అలరారుతోన్న క్షేత్రాల్లో్ల లేపాక్షి ప్రముఖమైనది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆద్భుత పర్యాటక కేంద్రంలో మార్చి 31 నుంచి రెండు రోజుల పాటు ‘లేపాక్షి ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక వేడుకల్లో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారా.. అయితే లేపాక్షికి వెళ్లిపోదాం.
ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. నీలిరంగు అట్ట ఉన్న నోట్ పుస్తకాలు ఉండేవి. అదేనండి ‘లేపాక్షి నంది’ నోట్ పుస్తకాలు. ఆ ఆట్ట మీద వేలడంత సైజులో ఓ నంది చిత్రం ఉండేది. గుర్తొచ్చిందా. అట్టమీద అంగుళం పరిమాణంలో మురిపించిన నంది.. లేపాక్షిలో ఆకాశమంత కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం అది. 15 అడుగుల ఎత్తు.. 25 అడుగుల పొడవుతో.. మువ్వల పట్టీలతో.. మెడలో గంటలతో.. నిన్నో.. మొన్నో చెక్కారా అన్నంత చక్కగా దర్శనమిస్తుంది. ఈ నందిని చెక్కి దాదాపు ఐదు శతాబ్దాలు కావొస్తోంది. అప్పుడే ఆశ్చర్యపోకండి. అంతకుమించిన విషయాలు.. విశేషాలు.. మరెన్నో ఉన్నాయి లేపాక్షిలో.
వీరభద్రుడి కోసం..
లేపాక్షి విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అచ్యుతరాయల పాలనా కాలంలో పెనుగొండ సంస్థానంలో విరూపణ్ణ కోశాధికారి. ఆయన వీరభద్రుడి వీరభక్తుడు. లేపాక్షిలోని కూర్మగిరిపై వీరభద్రుడికి ఆలయం కట్టించాలని భావించాడు. కోశాగారంలోని ధనం వెచ్చించి నిర్మాణం మొదలుపెట్టాడు. రాయల వైభవానికి తులతూగే విధంగా.. ఏడు ప్రాకారాలతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రభువుల అనుమతి లేకుండా ప్రజాధనంతో విరూపణ్ణ ఆలయం కట్టిస్తున్నాడని అచ్యుతరాయలుకు ఫిర్యాదు చేశారు గిట్టనివారు. ఆగ్రహించిన రాజు.. విరూపణ్ణుడి కనుగుడ్లు పెకిలించాల్సిందిగా ఆజ్ఞాపించాడట. ఆ విషయం తెలుసుకున్న విరూపణ్ణ తనకు తానుగా కను గుడ్లు పెకిలించి విసిరేశాడని గాథ ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టే.. లేపాక్షి ఆలయంలో ఓ రాతిగోడపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆలయంలోని కల్యాణ మంటపం అసంపూర్తిగా మిగిలిపోవడం వెనుక కారణం కూడా ఇదేనని చెబుతారు.
మిగిలినవి మూడే..
లేపాక్షి ఆలయం ఏడు ప్రాకారాలతో నిర్మించారు. కాలక్రమంలో నాలుగు ప్రాకారాలు శిథిలమై.. మూడు మాత్రమే మిగిలాయి. వీరభద్రుడి ఆలయం, ఉప ఆలయాలు, నాట్య మంటపం, కల్యాణ మంటపం అన్ని నిర్మాణాలూ ఆనాటి శిల్పకారుల చాతుర్యాన్ని కళ్లకు కడతాయి. ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా.. 246 స్తంభాలను ఒకదానితో ఒకటి పోలిక లేని విధంగా అద్భుతంగా చెక్కారు. కల్యాణ మంటపంలో పక్కనున్న లతా మంటపంలో 36 స్తంభాలపై 144 రకాల ఆకృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ డిజైన్లను ధర్మవరం చేనేతలో వాడటం విశేషం.
అచ్చెరువు.. చిత్తరువు..
లేపాక్షి ఆలయంలో అబ్బురపరిచే మరో విషయం తైలవర్ణ చిత్రాలు. తమ నైపుణ్యంతో ఎన్నో విశేషాలను శిలలపై పొదిగిన శిల్పకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. అద్భుతమైన చిత్రాలతో పురాణేతిహాసాలను కళ్లముందుంచారు చిత్రకారులు. ప్రకృతి సిద్ధమైన రంగులతో వీటిని తీర్చిదిద్దారు. శతాబ్దాలు దాటినా ఆ చిత్రాల్లోని వన్నె తగ్గలేదు. ప్రధాన ఆలయం గర్భగుడి పైకప్పుపై 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గీసిన వీరభద్రుడి చిత్రాన్ని చూశాక ఎలా చిత్రించారా అనిపిస్తుంది. నాట్య మంటపంలో ఎటువైపు నుంచి చూసినా మనవైపే చూసేలా ఉండే శ్రీకృష్ణుని చిత్తరువును చూసి అచ్చెరువొందాల్సిందే. రామయాణ, మహాభారత ఘట్టాలను తెలిపే చిత్రాలు కనిపిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల పరిణయం, శివతాండవం వంటి చిత్రాలు.. లేపాక్షికి వచ్చే పర్యాటకులకు ఆనందాన్ని పంచుతాయి. ఎన్నో అద్భుతాలకు నెలవైన లేపాక్షికి వారాంతాల్లో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి వందల మంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడి శిల్పాలను తరచి తరచి చూస్తారు. చిత్రాలను కోరి కోరి వీడియోలు తీస్తుంటారు. ఈ పర్యాటక ప్రాంత సందర్శన మరింత మధురానుభూతిగా మిగిలిపోవాలంటే.. ‘లేపాక్షి ఉత్సవాల’ కన్నా మంచి తరుణం ఏముంటుంది. సంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు.. ఇన్నిటి మధ్య లేపాక్షి విహారం భలేగా సాగిపోతుంది.
భళా నర్తనశాల
70 స్తంభాలతో నిర్మించిన నాట్య మంటపం మధ్యలో 12 స్తంభాలు ప్రత్యేకమైనవి. మధ్యనున్న స్తంభంపై రంభ నాట్యం చేస్తున్నట్టుగా చెక్కారు. బ్రహ్మ మృదంగం వాయిస్తున్నట్టుగా, తుంబురుడు వీణను మీటుతున్నట్లుగా, భృంగీశ్వరుడు రంభకు నాట్యం నేర్పుతున్నట్టుగా, దత్తాత్రేయుడు, నటరాజు, శివుడు, పార్వతి తదితర దేవతలు నాట్యాన్ని చూస్తున్నట్టుగా స్తంభాలపై శిల్పాలు మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. మంటపం పైకప్పులో చెక్కిన శతపత్ర (వందరేకుల) పద్మం మరో ఆకర్షణ.
మూలాధారం ఇదే!
లేపాక్షికి వెళ్లే పర్యాటకులు నంది విగ్రహాన్ని చూశాక... వెంటనే ఓ స్తంభం చుట్టూ మూగిపోతారు. నాట్య మంటపం ఈశాన్య దిశలో ఉంటుంది. పైకప్పు ఆధారంగా భూమికి అర అంగుళం ఎత్తులో.. గాలిలో తేలాడుతున్నట్టు ఉంటుంది. యాత్రికులంతా కాగితాన్నో, దుస్తులనో స్తంభం కిందుగా పంపించి.. వింత అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఈ స్తంభాన్ని నాట్య మంటపం మూలాధార స్తంభంగా చెబుతారు. 1902 ప్రాంతంలో.. బ్రిటిష్ ఇంజినీరు హ్యయిల్డన్ వేలాడే స్తంభాన్ని పరీక్షించాలని పక్కకు నెట్టించగా.. మంటపంలోని మిగిలిన స్తంభాలు కూడా పక్కకు జరిగాయట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట ఆ ఇంజినీరు. ఇప్పటికీ మంటపంలోని స్తంభాలు ఓ పక్కకు ఒరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.
ఏడు పడగల నీడలో..
ఆలయ ప్రాకారాల మధ్యలో ఉన్న ఏడుతలల నాగేంద్రుడి విగ్రహం.. సెల్ఫీ జోన్‌గా మారిపోయింది. ఒక పెద్ద శిలను ఏడు తలల సర్పంగా చెక్కి.. పడగల నీడలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శిల్పం చెక్కడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లారట. అప్పటికి వారి తల్లి ఇంకా వంట చేస్తోందట. వంట పూర్తయ్యేలోపు శిల్పులంతా కలిసి.. భారీ శిలను నాగేంద్రుడిగా చెక్కేశారట.
రామాయణంలో..
లేపాక్షికి చారిత్రక గొప్పదనమే కాదు.. పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. రావణుడు అపహరించిన సీతను అన్వేషిస్తూ తిరుగుతున్న రాముడికి ఈ ప్రాంతంలో రెక్కలు కోల్పోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనిపించిందట. సీతమ్మను కాపాడేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన జటాయువుకు మోక్షం ప్రసాదిస్తూ శ్రీరాముడు ‘లే.. పక్షి’ అన్నాడట. అదే నేడు లేపాక్షిగా రూపాంతరం చెందిందని అంటారు. లేపాక్షి ఆలయం సమీపంలోని పెద్ద రాతిగుండుపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జటాయువు పక్షి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది.
ఎలా వెళ్లాలి..?
* లేపాక్షికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో హిందూపురం రైల్వే జంక్షన్ ఉంది. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం, బెంగళూరు నుంచి హిందూపురానికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి.
* లేపాక్షికి కొడికొండ చెక్‌పోస్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, అనంతపురం నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు విరివిగా బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోల్లో వెళ్లొచ్చు. లేపాక్షి, హిందూపురంలో బస చేయవచ్చు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565