అమృతమూర్తికి అభివందనం!
ఆమె ఆంతర్యం అగాధం...
ఆమె లేకుంటే అంతా శూన్యం...
ఆమె సృష్టికి ఓ కానుక...
ఆమె ఓ మధుర భావన...
ఆమె శక్తి అపారం...
ఆమె యుక్తి అమూల్యం...
ప్రేరణ ఆమే... లాలనా ఆమే...
తల్లిగా... తోబుట్టువుగా...
తోడుగా... నీడగా...
ఆమె పాత్ర అనితరసాధ్యం...
అందుకే ఆమెకు
శతకోటి వందనాలు...
అభినందన చందనాలు...
పట్టు పరికిణీ కట్టి చిట్టిచిట్టి చేతులతో గుమ్మం ముందు ముగ్గులేసే చిట్టితల్లుల్ని చూడండి... ఎంత కనుల పండువగా ఉంటుందో... వారు తీర్చిదిద్దిన రంగవల్లులు ఆరోజే చెరిగిపోవచ్చు. కానీ ఆ దృశ్యం మన గుండెల్లోంచి ఏనాటికీ చెరిగిపోదు. కన్నకూతురు మిగిల్చే తీపిజ్ఞాపకాలు గుండెలో నిక్షిప్తంగా ఉంటాయి. ఆమెను అత్తారింటికి పంపేటప్పుడు కన్నీరై వర్షిస్తాయి. ఇది నాన్నలకు ఆడపిల్లలు మాత్రమే ఇవ్వగలిగే అపురూప కానుక. అలాంటి తీపిగాయాలు ఆడపిల్లల నుంచి అమ్మనాన్నలకు దక్కే వరాలు.
‘‘కోడలొచ్చాక కొడుకు కొడుకు కాదు. పెళ్లయి వెళ్లిపోయినా పిల్లలు తల్లయినా కూతురు కూతురే.’ అని పెద్దలు చెబుతారు.
ప్రతి పురుషుడిలో కొంత స్త్రీప్రకృతి కలిసి ఉండడాన్ని ‘ఏండ్రిగొని’ అంటారు. ఈ ప్రవృత్తి లేకుంటే మనిషి మేధావి కాలేడన్నాడు ప్రముఖ కవి కాలే రిడ్జ్! మగవారిలో మార్ధవంతో పాటు మేధావి తనం ఉనికికి సైతం ఈ రసాయన ప్రక్రియ కారణమవుతుంది. ఇదే స్త్రీత్వానికి పట్టాభిషేకం. దీన్నే మన పురాణాలు అర్ధనారీశ్వర తత్త్వంగా అభివర్ణించాయి. పరమ శివుడు తన సగ దేహభాగం పార్వతికి ఇచ్చాడంటే అర్థం అదే. హక్కులలో సగం, ఆకాశంలో సగం వంటివి కేవలం నినాదాలు. ఆత్మలో సగం అర్ధాంగి సొత్తు. కవులలో, కళాకారులలో, నిజ జీవిత విజేతలలో యువతులు రగిల్చే స్ఫూర్తి, ఉత్తేజం అనితర సాధ్యం. ‘క్రైం అండ్ పనిష్మెంట్’తో లోక ప్రసిద్ధుడైన దోస్త్‌వ్ స్కీ సృష్టించిన అపూర్వమైన పాత్రలకు ఆయన ప్రేమించిన పోలినా సుస్లోవా అనే అమ్మాయి స్ఫూర్తిగా నిలిచిందంటారు సాహితీవేత్తలు. ఆల్‌ఫ్రెడ్ నోబుల్ డైనమైట్ కనుక్కోవడంలో దాని మూలంగా లభించిన అపార సంపదతో ప్రతిష్ఠాత్మక నోబుల్ బహుమతి వ్యవస్థను రూపొందించడంలో ఆయన ప్రియురాలు బెర్తా అనురాగం ప్రేరణగా నిలిచింది.
ప్రాచీన ప్రాకృత గాథల్లో ఒక పచ్చిబాలింత ఉదంతం మనల్ని కన్నీరు పెట్టిస్తుంది. ఆమెది పూరిగుడిసె. బయట హోరున వాన. కొబ్బరి ఆకుల పందిరిలాంటి పైకప్పు. ఎక్కడికక్కడే కారిపోతోంది. ఆమె ఒళ్లోని పసిబిడ్డ తడిచిపోతాడన్న వేదనతో కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ తన చీరకొంగును గొడుగులా ఎత్తిపట్టుకుంది. అయినా ఆ పసివాడు తడిచిపోతున్నాడు ‘వర్షపు నీటితో కాదు... ఆ తల్లి కార్చే కన్నీటితో’...
నాలుగు పెదవులు కలిసినప్పటికన్నా రెండు పెదవులు కలిసి రెట్టింపు తీపిని ఎప్పుడిస్తాయంటే అమ్మా అని పిలిచినప్పుడు. ప్రపంచంలోని గొప్పవారిలో ఎక్కువమంది తమ తల్లుల జీవ లక్షణాలను పుణికి పుచ్చుకున్నవారే’ అని పరిశోధనల్లో తేలింది. స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలైతే... ఇల్లాలికి గౌరవవాచకం అమ్మ!
అనేక దశల్లో సమాజానికి చుక్కానిగా నిలిచిన మహిళలు మన ఆచార వ్యవహారాలకూ ఆధార భూమికలు. తరతరాలుగా మగవాడి విజయానికి వెన్నెముకగా నిలిచిన మహిళ... సప్తపదిలో భర్త చిటికెన వేలు పట్టుకుని ఒద్దికగా వెనక నడిచిన మహిళ ఈ ఆధునిక యుగంలో ప్రపంచాన్నే తన చూపుడు వేలితో శాసించాలని... చిటికెన వేలితో నడిపించాలని సమాయత్తం కావడం ఈ యుగం ప్రత్యేకత. రాబోయేది మహిళా యుగమే. ధీశక్తిలో, స్థైర్యంలో, ముందుచూపులో, వివేకంలో స్త్రీదే ముందంజ. ఆధునిక మహిళ సాధించిన అమోఘ విజయమిది.
- వై.శ్రీలక్ష్మి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565