రామచంద్రుడి రాజనీతి
ఊరు పచ్చగా ఉంటే రామరాజ్యం!
వానలు సమృద్ధిగా కురిస్తే రామరాజ్యం!!
సమాజంలో శాంతి వెల్లివిరిస్తే రామరాజ్యం!!
రాముడు ఎలా పరిపాలించాడు..?
ఆయనకు పాలన మీద ఉన్న అవగాహనంతా ఆయన భరతుడిని కుశల ప్రశ్నలు అడిగే సమయంలో బహిర్గతమవుతుంది.
అన్నను తిరిగి రాజ్యానికి రప్పించేందుకు పరివారంతో కలిసి భరతుడు.అడవికి వెళ్లాడు. అప్పుడు రాముడు భరతుడిని ‘‘ఎలా ఉంటున్నావు? ఎలా పరిపాలిస్తున్నావు?’’ అని అడిగిన విశేషాలన్నీ అయోధ్యకాండ వందో సర్గలో ఉన్నాయి. అందులోని శ్లోకాల సారాన్ని చూస్తే రాజ్యపాలన మీద రాముడికి ఉన్న పట్టు అర్థమవుతుంది.ఈ సందర్భంగా భరతుడితో రాముడు అన్న మాటలు గుర్తు చేసుకుందాం.
మంత్రులు నీతిశాస్త్ర కోవిదులుగా, శూరులుగా ఉండాలి. మంత్రి మండలిలో ఏ ఒక్కరూ కూడా ప్రలోభాలకు లొంగకూడదు. మంచి ఆలోచనలు,. విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అసలు పాలకుడి దగ్గర ఉండే అమాత్యుడు ఎక్కువ నిద్రపోయే వాడై ఉండకూడదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రాజ్య రహస్యాలను ఎన్నడూ బయటపెట్టకూడదు. రాజకీయ, ఆర్థిక శాస్త్రాలు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. పాలకుడికి కానీ, ఆయన చుట్టూ ఉన్న మంత్రులు, అధికారులకు కానీ ఎదుటివారిని చూడగానే వారి మనసు అంచనా వేయగలిగే శక్తి ఉండాలి.
* దేశంలో రైతు అవసరం ఎంతో ఉంటుంది. ఏ కారణాల చేతైనా రైతులు పన్నులు చెల్లించలేని స్థితిలో ఉంటే.. వారి నుంచి బలవంతంగా శిస్తు వసూలు చేయరాదు. ఈ విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రభుత్వాన్ని ప్రజలు అవమానిస్తారు. న్యాయాన్ని అతిక్రమించి అధిక పన్నుల భారాన్ని ప్రజలపై మోపకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు సకాలంలో చెల్లించాలి. ఆ జీతాలు వారి జీవన భృతికి సరిపోయేలా ఉండాలి.
* ·దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. దేశభక్తి ఉన్నవారిని, మేధావులను, ప్రభుత్వం మీద అభిమానం ఉన్నవారిని ఎప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. అలాగే వర్తక, వ్యాపారవేత్తలకు ప్రభుత్వం సహకార సంపత్తులను నిరంతరం అందించగలగాలి.
* పాలకుడనేవాడు ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి.. ఆంతరంగికులతో చర్చించాకే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంతకు ముందు తరాలలో ఉన్నవారు రాజ్యాన్ని, ప్రజలను బాగా పరిపాలించి ప్రశంసలు అందుకొని ఉంటారు. అలాంటివారి అనుభవాలను, కార్యాలను పరిగణనలోకి తీసుకొని పాలన చేయడం ఉత్తమం.
* రాజ్యపాలనలో ఉండే 18 రకాల కార్యనిర్వాహకులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అవసరమైన చోట పటిష్ఠమైన గూఢచర్య వ్యవస్థ ఉంచి జాగ్రత్త పడాలి. ఒక సార్వభౌముడిగా శ్రీరాముడు తన పాలనలో వీటన్నిటినీ ఆచరించాడు. అందుకే ఆనాటి అన్ని వర్గాల ప్రజలు ఎంతో హాయిగా ఉన్నారు.
- యల్లాప్రగడ మల్లికార్జునరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565