షడ్రుచుల సారం... జీవనవేదం..!
పచ్చని వనాలూ పూల హరివిల్లులూ వేపపూత గుబాళింపులూ మావిచిగురు అందాలూ కోయిలమ్మ కుహుకుహురాగాలూ మరుమల్లెల పరిమళాలతో విరిసిన మధుమాసంలో అందంగా అరుదెంచింది విళంబి నామ ఉగాది...షడ్రుచుల సంవత్సరాది..!
చెట్లు చిగురిస్తాయి...ఆశల పల్లకీలో ఊరేగిస్తూ. పచ్చదనం పల్లవిస్తుంది... నేత్రానందాన్ని అందిస్తూ. మరుమల్లెలు విచ్చుకుంటాయి... మన్మథబాణాలు వేస్తూ. గండుకోయిలలు గళం విప్పుతాయి... వీనులవిందు చేస్తూ... ఇలా ఎటుచూసినా అందంగా కనువిందు చేస్తుంటుంది వసంతరుతువు. అది మొదలయ్యే రోజే ఉగాది... చైత్ర శుద్ధ పాడ్యమి. ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇది రుతువులు మారే సమయం... కఫ ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి తిక్త(చేదు), కషాయ(వగరు) రస ప్రధానమైన ఆహారం అవసరం అని చెబుతారు. వీటికి మరికొన్ని రుచులు జోడించి చేసేదే ఉగాది పచ్చడి. వాత, కఫ, పిత్త దోషాలను హరించే అద్భుత ఔషధం.
‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’
అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని తినాలని చెబుతోంది శాస్త్రం. దీన్నే నింబ కుసుమ భక్షణం, అశోక కళికాప్రాశనం అనీ అంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి తింటే ఏడాది పొడవునా జబ్బులు రావా అన్న సందేహం సహజం. ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకూ వచ్చే రాత్రులను వసంత నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులపాటు పరగడుపునే ఉప్పు, కారం, వగరు, చేదు, పులుపు, తీపి అనే ఆరు రుచులు కలగలిసిన ఉప్పు, పచ్చిమిర్చి, మామిడికాయ, వేపపువ్వు, చింతపండు, బెల్లం కలిపి చేసిన ఈ పచ్చడిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నాయి శాస్త్రాలు. పూర్వం చైత్ర శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ దీన్ని సేవించేవారు. ఒకప్పుడు మామిడిపిందెలకు బదులు మామిడి చిగుళ్లూ అశోక చిగుళ్లూ దంచి కలిపేవారట. కాలక్రమంలో చిగుళ్లకు బదులు మామిడి పిందెలు, లేత మామిడికాయలను వేస్తున్నారు. నిజానికి పూర్వం లేత వేపచిగుళ్లు, ఇంగువ, బెల్లం, సైంధవ లవణం, చింతపండు, తాటిబెల్లం, వాము, జీలకర్ర, పసుపు వేసి మెత్తగా నూరి పరగడుపున తినేవారని కొన్ని శాస్త్రాలు చెబుతుంటే; చింతపండుగుజ్జులో వేపపువ్వు, బెల్లం, నెయ్యి వేసి పరగడుపునే తీసుకునేవారని మరికొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ఆయుష్షు పెరిగి వజ్ర సమాన దేహం సిద్ధిస్తుందట. కానీ కాలానుగుణంగా ఆరు రుతువుల్లోనూ ఏర్పడే త్రిగుణాత్మక కష్టసుఖాలను అనుభవించడానికి సంసిద్ధంగా ఉన్నాం అన్నదానికి సూచనగా ఆరు రుచులనూ కలిపి సేవించడం మొదలైంది. ఏ కాలానికి ఏది వచ్చినా స్వీకరిస్తాం అని శపథం చేయడానికి సంకేతమే ఈ పచ్చడి సేవనం. అందుకే ప్రస్తుతం అంతా వేకువనే లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, ఇంటిని మామిడాకుల తోరణాలతో అలంకరించి, ఇష్టదేవతారాధన చేశాక ఉగాది పచ్చడిని తింటున్నారు.
శాస్త్రం ఇంకేమంటోంది?
‘జిహ్వాగ్రే వర్తతే సర్వమ్ (నాలుక చివరనే అంతా ఉంది)’ అని నీతిశాస్త్రం చెబుతోంది. నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యాన్ని కొనితెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులనూ సమానంగా భరించడం తన కర్తవ్యంగా నాలుక గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు. కాబట్టి దానికి ఇదో హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి.
వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా మారి శత్రువు అవుతుంది. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. వాటిని జయించగలగడమే మానవ జన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం అదే. తీపి కామానికీ, కారం క్రోధానికీ, ఉప్పు మోహానికీ, పులుపు లోభానికీ, చేదు మదానికీ, వగరు మాత్సర్యానికీ సంకేతాలు. మనం తినే పదార్థాలు ఏవైనా ఈ ఆరు రుచుల్లోకే వస్తాయి. ఏదో ఒక రుచి లేకుండా తినలేం. అన్ని రుచులనీ కలిపి తింటే మనం గెలిచినట్లు. ఏదో ఒక రుచిని మెచ్చుకుంటూ తింటే ఓడినట్టు. అందుకే అన్నింటినీ గెలుస్తాం అన్న దానికోసమే కొత్త ఏడాదిలో పరగడుపునే ఉగాది పచ్చడిని రుచి చూస్తారు. అటు జీవనసారాన్నీ బోధిస్తూ ఇటు ఆరోగ్యాన్నీ చాటే ఆ ఆరు రుచులేమిటంటే...
ఆరూ... ఆరోగ్యదాయకాలు!
చేదు: వేపపూత చేదుగా ఉంటుంది. నోటికి రుచించదు. జీవితంలో బాధ కలిగించే సంఘటనలన్నీ చేదుగానే ఉంటాయి. వాటిని సైతం తట్టుకుని మింగాలని చెప్పేదే ఈ వేపపూత. ఆరోగ్యపరంగా చూస్తే వేపపువ్వులోని చేదు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. మంటను తగ్గించి, రక్తశుద్ధికి తోడ్పడుతుంది. చర్మవ్యాధుల్ని రానివ్వదు. కంటిచూపుని మెరుగుపరుస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. కుష్ఠువ్యాధిని రానివ్వదు. నాలుకకు రుచి జ్ఞానాన్ని కలిగిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. దీన్ని నూనెతోగానీ నెయ్యితోగానీ వేయించి, ఉప్పూ కారం కలిపి అన్నంతో తింటే సర్వరోగనివారిణిలా పనిచేస్తుందట.
తీపి: బెల్లం మధురంగా ఉంటుంది. ప్రతిమనిషి జీవితంలోనూ మధురానుభూతులు కొన్నే ఉంటాయి. ఎందుకంటే నిత్యం అవే అనుభవంలోకి వస్తే దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఉండదు. తియ్యగా ఉంది కదాని అతిగా తింటే, ఆ తీపి కూడా చేదెక్కుతుంది. ఆరోగ్యం పాడవుతుంది. బెల్లంలోని తీపి ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది. దీన్ని మితంగా తీసుకుంటే మనసుని ఆహ్లాదపరుస్తుంది. అందులో శరీరానికి కావాల్సిన విటమిన్లూ ఖనిజాలూ లభిస్తాయి. దగ్గు, అజీర్తి, అలర్జీ, మలబద్ధకాల్ని నివారిస్తుంది. శరీరకాంతికీ శిరోజాల పెరుగుదలకీ తోడ్పడుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది. బరువును పెంచుతుంది. ఉదర వ్యాధుల్నీ వాతాన్నీ పోగొడుతుంది.
ఉప్పదనం: ఉప్పు లేని పప్పు రుచించదు. అంటే రుచికి కారణం ఉప్పే. దీన్ని ఉత్సాహానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇది సరైన పాళ్లలోనే ఉండాలి. అప్పుడే జీవితంలోనూ విజయం వరిస్తుంది. ఆరోగ్యపరంగానూ ఉప్పు ఎక్కువయినా తక్కువయినా ముప్పు తప్పదు. కాబట్టి సమానంగా తీసుకుంటే ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతౌల్యం చేస్తుంది. చెమటపట్టేలా చేస్తుంది. జీర్ణక్రియా వేగాన్ని పెంచుతుంది. శరీరంలోని కొవ్వునూ కంతులనూ కరిగిస్తుంది. జడత్వాన్ని పోగొడుతుంది.
పులుపు: చింతపండులోని పులుపు నేర్పునకు సంకేతం. నేర్పు లేకుండా జీవితంలో నెగ్గుకురాలేం. అందుకే పచ్చడిలో కాస్త పులుపూ పడాల్సిందే. ఆరోగ్యపరంగా ఇది ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. గుండెకి బలాన్ని కలిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోబాటు విరోచనకారిగానూ పనిచేస్తుంది.
కారం: కారం/పచ్చిమిర్చి/మిరియాల్లోని కారం రుచిగానే ఉంటుంది. కానీ దాన్ని తినేటప్పుడు పుట్టే మంటను తట్టుకోవాలి. అంటే జీవనగమనంలో ఎదురయ్యే సంఘటనలకు సహనం ఉండాలి అని చెబుతుంది. అప్పుడే వాటి ఫలితాన్ని రుచి చూడగలం. ఆరోగ్యానికొస్తే ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కొవ్వుని కరిగించి చర్మ, కంఠ రోగాలను పోగొడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
వగరు: మామిడిపిందెలు వగరుగా ఉంటాయి. ఇవి సవాళ్లకు సంకేతం. వాటిని స్వీకరించేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నదే వీటి సారాంశం. ఆరోగ్యపరంగా మామిడిపిందెలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. ముఖ్యంగా పొట్టలో పేరుకున్న వాయువులను పోగొడతాయి. పెద్ద పేగుకి బలాన్ని చేకూర్చడంతోబాటు, శరీరాన్ని చల్లబరిచి, వడదెబ్బను పోగొడతాయి.
ఎలా చేస్తారు?
కొత్త కుండలో లేదా గిన్నెలో చిక్కటి చింతపండు రసంలో బెల్లం, మామిడి పిందెల్ని దంచిన మిశ్రమం లేదా మామిడిముక్కలు కలపాలి. దీనికి వేపపువ్వు, ఉప్పు, మిరియాలపొడి లేదా పచ్చిమిర్చి లేదా కారం వేసి కలుపుతారు. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు, పుట్నాలపప్పు, చెరకుముక్కలు, తేనె కూడా జోడిస్తారు. ఇటీవల తమ అభిరుచులకు అనుగుణంగా ద్రాక్షపండ్లూ, దానిమ్మగింజలూ, ఖర్బూజ, పుచ్చ... ఇలా రకరకాల పండ్లనూ జోడించి చేస్తున్నారు.
ప్రాంతాన్నీ అభిరుచినీ బట్టి ఎవరు ఎలా చేసుకున్నా జీవితంలోని భిన్న భావోద్వేగాలకు ప్రతీకే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565