MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉగాదిరోజు_Ugadi Visistatha-Telugu New Year



ఉగాదికే పంచాంగ శ్రవణం ఎందుకు?

చైత్రమాసం ప్రకృతిలో వసంతం వెల్లివిరుస్తుంది. . చెట్లు చిగురిస్తాయి. . పచ్చని ఆకులు నేత్రపర్వం చేస్తాయి.. కోకిలలు వీనుల విందుగా కూస్తాయి.. ప్రకృతిలో కొత్తదనం పరచుకొంటుంది . అంతటా నవవికాసం ఆవిష్కృతమౌతుంది.. మానవజీవితంలో నిత్య వసంతానికి అది ఓ సంకేతమే ! మనిషి గుణసంపద, యోగ్యతలకు చెట్టు చిగురు సంకేతమైతే , కాయలు వ్యక్తి ఎదుగుదలకు , పండ్లు అనుభూతులకు , కోకిల కూతలు మంగళధ్వనులకు సంకేతాలు . కనుక మానవ జీవనం ప్రతి నిత్యం వసంతమే.


చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని

శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి

వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ 


ప్రవర్తయామాస తదా కాల సగణనామపి 


గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్‌. 



బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ సృష్టి ప్రారంభమైందనీ, ప్రభవించిందనీ అర్థం. అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. నాశనమైందని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథివున్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయ సింధుకారుడు కూడా అదే చెప్పాడు. 


ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు 864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం. అంటే మూడు లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్ళు బ్రహ్మ ఆయుర్దాయం. 



ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి, వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదేనని ప్రతీతి. యుగం అంటే జంట అనే అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే జంట ఆయనాలతో కూడిన యుగ ప్రారంభానికి యిది తొలి రోజు కనుక దీనిని ఉగాది అన్నారు. సృష్ఠి ఆరంభంలో తొలి సూర్యోదయం చైత్రశుద్ధ పాడ్యమినాడు (ఉగాది) లంకానగరంలో జరిగిందని, భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి'లో ప్రస్తావించాడు. విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిందీ ఉగాదినాడే. 



భారతీయతకు మూలం వేదం. వేదంలో చెప్పబడ్డ మధు, మాధవ మాసములు జ్యోతిషశాస్త్రం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలుగా నిర్ధారించారు. చిత్తా నక్షత్రంతో సంబంధమున్నది చైత్రమాసం. జగత్కళ్యాణదాయకం అయిన శ్రీరామ పట్టాభిషేకానికి వసంత సమయమే సముచితమని భావించి వశిష్టాది మహర్షులు శ్రీ రామావతారానికి ప్రేరణగా నిలిచారు. ద్వాపరయుగం ముగిసిన తరువాత విధాత కలియుగాన్ని ఈరోజే ప్రారంభిచాడన్నది పురాణ కథనం. మహాభారత కాలంనుంచీ ఉగాది పర్వాన్ని నిర్వహిచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇన్ని విశేషాలున్న పర్వదినం కాబట్టే ఉగాది మనకు పండుగ రోజు అయింది. 



కాలాన్ని ఆరాధించడం 


మన హిందూ సంప్రదాయంలో పండుగలు ఒక ప్రత్యేక దైవారాధనతో జరుపుకోవడం మన ఆచారం. కానీ ఉగాది ఏ దైవారాధనకు సంబంధించినది కాదు. కాలాన్ని ఆరాధించే పండుగ. ఇందులోనూ అంతర్లీనంగా దైవచింతన ఉంది. "కాలః కాలయతా మహం'' అన్నాడు శ్రీకృష్ణుడు. కంటికి కనిపించని ఆ కాల స్వరూపం నేనే అంటాడు గీతాచార్యుడు. అందుకే ఉగాది రోజున విష్ణు సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం. ఈరోజున బ్రహ్మ సృష్టి చేశాడు కనుక బ్రహ్మను కూడా పూజించాలి. 


తైలాభ్యంగం, సంకల్పాదవు, నూతనవత్సర నామకీర్త నాద్యారంభం... 


ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం, వత్సరాది ఫలశ్రవణం. 


తైలాభ్యంగనం, నూతన సంవత్సర సంకల్పం, దేవుని నామకీర్తనం, ధ్వజారోహణం (పూర్ణ కుంభదానం), ఉగాదిపచ్చడి తినడం, పంచాగశ్రవణం ఇవి ఉగాదిరోజు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. ఉగాది పండుగనాడు వేకువ జామునే నిద్రలేచి అభ్యంగనం చేసి కొత్తబట్టలు ధరించి , ఇంటికి మామిడాకుల తోరణాలతో అలంకరించి, ఇష్టదేవతారాధన పూర్తిచేయాలి. అనంతరం బంధుమిత్రులతో కలిసి, మృష్టాన్న భోజనాలు చేయడం సంప్రదాయం. ఉగాది నూతనత్వానికి మారుపేరు కనుక ఈరోజున కొత్త నిర్ణయాలను తీసుకోవడం, ఆయా కార్యాలకు శుభారంభం చేయడం ఉగాది ప్రత్యేకత. 



ధర్మ కుంభదానం 


ఉగాదినాడు ప్రతి గృహమందు ధ్వజారోహణం చేయాలి. ఒక నూతన కలశంను వేపాకులతో అలంకరించి, అందు పంచపల్లవములు అనగా మామిడి, అశోక, నేరేడు, మోదుగ, వేపచిగుళ్ళు వేసి ఆ కలశాన్ని శుద్ధ జలంతో నింపి, ఆ జలములో సుగంధచందనాదులు, పుష్పాక్షతలు వేసి ఆ కలశానికి నూతన వస్త్రాన్ని చుట్టి, పసుపు, కుంకుమ, చందనం దారాలతో అలంకరించి కలశముపైన ఒక కొబ్బరిబొండాన్ని ఉంచి, ఇష్టదేవతను ఆవాహన చేసి, పుణ్యమంత్రాలతో, షోడశోపచారాలతో అర్చించి, ఉగాది పచ్చడిని నివేదన చేసి, ఆ కలశాన్ని కులగురువుకుగానీ, పురోహితుడికిగానీ దానమిచ్చి వారిని నూతన వస్త్రాలతో, దక్షిణలతో సత్కరించి, వారి ఆశీస్సులు పొందాలి. దీనినే 'ధర్మకుంభదానం' అంటారు. 



ఉగాది పచ్చడి 


మానవ జీవితం అనేక రుచుల కలయిక. అన్ని రుచులూ కలిస్తేనే మనిషి శరీరం సమగ్ర వికాసాన్ని అందుకొంటుంది. మనస్సు విశ్వతోముఖంగా ప్రసరిస్తుంది. అందుకే ఉగాదినాడు ఆరు రుచుల పచ్చడిని ప్రసాదంగా ఆరగిస్తారు. మధురానుభూతుల తీపి, కష్టాల చేదు, సమస్యలతో మింగుడుపడని కారం, బాధల ఉప్పు, కడగండ్ల పులుపు, అపజయాల వగరు మానవ జీవితంలో సహజ రుచులే. వీటిని సమన్వయం చేసుకుని అనుకూలంగా రంగరించుకొని ప్రయాణించడమే జీవనం. ఆశలు చిగురుల వంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలని కోరుకోవడమే జీవన వసంతం. ఎల్లప్పుడూ మంగళధ్వనులే వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిలకూత. ఇలా ఉగాది పండుగ మనిషి బ్రతుకులో కీలకంగానూ, మూలకంగానూ ఆవిర్భవించింది. నూతన సంవత్సరంనాడు ఎవరైతే నింబ కుసుమ భక్షణం చేస్తారో వారికి సంవత్సరమంతా ఆయురారోగ్యాలు, ఐశ్యర్యాలు, అదృష్టం వరిస్తుందని శాస్ర్తవచనం 



శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ 


సర్వారిష్ట వినాశాయ నిబకం దళబకణం 



అనే శ్లోకం చెప్పుకుంటూ పవిత్రమైన ఉగాది పచ్చడి స్వీకరించాలి. ఈ సమయంలో ప్రకృతి అప్పుడే చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారుతుంది కాబట్టి వాతావరణం మార్పులకి కఫ దోషాలు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ పచ్చడి ఎంతో ఉపయోగపడుతుంది. ఉగాదిరోజు నుంచి శ్రీ రామ నవమిరోజు వరకు ఈ పచ్చడి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు చెపుతున్నారు. 



పంచాంగ శ్రవణం ఎందుకు? 


అభ్యంగన స్నానం చేసి పచ్చడి తిన్న తర్వాత ఉగాదినాడు ఆచరించే మరొక కార్యక్రమం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే ఐదు అంగములతో కూడుకున్నది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము. ఇవి, మనకు దీర్ఘాయుర్దాయాన్నివ్వడానికి, ఎటువంటి అకాల మృత్యువు దాపురించకుండ ఉండటానికి, ఈ ఐదింటిని ప్రతిరోజు ప్రతివారు చూడాలని అంటారు. అందువల్లనే ఉగాదినాడు సాయంత్ర వేళలో ఈ ఐదింటి సమన్వయమైన పంచాంగం వినడం ఆనవాయితీ. ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగం వినాలని శాస్ర్తం చెబుతుంది. పంచాంగశ్రవణం ఎంతటి భాగ్యం ప్రసాదిస్తుందో తెలుపుతోంది ఈ ప్రాచీన శ్లోకం.- 



‘శ్రీకల్యాణగుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం 


గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణామ్‌ 


ఆయుర్‌వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం 


నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్‌’ 



‘‘ఓ మానవులారా! పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. సకల మంగళాలనూ ప్రసాదిస్తుంది. ఎన్నో గుణాలను అందిస్తుంది. శత్రువులను దూరం చేస్తుంది. పీడకలలు రాకుండా చేస్తుంది. దోషాలను తగ్గిస్తుంది. గంగాది పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలితం ప్రాప్తిస్తుంది. గోదాన పుణ్యం ప్రసాదిస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తుంది. అనేక శుభాలు అందిస్తుంది. చక్కని సంతానాన్ని అందిస్తుంది. ప్రతి పనిలోనూ విజయం చేకూర్చడం ద్వారా అనేక ఫలితాలను అందిస్తుంది. కనుక పంచాంగాన్ని వినడం, చదవడం మనిషికి సముచితం. పంచాంగాన్ని తప్పక వినండి’ అనేదే ఈ శ్లోక భావం. అందుకే ఈ రోజు పంచాగ శ్రవణంలో చెప్పే గోచార ఫలితాలు తప్పక తెలుసుకుంటారు. సంవత్సర ఫలితాలన్నిటినీ వింటారు. పంచాంగ శ్రవణ సమయంలో నవగ్రహాలను స్మరించడం ద్వారా ఆయా గ్రహాల కటాక్షం లభిస్తుంది. 



ఉగాది నవరాత్రులు 


ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. వీటిని వసంత నవరాత్రులు, రామ నవరాత్రులు అంటారు. ఆరు రుతువులతో పాటు మూడు గుణాలు కలిపి నవరాత్రులంటారు. ఈ నవరాత్రులలో శ్రీరాముడిని, అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిదిరోజుల వరకు శ్రీరామార్చణ, రామాయణ పారాయణం చేసి నవమి రోజున శ్రీరామ కల్యాణం జరుపుతారు. అదేవిధంగా రుతు సంధిషు వ్యాధిర్జాయతే.. అని ఆయుర్వేద గ్రంథాలు చెబ్తున్నాయి. ముఖ్యంగా వసంత, శరత్ రుతువులు యమ దంష్ట్రలని దేవీ భాగవతం వంటి పురాణాలు చెప్తున్నాయి. అందుకే శారీరక, మానసిక ఆరోగ్యాల కోసం ఆహార, విహార నియమాలు ఏర్పాటు చేశారు. శిశిరం వెళ్లి వసంతం వచ్చే సమయంలో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. వాటికి అనుగుణంగా ఉగాది రోజున వసంత నవరాత్రి ఉత్సవాలు అందుకే జరుపుకుంటారు. 



చలివేంద్రం ప్రారంభం 


ఉగాదిరోజు ఉదయాన్నే తలస్నానం. దేవతారాధన, ఉగాది పచ్చడి స్వీకరించడం, పంచాగ శ్రవణంతో పాటు మనకు వీలైతే చేయవలసిన మహత్కార్యం మరోటి ఉంది. అదే ప్రపాదానం. అంటే చలివేంద్రం ఏర్పాటు చేయడం. ఇంటిముందుగానీ, వీధిలో గానీ చలివేంద్రం స్థాపించి బాటసారులకు చల్లనినీరు అందిస్తే ఎంతో గొప్పపుణ్యం లభిస్తుంది. శుచిగా ఉన్న చోట, అలికి ముగ్గుపెట్టి కొత్త కుండలలో నీరు నింపి గణపతిని, ఇతర దేవతలను స్మరించి, కొబ్బరికాయ కొట్టి చలివేంద్రం ప్రారంభించాలి. ఈరోజున పితృదేవతలకు తర్పణలు కూడా ఇవ్వవచ్చు ఇవి ఉగాది పండుగనాడు ధర్మశాస్త్రం చెప్పిన ఆచారాలు. 


                                                                             – బ్రహ్మశ్రీ అవధూత శర్మ


















1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list