MohanPublications Print Books Online store clik Here Devullu.com

Sri Rama Navami Special Movie Songs ||

clik image play songs

Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

జగదభిరామనవమి 


రామనామం జగన్మోహనకరం. పేరులోనే లోకాన్ని ఆనందింపజేసే గుణం ‘రామ’శబ్దంలో ఉంది. అందుకే రాముడు జగదభిరాముడయ్యాడు. పేరులోనే గాక, గుణగణాల్లోనూ అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మానవోత్తముడు శ్రీరాముడు. ఈ అవతారపురుషుడి జన్మదినం, వివాహదినం శ్రీరామనవమి. ఏటా వసంతŸ రుతువు చైత్రమాసంలోని శుక్లపక్షంలో నవమి తిథినాడు సంక్రమించే ఈ శుభదినం మానవాళికి ఆదర్శపాత్రం, అభ్యుదయకారకం. 

శ్రీరాముడు జన్మించిన సమయంలో నక్షత్రమండలంలో అయిదు గ్రహాలు ఉన్నత స్థానంలో ఉన్నాయంటారు. ఇంత మంచివేళలో లోకోత్తర గుణాలు గల మహాపురుషులే అవతరిస్తారని శాస్త్రవాక్యం. అందుకే రామ జననవేళ విశ్వ క్షేమకారకం. వైవస్వత మన్వంతరంలోని పంచమ త్రేతాయుగం నాలుగో భాగంలో, విలంబి నామసంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు రాముడు జన్మించాడని ఒక భారతీయ కాలమానం చెబుతోంది. ఈ ఏడాది కూడా విలంబి కావడం విశేషం. 
శ్రీరాముడికి ఇంతటి విశిష్టత రావడానికి ఆయన ఉదాత్త శీలమే కారణం. ‘లోకంలో అత్యధిక గుణసంపద గల మహానుభావుడెవరు’ అని వాల్మీకి ప్రశ్నించినప్పుడు, నారదమహర్షి రాముణ్ని ప్రస్తావిస్తాడు. ఆయన గుణగణాల్ని వివరిస్తాడు. ఆకాశంలోని చుక్కల్లా అనంత గుణాలు కలిగిన రాముడి గురించి తెలుసుకొని, తాను కావ్యం రాస్తే అలాంటి మహాపురుషుడిపైనే రాయాలని వాల్మీకి నిర్ణయించుకొన్నాడు. రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. రామగాథ వాల్మీకితో పాటు లోకాన్నీ తరింపజేసింది. ఉన్నత గుణాలు గలవారి చరిత్రలనే కావ్యాలుగా రాయాలని అలంకారశాస్త్రాలూ ప్రబోధిస్తున్నాయి. 
తండ్రిమాట నిలబెట్టడం కోసం రాజ్యాన్నే త్యాగం చేసి, అడవుల బాట పట్టిన సత్యవాక్య పాలకుడు రాముడు. ఏకపత్నీవ్రతాన్ని ఆజీవనాంతం ఆచరించిన సచ్ఛీలి ఆయన. భ్రాతృవాత్సల్యాన్ని ఆదర్శవంతంగా కొనసాగించిన ప్రేమమూర్తి. 
అన్యోన్య దాంపత్యానికి పార్వతీ పరమేశ్వరుల్ని, ఆదర్శ దాంపత్యానికి సీతారాముల్ని ప్రత్యక్ష నిదర్శనాలుగా భావిస్తారు. కష్టసుఖాల్లో భార్యాభర్తలు కలసి నడవాలన్న నీతిసూత్రానికి వారే ఉదాహరణలు. 
వనవాసానికి పయనమయ్యే సమయంలో రాముడు- అపాయాలకు, ఆపదలకు నెలవైన అడవుల్లో నివసించడం ప్రమాదకరం కాబట్టి అయోధ్యలోనే ఉండిపొమ్మని సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. భర్త లేని అయోధ్య అడవిలాంటిదని, ఆయన ఉన్న అడవి అయోధ్య వంటిదని ఆమె సమాధానమిస్తుంది. నీడలా ఎప్పుడూ భర్తను అనుసరించే ఉంటానని పలికి అనేక కష్టాల్ని ఎదుర్కొన్న సాధ్వి సీతాదేవి. విడదీయలేని ప్రేమకు ప్రతిరూపాలైన సీతారాములు, అందుకే జగదారాధ్యులయ్యారు. ఎన్ని తరాలు గడిచినా సీతారాముల పెళ్లి విశ్వ కల్యాణంగానే విరాజిల్లుతోంది. 
భద్రాద్రి వంటి ప్రముఖ క్షేత్రాల్లోనే గాక ఊరూరా, ఇంటింటా సీతారామ కల్యాణాల్ని చూస్తుంటే శ్రీరామనవమికి గల ప్రత్యేకత, పవిత్రత ఎంతటిదో తేటతెల్లం అవుతుంది. కల్యాణం అనేది ఇంటివేడుక మాత్రమే కాదని, అది కుటుంబ వ్యవస్థ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చేసే పవిత్ర యజ్ఞమని రామాయణం చెబుతోంది. కన్యాదాతకు, కన్యా ప్రతిగ్రహీతకు సకల భోగభాగ్యాలు అందించేదే వివాహమని విశ్వగురువులైన వసిష్ఠాదులు జనక, దశరథులకు బోధించారు. ఇందుకు ఉదాహరణగా నిలిచేదే సీతారామ కల్యాణం. 
వివాహఘట్టంలో సీతారాముల తలంబ్రాల సమయం మనోహరం. ఎర్రమందారాల వంటి సీత అరచేతుల నుంచి జాలువారే అక్షతలు పద్మరాగమణులుగా మారాయి. నల్లనివాడైన రామయ్య అరచేతులమీదుగా జారే తలంబ్రాలు కుందపుష్పాలుగా రూపుదిద్దుకున్నాయని వర్ణించే శ్లోకాన్ని నేటికీ పెళ్లిళ్లలో గుర్తుచేసుకుంటారు. వివాహజీవితం అనురాగరంజితం కావాలన్న ఆశీస్సును అది అందిస్తుంది. మానవోత్తముడైన రాముడి ఆదర్శాల్ని తలచుకొంటూ, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి శ్రీరామనవమి స్ఫూర్తినిస్తుంది.
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మhttps://youtu.be/_QViIvulMSk

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list