కల్యాణవైభోగమే...వెన్నెల్లోకల్యాణం
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు... అంటాడు పోతన. రామయ్య పెండ్లిని వీక్షించు జన్మ జన్మ అంటారు భక్తులు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ చివర ఉత్తరాంధ్ర నుంచి
ఈ చివర రాయల సీమ వరకూ జరిగే సీతారామ కల్యాణాల్లో విశేషాలెన్నెన్నో!
రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని వై.ఎ్‌స.ఆర్. కడప జిల్లాలో, ఆంధ్రా భద్రాద్రిగా వాసికెక్కిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో మాత్రం చంద్రుని వెలుగుల్లో రాత్రి వేళ కల్యాణం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక పురాణగాథ వుంది. క్షీరసాగర మథనం తరువాత లక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని స్వామి వరమిచ్చాడు. దాని ప్రకారమే చైత్ర శుద్ధ చతుర్దశి నాటి రాత్రి ఇక్కడ స్వామివారికి కల్యాణం జరుపుతారు.
పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ రామాలయం కడప-చెన్నై ప్రధాన రహదారిలో కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఒంటిమిట్టలో ఉంది. ఒక రాతి గుట్టపై మూడు గోపురాలతో 32 అద్భుత శిల్పమయ స్తంభాలతో రంగ మండపం, కల్యాణ మండపం ఉన్నాయి. సీతారామలక్ష్మణులు ఒకే శిలపై వెలసి ఉన్నందున ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా వినుతికెక్కింది. దేశంలో హనుమ లేని రామాలయాలు చాలా అరుదు. హనుమంతుడు లేకుండా నిర్మించిన ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒంటిమిట్టను ప్రభుత్వం టీటీడీ ఆధీనంలోని ఆలయాల్లో విలీనం చేసింది. ఈ నెల 24 నుంచి ఒంటిమిట్టలో 11 రోజుల పాటు తిరుమల తరహాలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 30న ఉత్సవంలో ప్రధానమైన సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది.
రామాలయ ఆవిర్భావం
మట్లి పాలకుల్లో ఒకరైన సదాశివరాయుల కాలం నాటి శిలాశాసనాలను బట్టి చూస్తే ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని 1350లో ఉదయగిరిని పాలించిన కంపరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది. 1356లో ఉదయగిరి సింహాసనాన్ని అధిష్ఠించిన కంప సోదరుడైన బుక్కరాయలు ఒంటిమిట్ట కోదండరామాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. మట్లిరాజుల్లో ఒకడైన అనంతరాజు రామాలయ గుడిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ గోపుర నిర్మాణాలు మొదలు పెట్టగా అనంతరాజు కుమారుడైన తిరువెంగళనాఽథ రాజు మనుమడు కుమార అనంతరాజు పూర్తి చేశాడు.
ఇతిహాసాలెన్నో...
రామడు అరణ్యవాసం చేస్తూ ఒంటిమిట్టకు వచ్చినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ తపస్సు చేసుకొనే మునుల కోరికపై రామలక్ష్మణులు రాక్షస సంహారం చేసినట్లు చెబుతారు. అనంతరం మునుల యజ్ఞయాగాదులకు ఇబ్బందులు కలగకుండా ఒకే శిలలో నిర్మితమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేసినందున, దీనికి ‘ఏకశిలా నగరం’గా పేరువచ్చింది. శ్రీరాముడు అంబులపొది, పిడిబాకు, కోదండం చేతపట్టి రావడంతో ‘కోదండరాముడు’ అనే నామం వచ్చింది. కాగా, దండకారణ్యంలో పర్యటించిన సీతారామలక్ష్మణులు అలసి ఒక చెట్టునీడన చేరారట! ఆ సమయంలో సీతాదేవికి దాహంగా ఉండటంతో రాముడు బాణాన్ని భూమిలోకి సంధించగా గంగ పెల్లుబికింది. దీంతో వారు దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మణుడు కూడా భూమిలోకి బాణం సంధించగా గంగ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇవి శ్రీరామలక్ష్మణ తీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి.
జాంబవంత ప్రతిష్ఠ
త్రేతాయుగంలో ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చిన జాంబవంతుడు ఒక నాటి రాత్రి విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమిచ్చారట. జాంబవంతుడు ఉదయమే లేచి పరిసరాలను వెతకగా గుబురు పొదల్లో ఈ మూర్తులు కనిపించాయి. జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందువల్లే ‘జాంబవంత ప్రతిష్ఠ’ అని పేరు వచ్చింది.
ఒంటిమిట్ట పేరు ఎలా వచ్చిందంటే..
ఒంటెడు-మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో వేట సాగించేవారు. కంపరాయలు, ఆయన పరివారం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీర్చారట. ఈ అన్నదమ్ముల కోరికపై జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిలా దేవతామూర్తులకు కంపరాయలు గర్భాలయం నిర్మించారు. తరువాత వీరి పేరు మీద ఒంటిమిట్ట గ్రామాన్ని, చెరువును కట్టించారు.
ఇమాంబేగ్ పిలుపు.. రామయ్య పలుకు
క్రీ.శ.1640 ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్ నభీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్ ఒంటిమిట్ట కోదండరాముని మహిమను పరీక్షించేందుకు వచ్చాడట. గుడి లోపలికి వెళ్లి ‘‘ఓ రామ..! ఒంటిమిట్ట రఘురామ..!’’ అని మూడు మార్లు పిలువగా గుడిలోంచి ‘‘ఓ.ఓ.ఓ...’’ అనే సమాధానం వినబడిందట. ఇమాంబేగ్ ఆనందంతో మోకరిల్లి రాముని భక్తునిగా మారాడు. రాముని కైంకర్యం కోసం బావిని తవ్వించాడు. ఆ బావి నేటికి ఉంది. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె దర్గాకు వెళ్ళే ముస్లింలు కోదండరామున్ని దర్శించుకొంటారు.
అక్కడ రెండుసార్లు పెళ్ళి!
భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా శ్రీరాముడికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కల్యాణం నిర్వహిస్తారు. అది కూడా శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) నాడే చేయడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో మాత్రం శ్రీరాముడికి ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతారు. ఈ దేవస్థానం ఏర్పాటైన 16వ శతాబ్దం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.
ఇక్కడ శ్రీరామ నవమి రోజునే కాదు, మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)నాడు కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనినే తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు. శ్రీరామ నవమి రోజున కల్యాణోత్సవం పగటి పూట, తిరుకల్యాణ మహోత్సవం రాత్రి పూట జరుగుతాయి. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ‘దేవుని పెళి’్ల జరిగాకే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారం! రామతీర్థం సీతారాముల తొలి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది జనవరి 27న జరిగింది. రెండో కల్యాణోత్సవం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన జరుగనుంది
తిరుకల్యాణం కథ ఇదీ!
16వ శతాబ్ద కాలంలో ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది. సమీపంలోని కుంబిళాపురం (ప్రస్తుతం కుమిలి) గ్రామానికి చెందిన పుట్టు మూగ అయిన వృద్ధురాలు కట్టెల కోసం వచ్చింద ట. ఆమెకు శ్రీరాముడు ప్రత్యక్షమై, ఆమె నాలుకపై ‘శ్రీరామ’ అనే బీజాక్షరాలు రాశాడట! ఈ విషయాన్ని వెంటనే ఆమె కుంబిళాపురాన్ని పరిపాలిస్తున్న పూసపాటి వంశీయులకు తెలిపింది. అలాగే శ్రీరాముడు కుంబిళాపురం రాజుకు కూడా కలలో కనిపించి ఈ ప్రాంతంలో సీతా, రామలక్ష్మణ రాతి విగ్రహాలు ఉన్నాయని, వాటిని సేకరించి వెంటనే ప్రతిష్ఠించాలని కోరాడట. చక్రవర్తి, వృద్ధురాలు కలిసి వెతకగా నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు లభించాయనీ, తీర్థంలో రాముడి విగ్రహం లభించినందున ‘రామతీర్థం’ అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారట. అలాగే మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా ఆ భీష్మ ఏకాదశి నాడు సీతారాములకు బ్రహ్మాండంగా ‘తిరుకల్యాణ మహోత్స’వాన్ని నిర్వహించడం ఆనవాయితీ!
ఏకుల వంశీయులే ఆడపెళ్లి వారు
రామతీర్థంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో వరుడు శ్రీరామచంద్రుడు తరపున విజయనగరం పూసపాటి రాజ వంశీకులు లేదావారి తరపున దేవస్థానం అధికారులు వ్యవహరిస్తారు. వధువు సీతమ్మ తరపున పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరవుతారు. వీరు సీతమ్మ తల్లికి బంగారు మంగళసూత్రాలతో పాటు ఇతర సామగ్రి తీసుకొస్తారు. నాలుగు శతాబ్దాల కాలం నుంచి ఏకుల వంశీయులే ఆడ పెళ్లివారు! వీరు రాముడి విగ్రహాలను కనుగొన్న మూగ వృద్ధురాలి వంశీయులని చెబుతారు. కేవలం పూసపాటి రాజ వంశీయుల వశిష్ట గోత్రంతోనే వివాహం ఆద్యంతం నిర్వహిస్తామని దేవస్థానం ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయి రామాచార్యులు తెలిపారు. వివాహ మహోత్సవానికి ముందు రామతీర్థం ప్రధాన వీధిలో హంస, అశ్వ, గరుడ వాహనాలపై సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉంచి, అర్చకులు నిర్వహించే ఎదురుసన్నాహ కార్యక్రమం కనులవిందుగా సాగుతుంది.
పతివాడ రమణ, నెల్లిమర్ల, విజయనగరం
ఐదు రోజుల పెళ్ళి... ఆరుదైన పెళ్ళి!
రామ తీర్థంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ఒక్కరోజులో ముగుస్తుంది. తిరుకల్యాణ మహోత్సవం మాత్రం ఏటా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి ముందు వచ్చే రథసప్తమి నాడు పందిరి రాట వేస్తారు. నూతన వధూవరులకు ఈ రోజే నూతన వస్ర్తాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కల్యాణోత్సవం జరిగే భీష్మ ఏకాదశి నాటి ఉదయం ధ్వజ స్తంభంపె ధ్వజారోహణం చేస్తారు. కల్యాణోత్సవం జరిగిన నుంచి ఐదు రోజుల పాటు అర్చకులు ప్రత్యేక హోమాలు, గ్రామ బహిష్కరణ, సుందరకాండ పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజున సదస్యం అనే పేరుతో పండితులకు సత్కారం, పండిత పరిషత్ పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా నాలుగో రోజు రాత్రి పూలతోనూ, విద్యుత్ వెలుగులతోనూ అలంకరించిన ప్రత్యేక రథంపై నవ వధూవరులు సీతారామచంద్రులను, లక్ష్మణ స్వామిని రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథాన్ని పక్క గ్రామమైన సీతారామునిపేట గ్రామస్థులు మాత్రమే లాగుతారు. ఐదో రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి, ఆ రోజు రాత్రి గరుడ పటాన్ని అవరోహణం చేస్తారు. పూర్ణాహుతి అనంతరం కల్యాణోత్సవాలకు ముగింపు ప్రకటిస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565