ప్రస్తుతం వాహనం ఓ నిత్యావసర వస్తువుగా మారింది. కాలానుగుణంగా జనాభా ఎలా వృద్ధి చెందుతుందో, వాహన వినియోగం అదేరీతిలో పెరుగుతోంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వాహనం తీయాల్సిందే. ప్రధానంగా వాహనాల వినియోగానికి పెట్రోల్, డీజిల్ కీలకం. జిల్లా వ్యాప్తంగా 262 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. ప్రతి నెలా దాదాపు 90 లక్షల లీటర్ల పెట్రోలు, కోటి 80 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే పెట్రోల్ బంకుల వద్ద ఆపరేటర్లు చేసే మోసాలు అనేకం. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారుల చర్యలు నామమాత్రమే. ఆ బంకుల్లో మోసాలు షరా మామూలే. అంతిమంగా వినియోగదారులే నష్టపోతున్నారు. వాటిని వాహనదారులు ఎలా ఎదుర్కొవాలనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
నాజిల్‌ను పదే పదే ప్రెస్ చేస్తే.. మోసమే
బంక్‌లో ఇంధనం నింపే సమయంలో కొందరు వర్కర్లు ఫ్యూయల్ నాజిల్ ప్రెస్ చేస్తుంటారు. రీడింగ్‌పై దృష్టి పెట్టే వాహన చోదకులు నాజిల్‌ను గమనించరు. పంప్ పట్టుకునే చోట ఆన్ ఆఫ్ బటన్(నాజిల్) ఉంటుంది. దీనిని మారుస్తుండడం ద్వారా కొంత మిగుల్చుకుంటారు. బటన్ పూర్తిగా నొక్కి పట్టుకోవాలని కోరండి. లేదంటే పూర్తిస్థాయిలో పెట్రోల్ రాదు. ఆటో, నాలుగు చక్రాల వాహనాల డ్రైవర్లు వాహనం దిగకుండా ఇంధనం పోయిస్తే బంక్ వర్కర్లు ఎక్కువ మొత్తంలో మోసం చేసే అవకాశం ఉంటుంది.
దృష్టి మరల్చొద్దు
పెట్రోల్, డీజిల్ కొట్టించే ముందు రీడింగ్ సున్నా నుంచి ఫ్యూయల్ నింపుతారు. అయితే మన ముందు మాత్రం రీడింగ్ సున్నా చేస్తారు కానీ ఆయిల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్ మార్చడం లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో రావాల్సిన ఫ్యూయల్ రాదు. ఈ నేపథ్యంలో ఇంధనం నింపే సమయంలో రీడింగ్‌ను చూడాలి. మీటర్ రీడింగ్(000) నుంచి కొడుతున్నారా లేదా నిశితంగా గమనించాలి.
కల్తీపై కన్నేయండి
నాఫ్తాతో పెట్రోల్‌ను కల్తీ చేయడం ద్వారా లాభాలను మిగిల్చుకుంటారు. పెట్రోల్‌లో కిరోసిన్, ఇతరత్రా వాటిల్లో కూడా కలుపుతుంటారు. బండి మధ్యలో తరచూ ఆగిపోతుంటే అది పెట్రోల్ కల్తీ ప్రభావం అని గుర్తించాలి. అలానే సైలెన్సర్ కండిషన్ బాగోలేకుంటే అది పెట్రోలు కల్తీ ప్రభావం అని గుర్తించాలి. ఎక్కువగా పొగ వస్తుంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు గమనించాలి.
అనంతలో వెలుగుచూసిన కల్తీ పెట్రోలు
అనంతపురం నగరంలోని గణేష్ భారత్ పెట్రోల్ బంక్‌లో గత నెల మొదటి వారంలో కల్తీ పెట్రోలు బయటపడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఓ ద్విచక్రవాహనదారుడు ఆ బాంకులో పెట్రోలు పోయించుకున్నాడు. ఆ బంకులో పెట్రోలు పోయించిన తర్వాత సగం దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన సదరు ద్విచక్ర వాహనదారుడు మెకానిక్ వద్ద చూపించాడు. పెట్రోలులో కల్తీ ఉండటంతోనే వాహనం ఆగిపోయిందని మెకానిక్ చెప్పాడు. దీంతో సంబంధిత అధికారులకు వాహనదారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో సివిల్‌సప్లై, రెవెన్యూ అధికారులు పెట్రోలు బంకులో తఖీలు చేపట్టి పెట్రోలు కల్తీ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో పెట్రోలు బంక్‌ను సీజ్ చేశారు. ఆ పెట్రోలు శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పెట్రోలులో కలిపిన ఎథనాల్ నీరుగా మారిందని సేల్స్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు. ఎథనాల్ కలిపినందున అందులో కొద్దిగా నీరు కలిసినా అది నీరుగా మారుతుందని పేర్కొంటున్నారు. కాగా ఫోరెన్సిక్ లాబ్ నివేదికలు వచ్చిన తర్వాత ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అందుబాటులో లేని ఇంధన పరీక్ష కిట్లు
ఇంధనంలో కల్తీ జరుగుతున్నట్లు వాహనదారులు గమనించినా ఏమీ పాలుపోని స్థితి నెలకొంటుంది. పెట్రోల్ బంక్‌ల వద్ద ఉండాల్సిన ఇంధన పరీక్ష కిట్లు కానరావడం లేదు. అసలు ఈ కిట్లు పెట్రోల్ బంకుల వద్ద ఉంటాయని చాలామందికి తెలియదు. తహసీల్దార్ స్థాయి అధికారులు పెట్రోలు బంకుల వద్ద ఇంధన పరీక్ష జరపొచ్చు. కానీ తమకేమీ పట్టనట్లు వారు వ్యవహరిస్తుండడంతో వాహనదారులు నష్టపోతున్నారు.
ఆయుష్షు కోల్పోతున్న వాహనాలు
ఇంధనంలో కల్తీ పెరిగితే నిత్యం వాహనాలు మొరాయిస్తుంటాయి. వాటి ఆ యుష్షు పరిమాణం తగ్గుపోతుంది. ఇంధనం కల్తీ వల్లే వాహనాలు పాడవుతున్నా ఫిర్యాదు చేయలేని స్థితిలో చాలామంది వాహన యజమానులు ఉన్నారు.
జాగ్రత్తలు పాటిస్తే మేలు
చమురు కంపెనీ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్‌లపై ఉద్యోగుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో మోసాలకు ఆస్కారం తక్కువ. ఒక వేళ మోసం చేసినా ఫిర్యాదు చేస్తే చర్యలు వేగంగా ఉంటాయి. ఇలా ఆన్‌లైన్ చేసిన బంకుల్లో పెట్రోలు కొట్టించుకోవడం మంచిది.
ఆధునిక పంపింగ్ మెషిన్లు ఉన్న బంకుల్లో ఇంధనం నింపడం మంచిది. ప్రొడక్టు డిస్పెన్సర్ ఎంపీడీ పంపుల్లో మోసాలకు అవకాశం తక్కువ.
పెట్రోల్‌ను నిదానంగా పోయమని కోరండి. వేగవంతంగా పోస్తే తక్కువ పెట్రోల్ వచ్చేలా లోపల సెట్ చేస్తారు. అందుబాటులో ఉన్న బంకుల్లో ఒక్కోదానిలో ఒక్కోసారి నిర్ణీత పరిమాణంలోనే ఇంధనం కొట్టిస్తూ మైలేజ్ చెక్ చేసుకోవాలి. నిర్దిష్టమైన మైలేజ్ కంటే తక్కువ వస్తే మోసం జరిగినట్లే. ఇంజిన్ పనితీరులో మార్పు కనిపిస్తే కల్తీ జరిగినట్లే.
ట్యాంక్ మూతను ముందుగా తీయవద్దు. మీటర్ 000 చేసిన తరువాత ట్యాంక్ మూత ఓపెన్ చేయండి.
రూ.50, రూ.100, రూ.150, రూ.200 ఈ డినామినేషనల్‌లో పెట్రోల్, డీజిల్ పోయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువశాతం మంది చిల్లర సమస్య లేకుండా ఇంత మొత్తాల్లోనే పోయించుకుంటారు. ఈ నేపథ్యంలో బంకుల్లో సిబ్బంది తక్కువ వచ్చేలా సెట్ చేసి ఉండొచ్చు. అందుకే లీటర్లలో కొట్టించుకోండి. లేదా రూ.111, రూ.222, రూ.333 తరహా మొత్తాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం. ఆ నగదుకు సరిపడా చిల్లర దగ్గర ఉంచుకోండి.
సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. దీనివల్ల లిక్విడ్ రూపంలో పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉండదు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565