MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రదక్షిణ చేస్తే కోరిక తీరినట్టే!_PradakshinaChesteKorikaTeerinatte


ప్రదక్షిణ చేస్తే కోరిక తీరినట్టే!_ PradakshinaChesteKorikaTeerinatte MahabubNagarLakshmiChennakesavudu GangapuramLakshmiChennakesavaswamy Eenadu Sunday Magazine Sunday Magazine Eeandu Sunday Paper BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


ప్రదక్షిణ చేస్తే కోరిక తీరినట్టే!



కృతయుగం నుంచీ కలియుగం వరకూ అన్ని యుగాల్లోనూ భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దేవదేవుడు... మహబూబ్‌నగర్‌ జిల్లా గంగాపురంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు. ఆనాడు ఒక భక్తుడి కోరికను మన్నించి ఈ పల్లెలో వెలసిన స్వామి నేటికీ తనను శరణు కోరిన వారికి అభయ హస్తం అందిస్తున్నాడు.

దేశవ్యాప్తంగా కేశవనామంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆ పరంపరలో అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో గంగాపురం చెన్నకేశవస్వామి ఆలయం ఒకటి. ఇక్కడ గర్భాలయంలో కొలువుదీరిన మూల విరాట్టు శంఖం, చక్రం, గద, కమలాలను ధరించి భక్తులకు సాక్షాత్కరిస్తాడు.
స్థలపురాణం
కృతయుగంలో ఒక విష్ణు భక్తుడు స్వామికోసం తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి ఆ భక్తుడు ‘నేను మీ కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను. అందులో మీరు చెన్నకేశవుడిగా కొలువుదీరి నన్ను అనుగ్రహించమని’ అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి సమ్మతిస్తాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ విష్ణుభక్తుడు ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాడు. తెల్లవారితే స్వామి వారు ఆలయంలో వెలుస్తారనగా ఆ వ్యక్తి గుడిని కట్టడానికి అయిన ఖర్చులను లెక్కిస్తాడు. అందుకు ఆగ్రహించిన విష్ణుమూర్తి దేవ శిల్పులను పిలిచి మరో ఆలయాన్ని కట్టమని పురమాయించాడు. అందులో చెన్నకేశవుడు స్వయంభూగా వెలసి పూజలందుకుంటున్నాడు. స్వామి ఆనాడు వెలసిన ఆ ఊరే నేటి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం.
చారిత్రకంగా...
గంగాపురం చాళుక్య చక్రవర్తుల ఉపరాజధానిగా విరాజిల్లింది. క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని త్రైలోక్య మల్లకేశవపురంగా పిలిచేవారని పశ్చిమ చాళుక్య శాసనాల ద్వారా తెలుస్తోంది. పశ్చిమ చాళుక్య రాజైన మొదటి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు (1042-1062) గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాడు. పశ్చిమ చాళుక్య రాజులు వైజయంతి పురాన్ని రాజధానిగా, గంగాపురాన్ని రెండో రాజధానిగా చేసుకుని పాలించారు. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూట వంశీయుల కాలం, కందూరు చోడుల కాలంతోపాటు కాకతీయ, గోన, మల్యాల, పద్మనాయకాది రాజవంశీయుల పాలనలో గంగాపురం ప్రముఖ పట్టణంగా వెలుగొందింది. క్రీ.శ. 1091 సంవత్సరం నాటికే లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి పొందినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రం గురించి పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ప్రస్తుతించాడు. సుమారు పాతిక మంది కవులు గంగాపురం గురించి తమ గ్రంథాల్లో వర్ణనలు చేశారని ప్రతీతి.
ప్రదక్షిణలతో...
లక్ష్మీ చెన్నకేశవస్వామికి శక్తి మేరకు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నేరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, కర్ణాటక నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు కోరిన కోర్కెలు
నెరవేరిన వారు మళ్లీ వచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆ రాత్రికి ఆ ఆలయంలోనే నిద్ర చేస్తారు. భక్తులు స్వామి వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా నివేదిస్తారు. ఉగాది, వైకుంఠ ఏకాదశి, విజయదశమి పర్వదినాల్లో, కార్తీకం, శ్రావణమాసాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు, గోదాదేవి కళ్యాణాలను ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే తిరుకల్యాణం, రథోత్సవం, శకటోత్సవాలు ప్రత్యేకమైనవి. వీటిలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు.
 
ప్రదక్షిణ చేస్తే కోరిక తీరినట్టే!_ PradakshinaChesteKorikaTeerinatte MahabubNagarLakshmiChennakesavudu GangapuramLakshmiChennakesavaswamy Eenadu Sunday Magazine Sunday Magazine Eeandu Sunday Paper BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu
 
 
విశేషం ఏమిటంటే...
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఏటా భాద్రపద మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో ఒక రోజు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. అదే రోజు సాయంత్రం ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాంబరం శివాలయం (పరుసవేదీశ్వరాలయం)లోని లింగంపై కిరణాలు పడతాయి. ఈ శివాలయానికి ఆనుకొనే దుందుభి వాగు ఉంటుంది. గుడికి తూర్పుదిశలో దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న ఈ వాగును మొదట దేవసేనానది అని
పిలిచేవారు. ఇక్కడికి ఆగ్నేయ దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో ఇటుకతో నిర్మించిన అతిపురాతనమైన గొల్లత్త గుడి అన జైనమందిరం ఉంది.
ఇలా చేరుకోవచ్చు
మహబూబ్‌నగర్‌ నుంచి గంగాపురానికి 22 కిలోమీటర్ల దూరం. ఇక్కడికి చేరుకోవడానికి రైలు, రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ బెంగళూరు హైవే మీదుగా ప్రయాణించి జడ్చర్ల దగ్గర దిగి, అక్కడి నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జడ్చర్ల స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి అయిదు కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి చెన్నకేశవ ఆలయానికి చేరుకోవచ్చు.
- ఎన్‌.మనోజ్‌ కుమార్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list