ఔషదాల తల్లి... వెలుల్లి..!
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లిస్తారు.కానీ అది లేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్లి ఉండాల్సిందే. జలుబు చేసినా జ్వరం వచ్చినా వెల్లుల్లి తినాల్సిందే..!
‘‘వెల్లుల్లి బెట్టి పొగిచిన పుల్లగోంగూర రుచిని బొగడక వశమా’’
... అని జానపద సాహిత్యకారుడైన గువ్వల చెన్నడు చెప్పినట్లు గోంగూరకి అంతటి రుచి రావడానికి కారణం వెల్లుల్లే మరి. ఒక్క గోంగూర అనేముందీ... వంకాయ, దోసకాయ, టొమాటో... ఏ రోటి పచ్చడి చేయాలన్నా; ఆవకాయ, మాగాయ, దబ్బకాయ... ఏ ఊరగాయ పట్టాలన్నా వెల్లుల్లి ఘాటు తగలాల్సిందే.
ఇక, బిర్యానీలూ మసాలా కూరకైతే అల్లం తోడుగా వెల్లుల్లి ఉంటేనే వాటికా రుచి. పచ్చళ్లూ మసాలా వంటలే కాదు, పప్పుకూరలైనా కాసిని వెల్లుల్లి రెబ్బలు పడితే ఆ సువాసనే వేరు. మొత్తమ్మీద ఆధునిక గృహిణికయినా సంప్రదాయ బామ్మకయినా పోపులపెట్టెలో వెల్లుల్లిపాయ లేకపోతే వంట రుచించనట్లే. అంతగా ఆహారంలో భాగంగా మారిన వెల్లుల్లిని కేవలం మనదగ్గర మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఇష్టంగా తింటున్నారు. ఐరోపా, అమెరికాల్లో ప్రాచుర్యం పొందిన బేకరీ పదార్థాల్లో గార్లిక్ బ్రెడ్ ఒకటి. అక్కడ వెల్లుల్లిని ఇతర నూనెల్లోనూ కలిపి వాడుతుంటారు. సాస్‌లా చేసుకుని మాంసాహారంతో కలిపి తింటుంటారు. మధ్యతూర్పు దేశాల్లో అయితే వినెగర్‌లో నిల్వచేసిన వెల్లుల్లి వాడకం ఎక్కువ. దీన్నే గార్లిక్ పికిల్ అంటారు. కొన్ని రోజులకి ఇవి నీలం రంగులోకి మారతాయే తప్ప పాడవవు. వీటినే బ్లూ గార్లిక్ పేరుతో వంటల్లో
వాడతారు. ఇంకా వెల్లుల్లిని చేప, మాంసం... వంటి వాటిని నిల్వచేసేందుకు కూడా ఉపయోగిస్తారు. మొత్తమ్మీద ఏదో ఒక రూపంలో వెల్లుల్లి వాడని ప్రాంతం ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు.
మనది రెండో స్థానం..!
వెల్లుల్లిని పండించే దేశాల్లో అగ్రరాజ్యానిదే అగ్రస్థానం. రెండో స్థానం మనదే. ఆగ్నేయాసియా దేశాల్లో ఉల్లికాడల మాదిరిగానే వెల్లుల్లి కాడల్ని వంటల్లోనూ సూపుల్లోనూ వాడతారు. వీటినే గ్రీన్ గార్లిక్ అంటారు. సాధారణంగా వెల్లుల్లికోసం పండించేవాళ్లు మొక్కలకు పూత రాకుండా పూలొచ్చే కాడల్ని తుంచేస్తారు. లేదంటే నేలలో పాయ ఊరడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
మనకు తెలిసి వెల్లుల్లి... తెల్లగానే ఉంటుంది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒకటో రెండో పాయలు మాత్రం తెలుపూగులాబీ మిశ్రితమై కనిపిస్తుంటాయి. కానీ దాన్ని పండించే ప్రాంతాన్ని బట్టి వెల్లుల్లిలో ఎరుపూ, గులాబీ, ఊదా, గోధుమ... ఇలా ఎన్నో రంగులూ మరెన్నో ఛాయలూ. మన దగ్గర తెలుపురకం వెల్లుల్లిని ఎక్కువగా పండించినట్లే, సిసిలీలో ఎరుపూ, ఫ్రాన్స్‌లో గులాబీ, ఇటలీలో గోధుమరంగు రకాల్ని ఎక్కువగా పండిస్తుంటారు. భారీ సైజులో ఉండే గజ వెల్లుల్లి రకాన్ని చైనీయులు పండిస్తుంటారు. అలాగే పూలకోసం పెంచే వెల్లుల్లి రకాలూ ఉన్నాయి.
ఎంత మంచిదో..!
ఓ పండో, కూరగాయో తిన్నట్లుగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తినలేం. కాబట్టే పోషకాహారంగా కన్నా మాంఛి మసాలాద్రవ్యం, అద్భుత ఔషధంగానే వాడకం ఎక్కువ. అలాగని వెల్లుల్లిలో పోషకాలకేమీ లోటు లేదు. ఖనిజాలతోబాటు బి-విటమిన్ రకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని అలిసిన్ అనే కర్బన పదార్థం, అనేక వ్యాధుల్ని నివారించే ఔషధంగా పనిచేస్తుంది. అందుకే ఇది ఓ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్‌లా పనిచేస్తుంది అంటారు నిపుణులు.
* వెల్లుల్లిలోని అలిసిన్ రక్తనాళాల్లోని ఒత్తిడిని తగ్గించి, బీపీని తగ్గిస్తుంది. రక్తంలో గడ్డలు ఏర్పడకుండానూ చేస్తుంది. తద్వారా హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు, రోజూ ఒకటి రెండు రెబ్బల్ని తినడంవల్ల బీపీ తగ్గడంతోబాటు రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ శాతం తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.
* ఇది జీర్ణాశయ, పేగు క్యాన్సర్లనీ నిరోధిస్తుంది. మొత్తంగా వెల్లుల్లి 13 రకాల ఇన్ఫెక్షన్లనీ, 14 రకాల క్యాన్సర్లనీ నివారిస్తుందని ‘అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్’ సైతం పేర్కొంది.
* వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీసెప్టిక్ గుణాలు అత్యధికం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయాలకు మందుగా వెల్లుల్లి రసాన్ని వాడారట. ఆ రసంలో కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. లేదంటే మంట తట్టుకోలేరు. వెల్లుల్లిని తినడంవల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.
* మధుమేహ రోగులకు మూత్రపిండాలు, గుండె, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వాళ్లు వెల్లుల్లిని తినడంవల్ల ఆయా దుష్ఫలితాలు తలెత్తకుండా ఉంటాయి. వెల్లుల్లిలోని సెలీనియం, క్యుయెర్టిసిన్, విటమిన్-సి వంటి పోషకాలు ఇన్ఫెక్షన్లనీ వాపుల్నీ తగ్గించేందుకు తోడ్పడతాయి.
* చెవినొప్పికి రెండుమూడు చుక్కల వెల్లుల్లి రసం కలిపిన కొబ్బరి లేదా ఆలివ్ నూనె బాగా పనిచేస్తుంది. జలుబూ దగ్గులతో బాధపడేవాళ్లు రెండు పచ్చి రెబ్బలు నలగ్గొట్టి తింటే, తీవ్రత తగ్గుతుంది.
* శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లనీ, శ్లేష్మాన్నీ కూడా తగ్గిస్తుంది వెల్లుల్లి. అందుకే ఆస్తమా రోగులు నిద్రపోయే ముందు మూడు ఉడికించిన రెబ్బలు తిని, గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పట్టి ఉపశమనం కలుగుతుంది. పొట్టలోని హానికర బ్యాక్టీరియానీ నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, డీసెంట్రీలతో బాధపడేవాళ్లు వెల్లుల్లి రెబ్బల్ని రెండుమూడుచొప్పున రోజుకి మూడుసార్లు తింటే మేలు.
* శృంగారప్రేరిత ఔషధం కూడా. నరాల బలహీనతతో బాధపడేవాళ్లు ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తింటే ఫలితం ఉంటుంది.
ఆహారంలో ఎక్కువగా తీసుకోలేనివాళ్లు జ్యూస్‌లా చేసుకుని అందులో కాసిని నీళ్లు కలుపుకుని తాగినా మంచిదే. ఇది ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికీ జుట్టు పెరగడానికీ తోడ్పడుతుంది. దీనివల్ల జీవక్రియావేగం పెరిగి బరువు పెరగరు. అందుకే ‘అబ్బా వెల్లుల్లా...’ అంటూ ముక్కూ మొహం చిట్లించకుండా వీలైనంత ఎక్కువగా వెల్లుల్లిని తినండి.
ఏకపాయ వెల్లుల్లి..!
వెల్లుల్లిపాయ అంటేనే అనేక రెబ్బలు కలిసిన పాయ. కానీ ఒకటే పాయ ఉండే సోలో గార్లిక్ రకం కూడా ఉంది. దీన్నే సింగిల్ క్లోవ్ ఆర్య గార్లిక్ అనీ పిలుస్తారు. చైనాలో పుట్టిన ఈ రకాన్ని ఈ భూమ్మీద ఉన్న అత్యంత శక్తిమంతమైన ఔషధాల్లో ఒకటిగా చెబుతారు. ఔషధాలకి రాజు వెల్లుల్లి అయితే, సోలో వెల్లుల్లి రాజాధిరాజు. 17 రకాల అమైనో ఆమ్లాలూ, 33 సల్ఫ్యూరిక్ పదార్థాలూ, 200కి పైగా ఎంజైములూ ఉన్న ఏకైక ఔషధం ఇదే. శరీరంలోని అన్ని రకాల కణాల పెరుగుదలకీ తోడ్పడే ఒక రకమైన కిరణాలు దీన్నుంచి వెలువడతాయట. జెర్మానియం అనే శక్తిమంతమైన ఆక్సిడెంట్ ఇందులో దొరుకుతుంది. అందుకే ఇది సర్వరోగనివారిణి. వ్యాధుల నివారణలో వెల్లుల్లికన్నా ఇది ఏడురెట్లు దృఢమైనది. దీని రసాన్ని ఎలుకల్లో ఇంజెక్ట్ చేస్తే 72 శాతం కొలెస్ట్రాల్ తగ్గిందట. బీపీకి కూడా అద్భుతమైన మందు.
నల్లని వెల్లుల్లి
తెలుపురంగు వెల్లుల్లినే కొన్ని వారాలపాటు ఎలాంటి తేమ లేని వాతావరణంలో సుమారు 60 - 77 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత మధ్య 60-90 రోజులపాటు ఉండేలా చేసి నల్ల వెల్లుల్లిని తయారుచేస్తారు కొరియన్లు. ఇదో రకమైన రసాయన చర్య. దీని కారణంగా వాటిల్లోని ఎంజైములన్నీ చర్యపొంది రంగు మారి, ఖర్జూరాల్లా మెత్తబడి తియ్యదనాన్ని సంతరించుకుంటాయి. వీటిని తినడం వల్ల అమరత్వం సిద్ధిస్తుందనేది వాళ్ల నమ్మకం. దాదాపు నాలుగువేల సంవత్సరాల నుంచీ దీన్ని అక్కడ వాడుతున్నారు. థాయ్‌లాండ్ వాసులు వీటిని ఆయుఃప్రమాణం పెరిగేందుకు
తింటారట. వీటితో చాకొలెట్లూ తయారుచేస్తారు. దాదాపుగా అక్కడ అన్ని వంటల్లోనూ నల్ల వెల్లుల్లి కనిపిస్తుంది. ఈ రకమైన వెల్లుల్లిలో అలిసిన్ అనే శక్తిమంతమైన పదార్థం, సాధారణ వెల్లుల్లిలో కన్నా రెట్టింపు శాతం ఎక్కువ. విటమిన్-సి, విటమిన్‌బి6, మాంగనీస్‌తోపాటు, ఇతర యాంటీఆక్సిడెంట్ల శాతమూ ఎక్కువే. అందుకే సాదా వెల్లుల్లి కన్నా ఇది చెడు కొలెస్ట్రాల్‌నీ మధుమేహాన్నీ సమర్థంగా తగ్గిస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565