ధర్మ మార్గం
‘ధర్మం’ అనే మాట అనడానికి, వినడానికి బాగుంటుంది. అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టడమే కష్టం. ధర్మాన్ని ఆచరించే పద్ధతుల్ని ‘ధర్మమార్గాలు’ అంటాం. వాటి చర్చ మహాభారతంలో అనేక పర్యాయాలు వస్తుంది. ‘ఇతరులు నీ పట్ల ఎలా ఉంటే నీకు అయిష్టం కలుగుతుందో, వారితో నువ్వు అలా ఉండవద్దు... అదే పరమ ధర్మం’ అంటాడు విదురుడు.
నీతి తప్పి అధర్మమార్గాన ప్రవర్తించేవాడు న్యాయస్థానంలో శిక్షల్ని తప్పించుకోవచ్చునేమో గాని, అంతరాత్మ వేసే శిక్షల నుంచి తప్పించుకోలేడు. ‘ధర్మవాణిజ్యం’ అంటే ధర్మకార్యాల్ని ధనార్జనకు సాధనంగా చేసుకోవడం! అలాంటి ఎందరినో సమాజంలో చూస్తుంటాం. ధర్మం పేరు చెప్పి డబ్బు సంపాదించుకొనే అలాంటి వ్యక్తుల వల్ల, ధార్మికుల్నీ సమాజం ఒక్కోసారి అనుమానిస్తుంటుంది.
ధర్మాల్లో ఒకటి- అహింస. అదే బౌద్ధుల దృష్టిలో గొప్ప ధర్మం. అహింసా ధర్మమే బుద్ధుడి ప్రధాన బోధన. అదే ఆయన ధ్వజ సంకేతం. అందుకే ఆయనను ‘ధర్మకేతువు’గా భావిస్తారు. ధర్మాన్ని శాసించగలిగింది బ్రహ్మ శాసనం. అలాగే రాజయోగానికి మరో పేరు‘ధర్మమేఘం’. అది సమాధి స్థితిలో సిద్ధశక్తుల్ని వర్షిస్తుందని సాధకుల విశ్వాసం.
ధర్మానికి మూలం వేదం. ధర్ముడు అంటే, యముడు. ధర్మం లోకాన్ని నడిపిస్తుంది. లోక వ్యవహారాల్లో అందరికీ న్యాయం జరిగేలా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తుంది. శ్రుతులు, స్మృతులు ధర్మబద్ధమైన కృత్యాల్ని తెలియజేస్తాయి.‘సత్యం వద’ అనేది వేదవాక్యం. దాన్ని బౌద్ధులు ప్రమాణంగా భావించకున్నా, ‘సత్యమే పలకాలి’ వంటి వాక్యాల్ని ప్రామాణికాలుగా స్వీకరిస్తారు. స్మృతి, ధర్మశాస్త్రం అనేవి పర్యాయపదాలు. అందరికీ శ్రేయస్సు కలిగించేది ధర్మం. దానికి వ్యతిరేకమైనది అధర్మం. ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది.
ధార్మిక గుణాల వల్ల మనిషి దైవం కాగలడు. మనిషి తన బుద్ధిహీనత కారణంగా మెట్టు దిగి పశువులా మారగలడు. మానవుడు దైవస్థాయికి చేరడానికి దారి చూపేది ‘ధర్మజ్యోతి’. ఆచారాలు, సంప్రదాయాలే ధర్మజ్యోతులు. అవి రుషిపుంగవులు ప్రసాదించిన వెలుగు దివ్వెలు. స్వార్థం అనే చీకటి నుంచి నిస్వార్థం అనే వెలుగు వైపు అవి మనుషుల్ని నడిపిస్తాయి. అహంకారం నుంచి నిరహంకార స్థితికి చేరుస్తాయి. వాటిని ఆధారం చేసుకొన్నవారు లోకంలో ఉన్నారు. వారికి భక్తులు గుడులు కట్టి పూజిస్తారు. మహర్షులు సూచించిన ధర్మమార్గంలో నడిచి, అవే అడుగుజాడల్ని లోకానికి మిగిల్చి వెళ్లిన మహాపురుషులు ఎందరో!
మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించినప్పుడే, దేవుడు చేయూతనందిస్తాడు. అది అతడు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనిషి తన పనిని తాను నిర్వర్తించకుండా, అన్నింటికీ దేవుడే దిగివచ్చి సహాయం చేస్తాడనుకోవడం ఓ భ్రమ! ప్రయత్నమే పరమేశ్వరుడు. గజేంద్రుడు మొసలితో తీవ్రంగా పోరాడి, శక్తి అంతా అయిపోయిన తరవాతే దైవానికి శరణాగతుడయ్యాడు. ఇలాంటి పౌరాణిక గాథలన్నీ మనిషి పాటించాల్సిన ధర్మాన్ని గుర్తుచేస్తుంటాయి.
ఏది మానవ ధర్మమో చాటిచెప్పాలని మహాత్ములెందరో కృషిచేశారు. వారి మార్గాలు భిన్నంగా కనిపించినా, సారాంశం ఒకటే! ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ చెప్పినట్లు- వేదాన్ని ప్రమాణంగా అంగీకరించడం, సంప్రదాయంగా వచ్చే విభిన్న సాధనా మార్గాల్ని అనుసరించడం, భక్తితో ఉండటం...ఇవన్నీ ధర్మజ్యోతి వెదజల్లే వెలుగు కిరణాలు. రుషీశ్వరులు ప్రబోధించిన ధర్మం కాబట్టి ‘ఆర్షధర్మం’ అంటాం. ఇటువంటి కాంతికిరణాల్ని ప్రపంచమంతటా ప్రసరింపజేసిన ఆధునిక రుషీశ్వరుడు- స్వామి వివేకానంద. ఎన్నటికీ ఆరిపోని అఖండ ధర్మజ్యోతి ఇది. దీని వెలుగులోనే ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తారు!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565