తొలినాటి పండుగ
వినండి... వినండి...
వసంత రాగం!
కాకి, కోకిల రూపానికి ఒకేలా కనబడతాయి. వాటి మధ్య తేడా తెలియాలంటే వసంతకాలం రావాలంటారు కవులు.
హొయలొలికించే చిగురుటాకులు.. కొత్త ఆశలకు ప్రతీకలైన లేలేత మొగ్గలు కమ్మని తావిని నలుదిశలా వెదజల్లే తొలిపూతలు తనువుకు హాయినిచ్చే చిరుగాలి, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే కోయిలపాట... ఇవన్నీ ఒకేచోట, ఒకేసారి కలిస్తే, కనిపిస్తే దానిపేరు వసంతం.
శుభ సూచకమైన ప్రారంభం, ఒకదానితో మరొకటి ముడిపడి ఉండే ఆశలు, తద్వారా మనసు పొందే ఆనందం, వాటి ఫలితంగా మదినిండిన సంతృప్తి వీటన్నిటికీ సరైన చిరునామా వసంతం...
ఎప్పుడు వస్తుంది: వసంతం మొదలయ్యేది తెలుగు సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర మాస శుద్ధ పాడ్యమి నుంచి.. ఇదే ఉగాది.
ఎలా ఉంటుంది: చెట్లు కొత్త చిగుళ్లు తొడుగుతాయి. వాటి వెంటే మొగ్గలు తొడిగి పూలతో అలరారుతుంటాయి. ఈ పూలు పరిమళాలతో పరిసరాలను ఆహ్లాదపరుస్తాయి. అంతవరకు కురిసే మంచు తగ్గుముఖం పట్టి సమశీతోష్ణ స్థితి ఏర్పడుతుంది. చల్లటి గాలులు తనువుకు సౌఖ్యాన్ని, మనసుకు హాయిని ఇస్తుంటాయి. కోకిల తన గళాన్ని విప్పి కమ్మగా కూసేది ఈ సమయంలోనే.
ఎవరేమన్నారు: భారతీయ సాహిత్యంలో వేదాల నుంచి, ఆధునిక ప్రక్రియల వరకు సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది వసంతం. ఆదికవి వాల్మీకి సహా సంస్కృత కవులైన కాళిదాసు, భవభూతి లాంటి వారు తమ కావ్య నాటకాల్లో వసంత వర్ణనకి పెద్దపీట వేశారు.
చిరుగాలి అనే చిన్న పిల్లవాడిని, చెట్లు పూల తేనియలతో జలకమాడించాయి. తెల్లని మల్లెపూల పొదలు అనే పొత్తిళ్లలో కప్పి, సొంపైన చిగురుటాకుల ఊయలలో పడుకోబెట్టి ఊపుతున్నాయి. కోకిలలు తమ గానమాధుర్యంతో జోలపాడుతున్నాయి’
అని వర్ణించారో కవి
శ్రీశ్రీ తన శైశవ గీతి అనే కవితలో ఈ కాలాన్ని రుతువుల రాణి అని పేర్కొన్నారు...
- అయ్యగారి శ్రీనివాసరావు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565