స్వేచ్ఛ-స్వచ్ఛత
శాస్త్రానికి సంబంధించిన అంశం ఏదైనా, అది సముద్రంతో సమానం. ఆ అంశాన్ని అర్థం చేసుకున్నా, అధ్యయనం చేసినా మనిషి అందులో కొంతవరకే సాధించగలడు. సంపూర్ణ అభ్యాసానికి అతడి జీవితకాలం సరిపోదు. అంతా కరతలామలకం అయిందని కొందరు అనుకుంటారు. తమను మించినవాళ్లు లేరని మిడిసిపడతారు. తాడి దన్నేవాడు ఉంటే, వాడి తలదన్నేవాడు ఉంటాడని కొంతకాలానికి తెలుసుకుంటారు. విహంగంలా ఆకాశ విహారం చేసే కాళ్లను మళ్లీ భూమిమీద ఆన్చక తప్పదు.
మనిషి విజ్ఞానానికి మొదటి సవాలు ప్రకృతి. ఎన్నో ప్రతులున్న అద్భుత పుస్తకమది. వీక్షించే, ఆలకించే మనసు ఉండాలే కాని- అన్నీ వింతలూ విడ్డూరాలే! కళ్లు విప్పార్చుకుని చూస్తూ ఆశ్చర్యపడటం తప్ప, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రకృతి ముందు అందరూ పసికూనలే. ఒడిలో చేర్చుకొని లాలించే కన్నతల్లి ప్రకృతి. కన్నెర్ర చేస్తే, అది అపర కాళి. తల్లిని గౌరవించినట్లు, ప్రకృతికీ మనిషి శుశ్రూష చేయాలి. అప్పుడే అతడి మనుగడ నల్లేరు మీద బండి నడక. లేదంటే, ప్రళయ హేల!
మనిషి మనసులో ఎన్నో రకాల భావాలు నాటిన అంతర్యామి, అందులో సూదిమొనంత స్వార్థాన్నీ చేర్చాడు. ఎదుగుతున్న మానవుడు దాన్ని చీమంత ఉంచుతాడా, ఏనుగంత చేసుకుంటాడా అన్నది అతడి వ్యక్తిత్వానికే వదిలిపెట్టాడు. మానవుణ్ని బుద్ధిజీవిగా సృష్టించాడు కాబట్టి- ప్రకృతిలో అడుగడుగునా అణువణువునా తన అస్తిత్వం ఉందని, దాని పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత అతడిదేనని నర్మగర్భంగా తెలియజెప్పాడు. స్వార్థం వ్యక్తిగతమే అయితే, అది అతడికి చెరుపు చేస్తుంది. సామాజికం అయితే, మొత్తం సమాజమే అతలాకుతలం అవుతుంది. దాని దుష్ప్రభావం ప్రకృతి మీదా పడుతుంది. ఒకరు పాలిథీన్ సంచిలో సరకులు తెచ్చుకుంటారు. బయట పడేసిన ఆ సంచిని ఆవు తిని, జీర్ణం కాక సతమతమవుతుంది. దాని బాధను అతడు చూడలేకపోవచ్చు. జీవహింసకు కారణం మాత్రం ఆ మనిషే!
ఉద్యోగాలు కల్పించి పొట్ట నింపే పారిశ్రామిక సంస్థ- వ్యర్థ పదార్థాల్ని కలుషిత నీరు, వాయువు రూపాల్లో వెలుపలికి వదులుతుంది. పరిసర ప్రాంతాల్ని విషతుల్యం చేస్తుంది. జీవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. తోటమాలి రక్షణలో ఉన్న మొక్క చక్కని నిగారింపుతో పూలు, పళ్లతో మిసమిసలాడుతుంది. రోడ్డును విభజిస్తూ ఏర్పరచిన స్థలంలో గల మొక్క- అటూ ఇటూ తిరిగే వాహనాల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ వాడిపోయి ఉంటుంది. ప్రకృతిలో జనించిన ప్రతి జీవికీ స్వేచ్ఛగా, ఆనందంగా స్వచ్ఛమైన వాతావరణంలో జీవించే హక్కు ఉంది. అది దైవ ప్రసాదితం. దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. కాగితాల మీద ఏవో కొన్ని హక్కులు రాసుకుని, వాటిని పూర్తిగా తన సౌలభ్యం కోసమే ఉపయోగించుకోవాలని మనిషి అనుకోవడం అసమంజసం.
మానవుడు ఎంత సాధించినా, వానల కోసం రుతువుల మీద ఆధారపడాల్సిందే. పెద్ద కొండలుంటేనే, అవి మేఘాల్ని అడ్డుకుంటాయి, వానలు కురిపిస్తాయి. చెట్లు ఉంటేనే ప్రాణవాయువునిచ్చి, మనిషి గుండెను పదిలంగా ఉంచుతాయి. సర్వత్రా స్వచ్ఛత ఉన్నప్పుడే, మనిషికి ఆయుర్దాయం. ప్రకృతి అన్నీ స్వచ్ఛంగానే ఇచ్చింది. దాన్ని మనిషి స్వార్థమే కలుషితం చేస్తోంది. నదులు, చెరువులు ఉంటేనే ప్రాణుల దాహార్తి తీరుతుంది. అవి కలుషిత కాసారాలైతే, మనిషిని కాపాడే దిక్కెవరు?
మానవుడు తన స్వేచ్చను హరించే ఏ పని జరిగినా, అన్యాయం అనిపించినా గొంతెత్తుతాడు. రోడ్డెక్కుతాడు. చెట్లు, పుట్టలు, మూగజీవులు ఆ పని చేయలేవు. అన్నింటినీ మౌనంగా భరిస్తాయి. పూర్వం రుషుల ఆశ్రమ వాతావరణంలో మనుషులతో పాటు జంతువులూ కలిసి ఉండేవి. కాలక్రమంలో జంతువులకు మనిషి దూరమయ్యాడు. భారమయ్యాడు. ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణ గురించి మానవీయ కోణంలో పిల్లలకు పాఠాలు చెబితే- రానున్న తరాలైనా ప్రకృతిని, జీవ జంతుజాలాన్ని తమ కళ్లతో చూడగలుగుతాయి. లేదంటే తెరపై కదిలే దృశ్యాలే మిగులుతాయి. కృత్రిమ వాతావరణంలో ప్రాణం గల జీవిగా మనిషి ఒక్కడే మిగులుతాడు!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565