దూసుకొస్తోంది.. నాలుగో చక్రం!
ఎటు చూసినా ఓ సునామీ!
పరిశ్రమల్లో రోబోల హడావుడి.. ఆకాశంలో డ్రోన్ల చక్కర్లు.. రోడ్ల మీద డ్రైవర్ లేని కార్లు.. మన గుట్టు బయటేస్తున్న మొబైళ్లు.. త్రీడీ ప్రింటింగ్‌తో తయారవుతున్న అవయవాలు.. ఎవరి జబ్బేమిటో చెప్పేస్తామంటున్న అల్గోరిథమ్స్..
ఇవన్నీ వేర్వేరుగా అనిపించొచ్చుగానీ.. కలిపి చూస్తే వీటన్నింటి వెనకా ఒకటే సూత్రం.. సరికొత్త విప్లవం స్పష్టంగా కనబడుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ‘చక్రం’తో మొదలైన మన పారిశ్రామిక పరుగులో ఇప్పుడు మనమో అపూర్వ ఘట్టాన్ని చేరుకున్నామంటున్నారు నిపుణులు.
ఈ సంరంభంలో మన ఉద్యోగాలుంటాయా? చదువులు ఏమవుతాయి? వ్యాపారాలు ఎటు పోతాయి? అసలు మనిషి మిగులుతాడా..?
ప్రత్యేక కథనం..
ఈ ప్రపంచానికి ఏమవుతోంది? ఇక మీదట కొన్ని దశాబ్దాల పాటో, శతాబ్దాల పాటో మనం వినబోతున్న పేరిది. 18వ శతాబ్దంలో ఆవిరి యంత్రంతో ఆరంభమైన ప్రపంచ పారిశ్రామిక రంగ గమనం.. మూడు మైలురాళ్లను దాటి ఇప్పుడో కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఇది ఆషామాషీ దశ కాదు. యంత్రశక్తిని గుప్పిట పెట్టుకుని గత మూడు విప్లవాలనూ మనిషి నడిపించాడు. కానీ సైబర్ ఉప్పెనలో, అత్యాధునిక సాంకేతిక ప్రభంజనాలన్నింటి కలగలుపుగా పురివిప్పుకుంటున్న తాజా విప్లవం మాత్రం.. అన్నీ తానై.. మానవ జీవితాలను అన్ని దిక్కుల నుంచీ ఆవరించి.. మనిషిని పూర్తిగా తనలో కలిపేసుకునేటంతటి శక్తిమంతమైందని భావిస్తున్నారు. ఒకవైపు కాగ్నిటివ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, మరోవైపు డిజిటైజేషన్, నానోటెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక విప్లవాలన్నీ ఒక వేదిక మీదికి వచ్చి.. మానవ జీవితంలో ముందెన్నడూ చూడనంతటి వేగవంతమైన, ప్రభావవంతమైన మార్పులు తెస్తున్నాయి. దీన్నే ఇప్పుడు పారిశ్రామిక విప్లవాల పరంపరలో సరికొత్త ‘వర్షన్’గా.. ‘ఐ 4.0’గా అభివర్ణిస్తున్నారు.ఈ ప్రభంజనానికి.. మానవ జీవితంలో ప్రభావితం కాని పార్శ్వం ఉండదు.
భౌతిక, డిజిటల్, జీవ ప్రపంచాలన్నీ కలగలిసిపోతుండటం తాజా విప్లవ లక్షణం. ఫలితంగా.. ‘పని’, ‘పరిశ్రమ’, ‘వ్యాపారం’, ‘సంపద’.. వంటి భావనలన్నీ విప్లవాత్మక మార్పులకు లోనవుతున్నాయి. ఉత్పాదనా రంగంలో ఆటోమేషన్, డిజిటల్ డేటా మార్పిడి పెరిగిపోతుండటంతో ‘పని’ అనేది ఇంతకు ముందున్న పనిలా ఉండే అవకాశమే లేదు. డిజిటల్ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీలు మానవ శరీరాలతో సంపర్కం పెంచుకుంటున్న నేపథ్యంలో మనిషి కూడా గతంలో మనిషిలా ఉండే అవకాశం తక్కువ. కృత్రిమ మేధ ఆసరాతో డ్రైవర్ రహిత కార్లు, డ్రోన్లు, వర్చ్యువల్ అసిస్టెంట్లు ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. అపరిమితమైన డేటా, దాన్ని కంప్యూటింగ్ చేసే ప్రక్రియలు అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. కోట్ల మందికి సరిపోలే అల్గోరిథమ్స్‌తో కొత్త ఔషధాల ఆవిష్కారం, జాతి వైవిధ్యాలను గుర్తించటం వంటివన్నీ తెర మీదకు వస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్‌తో మన వస్తువులు, మన భవంతులు, మన ఆవాసాల వంటివన్నీ మారిపోనున్నాయి. ఇంజినీర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్టులు.. ఇలా ఇప్పటి వరకూ భిన్న విభాగాల్లో పని చేసిన వాళ్లంతా ఇప్పుడు ఒకే లక్ష్యం దిశగా పనిచేస్తూ కంప్యూటర్ డిజైన్లను, సరికొత్త తయారీ సాధనాలను, వస్తువులను, కృత్రిమ జీవలోకాన్ని కలగలిపేస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా రవాణా, కమ్యూనికేషన్ ధరలు తగ్గిపోతాయి. వాణిజ్య ఖర్చులూ తగ్గుతాయి. ప్రపంచ వ్యాపార రంగం కొత్తపుంతలు పోతుంది. |
|
ఆవిరి, జల యంత్రాల ఆవిష్కారం, మారిన శక్తి రూపం. యాంత్రిక శక్తితో సాంకేతిక పరుగు ఆరంభం. మనిషిని యంత్రాల దిశగా నడిపించిన తొలి విప్లవం (1760- 1840) ఇది. ఆవిరి యంత్రాలు, రైలు ఇంజిన్ల ఆవిష్కారం ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించింది. వందలాది మంది మనుషులు, చేతులతో రోజుల తరబడి చేసే కాయకష్టాన్ని యంత్రాలు నిమిషాల్లో పూర్తి చేయటం ఆరంభించాయి. ఉత్పత్తి విధానం సమూలంగా మారిపోయింది. మిల్లులు, ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. రెండో విప్లవం 1870 విద్యుచ్ఛక్తి ప్రవేశం, ఫ్యాక్టరీల సందోహం. అసెంబ్లీ లైన్లతో భారీ ఉత్పాదన మొదలైంది. పని విభజన అవసరమైంది. విద్యుత్ ఆవిష్కారంతో రెండో విప్లవం (1840-1914) ఆరంభమైంది. దీన్ని పెట్రోలియం, ఉక్కు... మరింత వేగవంతం చేశాయి. హెన్రీ ఫోర్డ్ పరిశ్రమల్లో వేగంగా కదిలిపోతుండే ‘అసెంబ్లీ లైన్’ను రంగంలో దింపటంతో తయారీ రంగం మొత్తం సమూలంగా మారిపోయింది. ఉత్పాదన అన్నది మరింత భారీగా తయారైంది. ఇది వ్యాపార, వాణిజ్యాలను విపరీతంగా విస్తరించింది. మూడో విప్లవం 1969 ఎలక్ట్రానిక్స్ ప్రభంజనం, కంప్యూటర్లు తోడయ్యాయి, ఉత్పాదనలో ఆటోమేషన్ ఆరంభమైంది. 1950ల తర్వాత ‘ఎలక్ట్రానిక్’ సంచనాలతో మూడో విప్లవం ఆరంభమైంది. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్.. కమ్యూనికేషన్ విప్లవాలు ప్రపంచాన్ని కుగ్రామం చేసేశాయి. డిజిటల్ వ్యవస్థలు సమాచార ఉత్పాదన, పంపిణీ రంగాలను పూర్తిగా మార్చివేశాయి. కాలుష్యానికి విరుగుడుగా హరిత ఇంధనాలకు తలుపులు తెరుచుకున్నాయి. నాలుగో విప్లవం ప్రస్తుతం గత విప్లవాల పునాదిపై, సైబర్-భౌతిక-జీవ సాంకేతికతల సమ్మేళనంగా నాలుగో విప్లవం పురివిప్పుకొంటోంది. తెలివి నేర్చిన కంప్యూటర్లు, సరికొత్త ముడివస్తువులు, రోబోలు, త్రీడీ ప్రింటింగ్, వెబ్ సేవలు.. ఇవన్నీ కలిసిపోయి.. గతంలో ఎన్నడూ ఊహించనంతటి పెను మార్పులు తీసుకురానున్నాయి. టెక్నాలజీ మనకు ఉపయోగపడటం కాదు.. సమాజంలో, మనలో భాగమైపోయి.. మనల్ని తనలో కలిపేసుకునే వినూత్న శకం ఆరంభమవుతోంది. |
|
ప్రతి పరిశ్రమ, ప్రతి రంగం.. మొత్తం వ్యాపార పంథానే మారిపోతుంది. ముఖ్యంగా డిజిటల్ ఎనర్జీ (కొత్త గ్రిడ్‌ల ఏర్పాటు), డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ (డ్రైవర్ రహితవాహనాలు), డిజిటల్ హెల్త్ (ఎక్కడి నుంచైనా వైద్యం అందే అవకాశం), డిజిటల్ కమ్యూనికేషన్ (కోట్లమంది అనుసంధానం).. వీటికి అనుబంధంగా డిజిటల్ ప్రొడక్షన్ పెరుగుతాయి. 5జీ, క్లౌడ్ టెక్నాలజీలు పరిశ్రమల్లో డిజిటైజేషన్‌ను పెంచుతాయి. తయారీ-సేవల రంగాల మధ్యనున్న అంతరం తగ్గిపోతుంది. ఉదాహరణకు రోల్స్ రాయిస్ ఇప్పటికే జెట్ ఇంజిన్లు అమ్మటం మానేసి.. ఈ ఇంజిన్లను విమానాల్లో వాడుకుంటున్న సమయాన్ని గంటల చొప్పున అమ్మటం ఆరంభించింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఆర్థిక నమూనా అవసరమవ్వొచ్చు. మారిపోయే రంగాలు: నిర్మాణం, తయారీ, సేవలు, ప్రజారోగ్యం, విద్య, వాణిజ్యం.. ఈ జాబితా అనంతం తొలి పారిశ్రామిక విప్లవాలు పైకి తెచ్చిన శిలాజ ఇంధనాలు శతాబ్దాల తరబడి బాగానే అక్కరకొచ్చాయిగానీ వాటికిప్పుడు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు ఇంధనం స్థానంలో ‘ఇంధన పరిజ్ఞానం’, సౌర, పవన, జీవ ఇంధనాలు వస్తున్నాయి. వీటన్నింటినీ గ్రిడ్‌తో అనుసంధానించటం ఒక్కటే ఇప్పుడు కీలకం. విద్య, వృత్తి ఇప్పటి వరకూ చౌకగా కార్మికులు ఎక్కడ దొరికితే పరిశ్రమలన్నీ ఆ దేశాలకు తరలిపోయాయి. కానీ నానాటికీ కార్మికుల అవసరం, తయారీలో కార్మికుల ఖర్చు తగ్గిపోతోంది. ఉదాహరణకు 499 డాలర్ల విలువైన తొలితరం ఐపాడ్ తయారీలో కార్మికులకు అయిన ఖర్చు కేవలం 33 డాలర్లు, పైగా చైనాలో తుదిదశ అసెబ్లింగ్‌కు అయిన ఖర్చు కేవలం 8 డాలర్లు. దీంతో ఆఫ్‌షోరింగ్, ఔట్‌సోర్సింగ్ అన్నది క్రమేపీ తగ్గిపోయి.. కంపెనీలన్నీ తమతమ స్వస్థానాలకు వెళ్లిపోవటమన్నది పెరగొచ్చు. ఇక పని, ఉద్యోగాల కోణం నుంచి చూస్తే మనం సరికొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. రోబోలతో కలిసి పని చెయ్యాల్సిన తొలి తరాన్ని సిద్ధం చెయ్యాల్సిన అవసరం వచ్చేసింది. స్కూలు చదువులు పూర్తయ్యే సరికే పిల్లలకు చాలా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ పిల్లల నుంచి సమాచారం (ఇన్‌ఫర్మేషన్) మాత్రమే ఆశిస్తున్నాం. కానీ ఈ ఇంటర్నెట్ యుగంలో సమాచారం ఎందుకూ కొరగాని కాసు అయిపోయింది. రేపటి తరం నుంచి మనం వినూత్న ఆవిష్కరణలను (ఇన్నొవేషన్) ఆశించాల్సి ఉంటుంది. మారుతున్న కాలానికి, సందర్భానికి అనుగుణంగా మన జీవితాలను మలచుకునేందుకు అడుగడుగునా సరికొత్త ఆవిష్కరణలు అవసురమవుతాయి. చౌకగా, వేగంగా ఆవిష్కరణలు చేయటం, ఎవరికి ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అలా.. క్షణాల్లో సృష్టించిపెట్టటం.. ‘కస్టమైజేషన్’ అన్నది కీలకం కాబోతోంది. డెన్మార్క్‌లో గాలి బాగా వీస్తుంటే అక్కడి పవన విద్యుత్తును.. జర్మనీలో ఎండ బాగా ఉంటే అక్కడ సౌర విద్యుత్తును ప్రపంచమంతా నియోగించుకునే రోజు వచ్చేస్తోంది. ‘ఇంటిగ్రేటెడ్ గ్రిడ్’తో ఇది సర్వకాలాల్లోనూ అందరికీ అందుతుంది. * ప్రపంచంలో మారుమూల ప్రజలు కూడా మొబైల్స్ వాడుతుండటం, డిజిటల్ ఫలాలు పొందుతుండటమే దీనికి తార్కాణం. మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలూ ‘శక్తి’కి సంబంధించినవి! కండకష్టంతో చేసే శక్తిని యంత్రరూపంలోకి మార్చటానికే అవి పరిమితం. అవి ఉత్పాదకతను అనూహ్యంగా పెంచాయి. ఫలితంగా భౌతిక, మౌలిక సదుపాయాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఇంధనం, రవాణా, ఆరోగ్యం వంటి రంగాలన్నీ పురోగమించాయి. అందుకే దాన్ని మానవ చరిత్రలో తయారీరంగ స్వర్ణయుగంగా చెబుతుంటారు. వీటితో పాటే సంపన్నులు పెరిగారు, పట్టణీకరణ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్, కంప్యూటింగ్, మొబైల్ విప్లవాలు మానవ జీవితాల్లో అద్భుత ఫలాలు మోసుకొచ్చాయిగానీ తయారీ వృద్ధి మాత్రం పెరగలేదు. నిజానికి 1970ల తర్వాత- గత వందేళ్లతో పోల్చుకున్నప్పుడు తయారీ వృద్ధి మూడో వంతుకు పడిపోయింది. ప్రస్తుత నాలుగో విప్లవం.. మొత్తం ప్రపంచ వ్యాపార రంగాన్నే సమూలంగా మార్చివేయనుంది. ఇది పని, ఉద్యోగాల స్వభావం, పని సంస్కృతిని మార్చివేస్తుంది. మూడవ పారిశ్రామిక విప్లవం కంటే నాలుగోది మరింత వేగంగా ప్రజలను చేరుతుందని భావిస్తున్నారు. |
|
సవాళ్లు
ఏ విప్లవమూ కూడా సునామీలా దానంటదే తోసుకురాదు. వాస్తవానికి అది మన ఆలోచనలు, ఆశలకు అద్దం పడుతుంది. ఈ విప్లవాల నుంచి మనం ఏం ఆశిస్తున్నామన్నదే అంతిమంగా కీలకాంశం. పారిశ్రామిక విప్లవాల వల్ల వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు, నాణ్యత పెరుగుతుంది, ఖరీదులు తగ్గుతాయి. తాజా విప్లవాలు కూడా ప్రజల జీవితాల్లో సౌలభ్యాన్నీ, సంతోషాన్నీ పెంచుతున్నాయి, సేవలు విస్తరిస్తున్నాయి. రవాణా, సరుకుల కొనుగోలు, చెల్లింపులు, సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇవన్నీ చిటికెలో సాధ్యమవుతున్నాయి. కానీ ఇవన్నీ ఆర్థిక వృద్ధికి ఎలాదోహదం చేస్తాయన్నది ఆలోచించాల్సిన అంశం. నిరుద్యోగం వాస్తవానికి అన్ని పారిశ్రామిక విప్లవాలూ కొన్ని ఉద్యోగాలను చంపేశాయి, కొన్నింటిని పుట్టించాయి. కాకపోతే కొత్త విప్లవాలు ఉద్యోగాల సంఖ్యను మరింత తగ్గించేస్తున్నాయి. ప్రపంచ కార్మిక రంగం కుంచించుకుపోతోంది. కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. 1990లలో కొత్త పరిశ్రమల వల్ల వచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే ఇప్పుడు కేవలం 4.4% మాత్రమే కొత్త ఉద్యోగ కల్పన జరుగుతోంది. పైగా కొత్త తరం ఉద్యోగాలన్నింటికీ ప్రత్యేక నైపుణ్యాలు, శిక్షణలు అవసరమవుతున్నాయి. ఆటోమేషన్ వల్ల తయారీ, నిర్మాణ రంగాల్లో పురుషుల ఉద్యోగాలు పోవచ్చు. మధ్య తరగతి, కింది తరగతికి చెందిన ఆడపిల్లలు ఎక్కువగా చేస్తున్న కాల్‌సెంటర్లు, రిటైల్, పరిపాలనా ఉద్యోగాలన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోతాయి. ఆటోమేషన్ వల్ల వర్ధమాన దేశాలు చాలా నష్టపోవచ్చు. కేవలం టెక్నాలజీ కారణంగానే 2020 నాటికి 50 లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి. భద్రత గతంలో యుద్ధాలు నేల మీద, జలాలు, ఆకాశంలోనే జరిగేవి. ఇక మీదట జరిగేవి సైబర్ ప్రపంచంలో యుద్ధాలే. ప్రజల సైబర్ జీవనం అతలాకుతలం చేయటం, ఉగ్రవాదం పెచ్చుమీరటం వంటివన్నీ పెరగనున్నాయి. డ్రోన్లు, నానో యుద్ధ పరికరాలు, జీవ, జీవ రసాయన ఆయుధాలు.. పుట్టుకొస్తున్నాయి. ఇక తర్వాతి లక్ష్యం మెదడు! ధరించటానికి వీలైన పరికరాల వంటివన్నీ సైనికుల మెదడును ప్రత్యక్షంగా ప్రభావితం చేసి, నియంత్రించే స్థాయికి చేరుకోబోతున్నాయి. అస్తిత్వం సైబర్ యుగంలో సమూహాలు మారిపోతున్నాయి. కొత్త బృందాలు, కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సాంకేతికత, పరికరాలు మనలో భాగమైపోతున్నాయి. మన జన్యు స్వభావం మారిపోయే రోజు రావచ్చు. ఇవన్నీ మానవ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తుండటం.. అసలు పెద్ద సమస్య! |
|
ప్రస్తుతం దేశంలో ప్రతి 10,000 మంది కార్మికులకు 3 రోబోలు పనిచేస్తున్నాయి. ద.కొరియా 631 సింగపూర్ 488 జర్మనీ 309 జపాన్ 303 అమెరికా 189 చైనా 68 మనం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నామనటానికి ఒక్క 2017లోనే 3000 రోబోలు దిగుమతి చేసుకోవటం తార్కాణం. 2020 నాటికి ఇది 6000 అవుతుందని అంచనా. |
|
ప్రతి 10,000 మంది కార్మికులకు ఈ రంగంలో పని చేస్తున్న రోబోలు |
|
ప్రస్తుతం వివిధ దేశాల్లో నైపుణ్య కార్మికులు... ద.కొరియా 96% జపాన్ 80% జర్మనీ 75% చైనా 24% భారత్ 4.7% |
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565